శర్మ కాలక్షేపంకబుర్లు-ఇంట్లో ఇల్లాలు-వీధిలో ప్రియురాలు.

ఇంట్లో ఇల్లాలు- వీధిలో ప్రియురాలు.                       DEVAYAANI-5

మన కధానాయకి దేవయాని, శుక్రుని కుమార్తె. కచుని ప్రేమించి, అతనిచే తిరస్కరించబడి, శాపం ఇచ్చి, శాపం పొంది, వన విహారంలో జరిగిన పొరపాటుకు, రాజు కూతురుని తూలనాడి, ఆమెచే నూతిలో పారేయబడి, యయాతిచే రక్షింపబడి, శర్మిష్ఠను ఆమె వెయ్యి మంది చెలులతో దాసిగా పొంది, యయాతిని భర్తగా పొందటం దాకా మనం కధ చెప్పుకున్నాం, ముందుకెళితే.

దేవయాని-యయాతిల వివాహం జరిగేటపుడు, శుక్రుడు యయాతికి శర్మిష్ఠను చూపించి, ఈమె కు కావలసినవి “అన్న, పాన, భూషణ, ఆఛ్ఛాదన,మాల్య, లేపనాదులతో సంతొషపెట్టు,మంచం పొత్తు మాత్రం పనికిరాదని” చాలా ఖచ్చితంగా చెప్పి, కూతురుని అల్లునితో పంపేడు. దేవయాని, శర్మిష్ఠ, చెలికత్తెలు వేయిమందితో యయాతి, తన పురం చేరి, అంతఃపురంలో దేవయానిని ఉంచి, ఆమె అనుమతితో శర్మిష్ఠను వేయి మంది చెలికత్తెలతో అశోకవనంలోని గృహంలో ఉంచి రోజులు గడుపుతూ, దేవయాని యందు యదు, తుర్వసులనే పుత్రులను కన్నాడు.

ఇక్కడ శర్మిష్ఠ కూడా వయసులో ఉండటంతో, “ఎన్ని ఉండి ఏమి ఉపయోగం,యవ్వన సుఖాలనుభవించలేక, పిల్లలని కనక” అనే ఆలోచన లో పడి, “దేవయానికి మంచి మొగుడు దొరికేడు, పిల్లలు కలిగేరు,ఎంత అదృష్టవంతురాలో” అని వగచి ఇలా అలోచిస్తుంది. “దేవయాని మొగుడు యయాతి మీద నా మనసు నిలిచింది, అతను కూడా నా మీద దయ చూపిస్తాడు, దేవయాని యయాతినికోరి భర్తగా చేసుకుంది కనక నేనెందుకు అలా యయాతినికోరి అతనిని భర్తగా పొందకూడ”దనుకుంది. అలోచనొచ్చింది, మరెందుకూ ఆలస్యం అనుకుంటూ ఉండగా, యయాతి అశోక వనం చూడటానికి వచ్చి, ఏకాంతంగా ఉన్న శర్మిష్ఠను చూశాడు. అప్పుడు శర్మిష్ఠ చేతులు జోడించి యయాతితో, నీవు నా యజమాని భర్తవు,కనుక నాకు కూడా భర్తవే, అందుచేత నన్ను భార్యగా అంగీకరించమని వేడుకుంది. అప్పుడు యయాతి, నీతో “మంచంపొత్తు తప్పించి అన్నీ ఇవ్వవచ్చని” పెళ్ళిలో మా మామగారు ఆంక్ష విధించారు, “దానికి నేను ఒప్పుకున్నాను,అప్పుడు, ఇప్పుడు కాదనవచ్చునా” అని అనుమానం వెలిబుచ్చితే, శర్మిష్ఠ, “వారిజాక్షులందు, వైవాహికములందు,ప్రాణ, మాన, విత్త భంగమందు, చకిత…….. బొంకవచ్చు, అఘము పొందరధిపా” అనే శుక్రనీతి చెప్పింది. “సరే” నని ఆమె కోరిక తీర్చాడు, యయాతి. సృష్టి ధర్మం ప్రకారం శర్మిష్టకు నెల తప్పి, కొడుకును కన్నది. ఇది తెలిసిన దేవయాని శర్మిష్ఠ దగ్గరకొచ్చి, “కన్యవి కదా నీకు కొడుకెలా పుట్టేడని” అడిగితే, “ఎక్కడనుంచో వచ్చిన ఒక మహాముని నాకు పుత్రుడిని ప్రసాదించాడ”ని చెబుతే, నమ్మిన దేవయాని ఇంటికిపోయింది. ఇలా శర్మిష్ఠ యయాతి వలన ముగ్గురు కొడుకులను కన్నది. కధ ఇంకా ఉంది, కాని ఇక్కడికి ఆపుదాం, మన అవసరం బట్టి.

