శర్మ కాలక్షేపంకబుర్లు-విఫలప్రేమ

విఫల ప్రేమ.                                           DEVAYAANI-2

ప్రేమ విఫలమవడం, నేడు సర్వ సాధారణం గా కనపడుతున్న విషయం. అలవాటు ప్రకారం చూస్తే ఒక సంఘటన కచ దేవయానిల విఫల ప్రేమ, లేక ఒక వైపు ప్రేమ పరిణామం కనపడుతుంది. ఇది కొత్త కాదు మనకు పాతదే.

కచుడు దేవగురువు బృహస్పతి కొడుకు. యుద్ధాలలో దేవతలు చస్తున్నారు, రాక్షసులు బతుకుతున్నారు, దీనికి కారణం, శుక్రాచార్యునికి తెలిసిన మృత సంజీవినీ విద్య. అది నేర్చుకుని వచ్చి దేవతలని బతికించమని కచుడిని శుక్రాచార్యుని వద్ద విద్య నేర్చుకురమ్మని దేవతలు కోరుతారు. అప్పుడొక మాట కూడా చెబుతారు. శుక్రునికి కూతురంటే ప్రేమ ఎక్కువ అందుకని నువ్వెలాగయినా ఆమె మనసు గెలుచుకుంటే నీకు మృత సంజీవని తొందరగా లభ్యమవుతుందని చెప్పి పంపుతారు. కచుడు, శుక్రుని వద్దకు వచ్చి తన విషయంలో దాపరికం లేకుండా చెప్పి విద్య నేర్పమని అడుగుతాడు. శుక్రుడు కూడా దానికి ఇష్టపడి విద్య నేర్పడానికి ఒప్పుకుంటాడు. దేవతల గురు పుత్రుడు తమ గురువు వద్ద విద్య నేర్చుకోవడం రాక్షసులకి ఇష్టం లేక కచుడు అడవికి వెళ్ళినపుడు చంపి చెట్టుకు కట్టేస్తారు. గోవులిఇంటికి వస్తాయి, కచుడు రాడు, కచునిపై ప్రేమ పెంచుకున్న దేవయాని తండ్రితో కచుడు రాలేదని చెబుతుంది. శుక్రచార్యులవారు దివ్య దృష్టితో చూసి, కచుడు చంపబడినట్లు గుర్తించి వెళ్ళి మృత సంజీవనితో బతికిస్తారు. కొంత కాలం తరవాత రాక్షసులు కచుని చంపి బూడిద చేసి గురువు గారు తాగే సురలో కలిపి గురువుగారు తాగేలా చేస్తారు. కధ మళ్ళీ మామూలే. కచుని పై ప్రేమ పెంచుకున్న దేవయాని ఈ సారి మొండి పట్టు పట్టి కచుని చూడనిదే తిండి నీళ్ళు ముట్టనని హఠం చేస్తే దివ్య దృష్టితో చూస్తే, కచుడు తన కడుపులో ఉన్నట్లు తెలుసుకుని, కచుని బతికిస్తే, బయటకు వచ్చే మార్గం చెప్పమంటే, కచునికి మృత సంజీవనీ విద్య నేర్పి, కడుపు చీల్చుకుని బయటకు రమ్మని చెప్పి, బయట కొచ్చిన తరవాత గురువును బతికిస్తాడు, కచుడు. ఆ తరవాత కూడా చాలా సంవత్సరాలు గురువును సేవిస్తాడు. భారతంలో ఎక్కడా కచుడు దేవయానిని ప్రేమించినట్లుగాని, ఆ సూచనగాని కనపడదు. గురువు ఆజ్ఞ తో తిరిగి వెళ్ళిపోడానికి తయారవుతున్న కచునితో దేవయాని, నువ్వు బ్రహ్మచారివి, నేను కన్యను, మనకు వివాహంచేసుకోడానికి తగిన అర్హతలన్నీ ఉన్నాయి, వివాహం చేసుకుందామంటుంది. దానికి కచుడు నీవు గురు పుత్రివి కనుక సోదరివవుతావు, కనక వివాహం చేసుకోలేనని చెబుతాడు. దేవయాని చాలా చెబుతుంది. కచుడు వినడు, వివాదం ముదిరి దేవయాని కచుని “నీవు నేర్చిన మృతసంజీవని విద్య నీకు ఫలించకుండు గాక” అని శపిస్తుంది. కచుడు “నీకు బ్రాహ్మణునితో వివాహం జరుగ కుండుగాక” అని శపిస్తాడు. ఇల్లాగ ఒకరి కొకరు శాపాలిచ్చుకుని విడిపోతారు. ఇది నిజంగా దేవయాని ఒక పక్కనుంచి ప్రేమించిన వ్యవహారమే.

