శర్మ కాలక్షేపం కబుర్లు-అల్లం జీలకర్ర పెసరట్లు.

అల్లం జీలకర్ర పెసరట్లు.

మొన్ననొకరోజు ఉదయం ఫలహారంగా అల్లం జీలకర్రపెసరట్లు వేసేరు హోం మినిస్ట్రీ వారు. అవి తింటూ ఉంటే నలభై  సంవత్సరాల కితం, ఈ పెసరట్లు తినడానికి పక్క ఊరికి, వారానికి ఒక రోజు కేంపు కెళ్ళే సంగతి గుర్తొచ్చింది. ఇదేంటీ పెసరట్లు తినడానికి కేంపు వెళ్ళాలా అనకండి, చెబుతా.

నలభై సంవత్సరాల కితం నేను టెలికమ్ డిపార్టుమెంటులో జె.యి గా పని చేస్తున్న రోజులు. ప్రస్తుతం ఉన్న ఊరులో ఉండి పల్లెలలు కూడా వ్యవస్త చూసేవాడిని. మాకు దగ్గరగా పది కిలో మీటర్ల దూరంలో ఒక పల్లెటూరుంది, నేను ఉంటున్న ఊరు కంటే చిన్నది, కాని ప్రసిద్ధి పొందినదే. ఇప్పటిలా వ్యవస్త నికరంగా పని చేసేది కాదు, కారణాలనేకం, అది ఇప్పుడు అప్రస్తుతంగాని. ఆవూరు నుంచి బయట మాట్లాడుకోడానికి మూడు ఛానల్స్ ఉండేవి. అటువంటి యంత్ర సామగ్రి పాడయింది. అప్పుడు రోజుల్లో ఉన్నది బాగుచేసుకుని పని చేయించుకోవలసిందే, ఇప్పటిలాగా కొత్త యూనిట్ పెట్టేసుకుని పని చేయించుకునే సౌకర్యం ఉండేది కాదు. పగలు బాగు చేసుకుందామంటే అన్నీ అడ్డంకులే, అందుకు రాత్రి మొదలెట్టా. పది గంటలకి అక్కడికి కావలసిన వస్తు సామగ్రి అన్నీ పుచ్చుకుని వెళ్ళా. పని పూర్తి కావాలంటే ఒక రెండు గంటలు నికరంగా పని చేస్తేచాలు. యంత్ర సామాగ్రి మొత్తం విప్పి పక్కన పెట్టేసి, పాడయిన దానిని గుర్తించా. దానిని కొత్త స్పేర్ వేసి బాగు చేయాలి. దాని మీదున్న ట్రాన్సిస్టర్ లన్నీ పోయాయి. సరే పాత వాటిని పీకి కొత్త వాటిని తగిలించమని టెక్నీషియనికి అప్పచెప్పా. అతను అవి అన్నీ పీకి హీట్ సింక్ అనేదాన్ని పైన పెట్టి కొత్త ట్రాన్సిస్టర్లు తీస్తున్నాడు, బిగించడానికి. ఈ లోగా టీ తెచ్చాడు, ఒక కుర్రాడు. వాడు టీలు అందరికి ఇస్తూ వుండగా ఈ హీట్ సింకు, వాడి చెయ్యి తగిలి పడిపోయి ముక్కలై ఊరుకుంది. అసలే పల్లెటూరు, అది దొరికేసావకాశం లేదు. నా దగ్గర ఊళ్ళో లేదు. పని ఆగిపోయింది. ఏలా! పని పూర్తి చేయాలి పట్టుదల. ఫోన్ పట్టుకుని ఎవరెవరికో మిత్రులు జె.యి లకి ఫోన్ చేసి ఫలానా కావాలి అంటే, విసుక్కున వాళ్ళు, మరొక ఆలోచన లేక లేదని వెంటనే చెప్పేసి, టక్కున ఫోన్ పెట్టేసిన వాళ్ళు, అసలు పలకనే పలకని వాళ్ళు, ఇలా సమయం వృధా అయిపోతూ వచ్చింది. పట్టుదల పెరిగి పోయింది. ఎలాగయినా ఉదయానికి బాగు చెయ్యాలి. ఈ మిత్రులందరూ ఏదో ఒక రోజు నన్ను అలా పిలిచిన వారే. ఒక్కొకరు అర్ధరాత్రి వచ్చి చలిలో మోటార్ సైకిల్ మీద కూచో బెట్టుకుని తీసుకుపోయి, నా చేత పని చేయించుకున్న వారే. కాలం కలిసి రాలేదు. ఆఖరి ప్రయత్నంగా అడవిలో ఉన్న మిత్రుడికి ఫోన్ చేశా. పలికేడు. విషయం చెప్పేను. “సామాను ఉందిరా! ఈ అర్ధ రాత్రి నీకు ఎలా చేరుతుందీ” అని అనుమానం వెలిబుచ్చాడు. “ఉంటే చాలు, నేను రావడం కాని, మనిషిని కాని పంపుతాను, వస్తువిచ్చి పంపు”అని చెప్పేను. సరే నన్నాడు. నేను బయలుదేరబోతూ ఉంటే, అక్కడి లైన్ మన్ నేను వెళ్ళి వస్తాని మోటార్ సైకిల్ తీసుకుని వెళ్ళేడు, చలిలో, అడవిలోకి దగ్గరగా ౫౦ కిలోమీటర్లు.

