శర్మ కాలక్షేపంకబుర్లు-వినినంతనె వేగపడక……

వినినంతనె వేగపడక….

మా సత్తిబాబు వస్తూనే “ఇదేంటి పంతులుగారూ, ఇల్లు ఇలా ఉంది,తలుపులు,ద్వారబంధాలు లేవు” అన్నాడు. “అదంతా పెద్ద కధలే, చెబుతాను,” అని మామిడి చెట్టు కింద కూచున్నాము. ఈలోగా ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు చేతిలో పుస్తకాలు పుచ్చుకుని వచ్చారు. వస్తూనే వాళ్ళు ఏసు ప్రభువు గొప్ప వాడు. రక్షకుడు అంటూ, చెప్పడం ప్రారంభించారు. మా సత్తిబాబు, “ఏమ్మా! మీరు మత ప్రచారకులా” అని అడిగాడు. “అవును” అన్నారు, వాళ్ళు. “చూడండి, మీరు క్రైస్తవ మతాన్ని నమ్మితే, అది మీఇష్టం, తప్పులేదు. మరొకరికి దీని గురించి ఎందుకు చెబుతున్నారు,” అన్నాడు. వాళ్ళు “ఇది మత ప్రచారంలో భాగమండి” అన్నారు. “అమ్మలూ, మీకు తెలుసో లేదో కాని ఇలా ఇంటింటికి తిరిగి మత ప్రచారం చేయడం నేరం సుమా, అందుచేత మీరు మరెక్కడికి వెళ్ళక ఇంటి కెళ్ళిపోండి, మీకు తెలియదు కనక చెబుతున్నా, నేను క్రైస్తవ మతం గురించిన డిప్లమా తీసుకున్నా, బైబిల్ మిషన్ నుంచి. ఏమతానినైనా కావాలనుకున్న వారు తెలుసుకుని అందులో చేరచ్చు, తప్పులేదు, ఇలా ప్రచారం వల్ల కాదు సుమా,” అన్నాడు. వాళ్ళు మరు మాట మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అప్పుడు నేను, “సత్తిబాబూ, ఏంటి క్రైస్తవమతంలో డిప్లమా తీసుకున్నావా,”అన్నా. “అవును ,నిజమే, చెబుతా వినండి” అని ఇలా చెప్పేడు.

” 30 ఏళ్ళ కితం సంగతి, బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటున్నా. పిల్లలు చదువు కుంటున్నారు. కలిగినదానితో బతకడం చిన్నప్పటి నుంచి అలవాటు కనక బాధలు లేవు. చేతికి నోటికి ఇబ్బంది లేదు. నిలవలేమీ లేవు అలాగని అప్పులూ లేవు. రేపు పెద్ద ఖర్చులు రాబోతాయి కదా ఎలా అనే అలోచన మాత్రం ఉంది, మరో భరోసా ఉంది. దైవం నాకు ఎప్పుడు ఏదికావాలో అది అందుబాటులోకి తెచ్చింది, ఇక ముందుకూడా తెస్తుందన్న నమ్మకం మాత్రం పుష్కలంగా ఉంది. ఇలా రోజులు జరుగుతుండగా ఒక రోజు ఒక మిత్రుడు….

“మిత్రమా! నలుగురు పిల్లలు, నీకు. పోనీ ఆస్థి పాస్థులు చూస్తే గొప్పగా ఏమీ లేవు. ఇప్పుడేమో నువ్వు సంపాదన గురించి అలోచించడం లేదు. దానికితోడు పనికి రాని పనులు నెత్తిన వేసుకు తిరుగుతున్నావు తప్పించి, మరొక డబ్బు సంపాదించే వ్యాపకం పెట్టుకోలేదు. రేపు నీ ఖర్చులు పెరుగుతాయి తప్పించి తగ్గవు సుమా. ఇలాగయితే జీవితం లో కష్టపడతావు సుమా” అని హెచ్చరించాడు. ఇలా అంటూ మిత్రుడు మాటల సందర్భంగా ఒక కొత్త విషయం ప్రస్తావన తెచ్చాడు. “జీతాలు చూస్తే గొర్రికి బెత్తెడు తోకలాగే ఉన్నాయి. ఎన్నేళ్ళు ఉద్యోగాలు చేసినా సంపాదించేది కనపడటం లేదు. నీకు మరొక ఉద్యోగం ఇప్పిస్తాను ఇక్కడ జీతం వందల్లో ఉంది, అక్కడ నీ జీతం వేలల్లో ఉంటుంది. నీ పిల్లలకి వాళ్ళే చదువు చెప్పిస్తారు, మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయగలవు నువ్వెందుకు బాధ పడతావు. నీ బాగు, నీ పిల్లల బాగు నువ్వు చూసుకో, డబ్బు సంపాదించుకో, అందుచేత ఏదో ఒకటి చేయడం మంచిది” అన్నాడు. దానికి నేను, “మనం ప్రస్తుతం లో చేయగలది కొత్తగా ఏమీ ఉండదు, నడుస్తున్న జీవితం నుంచి కొత్త దారి పడితే చిక్కుల్లో పడటం తప్పించి ఉపయోగం ఉండక పోవచ్చును” అన్నా. దానికతను, “నిన్ను తప్పక మరొక వుద్యోగం లోకి పంపే ఏర్పాటు చేస్తాను కదా. అక్కడ జీతం, అక్కడ వేలల్లో ఉంటుంది. ఖర్చులుపోను ఇంకా డబ్బులు బాగానే మిగులుతాయి. ఆలోచించుకో” అన్నాడు. “సరేలే చూద్దాం” అని ఊరుకున్నా. మళ్ళీ సారి కలిసినపుడు ప్రస్తావించాడు. నేను ఆలోచించలేదని చెప్పా. “సరే ఆలోచించి చెప్పు” అన్నాడు. నాకో అడ్రస్ ఇచ్చాడు. దీనికి కార్డ్ రాయి వివరాలొస్తాయి. అన్నాడు ఉత్తరం రాశా. ఏవో పంపించారు. చదివాను. మీరు చదివి ప్రశ్నలకి సమాధానాలు రాస్తూ వుంటే కొంతకాలం తరవాత మీకు క్రైస్తవ మతంలో డిప్లమా ఇస్తామన్నారు. చదివేను, ప్రశ్నలకి సమాధానాలు రాశాను. వాళ్ళు డిప్లమా ఇచ్చారు. ఇదంతా నా మిత్రుడికి తెలుసును. “ఇప్పుడు నేను చెప్పిన ఉద్యోగం చేయడం నీకు తేలిక” అన్నాడు. “ఉద్యోగం ఏమిటి” అన్నా. “మత ప్రచారం” అన్నాడు.

