శర్మ కాలక్షేపంకబుర్లు-చెయ్యి

చెయ్యి

అందరికి అభయమ్ములిచ్చు చేయి…..బంగారు చేయి….అన్నమాచార్య కీర్తన. అభయహస్తం, వరద హస్తం అని భగవంతుని ముద్రలు రెండింటికి పేరు. వేళ్ళు పైకి ఉండేలా చెయ్యి పైకి పట్టుకున్నది అభయ హస్తం. వేళ్ళు కిందికి చూపించేలా పట్టేది వరద హస్తం అంటారంటారు పెద్దలు. దానం ఇచ్చేది, చేతితోనే ఇస్తారు. దీనికి మంచి కధ భాగవతం లో ఉంది చూదాం.

బలి చక్రవర్తి, ఈయన ప్రహ్లాదుని మనుమడు, హిరణ్యకశిపుని ముని మనుమడు, రాక్షస రాజు, అయినా హరి భక్తుడు. ఈయన ఒక యాగం చేస్తున్నాడు. ఈ యాగానికి హరి, వామన రూపంలో మయా వటువుగా విచ్చేసి మూడడుగుల నేల దానమడుగుతాడు. మరేమయినా కోరుకో మూడడుగు నేల చాలా తక్కువ కదా అంటాడు, బలి. మూడు అడుగుల నేల చాలంటాడు, మాయా వటువు. వటువు రూపంలో వచ్చిన వాడు హరి అని, దానం ఇవ్వవద్దని, ప్రాణ, మాన, విత్త భగమందు మాటిచ్చి తప్పచ్చని, రాక్షస గురువు శుక్రాచార్యులవారు చెబుతారు. అయినా బలి చక్రవర్తి వినకుండా ఇలాఅంటాడు.

“కారేరాజులు, రాజ్యముల గలుగవే గర్వోన్నతిన్ బొందరే
వారేరీ సిరి మూటకట్టుకొని పోవం జాలిరే భూమిపై
పేరయినం గలదే శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు వారలన్ మఱచిరే ఇక్కాలమున్ భార్గవా!
అంటూ, ఇంకా
ఆదిన్ శ్రీ సతి కొప్పుపై దనువుపై సంసోత్తరీయంబుపై
పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మ
ర్యాదన్ చెందు కరంబు కిందగుట మీదై నా కరంబుంట మే
ల్గాదే రాజ్యము గీజ్యమన్ సతతమే కాయంబు నా పాయమే!

గురువరేణ్యా! వచ్చినవాడు నిజంగా హరి కనక ఐనట్లయితే లక్ష్మీ దేవి శరీరం పై అలవోకగా తిరుగాడిన చేయి, గొప్పదయిన చేయి కిందయి దానం పుచ్చుకోవడం నా చేయి పైనుండి దానం ఇవ్వడం గొప్పకాదా! ఈ రాజ్యం, సిరి సంపద ఇవ్వన్నీ శాశ్వతమా! అందు చేత దానం ఇచ్చి తీరుతా ఏమయినా సరే, అన్న మాట వెను తీయనని దానమిచ్చి, హరి చేత మూడవ అడుగుకు తన శిరస్సు ఇచ్చి పాతాళానికి ప్రభువుగా వెళ్ళిన వాడు. ఈ దాన గుణానికి ఇంకా చెప్పుకో వలసిన వారు, శరీరాన్ని త్యజించి వెన్నెముకను ఇంద్రుని వజ్రాయుధం కొరకిచ్చిన దధీచి, సహజ కవచ, కుండలములను కోసి ఇచ్చిన కర్ణుడు, వాయసాన్ని రక్షించడం కొరకు తొడ మాంసాన్ని కోసి ఇచ్చి, సరిపోకపోతే తనే తూగిన శిబి చక్రవర్తులు గొప్పవారు.

మరొక హస్తం ఉంది. భస్మాసురుడనే రాక్షసుడు శంకరుని గురించి తపస్సు చేస్తాడు. శంకరుడు ప్రత్యక్షమై ఏమీ కావాలంటే నేను ఎవరి నెత్తి పై చేయిపెడితే వారు భస్మమై పోవాలి అంటాడు. శంకరుడు సరేనని వరమిస్తారు. మీరిచ్చిన వరం నిజమో కాదో చూడాలి అందుకు మీ నెత్తిన చేయిపెడతానని శంకరుని వెంట పడతాడు. అపుడు శంకరునికి హరి అడ్డుపడి, నీ వరం నిజమో కాదో తేల్చుకోవాలి గనక నువ్వు ముందు స్నానం చేసి వచ్చి, అప్పుడు శంకరుని తల పై నీ చెయ్యిపెడుదువుగాని, అందుచేత స్నానం చేసి రమ్మంటారు. భస్మాసురుడు స్నానం చేసి తల తుడుచుకోడానికి చెయ్యి తన తలపై పెట్టుకోగానే భసమై పోతాడు. అదీ భస్మాసురహస్తం.

