శర్మ కాలక్షేపంకబుర్లు-సత్తిబాబు పరిష్కారాలు.

సత్తిబాబు పరిష్కారాలు.

శుష్కప్రియాలు-శూన్య హస్తాలు లో సత్తిబాబు రేకెత్తించిన విషయాలకి పరిష్కారాలు. ఈ టపా రాయమని ప్రోత్సహించిన వారందరికి అంకితం.

సత్తిబాబు వస్తాడేమో నని చాలా సేపు చూసి, నేనే బయలుదేరా, సత్తిబాబింటికి. పరిష్కారాలు చెప్పమంటే చెబుతనన్నాడుకదా మరి. ఇంటి కెళితే చెల్లెమ్మ “అన్నయ్యా, ఊరి కెళ్ళేరు, వచ్చేస్తున్నారు, కూచో, కాఫీ తెస్తా” అని లోపలికెళ్ళింది. “వద్దు తల్లీ, సత్తిబాబుని” రానీ అంటూ ఉండగా సత్తి బాబు మోటార్ సైకిల్ మీద దిగేడు. లోపలకొస్తూనే “ఏమోయ్ మీ అన్నయ్య గారొస్తే కాఫీ మంచి నీళ్ళు ఏమయిన ఇచ్చావా? నేను వారింటి కెళితే నేను అక్కడున్నంత సేపులో చెల్లాయి ఎన్ని సార్లు ఇస్తదో టీ తెలుసా” అన్నాడు. “నేనిప్పుడే వచ్చానయ్యా! కాఫీ, టీ లకేమి గాని పరిష్కారాలు చెప్పు నాయనా” అని బతిమాలా. “ఐతే వినండి” అని మొదలు పెట్టేడు.

“గ్రామ ఆయకట్టు, తెలుసు, నీటి ఆధారం తెలుసు,ఎవరు సాగు చేస్తున్నారు, తెలుసు, ఎంతమంది కూలీలున్నారు, తెలుసు. సహకార సంస్థ, ఉంది. ముందు సహకార సంస్థ నుంచి మొదలు పెట్టండి. దీనిలో ఎవరుపడితే వారిని సభ్యులుగా చేర్చుకోవద్దు. వ్యవసాయం చేసేవారు తప్పని సరిగా ఇందులో చేరాలి, వ్య్వసాయం చెయ్యని వారిని సభ్యులుగా తొలగించాలి. సేవ చేయడానికి, ముందు చూపున్న వారిని ఎన్నుకోండి. రాజకియాలు దగ్గరికి రానివ్వకండి. మేము విభజించి పాలించడానికి చూస్తాం. మమ్మల్ని దూరంగా పెట్టండి. ప్రభుత్వం పావలా వడ్డీ కిచ్చేసొమ్ము ఈ సంస్థకి ఇవ్వమనండి. ఈ ఒక సంస్థే అప్పులివ్వలేదంటే కొన్ని బేంకులు సూచించండి. బేంకుకు ఫలానా ఫలానా రైతులు అప్పులకొస్తారని చెప్పండి. వాళ్ళని తిప్పద్దని చెప్పండి. ప్రతి దానికి ఆన్ లైన్ అంటున్నారుకదా, ఈ బేంకు వారు మిగిలిన బేంకులతో ఆన్ లైన్లో ఈ ఎన్.ఓ.సి తీసుకోవచ్చుగా, అవసరమైన చోట. ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు, బేంకు మాత్రం రైతు దగ్గర పావలా వడ్డీ వసూలు చెయ్యాలి. ఎకరానికి మీరెప్పుడో వేసిన లెక్కలతో పెట్టుబడికి అప్పు సరిపోదు. ఎప్పటికప్పుడు సవరించండి.

ఎరువులు, పురుగుమందులు,విత్తనాలు, వీటిని సహకార సంస్థ, పేరున్న మంచి కంపెనీలనుంచి బాధ్యత మీద తెప్పించనివ్వండి. ప్రభుత్వం వీరికి తెప్పించుకున్న వాటిమీద సబ్సిడీ ఇవ్వమనండి. అదెప్పుడో కాదు. తెప్పించుకున్న వారం రోజులలో.

ఎరువులు, పురుగు మందులు వాడకానికి ఒక కుర్రాణ్ణి ట్రయినింగిచ్చి ప్రతి ఊరికీ ఇవ్వండి. ఇప్పుడు ఆదర్శ రైతుల్ని పెట్టేరు. వారెవరూ, వారు మా పార్టీ కార్యకర్తలు. వారికి వ్యవసాయమూ లేదు, రైతూ కాదు. అది తీసెయ్యండి. మరొక సమస్య కూలీలులను వంద రోజుల పనితో అనుసంధానం చెయ్యండి. కూలీ బాధ పడడు, రైతూ బాధ పడడు. ఈ పనికి ఇంత మంది కూలీలని రైతు వారీ కట్టుబాట్లున్నాయి కదా. సగం కూలి రైతు, సగం కూలి ప్రభుత్వం పంచుకోమనండి. ఇదంతా సమన్వయం చేసేందుకో మంచి మనిషిని, రాజకీయాలకి అతీతంగా వెయ్యండి. మనం ప్రపంచం మొత్తానికే ఆహారం ఇవ్వగలం. రాజకీయం ఇందులో చొరబడనీయకండి, చాలు. నేను చెప్పిందే వేదం కాదు. చాలా మంది అనుభవజ్ఞులు, మేధావులు వున్నారు. అభిప్రాయం తీసుకోండి. ఇదంతా అనవసరం రైతుల్నే అడగండి వాళ్ళే చెబుతారు పరిష్కారాలు. బాధ పడుతున్నవాడికి నెప్పి బాగా తెలుసు కనక. ప్రతి విషయం పారదర్శకంగా చేయండి. మూతలొద్దు.ఇదంతా ప్రభుత్వం చేయ్యాలి, మీరు చేయించుకోవాలి.