అతను తిరిగొచ్చేదాక పని లేదు కనక కబుర్లలో పడితే, మా వూళ్ళో పెసరట్లు స్పెషల్ అన్నాడు, మా టెక్నీషియన్ గారు. అదేమిటి అన్నా. ఇక్కడికి దగ్గరలోనే మెయిన్ రోడ్ మీద చిన్న బడ్డీకొట్టు. అతను రోజూ ఉదయం నాలుగు నుంచి ఎనిమిది వరకూ పెసరట్లు వేస్తాడు. ఆ తరవాత వేయడు. ఎవరడిగినా లేదనే చెబుతాడు. వేడిగా ఉన్నపుడే అమ్ముతాడు. చల్లారిపోతే, చచ్చినా ఇవ్వడు. స్వంత గానుగు మీద నూని ఆడి, పెసలు మొక్కలొచ్చేలా నానబెట్టి వేస్తాడు. చాలా శుభ్రంగా, రుచిగా ఉంటాయి, తిని చూడాలి కాని చెబితే సుఖం లేదన్నాడు. ఈలోగా సామాను పట్టుకుని మా లైన్ మన్ వచ్చేశాడు. సమయం దగ్గరగా తెల్లవారు గట్ల నాలుగయింది. ఈ సారి నేను అన్నిటినీ పొందుపరచి జాగ్రత్తగా మళ్ళీ అన్నిటిని వాటి వాటి స్థానాల్లో బిగించి పవరిస్తే పని చేసింది. సమయం ఆరయింది. సరే! నేను వెళ్ళిపోతానన్నా. మా లైన్ మన్ తో సహా అందరూ మీరు మళ్ళీ వచ్చేసావకాశం చెప్పలేము. ముఖం కడిగేసుకుని పెసరట్లు తిని వెళ్ళమన్నారు. నాకు ఇష్టం లేకపోయినా సరేననక తప్పలెదు. పాక హోటల్ కెళ్ళేము. అప్పటికే జనం ఉన్నారు. మా లైన్ మన్ “మా జె.యి గారొచ్చారు పెసరట్లు బాగా వేసి ఇవ్వండి, అల్లం జీలకర్ర, పచ్చిమిరపకాయ, మాకూ ఇవ్వండి” అని చెప్పేడు. మా వంతు వచ్చేటప్పటికి ఒక అరగంట పట్టింది. అరటాకులో పట్టుకొచ్చాడు, ఇస్తూ “బాబూ అహారం విషయంలో అందరూ ఒకటే కదా, పెద్దవాళ్ళకి వేరుగాను, చిన్న వాళ్ళకి వేరుగానూ చేయను, అందరికి ఒకలాగే చేస్తాను” అన్నాడు. పెసరట్లు తిన్నాను, చెప్పిన దానికంటే బాగున్నాయనిపించింది. అల్పాహారం ఘనంగానే చేశాను. డబ్బులిచ్చి వచ్చేశాము. ఆ తరవాత నుంచి ప్రతి వారం ఉదయం ఎనిమిదిలోపు చేరేలా అక్కడికి వెళ్ళేవాడిని. ఒక సారి ఒకతను సమయం అయిపోయిన తరవాత వచ్చాడు. నాది ఆఖరు పెసరట్టు. పెసరట్టు కావాలంటే లేదన్నాడు. ఒక పెసరట్టు మాత్రం ఒక ప్లేటులో ఉన్నది. అది ఇమ్మన్నాడు వచ్చినతను. దానికి హోటలతను అది చల్లారిపోయింది, “నేను తినను కనక, మీకూ ఇవ్వలేను. నేను తినలేనిది మరొకరికి ఎలా పెడాతాను. డబ్బుకి కక్కుర్తి పడలేను. డబ్బు ముఖ్యం కాదు, ఈవేళ సంపాదిస్తాం రేపు పోతుంది, ఒక వేళ నేను లేక పోయినా నా గురించి తలుచుకోవాలి” అని “రేపు ఉదయంరండి” అని చెప్పి చాలా నిక్కచ్చిగా, అనునయంగా చెప్పి పంపేశాడు. నాకు చాలా ముచ్చటనిపించింది. ఇలాగే మరొకచోట చూశాను. (పాలకొల్లు) పాలకొలనులో ఉద్యోగం చేస్తున్న రోజులలో, ఆ ఊళ్ళో ఎర్రవంతెన అనేవంతెన ఉంది, నర్సాపురం కాలవ మీద. దానికింద ఒకతను రోజూ తెల్లవారుగట్ల నాలుగు నుంచి ఉదయం ఎనిమిది దాకా పెసరట్లు వేసేవాడు. అవి కూడా, మా పక్క ఊరి వాటి రుచిని పోలేవి.