నేటి కాలంలో ఒక పక్క ప్రేమ వ్యవహారాలు చాలా కనపడుతున్నాయి. వాటి పరిణామాలు, ఆడపిల్లలని ఏసిడ్ పోసి విరూపులను చేయడం నుంచి, ఆడపిల్ల తల్లి తండ్రులను చంపడం నుంచి, ప్రేమించామంటున్న వారిని దారుణంగా పీకలు కోసి చంపేదాకా, అనేక ఘాతుకాలు కనపడుతున్నాయి. శుక్రాచార్యుడు తన కూతురుని అదుపులో పెట్టుకుని ఉంటే, కూతురి పట్ల, పట్టరాని ప్రేమ ప్రదర్శింపకుంటే, కూతుర్ని మొండిగా తయారయేలా పెంచకుంటే, ఈ సమస్య అసలు వచ్చి ఉండేది కాదుకదా. ఎక్కడా భారతంలో శుక్రుని భార్య ప్రసక్తి రాలేదు, విచిత్రం. అలాగే నేటి ఆడపిల్లలు కూడా మొదటిలోనే సమస్యలని, సమస్య సృష్టించేవారిని తుంచేస్తే కొన్ని సమస్యలు ముదరవు కదా, ప్రమాదాలకు దారి తీయవుకదా. ప్రమాదాలు జరుగుతున్నాయి కదా అంటారు, నిజమే కొన్ని కొన్ని జరుగుతున్న మాట వాస్తవమే. అమ్మాయిలు ముందునుంచీ జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని జరగపోయే సావకాశం ఉందన్నదే అలోచన. ఇక మగ పిల్లలు కూడా తమ హద్దులు ఎరిగి వారి బాధ్యతలెరిగి ప్రవర్తించాలి. ప్రేమకి, అరాధనకి, మోహానికి, కామానికి తేడా తెలియకపోవడం, ఆడపిల్లలని ఏడిపించడం, దురుసుగా ప్రవర్తించడం, అదేమో ఘనకార్యం, హీరోఇజం అనుకోడం, తల్లి తండ్రులు మందలించక వంత పాడటం సహజమైపోయింది. ఇంకా కొంత మంది తల్లి తండ్రులు మగవాడు ఎమైనా చేస్తాడు, ఆడపిల్ల జాగ్రత్తగా ఉండాలంటూ, కొడుకులను వెనక వేసుకు వచ్చిన తల్లులను ఎరుగుదును. ఇది తప్పని సాటి స్త్రీ, కొడుకుపై ప్రేమతో తప్పుని సమర్ధించడం, లేదా చూసీ చూడనట్లు నటించడం, ఖడించలేకపోవడం దురదృష్టకరం. ఈ విషయం లో మగపిల్లల తల్లి తండ్రులు సరి అయిన చర్యలు తీసుకోక పోవడం, కొడుకు చేస్తున్న పనులు తమ దృష్టికి వచ్చినా అవన్నీ గొప్పతనంగా భావించడం, డబ్బున్న వారు తమ పిల్లలు ఏమి చేసినా చెల్లిపోతుందనే భావం కలిగి ఉండటం, ఈ రకపు సమస్యలకు మూల కారణాలవుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం డబ్బున్న వారి పట్ల, లేనివారి పట్ల వివక్ష చూపడం కూడా సమస్యలు ముదరడానికి కారణం. కొన్ని చోట్ల వేధింపబడిన అమ్మాయికి వేధించిన వానితో వివాహం చేసి సమస్యను కప్పి పెట్టడం మూలంగా కూడా సమస్యలు పెరుగుతున్నాయి. ఈ విషయాలలో ఆడ, మగ పిల్లల తల్లి తండ్రులు చురుకుగా నిర్ణయాలు తీసుకుని సమస్యలను పెరగనీయకుండా చూడటం అత్యవసరం. పెద్దలు ఎవరేనా మంచి చెబితే, ముసలాళ్ళు మీ పని మీరు చూసుకోండని యీసడించడం, కోరి మృత్యువును కౌగలించుకోవడమే. ఆడపిల్లలు కూడా ఫేషన్ అనుకుంటూ నేటి సినీ నాయికలను అనుకరిస్తూ వస్త్ర ధారణ చేయడం కూడా సమస్యకు కొంత కారణం. ఆడపిల్లలను వేధించడం గొప్పగా చూపుతున్న సినిమా వారు కూడా ఈ విషయంలో తమ కూతురు, చెల్లెలు ఇటువంటి పరిస్థితులలో ఉన్నపుడు ఎలా ఉంటుందో అలోచించాలి. ఇక సెన్సారు వారు ఈ విషయాలని ఎందుకు తీసివేయటం లేదో తెలియదు. పిల్లలను రెచ్చగొట్టే విధమైన ఆహార్యంతో నాయికను చూపి సొమ్ము చేసుకునే సంస్కృతినుంచి సినిమా మారాలి. డబ్బున్న మగ ఆడపిల్లలు, వారి తల్లి తండ్రులు సరి అయిన పరిస్థితులలో మెలిగితే సమస్యలు తగ్గుతాయి. ఈ విషయాలలో ఎక్కువగా నష్టపోతున్నది మధ్య తరగతి వారేనన్నది గుర్తించాలి. అహం విడిచిపెడితే సమస్య తేలికయిపోతుంది….అక్కడే ఉంది అసలు సమస్య….

