శర్మ కాలక్షేపంకబుర్లు-నందనకు వందనం.

నందనకు వందనం.

నందన నామ సంవత్సర ఉగాది శుభాకామనలు. ఇదేంటి పండగైపోయిన నాలుగోరోజు అనకండి, జరిగింది అవధరించండి.

నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికో పిచ్చి కవిత రాశాను, మనసు బాగోలేక. జిలేబి గారు నందన నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం చేయమన్నారు. “సోమవారం వారం మొదలు, మనసు బాగోలేదు చెయ్యలేను”అన్నా. ఇరువది రెండవ తారీకు మధ్యాహ్నం నుంచి నెట్ పని చేయడం మానేసింది, ఏమయిందని కనుక్కుందామంటే లేండుఫోన్, సెల్ పోన్ ఏవీ పని చెయ్యటంలేదు. ఆఫీసుకిపంపితే, ఎక్కడో తంతువు (ఫైబర్) తెగిపోయినట్లు చెప్పేరు. సరి అవుతుందిలే అనుకున్నా. పండగ రోజు ఉదయం పూజ చేసుకుని పంచాంగ శ్రవణం విందామని టి.వి పెట్టేటప్పటికి టి.వీ సిగ్నల్ కాస్తా పోయింది. కాసేపు చూసి ఫోన్ చేద్దామంటే నిన్నటి పరిస్థితే నేడూ ఉన్నది. “టీ.వీ.సిగ్నల్ కేబుల్ కట్టయిపోయింది చూస్తున్నమన్నారు,” అని చెప్పేరు పక్కింటివారు.. కాసేపటికి అది సరి అయిందనుకుంటే కరంటు వారు తీసేశారు. అయ్యో ! ఇలా అయిందే ఈ సంవత్సరం మొదటి రోజే అనుకుంటూ పంచాగం శ్రవణం మనమే చేద్దామని కూచుని పంచాగం తీస్తే, తెల్ల కాగితాలుకొన్ని, మరికొన్ని కనపడి కనపడని అక్షరాలు ఉన్నాయి. అబ్బాయిని కేకేసి ఇదేదో చూడరా అంటే, కొట్టు వాడి దగ్గరకు పట్టుకెళితే “నేనేమి చేయనండి, ఆ రోజే మీరు చూసుకోవాలి” అన్నాడట. “మరొకటి ఇమ్మంటే” “స్టాకు అయిపోయింది, లేవు”అన్నాడట.”పంచాగం ఇక్కడ వదిలేయండి స్టాకు తెప్పించిన తరవాత ఇస్తాను” అన్నాడట. మరి ఇప్పుడు పంచాగం కావాలి కనక కొత్తది మరొక కొట్లో కొనుక్కొచ్చాడు.ఈలోగా కరంటు వారు కొద్దిసేపు కరంటు ఇచ్చారు. టి.వి లో పంచాంగ శ్రవణం అయిపోయింది.

సరే! ఇల్లాలి తీరు వీధి గుమ్మం చెబుతుందని సామెత. ఈ సంవత్సరం ఎలా ఉండబోయేది తెలుస్తూనే ఉందనుకుని, ఇవన్నీ పూర్తి అయి పంచాంగం వచ్చేటప్పటికి పన్నెండయింది కనక భోజనాలు చేసి అప్పుడు పంచాంగ శ్రవణం చేద్దామని భోజనానికి కూచున్న వెంటనే పాపం కరంటు వారికి కోపం వచ్చి కరంటు పీకేశారు. రాత్రి నుంచి కరంటు వస్తూ పోతూ ఉండటంతో ఇన్వర్తర్ బేటరీ అయిపోయింది. ఎలాగో భోజనం కానిచ్చిన తరవాత ఉక్కపోతతో పంచాంగ శ్రవణం మొదలెడితే ఎవరికి చూసినా అదాయం తక్కువ వ్యయం ఎక్కువ, రాజపూజ్యం తక్కువ, అవమానం ఎక్కువ కనపడింది. అది నిన్నటి నుంచే కనపడుతోందనుకుని, సాముదాయికం చూస్తే అది కూడా అంతంత మాత్రంగా కనపడి, రాబోయే గడ్డు కాలాన్నే సూచించింది. పండగపూటా ఫోన్ లేదు, నెట్టూ లేదు,సెల్ ఫోన్ కూడా లేని పరిస్థితులలో, ఫోన్లో అప్పుడప్పుడు ఎవరో ఒకరు పిలిచి శుభాకాంక్షలు చెబుతున్నారు. మనం చెబుదామని ప్రయత్నం చేస్తే పని చేయకపోడం చేత మొత్తానికి ప్రయత్నమే మానేశాము. పండగ గడిచింది.

