శర్మ కాలక్షేపంకబుర్లు-నీరు

నీరు

ఎండలు మండిపోతున్నాయ్.! ఈ మధ్య బయటికి వెళ్ళటం లేదు, ఇంట్లో పని జరుగుతున్నందునా, ఎండకి జడిసీ. ఈ వేళ వెళ్ళక తప్పలేదు. బస్ స్టాండులో మిత్రుడొకరు చలి వేంద్రం పెట్టేడు, మంచినీళ్ళు తాగమని ఇచ్చాడు. బాగున్నాయి, “ఎక్కడివ”న్నా. “మినరల్ వాటర్” అన్నాడు. “అదేమి మన వడ్లాసుబ్బమ్మ నుయ్యి నీరు తేవటం లేదా” అన్నా. “ఆ నీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా తెచ్చిపోయడానికి మూడు వందలడుగుతున్నాడు. ఇదయితే ఐదు బాటిళ్ళు వంద రూపాయలు. అందుకు ఇవే పోస్తున్నా” అన్నాడు. “అసలేవో ఒకటి పోస్తున్నావు అది సంతోషం,” అని వచ్చా. ఇదివరలో ఎవరింటికైనా వెళితే రండి అని ఆహ్వానించి కూచునే లోపు మరొకరు మంచి నీళ్ళు తెచ్చి పట్టుకు నుంచునేవారు. ఇది వారి పట్ల చూపే గౌరవభావం కూడా అయి ఉండే దనుకుంటా. ఇప్పుడెవరింటికెళ్ళినా మంచినీళ్ళిచ్చే సంస్కృతి లేదు. ఒక వేళ మనం అడిగితే తెచ్చి అక్కడున్న టీ పాయ్ మీద పెట్టిపోతున్నారు. ఏమో లోకంతో పాటు మారలేకపోతున్నామేమో. మా చిన్నపుడు రోజుల్లో, “నీకు నిప్పూ నీళ్ళూ కూడా పుట్టవురా” అని దీవించేవారు కోపం వస్తే.

జలం, పానీ, తణ్ణీ, నీరు ఏమని పిలిచినా నీరు నీరే కాని నీఱు కాదు, నీఱు అంటే బూడిదని అర్ధం. “తా వలచింది రంభ తా మునిగింది గంగ” అని సామెత. రాని బాకీని “నీళ్ళొదులుకున్నట్లేనా” అనడం ఇప్పటికీ ఉంది. “చుట్టాలకి దూరంగా నీటికి దగ్గరగా ఉండమని” సామెత. నీళ్ళాడటం, నీళ్ళోసుకోవడం అంటే గర్భవతి కావడం అని అర్ధం. జీవితంలో ఒక సారయినా కాశీ వెళ్ళాలట, గంగలో మునగాలట. శంకరులు గంగా జల లవ … అన్నారు, భజ గోవిందంలో.మరో విశేషం ఏ నీరయినా నిలవ ఉంటే బాక్టీరియా చెరుతుంది, కాని గంగ ఎన్నేళ్ళు నిలవ ఉన్నా బాక్టీరియా చేరదట, అదేమి చిత్రమో! ఏదయినా మలినం పోవలంటే వాడేది నీరు. శుభ్రం కావాలంటే, ఆరోగ్యం కావాలంటే శుద్ధ జలం కావాలి. దానిని పాడు చేసేస్తున్నారు, ఆలోచన రహితంగానో, ఆలోచనా సహితంగానో తెలియదు. ఒక రోజు భోజనమైనా మానగలుగుతున్నాము తప్పించి ఒక రోజు స్నానం చేయకుండా ఉండలేము. చలి దేశాలవారికి ఈ స్నానం బాధ ఉండదేమో తెలియదు.