ప్రకటనలు

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-విఫలప్రేమ

 1. /శుక్రాచార్యుడు తన కూతురుని అదుపులో పెట్టుకుని ఉంటే, కూతురి పట్ల, పట్టరాని ప్రేమ ప్రదర్శింపకుంటే, కూతుర్ని మొండిగా తయారయేలా పెంచకుంటే, ఈ సమస్య అసలు వచ్చి ఉండేది కాదుకదా./
  అందరూ ఇలాంటి సందర్భాల్లో ఇలానే చెబుతారు కాని, పిల్లల్ని కనగలరేమో కాని వారి తలరాతలని ఎవరు కనగలరు?!

  విష్ణువు చెవిలోంచి పుట్టిన రాక్షసులని, విష్ణువే కడతేర్చాల్సి వచ్చిందని చందమామలో ఎప్పుడో చదివినట్టు గుర్తు. పులస్త్య బ్రహ్మ వంశంలో రావణుడు, హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుట్టినట్టు! కొంతవరకూ ప్రయత్నిచగలరేమో కాని వాళ్ళను పూర్తిగా బాధ్యులను చేయలేము.
  బాగుంది, ఆలోచింపచేసేదిగా వుంది.

 2. చాలా చాలా బాగా వ్రాసారు. చాగంటి వారు అన్నట్టు ప్రేమకూ కామానికీ తేడా తెలియకపోవడం, సినిమాలలో ప్రేమ ని అలా చూపడం కూడా ప్రేమ పేరిట జరిగే వికృతాలకు కారణమేమో .

  • @సుబ్రహ్మణ్యంగారు,
   నా బ్లాగుకు స్వాగతం. పాపం మనకు పాలకులుగా ఉన్న వారి భాషలో ఇన్ని ఉన్నట్లు లేవు. వారికి అన్నిటికీ కలిపి ఉన్న మాట ఒక్కటే.LOVE అదే సర్వస్వం అని మనం అనుకుంటున్నాం.
   నెనరుంచండి.

 3. ఈ కాలం పిల్లలకి తల్లిదండ్రులతో మాట్లాడే తీరికే ఉండటం లేదు. వాళ్ళు చెప్పేది నరకం. మంచి – చెడు వివరించి చెబుతుంటే..హెల్ ..వద్దురా బాబు..అంటారు.

  పేస్ బుక్ లు,చాటింగ్ లు,ఎస్.ఏం.ఎస్ లు ,సినిమాలు,కబుర్లు ,కెరీర్ ,ఎంజాయ్ మెంట్, పోటీతత్వం,డబ్బులు త్వరగా ఎక్కువ సంపాదించడం ఎలా..? ఇవి జీవన విధానం లో ముఖ్యంగా కనిపించేవి.

  ఆకర్షణ,మొహం,విచక్షణా రహితం,తొందరపడి జీవితాలు ముగించుకోవడం..ఇవి ఫలితాలు. విఫలమైన జీవితాలు. తప్ప ఇంకా క్రొత్తగా ఏం ఉంటాయి..!?

  మీరు చెప్పిన విధానం చాలా బాగుంది మాస్టర్.

  • @వనజగారు,
   మనలో కూడా కొంత మార్పురావాలనుకుంటా. తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుండు….ఆడయినా, మొగయినా చెప్పిన మాట విని ఆలోచించే స్వభావం అలవరచుకోకపోతే నష్టాలు, కష్టాలే మిగులుతాయి.డబ్బే జీవిత సర్వస్వం కాదని మనం కూడా చెప్పాలి.

   నెనరుంచండి.

 4. కొన్ని సినిమాలలో ప్రేమని చాలా వయొలెంట్ గా చూపిస్తున్నారు.

  • @లాస్య రామకృష్ణగారు,
   సున్నితమైనదానిని అలా చూపించడం, దానిని ఆదరించడం, కాలమహిమ.
   నెనరుంచండి.

 5. ఏమండీ శర్మ గారు,

  సినిమా వాళ్లు అలా చేస్తే నష్ట పోరు సుమండీ !

