శర్మ కాలక్షేపంకబుర్లు-పుట్టింటికి ఫిర్యాదు.

పుట్టింటికి ఫిర్యాదు.                                       DEVAYAANI-6

మన కధానాయకి దేవయాని, శుక్రుని కుమార్తె. కచుని ప్రేమించి, అతనిచే తిరస్కరించబడి, శాపం ఇచ్చి, శాపం పొంది, వన విహారంలో జరిగిన పొరపాటుకు, రాజు కూతురుని తూలనాడి, ఆమెచే నూతిలో పారేయబడి, యయాతిచే రక్షింపబడి, శర్మిష్ఠను ఆమె వెయ్యి మంది చెలులతో దాసిగా పొంది, యయాతిని భర్తగా పొందటం, శర్మిష్ఠ యయాతిని వేడుకుని పిల్లలని కనడం దాకా మనం కధ చెప్పుకున్నాం, ముందుకెళితే.

ఒక రోజు శర్మిష్ఠ ముగ్గురు పిల్లలూ, యయాతి దగ్గర ఆడుకుంటూ ఉండగా దేవయాని శర్మిష్ఠతో కలిసి వచ్చి, ఆడుకుంటున్న పిల్లలని చూసి, ముమ్మూర్తులా యయాతిని పోలివుండటంతో, ఎవరి పిల్లలని అడిగింది. దానికి యయాతి జవాబివ్వకపోతే, పిల్లలనడిగితే, వారు విషయం తెలియక యయాతి, శర్మిష్ఠలను తల్లి తండ్రులుగా చూపడంతో, దేవయాని, యయాతి తనను వంచించి శర్మిష్ఠతో కాపరం చేసి పిల్లలను కన్నాడని ఏడుస్తూ తండ్రి దగ్గరకు వెళ్ళింది. ప్రమాదం గుర్తించిన యయాతి వెనకనే బయలుదేరి వెళ్ళేడు. అక్కడకెళ్ళి మామగారికి నమస్కారం చేసి నిలబడ్డాడు. దేవయాని తండ్రితో, ఇతను ధర్మం, అధర్మం అన్నవి చూడక, శర్మిష్ఠ మీద ప్రేమతో ఆమెతో సంసారం చేసి, ముగ్గురు పిల్లలని కని, నన్ను అవమాన పరచేడని చెబుతుంది. శుక్రుడు కోపంతో వెంటనే, “యవ్వన గర్వంతో శర్మిష్ఠ గుడ్డి ప్రేమలో పడి, నాకూతురికి అవమానం కలగచేసేవు కనక ముసలివాడవైపోదువుగాక” అని శపించాడు. అప్పుడు యయాతి “ఋతుమతి అయి పుత్రుల కోసం వాంఛించిన భార్యయందు ప్రతికూలుడయినవాడు, భ్రూణ హత్య చేసినవానితో సమానం కనక నేనా పని చేశాను, నేనీమెయందు ఇంకా అనురక్తుడనే కనుక శాపం మరల్చమని” వేడుకుంటె, “నీ పుత్రులలో ఎవరయినా నీ ముసలితనం తీసుకుని అతని యవ్వనం నీకిస్తే, నీ ఇష్టమయినంతకాలం యవ్వనం అనుభవించి, ఆ తరవాత అతని యవ్వనం అతనికిచ్చి, నీముసలితనం నీవు తీసుకోవచ్చు, అతనే వంశ కర్త రాజ్యాధికారి” అని చెప్పి పంపేశాడు. ప్రస్తుతానికి ఇక్కడ ఆపుదాం, ఇంకా వుంది కనక.

ఏంటండీ! ఒంటెద్దు బండి లాగ, కధ ఇలా ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉందనద్దు. ఈ కధ పెద్దది, చాలా మలుపులున్నాయి, ప్రతి మలుపు నేటి సమాజంలో ఉన్నవారికి, ఒక్కొక పాఠం అందుకని అపవలసి వస్తూ ఉంది. దగ్గరకొచ్చేసేము, పూర్తి చేసేస్తాను.ఒక రోజు ఆడాళ్ళని ఒకరోజు మగాళ్ళని మార్చి మార్చి తిడుతున్నారనద్దు. మన జీవితం లో వచ్చే వడిదుడుకులేలా ఉంటాయో చెప్పడమే నా ఉద్దేశం.