పండగ మరునాడు ఇరువది నాలుగోతేదీ ఉదయం నుంచి కరంటు లేదు. వస్తూ పోతూ ఉంది.ఇరువది నాలుగోతేదీ కూడా నెట్టు లేదు, మా వాళ్ళదగ్గరకెళ్ళి నన్ను కూడా రమ్మంటారా రెస్టొరేషన్ కని అడిగితే, వద్దండి అన్నారు,బుర్రతింటానని భయపడి ఉంటారు. ఏమో ఏమి చేశారో మరి సరి అవలేదు. ఆ రోజు సాయంత్రం ఏడు గంటలకి కరంటు పోయింది. కొద్దిసేపు చూసిన తరవాత చూస్తే, చుట్టుపక్కల వారందరికి కరంటు వచ్చింది కాని మాకు రాలేదు. నాయనా మాకొకరికే లేదు, కరంటు, దీపాలు డిమ్ముగా వెలుగుతున్నయంటే పాపం, వచ్చి చూశారు.ఇప్పుడిక ఏమీ చేయలేమండి ఉదయమే చూస్తామన్నారు. ట్రాన్సుఫార్మర్ పోయింది, రేపు ఉదయం చూస్తామని రాత్రికి బాధ పడక తప్పదని చావు కబురు చల్లగా చెప్పి వెళ్ళిపోయారు. ఇంక చెప్పేదేముంది. ఉన్న బేటరీ మీద భోజనం చేసి శివరాత్రి జాగరం చేశాము, ఇంటిల్లపాది. ఫోన్ గురించి ఆదివారం ఉదయం ఆఫీసు కెళ్ళి అడిగితే, పక్క ఊళ్ళో చెట్టుకొట్టేశారట రోడ్డు వెడల్పుకోసం, దాని దగ్గరిన్న కేబుల్ తెగిపోయిందిట. దాన్ని తవ్వి తీయడానికి పొక్లైన్ తెప్పించవలసి వస్తూంది,అని చెప్పేరు. కరంటు వారు ఆదివారం ఉదయమే వచ్చి ట్రాన్సుఫార్మర్ దగ్గర సరి చేసి కరంటు ఇచ్చి వెళ్ళేరు. ఆదివారం సాయంత్రంకి నెట్ సరి చేశారు. ఆహా! నందన నామ సంవత్సరమా నీకు వందనం, ఇంకా ఏమి దాచి ఉంచావో మాకోసం.

22 వతేదీని ఒక టపా రాసి ఉంచాను, పండగ రోజు వేద్దామని, దానిని రేపు వేస్తాను. నా గురించిన వివరాలు, మీతో టపాకి సంబంధించని విషయాలు చెప్పడానికి ఇల్లు పక్కనున్న పెద్ద పేరు మీద క్లిక్ చేయండి.

ప్రకటనలు

16 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నందనకు వందనం.

 1. హమ్మయ్య, శర్మగారు,

  మళ్ళీ వచ్చేరు!

  ఇక ఉగాది అయి, పంచాంగ శ్రవణం అయ్యి, మీరు చూచాయిగా చెప్పిన, శ్రవణం, ఆల్రెడి స్టాకు మార్కెట్టు లో కనిపిస్తున్నట్టుంది సుమీ!!