చాలా ముఖ్యమైన విషయం. రైతునే గిట్టుబాటు ధర చెప్పమనండి. ప్రతి వారు తమ పనికి, సేవకి,తయారు చేసిన వస్తువుకి విలువ చెబుతున్నపుడు, అది మనం ఇస్తున్నపుడు, రైతుకి ఒక్కడికీ గిట్టుబాటు ధర ప్రభుత్వం చెప్పడం ఏమిటీ? ఇది చెల్లదు. అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధం కండి,”అన్నాడు.

“సత్తి బాబూ ఇన్ని చెప్పేవు కదా! ప్రభుత్వానికి తెలియవా? ఎందుకు అమలు చేయరు” అన్నా. “పిచ్చి పంతులు గారూ, రాజకీయం అంటే చేస్తామని చెప్పడమే, ఆశ చూపాలి తప్పించి పని చేయకూడదు. పని చేసేసి రైతులు, కూలీలు అందరూ బాగుంటే మా మాటెవరు వింటారు. రేపు మాకు ఓట్లు ఎవరు వేస్తారు? కొన్నాళ్ళు దున్నేవాడిదే భూమి అన్నాం ఇచ్చామా? లేదు. కాలం గడిపేశాం. ఇప్పుడు పావలా వడ్డీ అంటున్నాం. ఇవ్వడానికి ఇన్ని గుంట చిక్కులు పెడతాం. అంతే.” అన్నాడు. “రేపు మరొకటి చెబుతాం, మాకు కావలసింది, మా ఆస్థుల రక్షణ, మాకు అధికారం కావాలి. ఎలాగయినా సరే. ఒక్క మాట చెప్పండీ, రేపు నేను నిలబడితే మీరు ఓటు వేస్తారా? వెయ్యరు అదంతే. ఆ ఎర్రిగొర్రిలే మాకు ఓట్లేస్తాయి,” అని ముగించాడు.

మా సత్తి బాబు రాజకీయం, ప్రభుత్వం చెయ్యవలసినవి మాట్లాడేడు, కొన్ని నిజాలూ చెప్పేడు.అవి ప్రభుత్వాన్ని అమలు చేయమని అడుగుతూ, నాకున్న అనుభవం మీద చెబుతున్నా, వీలును బట్టి ఈ సహాయాలు చేయడానికి ప్రయత్నించండి. అన్నీ అందరూ చేయలేక పోవచ్చు. చేయగలిగినవారు, చేయగలిగినది చెయ్యండి.

ఏదీ ఊరకనే ఇవ్వవద్దు.
మీ పల్లెలో పావలా వడ్డీకి మీరు వ్యవసాయానికి అప్పు ఇస్తారన్న నమ్మకం కలగచేసి ఇవ్వండి. మొత్తం ఒక సారి ఇవ్వద్దు. వరి రైతుకు ఎకరానికి మొదటి నెల పెట్టుబడి ఆరు వేలు దాకా ఉంటుంది. అది ఇవ్వండి తరవాత ఎరువు పురుగుమందులు వగైరాకి రెండు వేలు కావాలి. ఆ తరవాత కోత, కట్టేత, నూర్పు లకి మిగిలిన ఏడు వేలు అవసరం. గమనించి ఇవ్వండి. దీర్ఘ కాల రుణాలివ్వ వద్దు. పంట రుణమే ఇవ్వండి.
మరొకటి, రైతు, అతని కుటుంబం వైద్యం మీద చాలా ఎక్కువ సొమ్ము ఖర్చు పెడుతోంది. ఆ సందర్భంలో చేయగల సాయం ఆలోచించండి. ఎక్కువ ఖర్చు ఊడుపు సమయం, కోత, నూర్పుడు సమయం లో ఖర్చు అవుతోంది. దీనికి సంబంధించిన, ఆ ప్రాంతం లో ఉపయోగపడే యంత్రం కొని తక్కువ అద్దెకు అద్దెకివ్వండి. మీ సొమ్ములు ఎక్కడికీ పోవు. నిజమైన రైతు బాకీ ఉంచుకోడు. పావలా వడ్డి రుణం తీసుకుని వడ్డీకి తిప్పుకునే ఆషాఢభూతులను చేరనివ్వకండి.ఒక కుర్రవానికి ట్రయినింగు ఇప్పించి ఎరువులు పురుగు మందుల వినియోగం మీద సలహాలిప్పించండి. ఆ కుర్ర వానికి నెలకు ఒక ఐదు వేల దాక జీతం ఇవ్వచ్చు. ఇవీ నేను మీరు చేయగల నిజమైన సహాయాలుగా గిర్తించినవి. నేను కూడా రైతునే గత పదకొండు సంవత్సరాలుగా, కనక చెప్పగలిగేను. రైతును బతికించుకోండి, మీరు బతకండి
నమస్కారం.
మీ అందరిదగ్గరా శలవు తీసుకుంటున్నా.
శర్మ.