  దేవయాని ప్రేమ ఒక వైపే ఐనదైనా, మనసారా ఒకణ్ణి ప్రేమించింది. అతని కోసం పోరాడింది , ప్రాణ బిక్ష పెట్టించింది. కథా ప్రకారం రాక్షస కన్య. తాను కోరింది తప్పక నేరవేరాలన్న కోరిక ఉన్న పడుచు.

  ఇక తండ్రి శుక్రాచార్యులవారి పెంపకం ( తల్లి లేని పెంపకం) కాబట్టి ముద్దూ మురిపాలూ ఎక్కువే అయి వుంటాయి.

  అమ్మాయి అబ్బాయి ని కోరడం తప్పా ? తను ఒప్పుకోకుంటే శపించడం సర్వ సహజం (ప్చ్ ఈ కాలానికి ఈ తెకినీకులు లేవే మరి !) వాటికి ఆ కచుడు కూడా రిటార్ట్ ఇవ్వడం వాళ్ళిద్దరి యవ్వనాన్ని సూచిస్తూంది.

  ఇక నేటి కాలానికి వస్తే, పెళ్లి చూపుల ప్రహసనాలని దాటి సో కాల్డ్ సభ్య సమాజం డేటింగ్ రోజులకు వచ్చి నట్టు ఉన్నాయి. !

  వేధింపులు సాధింపులు పూర్వ కాలం లో కూడా వుండేవే అనుకుంటాను. ఉదాహరణకి ‘అత్తయ్య ‘ కైకేయి వేధింపులు ఫార్ కోడలు సీతకి ! (మరో కోణం!) ఆరడి పెట్టి అబ్బాయి ని అడవులకి దాని తో బాటు కోడలూ అడవికి ( సీతమ్మ తల్లి పతి వెంట నడిచింది అది వేరే విషయం !- మూల కారణం అత్తయ్య వేధింపులే కదా !)

  ఈ కాలం లో వేధింపులు రోడ్డున, కోర్టులో పడుతున్నాయి అంతే వ్యత్యాసం !

  జిలేబి.

 6. శర్మ గారు..మంచి టోపిక్ అండి.బాగా రాసారు. జ్యోతిర్మయి గారు చెప్పినదానిలో చాలా నిజముంది. నిజమైన ప్రేమ ఉన్న చోట అహం అసలు ఎప్పుడూ ఉండదు.

  • @శ్రీ గారు,
   అమ్మాయి జ్యోతిర్మయి కొంత అనుభవం మీద చెప్పిన మాట అక్షరాలా నిజం. మళ్ళీ మళ్ళీ చెబుతున్నననుకోకపోతే, ప్రేమ, ఆరాధన, మోహం, కామం వీటి తేడా గుర్తించగలిగినపుడు, మనలని మనం నిజమైన విమర్శ చేసుకుని వచ్చిన సమాధానాన్ని అమలు చేస్తే తప్పులు జరగవు.
   నెనరుంచాలి.

 7. ముందుగా ఆలోచనా పరిధి పెరాగాలి, అంటే మంచి పుస్తకాలు చదవాలి, చుట్టూ ఉన్న జీవితాలను గమనించాలి. దురదృష్టవశాత్తూ మన మన విద్యావిధానం సంపాదనవైపే దారి చూపుతోంది. పోటీ తత్వంతో పిల్లలకు ఎక్కడి సమయమూ చదువులకే చాలడం లేదు. ఇక వాళ్ళు గమనించి నేర్చుకోవడానికి అవకాశం లేదు. మన బోధనా పద్దతులలనే వ్యక్తిత్వవికాసం కూడా వుంటే చాలా వరకూ సమస్యలు సమసిపోతాయేమో..

  • @జ్యోతిర్మయి,
   నీవు చెప్పింది నిజం. అన్ని పుస్తకాలు చదవలేము కనకే మనవాళ్ళు మూడుగా చేసి అందించారు.రామాయణం, భారతం, భాగవతం. వీటిని కధా పరంగా చదవడం కాక నిత్య వ్యవహారం లో మనకు సంఘర్షణలు ఏర్పడినపుడు వీటిలో ఘట్టాలని ఎన్నుకుని వాటిని విమర్శనాత్మకంగా చదువు కుంటే పరిష్కారాలు మనకే దొరుకుతాయి.ఘట్టాన్ని ఎంపిక చేసుకోవడంలో మన తెలివి ఉంటుంది. అంతే. ఐతే మనమా పని చేయటంలేదు. కొంతమంది వీటిని విమర్శ చేయడమే గొప్ప అనుకుంటున్నారు.
   నెనరుంచాలి.

వ్యాఖ్యలను మూసివేసారు.