శర్మ కాలక్షేపంకబుర్లు-కలిమి కష్టాలు

కలిమి కష్టాలు.

మొన్ననొకరోజు మధ్యాహ్నం భోజనం తరవాత ఉయ్యాలలో కూచున్నా. గుమ్మం ముందు కారు ఆగిన చప్పుడయింది. ఈ మధ్య గుమ్మం ముందు కార్లు ఆగడం అలవాటయిపోయింది కనక పట్టించుకోలేదు. ఎప్పుడూ నా గుమ్మంలోకి రాని, కలిమి కలిగిన, మా దూరపు బంధువొకరు భార్యతో సహా వచ్చేరు. “రండి రండి” అని ఆహ్వానించా. నా భార్యను పిలిచా. మర్యాదల తరవాత తీరుబడిగా కూచుంటూ, “కులాసానా” అన్నారు. “బాగానే ఉన్నాం” అన్నా. “మీరెలా ఉన్నారు” అన్నా. దానికి బంధువు భార్య “ఏం చెప్పమంటారు, కడుపు చింపుకుంటే కాళ్ళమీద పడుతుంది, అలా ఉంది మా పరిస్థితి” అంది. “అదేమిటమ్మా, కలిగిన వారు, దేనికీ చింత లేని వారు, కడుపు చింపుకోడం ఏమిటీ” అన్నా. “అదే కదండీ బాధ. కొడుకులు గురించి చెప్పుకోవలసి రావడం బాధ కదా” అంది. వ్యవహారం తేడాగా ఉందని ఊరుకున్నా. అతను మొదలు పెట్టేడు.

“మీ పిల్లలందరికి పెళ్ళిళ్ళు చేశారు. పిల్లలతో సుఖంగా ఉన్నారు. పిల్లలు మీమాట వింటున్నారు. అంతకు మించి సుఖం ఏముంటుంది” అన్నాడు. “మీకు మాత్రం లోటేమి పిల్లలు చెప్పినమాట వింటారు కదా! కలిగిన వారికి కష్టాలేమిటండీ” అన్నా. “అయ్యో కలిగి ఉండటమే కష్టానికి కారణమయిపోయింది కదా. మా మొగపిల్లలిద్దరికి పెళ్ళిళ్ళు చేశాను. అన్నట్లు మీ కోడలు ఇక్కడే ఉంటోందికదా” అని లేచి వెళ్ళి తలుపులు దగ్గరగా వేసి వచ్చి నెమ్మదిగా మాటాడటం మొదలు పెట్టేడు. “ఆడపిల్ల అత్తవారింట్లో ఉంది. కొడుకులు ఎవరి సంపాదన వారు చేసుకుంటున్నారు,ఇద్దరూ చాలా కాలం నుంచి నన్ను కుదురుగా ఉండనివ్వటంలేదు. ఆస్థి గురించిన వివరాలు చెబుతావా, చస్తావా అన్నట్లు మాటాడుతున్నారు. ఆస్థి అంతా నా స్వార్జితం. ఆస్థి పంపకాలు వేసి వారికిచ్చెయ్యాలట. కోడళ్ళు వీళ్ళకి వత్తాసు పలుకుతున్నారు. మొన్న రాత్రి ఇంట్లో పెద్ద గందరగోళమైపోయింది,” అన్నాడు. “ఇంతదాకా వచ్చాకా దాచుకోడం ఎందుకూ,” అని “అన్నయ్య గారు పిల్లలిద్దరూ ఈయనమీద చెయ్యి చేసుకోడానికి సిద్ధ పడ్డారు. అప్పటినుంచి ఈయనకు స్తిమితం లేదు” అంది. “ఏం చేద్దామనుకుంటున్నారు” అన్నా. “ఆస్థి నా స్వార్జితం వీళ్ళకి ఎందుకు చెప్పాలి”అనిపిస్తూంది. ఒక సారి వీళ్ళకోసం సంపాదించాము కదా అనిపిస్తూ ఉంది. వాళ్ళు అలా అడగడం తో చెప్పకూడదనిపిస్తూ ఉంది” “ఏం చేయాలో తోచడం లేదు. ఏమి చెయ్యమంటారు” అన్నాడు. “మీరు ఇంత హయిగా ఎలా ఉండగలుగుతున్నారో తెలియలేదు” అన్నాడు.
నా దగ్గరేమీ లేదండి అందుకు నాకు సమస్యలు లేవు కాని మీకు ఒక జరిగిన సంగతి మాత్రం, నా మిత్రుడు చేసినది చెప్పగలను, మీకు ఉపయోగపడుతుందేమో చూడండి,” అన్నా.

