శర్మ కాలక్షేపంకబుర్లు-ప్రేమ

ప్రేమ.

స్కూల్ ఫైనల్ పరీక్షలయిన తరవాత ఒక రోజు ఉదయం కన్నమ్మ “ఇంకా ఇక్కడ కూచున్నావేం” అంది. “అదేం” అన్నా. “నిన్ను అక్కడ ఇచ్చేశాను, పెంపకానికి, నీ జీవితం అక్కడిదే” అని చెప్పింది. “ఈ వేళే వెళ్ళిపోతున్నా, ఐతే” అన్నా కోపంగా. అమ్మ మాటాడలేదు. నేను బట్టలు సద్దుకుని అమ్మకి నాన్నకీ నమస్కారం పెట్టి “వెళుతున్నా” అన్నా. “వెళ్ళిరా నాన్నా” అంటూ ఆశీర్వదించి పంపేరు. అత్తారింటి కెళుతున్న ఆడపిల్ల మనస్తత్వానికి, అప్పటి నా మనస్తత్వానికి తేడా లేదు. కన్న వారిని, పుట్టిన ఊరిని వదిలేసి, ఇది నాది కాదనుకుని వలసపోతున్నా, భవిష్యత్తు వెతుక్కుంటూ, ఏడిచా లోలోపలే.

పెంచిన అమ్మగారి ఊరు చేరుకున్నా సాయంత్రానికి. పెంచినమ్మ నన్ను చాలా దగ్గరకి తీసింది. రాత్రి నిద్ర పట్టలేదు. “నాన్నా నిద్ర పట్టటం లేదా” అంది అమ్మ. అప్రయత్నంగా “అవునమ్మా” అన్నా. అది మొదలు ఎప్పుడూ పెంచినమ్మను అమ్మా అనే పిలిచా. పొంగిపోయేది, నేను పిలిచిన ప్రతి సారి. ఊరు కొత్త, చేసే పనిలేదు. పేపర్ తెప్పించడం మొదలు పెట్టా. ఏమి చేయాలో తెలియదు, భవిష్యత్తు తెలియదు. ముందుకు చదువుకోడానికి తగు ఏర్పాట్లు ఆర్ధికంగా చేయగల పరిస్థితి లేదు. ఇటువంటప్పుడు, బయటికి వెళుతున్నానమ్మా అంటె “జాగ్రత్త నాయనా!”, “పొలం వెళ్తానంటె అమ్మో! ముళ్ళు గుచ్చుకుంటాయి వద్దు.” నిద్ర పోతే “ఎక్కువ నిద్రపోయావేం” అనేది. అన్నం పెడితే “మరి కొచం తిను నాన్నా” అనేది ఇలా ఉండేది, ఆ ప్రేమ. నేను ఆమెకు దొరికిన వజ్రాలమూటని. అది తను పోగొట్టుకుంటానేమోనని ఆమె భయం. కొద్దిరోజులకే నాకు విషయం అర్ధమయింది. ఇలా చెప్పినపుడు, ఆమెకు నేను పైకి రావాలంటె పని చేసుకోవాలనీ, దానికి ఇలా అడ్డు చెప్పకూడదని నెమ్మదిగా చెప్పా. ఆమె అర్ధం చెసుకుంది, కాని జాగ్రత్త మాత్రం చెప్పేది. ఇలా జరుగుతుండగా రిజల్ట్ వచ్చింది. పాస్ అయినందుకు సంతోషించింది.ఎవో ఉద్యోగాలకి దరఖస్తులు పెట్టా. నాకు అమ్మ ప్రవర్తన మాత్రం బాధగా ఉండేది, ఈ అతి ప్రేమ వల్ల.

