శర్మ కాలక్షేపంకబుర్లు-కార్య సాధకుడు.

కార్యసాధకుడు.                                 DEVAYAANI-1

ఒకచో నేలను పవ్వళించు నొకచో నొప్పారు పూసెజ్జ పై
నొకచో శాకము లారగించు నొకచో నుత్కృష్ట శాల్యోదనం
బొకచో బొంత ధరించు నొక్కొక తరిన్ యోగ్యాంబర శ్రేణి లె
క్కకు రానీయడు కార్య సాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్ !!

ఏనుగుల లక్ష్మణ కవి భర్తృహరి సుభాషితాలను తెనుగు చేశారు, ఆ శతకంలో దీ పద్యం. కార్య సాధకుడు అవసరాన్ని బట్టి నేలమీద పడుకుంటాడు, లేదా పాన్పుపై పడుకుంటాడు. అవసరాన్ని బట్టి కందమూలాలేతింటాడు, లేదా గొప్పదైన భోజనం చేస్తాడు. అవసరమైతే కంబళీ కప్పుకు తిరుగుతాడు, లేదా గొప్ప వస్త్రం కడతాడు. ఈ కీడు, మేళ్ళు ఏవీ కార్య సాధకుడు లెక్కలోకి తీసుకోడు కార్య సాధనే ముఖ్యమని అనుకుంటాడని కవి భావం.

భారతం లో ఒక కధ చూద్దాం. దేవతల, రాక్షసుల యుద్ధాలలో దేవతలు మరణిస్తున్నారు, రాక్షసులు బతుకుతున్నారు, శుక్రాచార్యుని మృత సంజీవని విద్య వల్ల. కచుడు బృహస్పతి కుమారుడు, బృహస్పతి దేవతల గురువు. దేవతలందరూ కలిసి కచుని వద్దకు వచ్చి మనవాళ్ళంతా యుద్ధాలలో చచ్చిపోతున్నారు, అందుకని నువ్వు వెళ్ళి శుక్రాచార్యుని వద్ద మృత సంజీవని విద్య నేర్చుకుని రమ్మని పంపుతారు. కచుడు శుక్రుని వద్దకు వచ్చి తాను దేవతల గురువైన బృహస్పతి కుమారుడనని చెప్పి, విద్య నేర్పమని కోరుతాడు. శుక్రుడు శిష్యునిగా చేర్చుకుంటాడు. శుక్రునికో కుమార్తె, పేరు దేవయాని. కచుడు గురువు, గురుపుత్రి చెప్పినవి చేస్తూ ఇద్దరి మన్నన, ఆదరణ పొందుతాడు. ఇలా చాలా సంవత్సరాలు కచుడు శుక్రుని వద్ద విద్య నేర్చుకుంటాడు, కాని మృత సంజీవని విద్య మాత్రం గురువు చెప్పలేదు, కచుడూ అడగలేదు, నేర్పమని. దేవతల గురువైన బృహస్పతి కొడుకు తమ గురువైన శుక్రుని వద్ద విద్య నేర్చుకోడం రాక్షసులకు ఇష్టం లేదు. అందుకని ఒక రోజు పశువులను అడవికి తోలుకు పోయిన కచుని పట్టుకుని చంపి, చెట్టుకు కట్టేసేరు, రాక్షసులు. గోవులు యధావిధిగా తిరిగి వచ్చేయి కాని కచుడు రాలేదు. దేవయాని, కచుడు తిరిగి రాని విషయం చూసి చాలా బాధ పడుతూ తండ్రి దగ్గరకెళ్ళి రాత్రయిపోయింది,గోవులు తిరిగి వచ్చేసేయి. కచుడు రాలేదు, అడవిలో, మృగాలు, రాక్షసులు, పాములులలో, ఎవరి బారిన పడ్డాడో అని వేదన చెందుతుంది. శుక్రుడు దివ్య దృష్టితో చూచి, చంపబడివున్న కచుని చూసి, వెంటనే వెళ్ళి మృత సంజీవని తో బతికించి తీసుకువస్తే, దేవయాని సంతోషించింది. కచుడు బతకటం చూసి రాక్షసుల కడుపు మండిపోయింది. కాలంకోసం ఎదురు చూచి ఒకనాడు, అడవికిపోయిన కచుని చంపి, కాల్చి, ఆ బూడిద ను తెచ్చి శుక్రాచార్యుల వారు తాగే సురలో కలిపి, గురువుగారు తాగేలా చేసేరు, రాక్షసులు. మళ్ళీ కధ మామూలే. దేవయాని తండ్రికి చెప్పింది. శుక్రుడు పట్టించుకోలేదు. అప్పుడు దేవయాని కచుడిని చూస్తే కాని తిండీ నీళ్ళూ ముట్టనని హఠం చేస్తే, దివ్య దృష్టితో వెతికితే ఎక్కడా కనపడక, ఆఖరికి తన కడుపులో కనబడితే మృత సంజీవని విద్య చేత బతికిస్తాడు. బతికిన వాడు బయటికి వచ్చే మార్గం గురువునడిగితే, గురువు మృతసంజీవని విద్య కచునికి నేర్పి, కడుపు చీల్చుకుని బయటకు రమ్మనగా, కడుపు చీల్చుకుని కచుడు బయటకు రాగా, శుక్రుడు చనిపోతాడు. బయటికొచ్చిన కచుడు గురువును బతికిస్తాడు. ఈ కధ ఇంకా చాలా ఉంది. ఇక్కడికి ఆపుదాం, కార్య సాధకుడి గురించి చెప్పుకుంటున్నాం కనక. కచుడు తనను రాక్షసులు చంపుతారని తెలిసి, ఒక సారి చచ్చి బతికిన తరవాత కూడా శుక్రుని వద్ద విద్య నేర్చుకుని కార్య సాధన చేశాడు.