పల్లెటూళ్ళయినా శుచిలోను, శుభ్రతలోను రాజీ పడక, రుచికి ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చి, డబ్బుకు లోబడని వాళ్ళు ఎంతమందో….ఇప్పటికీ ఉన్నారు. ఉంటా ఈవేళ ఉదయం పలహారం పెసరట్లని హోం మినిస్ట్రీ వారి ప్రకటన వస్తా…..

ప్రకటనలు

18 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-అల్లం జీలకర్ర పెసరట్లు.

 1. భలే కదా ఆ పెసరట్ల అబ్బి.. చక్కటి జ్ఞాపకాన్ని మాతో పంచుకున్నారు.
  అంతా బాగుంది గానీ మీ కబుర్లు విన్నాక నాకిప్పుడు పెసరట్టు తినాలనిపిస్తోంది. దేశం గాని దేశంలో, వేళ గాని వేళలో కుదిరే పని కాదే.. ఇప్పుడెలా? 😦

  • @మధురవాణి గారు,
   నన్ను వీకెండులో పెసరట్ల విందుకు శ్రీ గారు పిలిచారు. వస్తానన్నా. రండి ఇరవైగంటలు విదేశీ ప్రయాణం అన్నారు. అందుకు మానుకున్నా, వయసు మీరిపోయింది కనక ప్రయాణం చేయలేను. మీరు, శ్రీ గారికి ఇదే మా కుటుంబ ఆహ్వానం.మీరు మీకుటుంబ సభ్యులతో మన దేశం వచ్చినపుడు, మా ఇంటికొస్తే నేను, మా కుటుంబ సభ్యులమందరం విందు చేస్తాo.
   ధన్యవాదాలు.

