శర్మ కాలక్షేపంకబుర్లు-మావిడాకులు/మా విడాకులు

మావిడాకులు/మా విడాకులు.

ఓలమ్మో! కొట్టేస్తన్నాడు, దేవుడో! పోలమ్మ వీధిని పడింది. పక్కనున్న నారాయుడు “ఒరే పోలుపిల్లీ రోజూ, ఇదేట్రా గొడవ” అన్నాడు. “నా పెల్లమ్ నా ఈష్టమ్ కొట్టు కుంటాను, కోసుకుంటాను, ముద్దెట్టుకుంటాను నువ్వెవరోస్ అడగటానికి?” పోలుపిల్లి ప్రశ్న, మందులో ఉండి. “సరేలే సావు” అని వెళ్ళి పోయాడు నారాయణ. రోజూ గొడవలే, పోలుపిల్లి మీద అనుమానం పోలమ్మకి. కూలి డబ్బులివ్వడు, రోజూ తాగేసి వస్తాడు, ఇల్లు పట్టించుకోడు, బంగారమ్మతో తిరుగుతున్నాడని పోలమ్మ అనుమానం. రోజులు గడుస్తున్నకొద్దీ అనుమానాలు ముదిరాయి, గొడవలు పెరిగాయి,కుల పెద్దలలో తగువెట్టింది పోలమ్మ. రెండు మూడు సార్లు విన్నారు పెద్దలు, పోలుపిల్లి బంగారమ్మతో తిరుగుతున్నట్లు రుజువైపోయింది, తీర్పిచ్చేశారు, పోలుపిల్లికి తప్పేశారు, పోలుపిల్లి తప్పు కట్టేసి మరునాడే బంగారమ్మని మనువు చేసుకున్నాడు. ( తప్పు= కుల కట్టు బాట్లు తప్పి, కొన్ని పనులు చేసిన వారికి కుల పెద్దలు విధించే జరిమానా. ఇది సాధరణంగా కుల పెద్దల తాగుడుకిందికి జమయిపోతుంది)

“ఏటే! ఎవుడాడు? రొజూ వస్తనాడు మనింటికి” సత్తి బాబు ప్రశ్న, “మా కాడ పని సేస్తనాడు, మనోడే,” సత్తెమ్మ జవాబు.”నీకాడ పని సేస్తనాడంటన్నావ్, నేనాణ్ణి పక్కూళ్ళొ నెల రోజులనించీ పని జేస్తంటే సూసేను,” సత్తి బాబు టొకాయింపు.”ఏదో ఒకటినే,” సాచేసింది సత్తెమ్మ. అనుమానం పెరిగింది సత్తి బాబులో, కాపేశాడు. ఎంకన్న, సత్తెమ్మ తప్పు చేస్తుండగా దొరికిపోయారు. కుల పెద్దలలో పెట్టేడు సత్తి బాబు. తప్పేశారు, సత్తెమ్మకి. తప్పు కట్టేసి,ఎంకన్నని మనువు చేసుకుంది సత్తెమ్మ.

కుల గోత్రాలు చూశారు, జాతకాలు చూశారు, గ్రహపొంతనలు చూశారు,మంచి చెడ్డలు చూశారు, అమ్మాయి, అబ్బాయి ఇష్టపడ్డారు, మాట్టాడుకున్నారు, అబ్బాయి అమ్మాయీని,ఇద్దరి అభిరుచులూ కలిశాయి. ఒడ్డుపొడుగులు సరిపోయాయి, ఇద్దరివి, కట్నాలొద్దనుకున్నారు, కానుకలుచ్చుకున్నారు. ఓహో! గొప్ప జోడి అనుకున్నారంతా. పెళ్ళయిపోయింది,రెండేళ్ళు గడిచింది. పిల్లలు కావాలంటాడు అబ్బాయి, నాకు ఇలాగే బాగుంది,పిల్లలొద్దో అంటుంది అమ్మాయి. ఉద్యోగం పిల్లలు రెండిటినీ సద్దుకోలేను, నాకసలు పిల్లలేవద్దంటుంది అమ్మాయి. కాదనుకుంటే, కెరీర్ బాగున్నాకా కంటాను పిల్లల్ని అంటుంది. అబ్బాయి అంటాడు వయసు ఇప్పటికే ముఫై, ఇంకా ముందుకెళితే, ఆరోగ్య సమస్యలు వస్తాయంటాడు. ఇలా వాదు లాడుకున్నారు, సమస్య తెగలేదు. మీ అమ్మగారి ప్రోద్బలంతో మీరు పిల్లలు కావాలంటున్నారు, కుదరదు కాక కుదరదు, ఇది అమ్మాయి వాదన. అత్తగారేమి చెప్పినా దూరంగా ఉండి, వేరు కాపరంలో ఉంటూ కూడా, అమ్మాయికి చిరాకే. అత్తగారంటే భూతమనుకుంటుంది అమ్మాయి, పోనీ కారణం ఉందా? లేదు. అనుమానమే, అత్త ఏమి చెప్పినా అది తనను బాధించడానికే అని అమ్మాయి నిశ్చితాభిప్రాయం. అక్కడి నుంచి భర్త చేసే ప్రతి పనీ భూతద్దంలో చూడటం, అత్తమామల దగ్గరకు తను వెళ్ళడానికి, భర్త కూడా వెళ్ళకుండా చేయడానికి అమ్మాయి ప్రయత్నం. గొడవలు ముదిరి అమ్మాయి పుట్టింటికిపోయి, రాకపోడంతో విసిగి, అబ్బాయి విడాకులకి దరఖాస్తు. అక్కడనుంచి అమ్మాయి 498A కింద కంప్లైంటు వగైరా వగైరా…. అంతులేని కధ.