  చీర్స్
  జిలేబి.

  • @జిలేబిగారు,
   మార్కెట్ శక్తులు ఎక్కువ కాలం నష్టాలు భరించవు. వీలుబట్టి సరుకమ్మేసి, కొట్లు కట్టేస్తున్నా, వ్యాపారం మానేస్తున్నా.అన్నీ వదిలేస్తున్నా. మిగిలిన కాలమంతా దైవ చింతనే.
   నెనరుంచండి.

 2. మా అమ్మగారి ఉవాచ ఒకటి ఇక్కడ చెప్పాలి. కరెంటులేకపోతే కలియుగం లేదనేవారు ఆవిడ. మీ అవస్థలు చదివాక ఆవిడ మాటలు ఠక్కున గుర్తుకు వచ్చాయి..

  • @మిత్రులు తాడిగడప శ్యామలరావు గారు
   నిజమే పెద్దల మాట చద్ది మూట. మీకు మీకుటుంబ సభ్యులకు శుభకామనలు.
   నెనరుంచండి.

 3. మీకూ, మీ కుటుంబ సభ్యులందరికీ, శ్రీ నందన నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు, శర్మగారూ!

  ఇక, పోస్టులో విషయాలు – అవన్నీ అప్పుడప్పుడూ అలా వుంటూనే వుంటాయి. అదంతే, దానికి చేయగలిగిందేమీ లేదు!

  మరోసారి శుభాకాంక్షలతో,
  వెంకట్.బి.రావు

  • @మిత్రులు వెంకట్ గారు
   ఆకటి వేళల అలపైన వేళల…. ఓపినంత హరి నామమే దిక్కు మరిలేదన్నారు కదా. మీకు మీకుటుంబ సభ్యులకు శుభకామనలు.
   నెనరుంచండి.

  • @మిత్రులు బులుసు సుబ్రహ్మణ్యం గారు
   జిలేబి గారి ప్రమేయం లేదండి. మీకు మీకుటుంబ సభ్యులకు శుభకామనలు.
   నెనరుంచండి.

 4. కరెంటు, ఫోనూ బాగా ఇబ్బంది పెట్టాయన్నమాట. ఇన్ని రోజులు ఏమీ వ్రాయకపోతే ఏమిటా అనుకున్నాను. అదన్నమాట సంగతి. ‘ఎందుకో రాయలనిపించట్లేదన్నారు’ మీరు కూడా కొంతకాలం బ్రేక్ తీరుకు౦టున్నారా..

  • @అమ్మాయ్! జ్యోతిర్మయి
   బాధ పెట్టేయనేకంటే హింస పెట్టేయంటే సరి అయిన మాటేమో అనిపిస్తుంది. . మీకు మీకుటుంబ సభ్యులకు శుభకామనలు.
   నెనరుంచండి.

 5. ఓహో అదన్నమాట రహస్యం!
  మీ టపా ఈ రెండు రోజులు రాలేదేమి సుమా అని అనుకున్నాను.
  మీకు ఉగాది శభాకాంక్షలు!

  • @శ్రీ గారు
   పాపం మా వాళ్ళు రహస్యంగా చెయ్యలేదండి. మీకు మీకుటుంబ సభ్యులకు శుభకామనలు.
   నెనరుంచండి.

 6. ఇంటర్ నెట్టూ, ఫోనూ, టీ వీ, కరెంటూ లేని అసలు సిసలు తెలుగు పండుగ చూపించిందేమో మీకీసారి.
  నందన సంవత్సర శుభాకాంక్షలండీ!

  • @చిన్ని ఆశ గారు
   పండగ రోజు ఎవరితో మాటాడలేకపోయినదానికి బాధ పడ్డాము.మీకు మీ కుటుంబ సభ్యులకు మా కుటుంబం తరఫున శుభకామనలు.మరుసటి రోజు కరంటు వారు నరకం చూపించారు.
   నెనరుంచండి.

వ్యాఖ్యలను మూసివేసారు.