అరవైఐదేళ్ళ అమ్మకి గుండెల మీద కురుపేసింది. అది నెమ్మదిగా పెరిగి అరచేయంతయిపోయింది. అది పల్లెటూరు. వైద్యం లేదు. ఏమిచెయ్యాలో తెలియదు. పక్క పట్నానికి ఐదు కిలో మీటర్ల దూరం లో డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళా. వంటెద్దు బండి మీద ప్రయాణం, పడుతూ లేస్తూ. డాక్టర్ చూసి, యూరిన్ టెస్టు చేసి సుగర్ ఉంది, దాని మూలంగా కురుపేసిందని చెప్పి, ముందు ఇంజక్షన్ తెస్తే చేసి, ప్రతి రోజూ చెయ్యలన్నారు. మా ఊరిలో ఇంజక్షన్ చేయగలవారు లేరు, రోజూ ఈమెను తీసుకురాలేను, ఏంచేయమంటారంటే, ఇంజక్షన్ చెయ్యడం నేర్చుకో అన్నారు, డాక్టరు. నేర్పించారు.కురుపు పెరగనిదే ఆపరేషన్ చెయ్యలేను, అందుకు పిండి కట్టు కట్టమన్నారు. మందులేయమన్నారు, ఇంటికొచ్చాము, ఎంత సుగర్ ఉన్నది తెలియాలంటే అప్పుడు యూరిన్ టెస్టు చేసేవారు. రెండు రోజులు యూరిన్ పట్టుకెళ్ళా. అమ్మ ఒకటే గొడవ సైకిల్ మీద తిరుగుతున్నావని. డాక్టర్ గారు, ఆ టెస్ట్ ఎలా చెయ్యాలో నేర్పేరు. కావలసినవి కొన్నాను, తెచ్చుకున్నా. టెస్ట్ ఇంటిదగ్గరే చేసేవాడిని, ఇంజక్షన్ చేసేవాడిని రోజూ, డాక్టర్ చెప్పిన ప్రకారం. పిండి కట్టు కట్టగా కురుపు మెత్త బడింది. ఒక రోజు తీసుకెళ్దామనే సరికి చితికి రక్తం వరదలా పారింది. దూది తీసుకుని డెట్టాల్ ఇంటిలో ఉంచేనుకనక దానితో వేడి నీళ్ళతో శుభ్రం చేసి, డాక్టర్ దగ్గరకి తీసుకెళ్తనన్నా, బండిలో కూచోలేనూ అంది. ఏమిచెయ్యాలో తోచలేదు. ఆ రోజు మానేసి మరునాడు నెమ్మదిగ తీసుకెళ్ళి డాక్టర్ కి చూపించా. ఆయనకి నేను చేసినది చెప్పేను, మంచి పని చేసేవని కురుపుని ఎలా శుభ్రం చేయాలో మందు ఎలా వేయాలో కట్టు ఎలా కట్టాలో ఆయన చెప్పి నేర్పించారు. ఇంటి దగ్గరకొచ్చిన తరవాత నేను రోజూ ఇంజక్షన్ ఇవ్వడం,కురుపు శుభ్రం చేయడం , కట్టుకట్టడం చేసేవాడిని. అమ్మ లేవలేకపోవటం మూలంగా, వంట చేసేవాడిని. ఎంతో బాధ పడిపోయేది, నేను వంట చేస్తున్నానని, అన్నం వంగి తిన లేకపోతే కలిపి తినిపించేవాడిని, పెద్ద వాలు కుర్చీలో పడుకుంటే.. దగ్గరే కూచునేవాడిని పేపర్ పుచ్చుకుని, కబుర్లు చెబుతూ. ఎలా ఉందని పది నిమిషాలకో సారి అడగడం అలవాటయిపోయింది, ఆతృత పెరిగిపోయింది, ప్రేమ మూలంగా, అది నాకు తెలియకనే జరిగింది.ఇలా బాధ పడగా మూడు నెలలకి కురుపు తగ్గింది.