వరూ, నీవులేక నేను లేను చెప్పేడు ప్రవరు. అబ్బా! నిన్ను చూస్తే చాలోయ్ మనసు నిండిపోతుంది. నీతోటిదే లోకం, ప్రవరు పేలాపన. ఇద్దరూ ఒక ఆఫీసులో ఉద్యోగం, పెద్దలని కాదని, ఎదిరించి ఇద్దరూ ఒకటయ్యారు. తమకంలో, ఒక బిడ్డ పుట్టింది. సినిమాలు షికార్లు, పబ్బులు వద్దంటుంది వరు. కాదు మనం పెళ్ళి ముందు, తరవాత ఎలావున్నామో అలాగే ఉండాలి ఇప్పుడూ,పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెప్పద్దు, నడూ, పబ్బుకి అంటాడు ప్రవరు. పిల్లడితో కుదరదంటుంది వరు. కాదు ఎవరికేనా అప్పచెప్పి వెళదామంటాడు ప్రవరు. వద్దంటుంది వరు. రోజూ గొడవే. చిలికి చిలికి గాలి వానయి ప్రవరు ఇంటికి రావడం తగ్గించాడు. మంచి ఉద్యోగమని పక్క కంపెనీకి మారిపోయాడు,పక్కవూళ్ళో. రాకపోకలు లేవు, కబురు లేదు, ప్రవరునుంచి. వరు ఇప్పుడు దిక్కులేనిదయిపోయింది, ఒంటరైపోయింది. తల్లి తండ్రులు తప్పక, ఆదరించారు. కేసు విడాకుల కోర్టు మెట్లు ఎక్కింది…కధ మామూలే….మళ్ళీ కలిసే ఆశపోయింది…

కోట్లకి అధిపతి కూతురు, డబ్బులేని వాడిని ప్రేమించానంది, కాదు ఆరాధించింది, కాదు మోహించింది, కాదు కామించింది. పెళ్ళి చేసుకుందామంది అమ్మాయి, దేవయాని లాగా. కచుని లాగా వద్దన్నాడు అబ్బాయి. వదిలిపెట్టలేదు దేవయాని, బలవతం చేసి కచుని లేవదీసుకుపోయింది.ఎక్కడో పెళ్ళి చేసుకున్నారు. సంవత్సరానికి బిడ్డపుట్టేడు. ఆరేడేళ్ళు గడిచింది. దేవయానికి కచునిపై మోహం తగ్గింది. నిన్నటి దాకా కనపడని పుట్టింటి హోదా, ఐశ్వర్యం ఇక్కడలేకపోవడం బాధించింది. నెమ్మదిగా పుట్టింటికి చేరింది 498A కేసు పెట్టింది. షరా మామూలే……..
చిన్నపుడు తల్లిని తండ్రిని ఆరాధిస్తాము, తరవాత క్లాస్ టిచర్, లెక్చరర్, ప్రొఫెసర్, తెలుసుకుని వీరులు, శూరులు, రాముడు మొదలైన వారిని అరాధిస్తాం, తప్పు కాదు. ఇంతనుంచి మోహం లో పడిపోకూడదు. ప్రేమ చాలా మంది మీద ఉంటుంది,తల్లి తండ్రులు, అత్తమామలు, బంధువులు, స్నేహితులు..వగైరా వగైరా……ప్రేమ ఉండాలి కూడా. కాని మోహం, కామం ఒకరితోనే. ప్రేమకి కామానికి తేడా తెలియటంలేదు. ఇది పెద్ద బాధ. ఏంటి ఈ సంఘటనలన్నీ? ఎందుకు జరుగుతున్నాయి ఇలాగా అని అడిగితే ఒక్కొకరు, ఒక్కొక సమాధానం చెబుతున్నారు. పుండు మీద కారం జల్లి నట్లుగా ఈ మధ్య ప్రభుత్వం వారు, విడాకుల బిల్లుకు కొత్త కోరలు తొడుగుతామంటున్నారు, ఒక పక్కగా. కారణాలాలోచిస్తే వివాహేతర సంబంధాలు, అర్ధిక వత్తిడులు,అనాలోచిత నిర్ణయాలు,అనుమానాలే కనపడుతున్నాయి. ఓర్పు, సహనం ఏకోశానా కనపడటం లేదు, ఎంత సేపు నీ కారు, నా బంగళా, నా సొమ్ము, నీ బేంకు ఆక్కౌంటు అనుకుంటున్నారు తప్పించి, మనది అన్న ఆలోచన రావటం లేదు.. దీనికి తోడు పెద్దలు కూడా ఈ నిర్ణయాలకి వంత పాడుతున్నారు. ఏమయినా నేటి కాలం వారికి అన్నీ ఉరుకులూ పరుగులే, ప్రతి విషయం తొందరే. ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ కనపడుతోంది. ఎవరేనా చెప్పబూనినా దానిని విని మంచి చెడ్డలు తేల్చుకునే పరిస్థితులలో భార్య కాని భర్త కాని ఉండటం లేదు. ఎంత సేపు డబ్బు సంపాదనా మార్గాల వెతుకులాట తప్పించి, జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి, అనుభవించవలసినవి అనే ఆలోచనే రావటం లేదు. తామనుకున్నది చెల్లాలనే ధోరణి బాగా ప్రబలిపోయింది. ఇదేదో సంపాదిస్తున్న అమ్మాయిలు అబ్బాయిలకే పరిమితం అనుకోనక్కరలేదు. సామాన్యులు కూడా ఇలాగే ఉన్నారు. ఆర్ధిక స్వతంత్రత ఉన్నవారు మాత్రమే ఇలా చేస్తునారనుకోడం పొరపాటే.పెద్దవాళ్ళ అలోచనలో మార్పు రావాలా?అందరూ ఇలా ఉన్నారనను సుమా!