శర్మిష్ఠ యవ్వన సుఖాలనుభవించాలనుకుని, మరొక దారిలేకా,తనకు యయాతి పై అప్పటికే చూపు ఉన్నందుకూ, యయాతి చూపుతన పై ఉన్న విషయం గుర్తించి, ఆలోచించి, నిర్ణయించుకుని యయాతిని తెలివిగా తన బుట్టలో వేసుకుంది, ధర్మం పేరు చెప్పి. ఇక్కడ నన్నయ గారు వాడినపదం”ఋతుకాలోచితంబు ప్రసాదింపవలయు”అని, సిగ్గు పడితే లాభం లేదని, సిగ్గు విడిచి అడిగేసింది. యయాతి కూడా మరో అందమైన, మనసుపడిన యువతి దొరికిందనుకున్నాడు, అభ్యంతరం చెప్పేడు తప్పించి, పెళ్ళి ఇబ్బందులు లేకనే సంసారం చేసి పిల్లలని కన్నాడు. ఇక్కడ నిజంగా దేవయాని పిచ్చిదే! తన మొగుడిని, శర్మిష్ఠ ఎగరేసుకుపోవచ్చనే ఊహ కూడా చేయక, శర్మిష్ఠ చెప్పిన కట్టు కధ నమ్మింది. ఇలా యయాతి ఇంట్లో ఇల్లాలితో, వీధిలో ప్రియురాలితో మొత్తం ఐదుగురు పిల్లలని కన్నాడు.

నేటి కాలంలో కూడా, ఇలా, ఇంట్లో అనుకూలవతి అయిన భార్య ఉండగా, ఆకర్షణకు లోనైన మగవారున్నారుకదా. ఈ విషయంలో ఆడవారు తగు జాగ్రత్త తీసుకోక పోతే, ఇటువంటి ప్రమాదాలుంటాయి. ఇంట్లో ఎప్పుడూ ఉండే భర్తే కదా అని శృంగారాన్ని నిర్లక్యం చేస్తే ఆడవారు నష్టపోతారు. కాలోచిత వేష, భాషలు, శృంగారం ఆరోగ్యానికి చాలా మంచిది సుమా! చాలా వ్యాధులనుంచి బయట పడచ్చు కూడా!! అయితే జాగ్రత్త తీసుకోమన్నామని, అనుమాన పిశాచంతో భర్తను బాధ పెట్టక, భర్తను కొంగున కట్టుకునే నేర్పు అలవడ చేసుకోవడం ఎంతయినా అవసరం, లేకపోతే, వెలి చవులకు అలవాటుపడి, గుప్పెటలోని ఇసుక జారిపోయినట్లు, మగవాడు జారిపోయే అవకాశం,ప్రమాదం కూడా ఉంది.

ఈ టపా జిలేబీగారికి అంకితం.

ప్రకటనలు

11 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఇంట్లో ఇల్లాలు-వీధిలో ప్రియురాలు.

 1. మంచి టపా. మీరు చెప్పినది నిజమేనండి. .. నేటి కాలంలో కూడా, ఇలా, ఇంట్లో అనుకూలవతి అయిన భార్య ఉండగా, ఆకర్షణకు లోనైన మగవారున్నారుకదా. ఈ విషయంలో ఆడవారు తగు జాగ్రత్త తీసుకోక పోతే, ఇటువంటి ప్రమాదాలుంటాయి. ఇంట్లో ఎప్పుడూ ఉండే భర్తే కదా అని నిర్లక్యం చేస్తే ఆడవారు నష్టపోతారు.

  అయితే, భార్యాభర్తల్లో ఎవరు ఎవరిని నిర్లక్ష్యం చేసినా కాపురాలు కూలిపోతాయి. ఈ రోజుల్లో చాలా మంది భార్యాభర్తలు ఉద్యోగం అంటూ వేరువేరు ఊళ్ళలో ఉంటున్నారు. ఈ రోజుల్లో విడాకులు బాగా పెరగటానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం కావచ్చు. అయితే , దేవయాని విషయంలో ఆమె భర్తను నిర్లక్ష్యం చేసినట్లుగా అనిపించటం లేదు. దేవయాని చేసిన తప్పు శర్మిష్ఠను దాసిగా చేసుకోవటం.

  • @anrdగారు,
   మీరు చెప్పింది నిజం. “మొక్కై వంగనిది మాని వంగుతుందా” అని సామెత.అలా తండ్రి వంచలేదు కనక ఆ అమ్మాయి అలా అయిపోయింది.
   ధన్యవాదాలు.

  • @జ్యోతిర్మయి,
   ఈ వేళ టపా చూడమ్మా! రోజుకొకళ్ళని తిడుతున్నావా బాబాయ్ అనద్దు సుమా!!నిజం నిష్టురంగా ఉంటుంది కదా!!!
   ధన్యవాదాలు.

 2. > ఇక్కడ తిక్కనగారు వాడినపదం…….
  నన్నయగారి ఆదిపర్వానువాదంలోని కథ కాదుటండీ?

  • @మిత్రులు శ్యామలరావు గారు!
   ఆ! అమ్మయ్య!!పట్టుకున్నారు కదా!!! మామూలుగా టపా వేసి ఉదయం పూజకి వెళ్ళేను. అప్పుడు అనుమానం వచ్చింది అక్కడ తిక్కన అని రాశానా నన్నయ అని రాశానా అని. తరవాత చూస్తే తిక్కన అనేరాశా, చూశా, మా మాస్టారు అడగుతారోలేదో చూద్దామని ఊరుకున్నా. నిజమే అది నన్నయదే!!! మారుస్తున్నా.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s