ఇంటికొచ్చా. రాత్రి భోజనాల తరవాత నా ఇల్లాలితో విషయం చెప్పేను. ఆవిడ ఒక మాట అడిగింది. “నేను మిమ్మలిని డబ్బు సంపాదించలేదని కాని, నగలు నాణ్యాలు కావాలని కాని ఎప్పుడూ అడగలేదే! మనకు ఏదో తక్కువయిందని అనుకో లేదే! ఇప్పుడు మనకి తక్కువేమి అయింది. పెద్దలు ఏదో కొద్దిగా ఆస్థి ఇచ్చారు. మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు. నలుగురు పిల్లలు కలిగేరు. వాళ్ళు చదువుకుంటున్నారు. ఇప్పుడు డబ్బుకు ప్రత్యేక అవసరం ఏమి వచ్చినది నాకు కనపడటంలేదు. అదీ గాక నాది మరొక అనుమానం, మిమ్మల్ని కొత్త ఉద్యోగానికి పంపుతానంటున్న ఆ మిత్రుడు వెళ్ళచ్చుగా. అదీగాక మత మార్పిడా, నాకయితే సుతరాము ఇష్టం లేదు” అంది.”

మరునాడు మిత్రుడు కనపడితే విషయం అడిగాను. “ఇది మత ప్రచారం, నేను వెళ్ళచ్చు, కాని ఆ పనికి నేను పనికిరాను. నోరున్నవాడు కావాలి దీనికి, అందుకు నీకు చెబుతున్నా, ఇంతకు మించి ఇప్పుడు వివరించలేను, ఏ పేరుతో పిలిచినా దేవుడొక్కడేగా” అన్నాడు. మిత్రమా! “నేను పుట్టిన ధర్మంలో, గీతలో కృష్ణ భగవానుడు స్వధర్మం ఎప్పుడూ మేలు, పరధర్మం ఎంత గొప్పదయినా భయంకరం అన్నారు. ఎప్పుడో చేసుకున్న చిన్న పుణ్యం మూలంగా భారత దేశంలో అదీ గోదావరి తీరాన పుట్టాను. ఇక్కడే పెరిగాను. నాకు ప్రస్తుతం జరుగుతున్న జీవితం తో సంతృప్తిగానే వున్నా. కొత్తగా ఏమీ చేయాలనుకోటం లేదు. ఏమి జరగబోతోందో అది మన చేతిలో లేదు. జరగ వలసినది జరుగుతుంది. నీమాట వినలేను, నన్ను క్షమించు” అని చెప్పి ఆ ప్రస్తావనకి చుక్కపెట్టేశా. అప్పుడు పొరపాటు నిర్ణయం తీసుకుని ఉంటే ఇప్పుడు బ్రదర్ సత్తిబాబుగా గాని, ఫాదర్ సత్తిబాబుగాగాని చూసివుందురు” అన్నాడు.

ఎన్ని ఎరలో, ఎన్ని ఉరులో జీవితంలో.
వినినంతనె వేగపడక వివరింపతగున్…..

 

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వినినంతనె వేగపడక……

  1. ఎంతో సంక్లిష్టమైన అంశాన్ని ఎంత సాత్వికంగా చెప్పారు! గోదావరి జిల్లాల్లో, ఆ మాటకొస్తే కోస్తా అంతటా క్రైస్తవుల మత ప్రచారం, మార్పిడులూ యుద్ధ ప్రాతిపదికన జరుగుతాయి. భర్త ఇంట లేని సమయంలో భార్యలను మతం మార్చేసిన ఘటనలెన్నో. పైగా దాన్ని ఆపాలని ప్రయత్నించే వారిపై హిందూ మతోన్మాదులని ముద్ర వేస్తారు… 😦

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s