“నా స్నేహితుడు సత్తిబాబు, నా వయసువాడే, కలిగిన సంసారం, అతనికి ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మొగపిల్లలు. అమ్మాయిలిద్దరికి ఉమ్మడి సంసారంలో పెళ్ళిళ్ళు చేశాడు. పెద్దబ్బాయికి పెళ్ళి అయిన వెంటనే ఆస్థి పంపకం చేశాడు. ఆడ పిల్లలకి ఇవ్వవలసినది వాళ్ళకి ఇచ్చేశాడు. ఎవరి సొమ్ము వారికి కేటాయించాడు. ఎవరి సొమ్ము వారి పేర వేశాడు. స్థిరాస్థులపై వచ్చేఆదాయం పిల్లలకిచ్చేశాడు, ఆ రోజునుంచే. వాళ్లపేర ఉన్న డిపాజిట్లు వగైరా సత్తిబాబు దగ్గరే ఉండేవి. అతనే చూసేవాడు.. పిల్లలు వాళ్ళ మటుకు వాళ్ళు నిర్వహించుకునే సమయానికి వాళ్ళకి ఇచ్చేశాడు. సత్తిబాబు పిల్లలు, ఇది ఇలా చేశాము, అలా చేశామని చెబుతారు. వింటాడు,అంతే. తనకు భార్యకు కొంత సొమ్ము ఉంచుకున్నాడు, అవసరాల కోసం. ఇంటి ఖర్చు ఇప్పటికీ సత్తిబాబే పెట్టుకుంటాడు.

“మరొక సంగతేమంటే మా సత్తిబాబు కట్నం తీసుకోడు ఇవ్వడు. కోడళ్ళని తెచ్చుకునేటపుడు వాళ్ళ కుటుంబ మంచి చెడ్డలు చూసి తెచ్చుకున్నాడు, డబ్బు చూసికాదు. కోడళ్ళకి వారి తల్లి తండ్రులు ఆనందంగా ఇచ్చిన సొమ్ముకు సరిపడా సొమ్ము మళ్ళీ సత్తిబాబిచ్చి వాళ్ళపేర డిపాజిట్లు వేయించేశాడు. కోడళ్ళు కొడుకులు, కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ సత్తిబాబు దంపతులని చాలా మురిపంగా చూసుకుంటారు. ఇది సంగతి,” అన్నా.

“నాకిప్పుడు అర్ధమైపోయిందండీ! నేనెమి చెయ్యాలో! మనం సంపాదించినదంతా వాళ్ళ కోసమే, మనం ఏమీ చేయకుండా పోయినా వాళ్ళు పంచుకుంటారు, మన తరవాత, ఇప్పుడే ఇచ్చేస్తే, వాళ్ళు అనుభవిస్తూ ఉంటే చూసి ఆనందించచ్చు కదా!! అదే చేస్తా!! వస్తామని” లేచారు. నా కోడలు ఒక రవికిల గుడ్డ తీసుకొచ్చి బొట్టు పెట్టి ముత్తయిదువు చేతిలో పెడితే “ఇదేమండీ” అంది ఆమె. “ఇది మా కుటుంబ ఆచారం, గుమ్మం లోకి వచ్చిన పుణ్య స్త్రీకి ఇలా సత్కారం చేసి పంపడం మా మామయ్యగారి అమ్మగారి కాలం నుంచి వస్తూందిట. అది మేము పాటిస్తున్నాము అంతే” అంది.

ప్రకటనలు

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కలిమి కష్టాలు

  • @మిత్రులు బోనగిరి గారు,
   మీరు చెప్పింది అక్షర సత్యం. నిజం, నిజం, నిజం, ముమ్మాటికీ నిజం
   ధన్యవాదాలు.

 1. శర్మ గారు,

  ధనం మూలం ఇదం జగత్. ఓకే. ధనం అన్నది ఏమిటి?

  Is not it transformed energy from one form into another? Of a parent, who has strived to ‘accumulate’ that so called ధనం by focussing his energy in that direction?

  so, if its true that energy can be never held consistently in one form and it has to manifest in another form, should not that flow where it is necessary? (not necessarily to the next kin just because they are born out of us) ? If it is not allowed to flow by our effort, will it not find its way to flow by itself?

  Now comes the karl marx, who says its in the flotation of money that the welfare of the human society can be bettered.

  so,ధనం మూలం, but yet, its flow which probably decides the welfare of the society as a whole.

  Just another side of the coin!

  cheers
  zilebi.

  • @జిలేబిగారు,
   మీరు చెప్పినట్లు ధనం కావలసిన వారికి, సంఘానికి సద్వినియోగం అయినప్పుడే దాని సార్ధకత. పెట్టెలో పెట్టి మూత వేసి ఉంచితే దానికి సార్ధకత లేదు. సమాజానికి ఉపయోగపడాలి.
   ధన్యవాదాలు.

