శర్మ కాలక్షేపంకబుర్లు-అమ్మకాలు

అమ్మకాలు.    ఇదీ బడ్జెట్ కి సంబంధించినదే. జిలేబీగారికి అంకితం.పెద్దయింది టపా.

మా సత్తి బాబొచ్చాడు. “ప్రభుత్వరంగ సంస్థలు కొన్నిటిని అమ్మేస్తున్నామంటున్నారేమమిటి” అన్నాడు. “కొన్నిటిలో నష్టాలొస్తున్నయి కనక అమ్మేస్తున్నారు” అన్నా. “పిచ్చి పంతులు గారూ వాటికి నష్టాలు రప్పించి అమ్మేస్తున్నాం. తెలిసిందా ఎలాగో చెబుతా వినండి” అన్నాడు. ఇలా చెప్పేడు మాసత్తి బాబు.

ప్రభుత్వ రంగ కంపెనీలకి నష్టలొస్తున్నాయి. వాటిని ఆదుకోలేము అందుకని డైవెస్ట్ చేసి అమ్మేద్దాం వాటిని., అంటున్నారు. అమ్మేస్తున్నారు కూడా. ఇదేరంగాలలో ఉన్న ప్రయివేటు కంపెనీలకి లాభాలు ప్రభుత్వ కంపెనీలకి నష్టాలు ఎందుకు అని ప్రశ్న వేస్తే, చెప్పే నాధుడు లేడు. నిజంగా చెప్పాలంటే ఈ సంస్థలు చాలా కాలం నుంచి పని చేస్తున్నవి, ప్రజలకి చాలా కాలం నుంచి తెలిసినవి కూడా. కుక్కని చంపాలంటే దానిని పిచ్చిది అని ముద్ర వేసి చంపెయ్యమన్నాడు, తెల్లవాడు. వాడుపోయినా మనం మాత్రం, ఆ సూత్రాన్ని వదిలి పెట్టలేదు. మరొకటి విభజించు, పాలించు. ఇది కూడా వాడి కంటే ఎక్కువ శ్రద్ధగా ఆచరిస్తున్నాము.

సంస్థలకి నిజంగా నష్టాలెందుకొస్తున్నయో చూద్దాం. కొన్ని పేర్లు చెప్పుకోక తప్పదు కనక చెప్పుకుందాము. నాకు ఈ సంస్థలమీద ద్వేషం కాని, వాటి పని తీరుపై కోపం కాని లేదు. వాటిని కించ పరచాలనే ఉద్దేశం కూడా లేదు. ప్రభుత్వ రంగం లో ఉన్నవి, ఆర్.టి.సి, బి.ఎస్.ఎన్.ల్, పవర్ డిట్రిబ్యూషన్ కార్పొరేషన్లు, చూద్దాము. ఆర్.టి.సి. లో బస్సు టిక్కట్ల రేట్లు దగ్గరనుంచి అన్ని విషయాలు ప్రభుత్వమే చూస్తుంది. అక్కడ వున్న వారు ఉత్సవ విగ్రహాలే. దానికున్న బోర్డుకు స్వయం నిర్ణయం తీసుకునే హక్కు లేదు. ఒకవేళ కాగితాలమీద ఉన్నా తీసుకోనివ్వరు. సంస్థ బస్సులు కొనాలి ,ప్రభుత్వం ఒప్పుకోవాలి, రేట్లు పెంచాలి ప్రభుత్వం ఒప్పుకోవాలి. మరి ప్రభుత్వం టాక్స్ లు వగైరాలన్నీ ఈ సంస్థ నుంచి ముక్కు పిండి మరే వసూలు చేస్తోంది. కాని విద్యార్ధులను, సీజన్ టిక్కట్లలో నష్టాలను, తదితరులకు ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను మాత్రం ప్రభుత్వం చెల్లించదు. వారికి తోచినపుడు, సొమ్ములున్నపుడు, ముష్టి పడేసి నట్లు పడేస్తారు. సంస్థ ఏమి చేయగలదు. ఉన్న ఆస్థులను వినియోగించుకోడానికి కూడా ప్రభుత్వ అనుమతి కావాలి. అతి జోక్యం,ఆ రంగం లో పరిపాలన నిపుణత్వం లేని వారిని నెత్తి మీద కూచో పెడితే బరువు తప్పించి, ఉపయోగం ఉండదు. ఇది రాజకీయ నాయకులకు విశ్రాంతి స్థానమై పోయింది. సంస్థకి నష్టాలు తప్పించి లాభాలెలా వస్తాయి? పోనీ పోటీ ఉందా ఈ రంగం లో, లేదే మరెందుకీ దౌర్భాగ్యం? సమాధానాలు దొరకవు,అంతే.