   • మీ ప్రేమపూర్వక ఆహ్వానానికి బోల్డు ధన్యవాదాలు. అన్నీ కుదరాలే గానీ అంత కన్నానా.. తప్పకుండా వస్తాను.. 🙂

   • @మధురవాణిగారు,
    మా కుటుంబ సభ్యులందరం మీ కుటుంబ సభ్యులతో, మీరాక కోసం ఎదురు చూస్తున్నాం.
    ధన్యవాదాలు.

   • తప్పకుండా వస్తానండి నేను.పిలిచినందుకు ముందుగా మీకు ….many many thanks.
    అన్నట్టు వీకెండ్ పెసరట్ట్లు తిన్నానండోయి.మా అమ్మాయి అడిగింది నన్ను “గ్రీన్ dosas ” India లో అమ్మమ్మ చేస్తే తిన్నాను. నీకు కూడా వచ్చా అని అడిగింది. మొత్తానికి మీ పోస్ట్ వలన నాకు గ్రీన్ dosalu వెయ్యడం వచ్చు అని ఒక certificate వచ్చింది.

   • @శ్రీగారు,
    మీరు, మీ కుటుంబ సభ్యుల రాక కోసమ్ నేను, నా కుటుంబ సభ్యులమ్ ఎదురు చూస్తున్నాం. పెసరట్లని చెప్పండి అమ్మాయికి, గ్రీన్ దోశా కాదనీ,మీరు పెసరట్లు తిన్నానని చెప్పిన తరవాత నాకు ఆకలెయ్యటం లేదు ఈ పూట.
    ధన్యవాదాలు.

 2. బాగున్నాయి మీ జ్ఞాపకాలు .విలువల గురించి టివిల్లో ఎక్కువగా మాట్లాడే వారి కన్నా రోడ్ పక్కన పెసరట్టు అమ్ముకొనే అతనిలో లక్ష రెట్ల నిజాయితి ఉంది

 3. ఓ పెద్ద చెట్టు కింద చిన్న పాక, దాని ముందు ఓ నాలుగు బెంచీలు. ఆకుపచ్చ ఆకులో పెసరట్టు అందులో పొగలు గక్కుతున ఉప్మ…మీర్రాసింది చదువుతుంటే నాకవి కనిపించాయి బాబాయి. బాగా వ్రాశారు. మీ లాగా మంచి విషయాలు అందరితో పంచుకుంటే మంచిని పెంచినవాళ్ళమవుతాము. మన టివి చానళ్ళు ఆ పని చేస్తే బావుణ్ణు..

 4. శర్మ గారు,

  మంచి విషయాన్ని పంచుకున్నారు. ఈ నిఖార్సైన హుందా తనం ఏమీ లేని వాళ్ళ వద్ద ఉన్నంత బడా బడా బిజినెస్ మెన్ ల వద్ద తక్కువ గా కనిపించడం ఆశ్చర్య కరమైన విషయం.

  మా ప్రయాణం లో ఓ మారు యలమంచలి వద్ద ట్రైను ఆగి పోయింది. ఏమంటే ముందర కొన్ని కిలోమీటర్లలో పట్టాలు వరదకి ఎగిరి పోయేయి.

  ఈ యలమంచలి స్టేషన్ లో రేఫ్రేష్మెంటు స్టాలు వాడికి లాటరీ కొట్టింది. ఏమీ లేని ‘ఉప్మా’ ని డబల్ రేటు కి అమ్మడం, అదే ప్లాట్ ఫారం మీద ఓ ముసలావిడ, గట్టి పెరుగు మామూలు ధర కే ఉన్నంత దాకా అమ్మడం గమనించడం జరిగింది.

  మనకి నోరు ఊరు కోదు కదా, ఆవిణ్ణి కదిపి, ఇదిగో పెద్దమ్మా, ఈ చిక్కటి పెరుగులో ఈ సమయానికి ధారాళం గా నీళ్ళు కలిపి డబల్ రేటు కి అమ్మ కూడదూ, డబ్బులు దండి గా వస్తాయని ఓ ఉచిత సలహా పెడితే, ఆశ పెడితే, మొహాన్ని ఓ మారు ఎగాదిగా చూసి, అట్లా డబ్బులు వద్దులెండి అంది.