ఒక రోజు “బయటకెళుతున్నా” అన్నా, “సైకిల్ మీద వెళుతున్నావు జాగ్రత్త” అంది. అందుకు నేను “నీది అతి ప్రేమ, దానితో ఇబ్బంది పెడుతున్నా”వన్నా. “నాన్నా, నిజమే కాని నన్ను పది నిమిషాలకొకసారి ఎలా ఉన్నావని అడిగినదాన్ని ఏమంటారురా” అంది. సమాధానం చెప్పలేకపోయా. ఉద్యోగమిచ్చాము, హైదరాబదులో, రెండు నెలలు ట్రయినింగు వెళ్ళమని ఉత్తరువిచ్చారు, ప్రభుత్వంవారు. అమ్మ సంతోషించింది. ఇద్దరం వెళ్ళిపోదాం, నిన్ను వదలి ఉండలేనంది. నెమ్మదిగా సద్ది చెప్పి, రెండు నెలలాగితే ఇద్దరం ఒక చోట ఉండచ్చు, రోజూ నా క్షేమ సమాచారంతో ఉత్తరం రాస్తానని ఒట్టుపెట్టి, కార్డులు తెచ్చి వాటిమీద ఆమె ఎదురుగా అడ్రస్ రాసి పట్టుకెళ్ళా. అక్కడి కెళ్ళిన తరవాత మిగతా స్నేహితులతో హోటల్ లో ఉండి, ఆ రోజే ఉత్తరం రాసి పడేస్తూ, కొన్ని కార్డులు కొని, నా అడ్రస్ రాసి అమ్మకి పంపేను, నాకు ఉత్తరం రాయడానికి. రోజూ ఉత్తరం రాసేది. నేనూ రోజూ ఉత్తరం రాసేవాణ్ణి. రెండు నెలల తరవాత మా పక్క ఊరిలో ఉద్యోగం ఇచ్చారు. నేను తిరిగి వచ్చే రోజు ఉదయమే స్నానం చేసి, నా కోసం టిఫిన్ చేసి, పారాయణ చేసుకుంటూ వీధిలో కూచుని ఉంది, నేను వెళ్ళేసరికి. “నాన్నా బాగున్నావా” అని ఒక్క సారి బావురుమంది. ఎందుకేడిచిందీ తెలియలేదు. పక్క ఊళ్ళో ఉద్యోగమని చెప్పేను. రెండు రోజులు తిరిగేను మూడవరోజు ఇల్లు చూసి, వారం లో మకాం మార్చేశాము.

అమ్మ ఎప్పుడూ నానుంచి కోరినదేమీలేదు,”నీ పలుకు కలకండ పలుకు నాకు” అనేది. అమ్మతో కబుర్లు చెప్పుకునేవాడిని. మా పెళ్ళి తరవాత, ఎగతాళి చేసేది, తాళి కట్టించుకున్న ఇల్లాలు, “అమ్మ కూచీ” అని. ఏమో అదీ ఆనందంగానే ఉండేది, నవ్వేవాడిని. ఈ రోజు నన్ను “బాగున్నావా, జాగ్రత్త” అని చెప్పే అమ్మేదీ?

ప్రకటనలు

16 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ప్రేమ

  • @వెంకట్ గారు,
   మీ అమ్మగారితో జ్ఞాపకాన్ని నెమరువేసుకోగలిగాలా నా టపా ఉన్నందుకు, ధన్యుడను.
   ధన్యవాదాలు.

 1. చాలా బాగుందండీ శర్మ గారూ, అమ్మ గారి గురించి , మీ టపా ! చక్క గా తెలియ చేశారు రాత పూర్వకం గా , మీ ఋణమూ, కృతజ్ఞతలూ. మీ తల్లి గారూ, మీరూ ధన్యులు.

  • @సుధాకర్ గారు,
   విచిత్రం ఏమంటే నేనామెలా అయిపోయా! కన్నతల్లిని, పెంచిన తల్లిని,దేశాన్ని మరిచిపోయేవాడు…..
   ధన్యవాదాలు.

 2. ఈ మధ్య మంచి మంచి పోస్ట్ లు చూడటానికి కూడా.. సమయాభావం. ఈ రోజు రెండు గంటలు దొరకబుచ్చుకుని.. మీ బ్లాగ్ లో ఓ..పది పోస్ట్ లు దాకా చదివాను. వేటికవే ఎన్నో విషయాలు చెప్పాయి.

  కాలక్షేపం కబుర్లు లో..జీవితానికి సరిపడా అనుభవాలు,సూచనలు.. సునిశితమైన అంశాలు ఎన్నో ఉన్నాయి.