మరొక ప్రభుత్వ రంగ సంస్థ పవర్ డిట్రిబ్యూషన్ కార్పొరేషన్లు. అబ్బో! వీటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వీటికీ పోటీ లేదు నేటికీ, మరెందుకొస్తున్నాయి నష్టాలు? జగమెరిగిన సత్యం. ఇంజనీర్లు లైన్ లాస్ లు ఎక్కువగా ఉంటున్నయి అంటున్నారు. నిజమా?లేకపోతే వ్యవసాయానికి ఉచిత కరంటు అంటున్నారు. లైన్ లాస్ లు ఉంటాయి. పిల్ఫరేజ్ లను అరికట్టలేక లైన్ లాస్ కింద కి తోసేస్తున్నారు. రెండు ఎ.సి లు ఎప్పుడూ పని చేసే, ఇంటి నిండా దీపాలెప్పుడూ పగలు రాత్రి భేదం లేకుండా వెలిగే వారింటి కరంటు బిల్లు నెలకు వెయ్యి రూపాయలు. నేను రెండు ఫేన్లు రెండు టి.ఇ.వి.లు ఇరవైనాలుగు గంటలూ పోనీ కరంటు ఉన్నంత సేపు వాడినందుకు నెలకు కట్టేది దగ్గరగా వెయ్యి రూపాయలు. ఏమిటీ తిరకాసు? ఎందుకు అరికట్టలేరు? నిజం! అరికట్టలేరు. వారు పెద్ద వారు, ప్రభువులు కనక. అదే మనదైతే కరంటు పీకేసి దిక్కున్న చోట చెప్పుకోమంటారు. వారి దగ్గరకే అనగా మీటర్ దగ్గరకే వెళ్ళలేరు. చిన్న వాళ్ళ మీటర్లన్నీ బయటికి మార్చేరు. పెద్దవాళ్ళవి మాత్రం ఇంకా లోపలే ఉన్నాయి, చాలా చోట్ల. ఇంకా విచిత్రం మీటర్ రీడింగు ఇంట్లోనుంచి చెబితే బయట నిలబడిన రీడర్ నోట్ చేసుకుని బిల్లిచ్చి వెళ్ళిపోతాడు. మరో సంగతి పెద్ద, చిన్న పరిశ్రమలలో కూడా ఈ పిల్ఫరేజ్ ఉంది. పెద్దవాళ్ళవి కనక ఎవరూ మాటాడలేరు. మా జిల్లాలో జరిగిన సంఘటన. ఒక పెద్దవారింటి మీదకి విజిలెన్స్ వారు వెళ్ళేరు. వెళ్ళిన విజలెన్స్ వారిని పెద్దవారేమీ అనలేదు కాని చుట్టుపక్కలవారు విజిలెన్స్ వారిని బంధించి క్షమాపణ పత్రాలు రాయించుకుని వదిలిపెట్టేరు. ఇంతకుమించి చెప్పలేను. ఈ సంస్థకి నష్టాలు కాకపోతే లాభాలొస్తాయా?

మరొక ప్రభుత్వ రంగ సంస్థ బి.ఎస్.ఎన్.ల్. ఇది గత నూట ఏబది సంవత్సరాల చరిత్ర కలిగిన, కమ్యూనికేషన్ వ్యవస్థ , నిపుణత కలిగిన సంస్థ. ఇది ఎప్పుడూ లాభాలే ఆర్జించేది, కాని గత కొద్ది కాలంగా ఇది వెనకపడుతోంది. ప్రభుత్వ అతిజోక్యం. దీనిని నిర్వహించడానికి తగిన వ్యక్తిని దానికి సమకూర్చలేకపోవడం. దానికి రావలసిన సొమ్ము ప్రభుత్వం ఇవ్వక పోవడం. ప్రయివేటు సంస్థల కిచ్చిన రాయితీలు కూడా దీనికి ఇవ్వక పోవడం.పల్లెలలో కమ్యూనికేషన్ వ్యవస్థ నడుపుతున్నందుకు ఇవ్వవలసిన సొమ్ము ఇవ్వకపోవడం. బాకీలు వసూలు చేసుకోడానికి ఇది అవస్థలు పడటం. ప్రఖ్యాతమైన ౨ జికి మూల కారణమైన ప్రభుత్వ శాఖకి సంబంధించిన సంస్థ ఇది.దీనికి నష్టాలొస్తున్నాయి కనక అమ్మేద్దామంటున్నారు. దీనికున్న ఆస్థులు లక్షల కోట్లలో ఉన్నాయి. వీటిని ఉప్పుగల్లుకి, ఊరగాయకి తినెయ్యాలని ప్లాను,” అన్నాడు.