  అప్పటికి ఉన్న పరిస్థుతులలో ఆవిడ ఓ లీటరు మంచి నీళ్ళలో ఓ చూక్కెడు పెరుగు కలిపి గట్టి పెరుగు అని అమ్మి ఉన్నా జనాలు విరగబడి కొనేసి ఉండే వారు. ట్రైను సంగతి ఏమీ తెలియని పరిస్థితి ఆయే మరి.

  ఈ స్కాములు, రెండు జీలు, మూడు జీలు చేసే వారు, ఈ పాటి నిఖార్సైన వారై ఎందుకు ఉండరు? డబ్బెవరికి చేదు పిచ్చోడా ? లేక పిచ్చోళ్ళకే డబ్బు మరీ ఆశ ఎక్కువా ? అర్థం కాని విషయం.

  టపా అంత కామెంటు పెట్ట కూడదు కాబట్టి ఇంతటి తో జిలేబీ కామెంటు పరిసమాప్తము.

  ఈ టపా , కామెంటు ఇది చదివిన వారికి, విన్నవారికి, చదివి వినిపించిన వారికి, మా కొండ దేవర ఆశీస్సులు మెండు గా, అండ గా ఉండు గాక !!

  చీర్స్
  జిలేబి. .

  • @జిలేబిగారు,
   నా టపా మిమ్మల్ని ఒక చిన్న టపా రాయించేలా కదిలించిందంటే ధన్యుడనే.మీరు చెప్పినట్లు డబ్బు సంపాదించాలనే యావలో మానవ విలువలు మరిచిపోతున్నారు. విలువలున్న వారు, చిన్నవారు గానే కనపడటం లోక రీతి కదా!
   ధన్యవాదాలు.

  • నేనూ ఇలానే ఓ సారి ఓ ఆస్పత్రి పక్కన ఉన్న కిళ్ళీ డబ్బా అతనికి సలహా ఇచ్చాను సిగరెట్ లు కూడా ఆమ్మా వచ్చు కదా అని ( నేనేమి సిగరెట్ తాగాను కానీ అక్కడ నిలబడ్డాను కదా అని అతని ఆదాయం పెరిగే ఉచిత సలహా ఇచ్చాను ) అతను నన్ను చూసి నాకోచ్చే సంపాదన తిండికి సరిపోతుంది . నేను సిగరెట్ లు అమ్మక పొతే మనే వాళ్ళు లేరు ఇంకో చోట కొంటారు కానీ నా చేతులతో సిగరెట్, గుట్కా అమ్మడం వంటి పాపపు పనులు చేయడం ఇష్టం లేదని చెప్పాడు

   • @మురళిగారు,
    డబ్బు ఉండటం లేకపోవడం కాదు. మానవ విలువలు, ఉన్న వారి దగ్గర భాసించటం లేదు. లేని వారు, ఎక్కువ మంది విలువలతో బతుకుతున్నారు, అడ్డదారిలో సంపాదనకి సావకాశం ఉన్నా.
    ధన్యవాదాలు.

 5. ఉప్మా పెసరట్టు గుర్తుకు తెచ్చారు. మీకు తాంక్స్ చెప్పాలి.
  ఈ వీకెండ్ తప్పకుండా చేసుకుని తినాలి అని నిర్నయించుకున్నాను.

   • తప్పకుండానండి… మీరు ఆహ్వానితులే.
    కాకపోతే ఒక ఇరవై (20) గంటల ప్రయాణం మీకు.పెసరట్టు తినటానికి పక్క ఊరు వెళ్ళారు కదా ఒకప్పుడు.ఇప్పుడు విదేశానికి వచ్చెయండి చాలు.

   • @శ్రీగారు,
    వామ్మో! ఇరవైగంటలు ప్రయాణమా!! అదీ విదేశమా!! పోనీలెండి రమ్మన్నారు. కడుపునిండిన మాట. నా పేరు చెప్పి మీరు తిని నాకు చెప్పండి.
    ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s