“మన పెళ్ళి అయిన తరవాత మీరేం సంపాదించారు” అంది ఒకరోజు రాత్రి నా ఇల్లాలు. “నీకు తెలియనిది ఏముంది,నా దగ్గరేమీ లేదు, ఇద్దరు మగ, ఇద్దరు ఆడ, పిల్లలని సంపాదించా” అన్నా. “ఏం ఎందుకడిగావు” అన్నా. “విడాకులకోసం” అంది. “దగ్గరగా పదేళ్ళపైనుంచి నీది, నాది కంచం, మంచం వేరుగానే ఉన్నయి కదా! మరెందుకూ” అన్నా. “చాలు సంబడం. ఉపయోగం లేని మొగుడు మంచానికి అడ్డమని సామెత, …సరే పడుకోండి……” అంది. నాకయితే ఏమీ అర్ధంకాలా….
పైన చెప్పిన సంఘటనలు ఎవరికేనా సరిపోలితే అవి యాదృచ్చికమే కాని ఎవరినీ ప్రత్యేకంగా ఉద్దేశించినవి కావని మనవి.

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మావిడాకులు/మా విడాకులు

 1. వివాహ వ్యవస్థ విచ్చిన్నం కళ్ళ ముందు ఉంచారు……
  ఆఖరిన మీ సామెత నవ్వుతాలగా అనిపించినా చీటికి మాటికి కొట్లాడుకుని విడిపోయే వారికి వివాహ బంధంలోని అనుబంధం ఆత్మీయతల పాత్రలు ఆ బంధాన్ని ఎంత బలంగా నిలబెడతాయో చెప్పకనే చెప్పారు ..

  • వనజగారు,
   ఎప్పటి టపా ఇది. నిజానికి ఈ మధ్య నాలుగు నెలల పైగా సరిగా కూచుని టపా రాయలేదు, ఇల్లాలికి బాగోలేదు, నాకు బాగో లేదు, ఆరోగ్యం. ఈ అనారోగ్యాల బాధల నుంచి కొద్దిగానైనా మనసు మళ్ళుతుందని బ్లాగు ఏదో రాసిపడెయ్యడమే జరుగుతోంది, పాత టపా ఇంత ఓపికగా చదివి వ్యాఖ్యానించిన మీకు
   ధన్యవాదాలు.

 2. శర్మ గారూ,
  మనది, మనం అనుకుంటూ వున్నవాళ్ళు ఉన్నన్నాళ్ళూ సుఖంగా వుంటారు, లేని వాళ్ళు పోతారు. దీనికి ఇంతకంటే వేరే ఏమీ చెప్పలేం!
  చివరి లైనుకు ముందు పేరా, “మన పెళ్ళి అయిన….నా కయితే ఏమీ అర్ధంకాలా…” – చాలా బాగుంది. సామెతల repertory మీరు!
  ధన్యవాదాలు!

 3. I guess main problem is — individual’s perspective towards life has changed. One life , let’s enjoy today as if there is no tomorrow .. That is the reason no one wants to compromise in life and decissions are taken in haste at times. Nice post andi.. Sorry I could not type in telugu at this present moment and had to respond in english.

వ్యాఖ్యలను మూసివేసారు.