శర్మిష్ఠ పిల్లలని, వారు యయాతివల్ల కలిగినవారని తెలిసిన వెంటనే ఏడుస్తూ తండ్రి దగ్గరకి దేవయాని వెళ్ళి, విషయం చెబితే, శుక్రుడు వెంటనే ముసలివాడవు కమ్మని శాపం ఇచ్చేశాడు. దీని వల్ల ఎవరు నష్టపోయారు, అది దేవయానికదా. దేవయాని, తన వేలుతో, తన కన్ను ,తనే పొడుచుకున్నట్లయింది కదా. దేవయాని ఇంకా యవ్వనంలో ఉంది, యయాతి ముసలివాడయితే ఎవరికి నష్టం?, దేవయానికే కదా!. శాపానికి కొంత సడలింపు ఇచ్చినా, ఇప్పుడు పరిస్థితి పరాధీనం అయిపోయింది కదా?. “గుడ్డి కంటే మెల్ల మేలని” సామెతని నిజంచేస్తూ, శర్మిష్ఠ పెళ్ళీ పెటాకులూ లేని బతుకు కంటే మేలు గతిలో, యవ్వన సుఖాలనుభవించి, ముగ్గురు పిల్లలను కన్నది కదా. ప్రతి విషయానికి అలోచనలేక, తొందరపడితే జరిగేది ఇంతేనేమో. అత్తవారింటిలో జరిగే ప్రతి విషయం పుట్టింటికి చేరేస్తే వచ్చే నష్టం ఇలాగే ఉండచ్చు కదా!.

నేటి కాలానికొస్తే దేవయాని లాగా, అత్తింటి ప్రతి విషయం పుట్టినింటికి చేరవేస్తున్న వారున్నారు కదా. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, కాపురాలు కూల్చుకుంటున్నారు కదా. ఏదయినా ఒక కష్టం వచ్చినపుడు, అలోచన చేసి, దానిని అధిగమించే సావకాశం కోసం వెతికి, మనలో లోపాన్ని సరి చూసుకుని, మీదుమిక్కిలి వచ్చినపుడు పుట్టింటికి తెలియచేయడం, ధర్మం కాని ప్రతి చిన్న కష్టానికి, పుట్టింటి వారికి ఫిర్యాదు చేయడం అంటే, ఆ కోడలు ఆ ఇంటి మనిషి అనుకోడంలేదన్న మాట. ఆమె కూడా రేపటి అత్త కదా!, అది మరిచిపోతే ఎలా?

ప్రకటనలు

7 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పుట్టింటికి ఫిర్యాదు.

 1. దేవయాని,శర్మిష్ఠ, యయాతీల కథ చాలా interesting గా ఉంది. మీరు ప్రతి పోస్ట్ లో చెప్పే moral కూడా బాగుందండి.

  • @శ్రీ గారు
   నీతులు కాదండి, ఎలా ఉంటే బాగుంటుందో అనుకుంటున్నా, అంతే! తెనుగు బ్లాగులో మీరు ఇంగ్లీషు పదాలెక్కువగా వాడేస్తున్నారు, మాలాంటి వాళ్ళకి అర్ధం కావండీ!!!
   ధన్యవాదాలు.

 2. మీరు వ్రాసింది నిజమేనండి. ఈ రోజుల్లో కొందరు ఆడపిల్లలు ప్రతి చిన్న గొడవని పుట్టింటి వారికి చెప్పేస్తున్నారు. ఓదార్పు కోసం చెప్పటం వరకు ఫరవాలేదు. అయితే కొందరు ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా కూతురు తన కష్టాలు చెప్పగానే ముందువెనకలు ఆలోచించకుండా విడాకులు అంటున్నారు. ఆ తల్లితండ్రులూ తమలోతాము గొడవలు పడుతుంటారు. అయినా విడాకులిచ్చుకోరు. కూతురు విషయానికి వచ్చేసరికి విడాకులంటారు.

  అయితే ఇక్కడ దేవయాని పెద్దకష్టం వచ్చిన తరువాతే పెద్దవాళ్ళకు చెప్పింది. శర్మిష్ఠ కు పిల్లలు పుట్టినతరువాత విషయం తెలియటం అంటే పెద్ద కష్టమే కదా ! చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం వంటిది. శుక్రుడు యయాతిని శపించటం బాగానే ఉంది కానీ, ఆయన శర్మిష్ఠను దాసిగా చేసినప్పుడే తన కూతురును మందలించి ఉండాల్సింది.

  • @anrdగారు,
   ఆ పెద్ద కష్టం తను చేతులారా కొనితెచ్చుకున్నదేగా! “పిల్లినీరువులకు కాపుంచినట్లు” అని సామెత. ఆ పరిస్థితి తెచ్చుకుని పుట్టింటి కి చెప్పుకుంటే ఉపయోగం ఉండదుకదా!
   ధన్యవాదాలు.

 3. శర్మగారూ,
  > శర్మిష్ఠ పెళ్ళీ పెటాకులూ లేని బతుకు కంటే మేలు గతిలో, యవ్వన సుఖాలనుభవించి, ముగ్గురు పిల్లలను కన్నది కదా.
  శర్మిష్ఠ వివాహం చేసుకోలేదని యెందుకు భావించాలి? ఆమె యయాతిని గాంధర్వవిధిగా వివాహమాడింది. అది క్షత్రియోచితమే.

  • @మిత్రులు శ్యామలరావుగారు,
   నిన్నటిరోజు చెప్పినదానిలో, తను యయాతికి ఎలా భార్యనవుతానో చెప్పి ఒప్పించింది. అలా చేసి ఉండకపోతే ఆమె కన్యగానే మిగిలిపోయేదని నా అభిప్రాయం.
   ధన్యవాదాలు.

వ్యాఖ్యలను మూసివేసారు.