ప్రకటనలు

18 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-సత్తిబాబు పరిష్కారాలు.

 1. శర్మగారు, బాగా చెప్పారు. సహకారసంస్థలు ఆర్థిక అవసరాలు కొంతవరకూ తాత్కాలికంగా తీరుస్తాయనుకుందాం. మరి ఇతర సమస్యల మాటేమిటి? 1) పంటకు గిట్టుబాటు ధర 2) కూలీలు సకాలంలో దొరక్క పోవడం 3) సరైన ధర వచ్చేవరకూ పంట దాచుకునే గిడ్డంగులు/బ్యాంకులు ఏర్పాటు 4) రాష్ట్రం/దేశంలో(అంతర్జాతీయ విఫణిలో అమ్ముకునే స్వేచ్చ తరవాత ఆలోచిద్దాం) ఎక్కడైనా అమ్ముకునే ఆన్‌లైన్ బజార్ ఆవశ్యకత 5) వీటన్నిటి మీద వుచిత సలహా కేంద్రాలు – ఇవన్నీ వ్యవసాయశాఖ నిర్వహిస్తే బాగుంటుంది. ఏమంటారు?

  • @snkrగారు,
   మీ ప్రశ్నలకి సమాధానాలు.
   1..గిట్టుబాటు ధర రైతే చెప్పాలి. అది ముందే చెప్పాను.
   2..కూలీలు దొరకకపోవడం లేదు, సమస్య, కూలీ రేట్లు దళారులు పెంచుతున్నారు.కూలీ కూడా లాభ పడటం లేదు. దీని మీద ప్రత్యేకమైన చర్చ కావలసి వస్తుంది. ఇంతతో ఆపుదాం.
   3,4,5.. అన్ని సమస్యలు ఒక్క రోజులో తీరిపోవాలనుకోవడం అత్యాశ కదా.
   మీరు చర్చలో పాల్గొని విపులంగా చర్చ చేసినందుకు ధన్యవాదాలు. నేను చెప్పిన వాటిలో ఏదయినా సాయం మీరు ఒక పల్లేకు చేయగలిగినా సంతసం.
   ధన్యవాదాలు.

 2. కష్టే ఫలే గారు..యెంత చక్కగా చెప్పారు!!! ఈ రోజు వ్యవసాయం అంటే అదేదో..పనికిరాని పనిలా ఉంది.అన్నదాతకి ఎన్ని కష్టనష్టాలో.కదా అండీ!మీరు రైతు పక్షాన నిలబడి . చాలా విపులంగా వ్రాసారు. నిజంగా రైతులని ఆడుకునే చిత్తశుద్ది ప్రభుత్వాలకి ఉందా? వారి కడగండ్లు తీరేనా?మంచి ఆలోచనాత్మకమైన పోస్ట్ వ్రాసినందులకు ధన్యవాదములు అండీ!

  • @వనజ వనమాలి గారు,
   మీరే చెప్పేరు, రైతులతో ఆడుకుంటున్నారని, రైతుల ప్రాణాలతో పులి జూదం ఆడుతున్నారు. లక్షాధికారయిన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మింగబోడు…..తిండికి ముఖం వాచే రోజొచ్చినపుడు కాని అర్ధం కాదు,
   ధన్యవాదాలు.

  • @సుభ,
   మీకు మీకుటుంబ సభ్యులకు నందన ఉగాది శుభాకామనలు, దీర్ఘ సుమంగళీ భవ
   ధన్యవాదాలు.

  • @శ్రీ గారు,
   రైతు గురించి చెప్పక తప్పలేదు,మీకు మీకుటుంబ సభ్యులకు నందన ఉగాది శుభాకామనలు
   ధన్యవాదాలు.

 3. entha bavundandi , nijamga nenu devudiki dannam pettukunemundu , prati rojuu raithu gurinchi pettukuntanu,raithula samasyalu telusu , parishkaralu teliyadu
  meeru naaku margam choopincharu, khatchitam ga okkataina amalu chesta

 4. ఎంతో సరళంగా, అంతే వివరంగా చెప్పారు. నిజమే, పనులు చేస్తే రా.నా.లకూ, అధికారులకూ ఏం ప్రయోజనం ఏముంది? రైతులకు నిజంగా మేలు జరిగిపోతే పుట్టి ములిగిపోదూ…!

వ్యాఖ్యలను మూసివేసారు.