   • మంచి మాట సెలవిచ్చారు.!

    సో, కాణీ అన్నిటికి మూల కారణం అన్న మాట !

    చీర్స్
    జిలేబి.

   • @జిలేబిగారు,
    ఒక సినీ కవి అన్నట్లు “ధనమేరా అన్నిటికీ మూలమ్, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం,” అన్నట్లు, సమయానికి తగినట్లుగా ధనం వినియోగం చేసుకోవడం చేతకాని వారికి, మిగిలేవి కష్టాలే, ఉన్నా సరే.
    ధన్యవాదాలు.

 2. ఈ సమస్యకు సంబంధించి.. చారు చర్య…( కాశ్మీరీ సంస్కృత పండితుడు ) లో ఒక శ్లోకం ఉంది . పెద్ద వారు తమ సంపద పూర్తిగా పిల్లలకు ఇవ్వ వద్దు అలా ఇవ్వడం వల్లనే కదా దుర్యోధనుడు యుద్ధం వద్దని దృతరాష్ట్రుడు చెప్పిన పట్టించుకోలేదు. రాజ్యం మొత్తం దుర్యోదనుడికి ఇచ్చాడు కదా అలా ఇచ్చాక తండ్రి మాట వినాల్సిన అవసరం ఏమిటి ? ఇవ్వక పొతే ఈ రోజుల్లో అయితే ఆస్తి కోసం తండ్రిని హత మార్చే పుత్రా రత్నాలు కూడా ఉన్నారు . మరేం చేయాలి ఏం చేయాలో చారు చర్యలో చెప్పాడు . కొంత ఆస్తి ఇవ్వాలి . అలా ఇచ్చాక తాను తాళి తండ్రులను బాగా చూసుకొంటే మిగతా ఆస్తి ఇస్తారని అనుకోని బాగా చూసుకుంటారు అంటాడు కవి . నా కయితే ఈ కాలానికి సయితం ఇదే సరయిన నిర్ణయం అనిపించింది

  • @మిత్రులు మురళిగారు,
   మీరు ఉటంకించినట్లు, కొంత ఇచ్చి కొంత ఉంచుకుని, మధ్యేమార్గమే మంచిదని నా అభిప్రాయమ్ కూడా. అయితే దీనికి సరి అయిన సమయం ఎంచుకోడం లోనే గొప్పతనం ఉంటుంది.
   ధన్యవాదాలు.

 3. శర్మగారు,
  మీ టపాతో పూర్తిగా యేకీభవించగలనని చెప్పలేను. ఒక వ్యక్త్తి ఆస్తిపాస్తులు కూడగట్టుకోవటం వెనుక రెండు అంశాలున్నాయి. సమాజానికి తన సత్తా చూపటం – తద్వారా వచ్చే గౌరవాదులను పొందటం. రెండవది తన యొక్క భవిష్యత్తుకోసం జాగ్రత్త పడటం. అయితే ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తులో అతని సంతతి ఉంటుందా అంటే చర్చనీయాంశమే. ఎవరి సుఖ జీవనమైనా వారి కష్టార్జితంతో ముడిపడటమే సామాజికంగా క్షేమకరం – అలా కాకపోతే బాధ్యత తెలియని వ్యక్తులను తయారు చేసే వాళ్ళుగా అవుతారు పెద్దలు. వారసత్వంగా సంక్రమించినదానిపై సంతానానికి హక్కు ఉంది కాని స్వార్జితంపైన కాదు గదా. సొమ్ము బోలెడు జమ అయితే సమాజాభివృధ్ధికార్యక్రమాలకు, దైవకార్యాలకూ ఖర్చు చేయటం ఇహమూ పరమూ అని నా అభిప్రాయం. ఒక వేళ సంతతి అయోగ్యులయితే యెట్టి పరిస్థితిలోనూ స్వార్జితాన్ని వారికి ఇవ్వరాదు. అలా ఇచ్చినంతమాత్రాన వారికి మంచితనం వచ్చి పెద్దలను బాగా చూస్తారని అనుకోవటం తెలివితక్కువా, ప్రమాదకరమూ అయిన ఆలోచన.

  • @మిత్రులు శ్యామలరావుగారు,
   ఈ విషయంలో ఇలాగే చెయ్యాలని ఎక్కడాలేదు.అయోగ్యులను తయారు చేయడం మంచిది కాదు. మురళి గారు, కాశ్మీరీ పండితులను ఉటంకించి, చెప్పినట్లు మధ్యే మార్గం మంచిదని నా అభిప్రాయం కూడా.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s