చేయూత అంటే సహాయం, పాణి గ్రహణం అంటే పెళ్ళి, చెయ్యి చేసుకోవడం అంటే దెబ్బలు కొట్టడం, చెయ్యివ్వడం అంటే మోసం చేయడం. ఇవండి చేతితో నానార్ధాలు.
నేటి కాలానికి దానం, ధర్మం వెనక పట్టింది. చేత్తో దానం కంటే నొల్లుకోవడం పెరిగిపోయింది,. వంద సంవత్సరాల పైబడిన చరిత్ర కల హస్తం గుర్తు పార్టి, రంగు రూపులు మార్చుకుంటూ, కాడి ఎడ్లు నుంచి, పొలం దున్నేరైతుకు, ఆతరవాత నాగలి భుజాన ఉన్న రైతుకు, ఆ తరవాత హస్తానికి రూపాంతరం చెందింది. ఒకప్పుడు ఇది అభయ హస్తమని చెప్పి ఓట్లేయించుకున్నారు. అభయ హస్తం అన్నది భస్మాసుర హస్తమై దొరికినది ప్రతీది నొల్లేసుకుని, ప్రజలను దూరం చేసుకుని భస్మాసురుని లాగే అంతమైపోతోందేమో ననుకుంటున్నారు, ప్రజలు. మొన్నటి ఎన్నికలలో అనగా ఐదు రాష్ట్రాలకి జరిగిన ఎన్నికలలో, పెద్ద రాష్ట్రంలో, యువరాజు తో సహా పెద్దలంతా ఎంత చెపినా ప్రజలు వినలేదంటే పరిస్థితి ఎలా వున్నదీ అలోచించ వచ్చు. మిగిలిన రాష్ట్రాల సంగతి చెప్పక్కరలెదు. ఒక్క మణిపురం లో మాత్రం మెజారిటీ వచ్చింది. ఉత్తరాంచల్లో రాష్ట్రపతి పాలన తప్పదేమో! ఇదీ చెయ్యి పార్టీ చరిత్ర. నూరేళ్ళునిండేయేమో!!!

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-చెయ్యి

 1. దీక్షితులు గారు,

  మీరు చెయ్యి తిరిగిన బ్లాగర్ అయిపోయారండోయ్! మరో హస్తం ఉందండీ. కామెంటు హస్తం ! ఇది కొండొకచో కలకలం కలిగించు హస్తం !!

  చీర్స్
  జిలేబి.

 2. ‘The best thing a man can give to another man is his hand!’ ….సరిగ్గా ఇవే మాటలో కాదో చెప్పలేను గాని, ఈ అర్ధంలో వచ్చే ఒక saying వుంది. చెయ్యి, ఊత– చేయూత అని మనకు తెలుగులో మంచి మాట!

  శ్రీ శ్యామలరావు గారు సౌందర్యలహరి నుంచి ఉదాహరించిన శ్లోకం అర్ధం, నిరాడంబర భక్తికి ప్రతీకలాగా, చాలా బాగుంది!!

  మీ ఇరువురికీ ధన్యవాదాలు!

  • @మిత్రులు వెంకట్ గారు,
   చేయూత ఇవ్వడం పోయి చెయ్యివ్వడం అలవాటయిపోయిందండి, ఎక్కువగా.
   ధన్యవాదాలు.

 3. చెయ్యికి సంబంధించి సౌందర్యలహరిలో ఒక అందమైన శ్లోకం ఉంది.

  త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః
  త్వమేకా నైవాసి ప్రకటిత వరాఽభీత్యభినయాః
  భయా త్రాతుం దాతుం వరమపిచ వాంఛాసమధికం
  శరణ్యేలోకానాం త్వమహి చరణావేవ నిపుణౌ.

  అమ్మా, లోకంలో నీవు కాక మిగిలిన దేవతలంతా అభయ హస్తమూ, వరద హస్తమూ చూపిస్తూ ఉంటారు. నీవలా చూపనవుసరమే లేదు. నీ చరణాలే లోకంలో అందరికీ అన్నివరాలనూ ఇవ్వటానికీ, అన్ని భయాలను పోగొట్టటానికీ చాలుగదా అని శ్లోక భావం.

  • @మిత్రులు శ్యామలరావుగారు,
   అమ్మ గురించిన మంచి శ్లోకం చేప్పి కృతార్ధుడిని చేశారు.
   ధన్యవాదాలు.

వ్యాఖ్యలను మూసివేసారు.