“నేనీ సంస్థలో కొంత కాలం పని చేశా. అప్పుల వసూలులో ఒక అనుభవం మాత్రం చెబుతా,” అన్నా. “చెప్పండి” అన్నాడు. “బాకీలు వసూలు కూడా మా ఉద్యోగం లో భాగం. పెద్ద వారొకరి దగ్గరనుంచి దగ్గరగా లక్ష రూపాయలదాకా బాకీ ఉంది. అది రాదు. ఎప్పుడెళ్ళినా వారు దొరకరు. దొరికినవారు వారికి చెబుతా మంటారు. పని జరగదు. ఒక మీటింగులో నా మీద చాలా అక్షింతలు చల్లేసి, మీకు వసూలు చేయడం చేతకాదు, టేక్ట్ లేదు వగైరా వగైరా అన్నారు. నాకు మండిపోయి, “టేక్ట్ అంటే ఏమిటి సార్, నేను చేయగలది ఏమి ఉంటుంది వారు కట్టకపోతే” అంటూ, “నేను చేయగలది ఆయన ఫోన్ పని చేయకుండా చేయగలను. మీదగ్గరకొచ్చి ఆయన కంప్లైంటు చేస్తాడు. మీ వాడు మా ఫోన్లే పని చేయించటంలేదు, మిగిలినవాటి సంగతి దేముడేరుగు, వీణ్ణి ఇక్కడ నుంచి అడివిలో పారెయ్యండి అంటే మీరు నా మీద కత్తి పుచ్చుకొచ్చేస్తారు కదా. నన్ను నేను రక్షించుకోవాలి కదా. ఏం చేయమంటారో చెప్పండి” అన్నా. ఆయన చాలా స్పోర్టివ్ గా నవ్వేసి, మరు విషయంలోకి వెళ్ళిపోయారు. ఈ బాకీ వసూలు కాలేదు. ఎలక్షన్ల సీజను, ఒక రోజు అర్ధ రాత్రి నా ఇంటి తలుపులు బాదుతోంటే తలుపులు తీసి చూస్తే ఒక డజను మంది కనపడ్డారు. ఏమిటో అర్ధం కాలేదు. కొద్ది ముఖపరిచయం ఉన్నతనొచ్చి, ఫలానా వారి తాలూకు మేము. మీకు బాకీ ఉందిట కదా తెచ్చేను. డబ్బు తీసుకుని రశీదిచ్చెయ్యమన్నాడు. నాకు మతి పోయింది. లోపలికి రమ్మని కూచోబెట్టి చెప్పా. “నేను సొమ్ము తీసుకుని రశీదివ్వలేను. ఫోస్టాఫీసులో కట్టాలి. వాళ్ళు మీకు రశీదు ఇస్తారు” అన్నా. కాదు మీరు తీసుకోవాలి తప్పదు. ఏంచేస్తారో తెలియదు. ఇదిగో సొమ్ము అన్నారు. ఓరి నాయనో పెద్ద చిక్కులో పడిపోయాననుకుని, “నేను సొమ్ము తీసుకుంటే నా ఉద్యోగం ఊడుతుంది, కనక మీరేమి చెప్పినా నేను సొమ్ము తీసుకోను. ఒక పని చెయ్యండి. ఒక డి.డి. ఈవేళ తేదీ తో తెచ్చి ఇవ్వండి. రశీదిస్తా” అన్నా. వెంటనే నాకు కాపలాగా ఇద్దరుండి బేంకు మేనేజర్ని లేపి సొమ్మిచ్చి డి.డి. రాయించి తెచ్చి, నాకిచ్చి రశీదు పట్టుకెళ్ళేరు.” మా సత్తిబాబన్నాడు “ఎందుకు కట్టేరో తెలుసా. ఈ డబ్బు బాకీ ఉంటే నామినేషను చెల్లదు, అందుకు కట్టేరు. తెలిసిందా మీకు, మేము కట్టం. ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేరు. మరొక సంగతి ఈ మధ్య ఒక పని లేనివాడు, ఆర్.టి.ఐ కింద ఒక యూనిట్లో మీకు రావలసిన బాకీలేమిటి ఎవరి దగ్గరనుంచి ఎంత రావాలి చెప్పమన్నాడట. దానికి మీ సంస్థ ఇచ్చిన జవాబేమిటో తెలుసా మీకు? అది వ్యాపార రహస్యం అందుకు చెప్పం అన్నారట. మాకు భయమేటీ. ఇదండీ సంగతి. ఈ సంస్థలికి నష్టాలు కాక లాభాలొస్తాయా? అమ్మేస్తాం, మా ఇష్టం,” అన్నాడు.

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అమ్మకాలు

  1. శర్మ గారు idpl వచ్చాక హైదరాబాద్ బల్క్ డ్రగ్స్ కు కేంద్రంగా మారింది .idpl లో పని చేసే అంజిరెడ్డి సొంతంగా రెడ్డి లయ్బ్స్ పెట్టుకొని వేళ కోట్ల ఆసామి అయ్యాడు idpl ముతా పడింది ఏమిటో రహస్యం

  2. శర్మ గారు,

    మరీ ఇన్ని చేదు నిజాలా ! సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమప్రియం !

    (నో) టు సత్యం !

    జిలేబి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s