ప్రాణాధరమైన వాటిలో నీరు రెండవది. ఆహారం లేకపోయినా నీటితో చాలా కాలం బతకవచ్చు అని అంటారు. ఇటువంటి ప్రాణాధారమైన నీటితో వ్యాపారం చేస్తున్నారు. మంచి నీళ్ళ పేకట్ ఒక రూపాయకి అమ్ముతున్నారు. ఎండలో దాహానికి తట్టుకోలేక అవి తాగి రోగాలు తెచ్చుకుంటున్నారు. ఆ అమ్మేవారికి, తయారు చేసేవారికి డబ్బు తప్పించి మరొకటి కనపడటం లేదు. నిజానికి ఆ పేకట్టు ఏబది పైసలకి అమ్ముతున్నాడు హోల్ సేల్ దారుడు,అతనికి కిట్టేది ముఫై పైసలుకి. అది కూడా పోచ్ ఖరీదు+ తయారి ఖరీదు. నీరు మామూలు నీరే, శుభ్రం చేసినది కూడా కాదు. ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి, కోన సీమలో ఎప్పుడూ నీళ్ళుండే చోట వేసవిలో ప్రజలు మంచినీటికి అల్లాడుతున్నరంటే, స్వతంత్రం వచ్చి అరవై సంవత్సరాలు దాటినా మన బతుకులు మారలేదు అన్నదానికి ఇదొక నిదర్శనం. మన దేశం లో పన్నెండు పెద్ద నదులున్నాయి. మరేదేశం లో ఇన్ని నదులు లేవు. వీటికే పుష్కరాలని చెప్పి ఒక్కొక సంవత్సరం ఒక నదికి ప్రాధాన్యం ఇచ్చారు. సరస్వతి అంతర్వాహిని అంటే కట్టుకధ అన్నవారు, నాసా వారు చెబితే నమ్ముతున్నారు. చిన్న నదులు లెక్క లేనన్ని, విశాల భూ ఖండం, చక్కటి నీటి వసతి, పరిశ్రమ చేయడానికి ఇష్టపడే జనభా ఉన్న దేశం ఎందుకు వెనక పడుతోందీ! కారణం అందరికి తెలుసు. ఇంతటి జల వనరులను ఉపయోగించుకోలేక, జలయజ్ఞం అని ధన యజ్ఞం చేస్తున్నారు. నదులలో ఇసుక తోడేసి నీరు నిలువలు లేకుండా చేసేస్తున్నారు. నదులను వ్యర్ధాలతో పాడు చెస్తున్నారు. డబ్బుకిచ్చిన విలువ నీటికి ఇవ్వడం లేదు. ఒక రోజు నీటికి అల్లాడే సమయం వస్తుందనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆ సూచనలు కనపడుతున్నాయి. కాని ప్రభుత్వాలు కుంభకర్ణునిలా నిద్ర పోతున్నాయి.

ఇంత విలువైన నీరు భూమి పై ధృవాలదగ్గర మంచురూపంలోనూ, సముద్రంలో ఉప్పునీటి రూపంలో నూ ఉన్నది. మంచి నీటి రూపంలో ఉపయోగపడేది తక్కువ. ఒక వ్యక్తికి ఒక రోజుకి నూట నలభై లీటర్ల నీరు కావాలి. ఐదుగురు కుటుంబానికి 700 లీ. నెలకి 21000 లీ సంవత్సరానికి 7665 కిలో.లీ. ఇటువంటి అవసరమైన నీటిని చాలా దుబారా చేస్తున్నాము. పళ్ళుతోముకునేటపుడు, గెడ్డం గీసుకునేటపుడు, వంట పాత్రలు శుభ్రం చేసేటపుడు, బట్టలుదికేటపుడు,అవసరాన్ని కంటే ఎక్కువ నీరు వదిలేసి, నీటిని వృధాగా వదిలేస్తున్నాము. మామూలుగా స్నానం చేస్తే అయ్యే నీటికంటే షవర్ కింద చేసే స్నానానికి నీరు ఎక్కువ పడుతుంది. డబ్బు నీళ్ళలా ఖర్చుపెడుతున్నారని సామెత.మనిషి శరీరంలో ఎనభై శాతం నీరేనట.మనిషి ఒంటిలో నీరు తగ్గిపోతే చనిపోతాడట. దీన్ని డి హైడ్రేషన్ అంటారట.ఎన్ని ఎయిరోబిక్స్ చేసినా ఉపయోగం లేకపోవచ్చు, కాని ఒక గంట రోజూ ఈత కొడితే ఆరోగ్యం కుదుటపడుతుంది. మన పిల్లలికి కూడా నీటిని జాగ్రత్తగా వాడుకునే అలవాట్లు చేద్దాం. నీటి వాడకంను బట్టి అతని పొదుపరితనం తెలుసుకునేందుకు మనకు చాలా కధలున్నాయి.

ఎడారి దేశాలు ఐస్ బర్గులను ఓడలతో లాగించుకుని తెచ్చుకుని సముద్రంలో నిలువ చేసుకుని రోజువారీ అవసరాలు తీర్చుకుంటాయి. ఇజ్రయిల్ లాటి దేశం వాన నీటిని పొదుపుగా వాడుకుని తాగునీటి, సాగు నీటి అవసరాలు తీర్చుకుంటుంది.మనం ఉన్న నీటిని తగువులాడుకుని మనం సముద్రం పాలు చేస్తున్నాం. వాన నీటిని నిలవ చెసుకుని వాడుకునే అలవాటు చేసుకోడం మంచిది. దీనికి చాలా చిన్న నిర్మాణం చేసి దాచుకోవచ్చు. ఇల్లు కట్టేటపుడు ఈ నిర్మాణం చాలా తేలిక. తెలియక నేను అప్పుడు చేసుకోలేకపోయా.