నేటి కాలంలో మధ్యప్రదేశ్ లో (గ)(ఘ)నులు మాఫియాను అరికట్టాలనే కార్యసాధన ప్రయత్నంలో గనుల మాపియా చేతిలో చనిపోయిన ఐ.పి.ఎస్. ఆఫీసరు నరేంద్రకుమార్ సింగ్ ను బతికించగల శుక్రుడు కనపడటం లేదు. కార్యసాధనలో ప్రాణాలు పోగొట్టుకున్న నరేంద్రకుమార్ సింగ్ కుటుంబానికి సానుభూతి, సంతాపం తెలియ చేయడం తప్పించి చేయగలది లేదు. కితం సంవత్సరం మహారాష్ట్రలో ఆయిల్ మాఫియా ఒక ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ ని కాల్చి చంపింది. దాని మీద చర్యలేమిటో తెలియదు. ప్రభుత్వాలే మాఫియాలను నడుపుతున్నాయో, మాఫియాలే ప్రభుత్వాలను నడుపుతున్నాయో తెలియటం లేదు. ఎవరేమి చెప్పినా, ఎంత డబ్బిచ్చినా అన్యాయంగా ట్రాక్టర్ ట్రయిలర్ కింద పడేసి, చంపబడిన నరేంద్రకుమార్ సింగ్ ను తిరిగి తీసుకు రాలేముకదా! అసలు ఇటువంటివి జరగ కుండా ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాయో అంతుబట్టటం లేదు. ఐ.పి.ఎస్ ఆఫీసర్లనే రక్షించుకోలేని ప్రభుత్వాలు ప్రజలను ఎలా రక్షిస్తాయో తెలియటం లేదు.

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కార్య సాధకుడు.

  1. శర్మ గారు,

    అయ్యబాబోయ్, ఎక్కడి నించి ప్రారంభించి ఎక్కడ కి తీసు కొచ్చారండీ టపా సబ్జెక్ట్ ని ! హ్యాట్స్ ఆఫ్ !

    చీర్స్
    జిలేబి.

వ్యాఖ్యలను మూసివేసారు.