  ఈ పోస్ట్.. చదివి.. మనసు మూగపోయింది. అమ్మ ప్రేమ .. బిడ్డలకి పెన్నిది లాంటిది. మీకు ఆ తల్లి ప్రేమ లభించడం..తిరిగి మీరు ఆ ప్రేమకి బదులు మరింత ప్రేమగా సేవలు చేయడం.. కళ్ళు చెమర్చాయి.

  నేను ప్రత్యేకంగా వ్యాఖ్య వ్రాయలేకపోవచ్చును. కానీ..మీ బ్లాగ్ ని తప్పక అనుసరిస్తాను. ధన్యవాదములు..మాస్టర్.

  • @వనజ గారు,
   మీరు సమయం చెసుకుని నా బ్లాగు పూర్తిగా చదివినందుకు ముందుగా ధన్యవాదాలు.నేను అమ్మ ప్రేమని అపార్ధం చేసుకున్నా ముందు. తరవాత అర్ధం చేసుకున్నా. భ్రమరకీట న్యాయంలా నేను అమ్మలా మారిపోయా! ఇప్పుడు నా నుంచి పారిపోతున్నారు, నా అతిప్రేమ తట్టుకోలేక, ఇది నిజం, మరుక్షణమేమో తెలియదు.
   ధన్యవాదాలు.

 3. ఒకరు కన్నమ్మ , పెంచిన దొక్క , రమ్మ
  లిద్ద రరుదిది , మిము పెంచి పెద్ద జేసి
  నమ్మప్రేమకు సాటిరా దమృత మేని ,
  యెంతదృష్టము ! శర్మగా రిలను మీకు !

  బ్లాగు సుజన-సృజన

  • @వెంకట రాజారావు, లక్కాకుల గారు,
   స్వాగతం. సుస్వాగతం నా బ్లాగుకు. మీ లాంటి పెద్దల దృష్టిని కూడా నా బ్లాగు ఆకర్షించినందుకు, తమ వ్యాఖ్య పద్య రూపం లో దయ చేసినందుకు
   ధన్యవాదాలు.

  • @బృందావనంగారు,
   నా బ్లాగుకు స్వాగతం. నేనే అదృష్టవంతుడిని.నాలాటి వాడు మరొకడు దొరుకుతాడు, ఆమెకు పెంచుకోడానికి, కాని నాకు అలాటి తల్లి దొరకదుగా.
   ధన్యవాదాలు

 4. రోజూ మీ టపా కోసం చూస్తు ఉంటా.ప్రతీదీ కనీసం రెండు సార్లు చదువుతాను. కానీ ఈరొజు కామెంట్ పెట్టక పోతే అన్యాయం అనిపించింది.
  మీ టపాలు చదువుతుంటే మా అమ్మతొ మాట్లాడుతున్నట్టే ఉంటుంది.మ అమ్మని పొద్దున్నే గుర్తు చేసారు !!

  • @హేమగారు,
   విడవకుండా చదువుతూ, అమ్మ మాట ” నీ పలుకు కలకండ పలుకు నాకు” అన్న మాట నిజం చేస్తారనుకుంటా.మీ అమ్మగారిని ఉదయమే గుర్తుకు తేగలగినందుకు ధన్యుడను,
   ధన్యవాదాలు.

 5. కళ్ళలో నీళ్ళు తిరిగాయండి!
  శుక్రువారం విశ్రాంతిగా కూర్చుని ఈ మధ్య బ్లాగ్స్ సరిగా చూడడానికి వీలు పడటం లేదు అనుకుంటూ, మీ పోస్ట్ చూసాను. మనసు ద్రవించిందండి! మీలాంటి బిడ్డను పెంచుకున్న ఆవిడ కూడా అద్రుష్టవంతులండి! అంత ప్రేమను పంచిన అమ్మ ని ఎప్పుడు మరచిపోలేము కదా?

  • @శ్రీగారు,
   ఆ అదృష్టం నాది, అమ్మది కాదు. అనామకుణ్ణి అంత ప్రేమగా చూసిన తల్లిని మరుస్తే…. నిష్కృతి లేదు.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s