పృధివ్యాపస్తేజోవాయురాకాశాత్ పంచ భూతాలు. నీరు నాల్గవది. బలి దానం ఇచ్చినపుడు వామనుని పాదం బ్రహ్మలోకానికి వస్తూ వుంటే బ్రహ్మగారు ఆ పాదాన్ని కడిగారట. ఆ కడగగా పారినది, ఆకాశగంగ. దానిని భగీరధుడు తపస్సు చేసి సాధించి, పితరులను తరింపచేశాడు. శివుడు గంగను జటాజూటంలో బంధించి ఒక పాయవదిలేడు. ఈ గంగావతరణాన్ని మామిత్రుడు సిరివెన్నెల తన గళంలో వినిపిస్తే నిజంగానే గంగ అక్కడ ఉరికినట్లుండేది, ఆ రోజుల్లో కాకినాడలో ఉన్నపుడు.

ఇటువంటి నీటిని అన్నిమతాలు గొప్పగానే చెబుతున్నాయి. ఇహ పరకర్మ లన్నిటిలోనూ నీటికి ప్రాముఖ్యత ఉంది.

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నీరు

 1. సుమారు ఇరవై సంవత్సరాల క్రితం బొంబాయి రైల్వే స్టేషన్లో మంచినీళ్ళు అమ్ముతుంటే మొదటిసారి చూసి ఆశ్చర్యపోయాను. ఈరోజు దేశమంతా ఇది మామూలు విషయం.

  ఇప్పుడు మన దేశం, కొబ్బరిబొండాలు దొరికేచోట కూడా కూల్ డ్రింక్స్ తాగే దౌర్భాగ్యుల దేశం అయిపోయింది.

 2. నీళ్ళకోసం బోరుబావులు తవ్వీ-తవ్వీ, భూమిని కుళ్ళబొడిచి, ఒకడితో ఒకడు పోటీబడి 180, 250, 500, 700, 900, 1200, 1500 చివరికి 2000 అడుగుల లోతు వరకూ తవ్వుకుంటూ పోయి, భూగర్భజలాలను హాం ఫట్ చేస్తున్న మనందరికీ మంచిరోజులు మున్ముందు ఉన్నాయేమో!?!
  .
  ఏదో ఒకరోజు, అలా తవ్వుకుంటూ పోతే, నీళ్ళకు బదులు చమురు తన్నుకొచ్చి మన దేశ దశ ఇట్టే తిరిగిపోతుందేమో! అలా జరిగితే, ఎంచక్కా విదేశాలకు చమురును ఎగుమతి చేస్తూ, మంచి నీళ్ళు దిగుమతి చేసుకోవచ్చు. ఏఁవంటారు?

  • @తెలుగు భావాలు గారు,
   అయ్యో! మళ్ళీ మంచినీళ్ళు దిగుమతీ ఎందుకండీ! ఆయిల్ తాగి, ఆయిల్ తిని బతికెయ్యచ్చు.
   ధన్యవాదాలు.

 3. @జిలేబి గారు,
  గ్రేట్ కెనాల్, గార్లెండ్ కెనాల్, ఈ రెంటి గురించి చాలా కాలం నుంచి వింటున్నాము, కాని అడుగు ముందుకుపడటం లేదు. సుప్రీం కోర్ట్ గ్రేట్ కెనాల్ మీద ఒక రిపోర్ట్ అడిగినట్లుంది. ఇప్పుడు బంతి సుప్రీం కోర్టులో ఉంది.
  ధన్యవాదాలు.

 4. ఆపః పునంతు పృథ్వీమ్!

  నీరోపాఖ్యానం బాగుందండీ మాష్టారు.

  దేశం లో ఈ నదీ జలాల కూర్పు, గార్లేండ్ కెనాల్ ప్రాజక్టు ఎప్పుడు వస్తుందో మరి ?

  అన్నీ బిజినెస్స్ అనుకున్నా, ఈ ప్రాజెక్ట్ చేసినా బిజినెస్స్ కదా ! ఎందుకు మరి చెయ్యటం లేదో ? రాజ్యాంగ లోపమా ? స్టేట్ వెర్సస్ సెంట్రల్ పరిధి రెండింటిలో ఈ నదీమ తల్లి కొట్టు కుంటోందా ?

  జిలేబి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s