శర్మ కాలక్షేపంకబుర్లు-బతుకు భయం.

బతకు భయం

“శ్రీ కైవల్య పదంబు చేరుటకునకునై చితించెదన్,” భాగవతం తీస్తే మొదటి పద్యం కనపడింది. ఆహా! పోతన గారు అదృష్టవంతులు. ముందుకెళితే “ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్…..కాలుచే సమ్మెట వాటులంబడక సమ్మతి శ్రీ హరి కిచ్చి” అని, “సత్కవుల్ హాలికులైన నేమి (ఆల్కహాలికులు కాదు, పాపం ఆయనకి తెలీదు లెండి) గహనాంతరసీమల కందమూల కౌద్దాలికులైన నేమి నిజదార సుతోదర పోషణార్ధమై” అని బతికినవారు, చరిత్ర లో నిలిచిపోయారు. మా కోసం భాగవతం చెప్పి కుంతి చేత ప్రార్ధన చేయిస్తూ ఒక పద్యం లో ఆమె చేత “యాదవులందు బాండుసుతులందు నధీశ్వర నాకు మోహ విఛ్ఛేదము సేయుమయ్య”.అనీ….రెండవ పద్యంలో మాకు

శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగార రత్నాకరా!
లోకద్రోహి నరేంద్రవంశ దహనా! లోకేశ్వరా! దేవతా
నీక బ్రాహ్మణ గోగణార్తి హరణా నిర్వాణ సంధాయకా!
నీకున్ మ్రొక్కెద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!

అని ప్రార్ధన చేసే భాగ్యం కల్పించిన పోతన గారికి వందనాలు. చేసేది, చెయ్యగలిగినదీలేక భాగవతంలో ఈ పద్యాలు చదువుకుంటూ ఉంటే మా సత్తిబాబొచ్చాడు. వస్తూనే “ఏంటండీ ఈ బతుకులు అర్ధంకావటం లేదు, బతుకు భయంగాఉంద”న్నాడు. అదేంటయ్యా ఏమయిందీ అన్నా. “ఏం చెప్పమంటారు. బతకటం కష్టమైపోయిందండి” అన్నాడు. “నిజమయ్యా! పోతన గారు రాజులకి కవిత్వం అంకితమిచ్చి వచ్చే సొమ్ముతో బతకలేను, వ్యవసాయం చేసుకుని వచ్చిన గింజలు తిని బతుకుతానన్నాడు. కాని నేడు అందుకూ సావాకాశం కనపడటంలేదు” అన్నా. అందుకు సత్తిబాబు ఆయనెలా బతికేడో కానండి, మన బతుకు కష్టమై పోయిందని, ఇలా చెప్పుకొచ్చాడు.

తెల్లారి లేస్తే ముందు కాఫీ చుక్క నోట్లో పడాలికదా, దానికి ముందు, పళ్ళు తోమాలి కదా.వేప చెట్టే కనపడటం లేదు. ఒక వేళ తెచ్చుకున్నా వేప పుల్లతో పళ్ళుతోముకునే అలవాటు ఎప్పుడో పోయింది కదా. పేస్టు ఖరీదు పెరిగిపోయింది, పాలు, పంచదార, కాఫీ పొడి ఖరీదు పెరిగిపోయాయి. చద్దెన్నం తినడం ఇప్పుడు ఫేషన్ కాదు కదా. గెడ్డం గీసుకునే బ్లేడ్ల కట్ట ఇరవైఏడు రూపాయలుండేది, ఇప్పుడు ముఫై అయి ఊరుకుంది. నాలుగురోజులకి ఒకసారయినా గెడ్డం గీసుకోవాలి కదా. స్నానానికి, తాగడానికి, ఇతర అవసరాలకి, నీళ్ళు పంచాయతీ వారు ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు ఇచ్చేవారు, పాతికేళ్ళకితం. అప్పుడు నెలకి పది రూపాయలు తీసుకునేవారు. ఇప్పుడు నలభై రూపాయలు చేసేరు, పోనీ గంటలు పెంచేరా అంటే అదీలేదు. ఇప్పుడు ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట నీళ్ళిస్తారు. అదేనా కరంటు సరిగా ఉంటే. లేకపోతే అదీ లేదు. ఒకో రోజు ఎగనామమే. సబ్బుల ధరలు ఆకాశంలో ఉన్నాయి, సున్నిపిండితో, కుంకుడుకాయతో స్నానం చేయడం మరిచిపోయాం కదా. పది రూపాయల ఖర్చుతో ఉదయం టిఫిన్ అయ్యేది అందరికి, ఇప్పుడు అందరికి టిఫిన్ కి రెండు వందలవుతోంది. కూరలు చెప్పక్కరలేదు. కిలో నలభై రూపాయల లోపు కూర లేదు. నీచు కూరలు మేమూ మానేస్తున్నాము, ఎందుకంటే, వాటి ఖరీదుతో పాటు, అందులో వేసే సరుకుల ఖరీదులు మరీ ఎక్కువైపోయాయి. కొత్తిమీర కట్ట పదిహేను రూపాయలంటున్నాడు. బట్టలు ఇస్త్రీ చేయించుకోవాలంటే జతకి పది రూపాయలడుగుతున్నారు, అదీ మనం ఉతుకు కున్నవి. పోనీ మనమే చేసుకుందామంటే కరంటు ఉండదు, అదీగాక కరంటు వారు అన్ని రేట్లు పెంచేసేరు, ఈనెల నుంచే. ఫేన్ వేసుకుందామంటే బిల్లు షాక్ కొడుతుందేమోననీ భయం వేస్తూ ఉంది. బియ్యం కేజీ ముఫై పైమాటే. నాలుగు కర్రబద్దలు ఆరడుగుల పొడుగువి, మూడు కేజిల బరువుండనివి, రిక్షాలో ఒక కిలో మీటర్ దూరానికి వంద రూపాయలు తీసుకున్నాడు. పెట్రోలు, డీజిలు రేట్లు పాపం పెరిగినట్లు పెరుగుతున్నాయి. వంట గేస్ ధర పెరిగిపోయింది. ఇప్పుడు నెలకొక సిలిండర్ మాత్రమే ఇస్తారట. కంపెనీలు ప్రభుత్వాన్ని రేటు పెంచుతారా చస్తారా అని అడుగుతున్నాయి. ప్రభుత్వం పచ్చి వెలక్కాయ గొంతుకలో పడినట్లు నాటకం ఆడుతోంది. శుభ ముహూర్తం చూసుకుని రేటు పెంచేస్తారు. తొమ్మిది రూపాయల దాక పెరగచ్చని వార్త. మార్కెట్లో ప్రతి వస్తువు ధరా పెరిగిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. వినోదానికి సినిమా టిక్కట్లు ధరలు పెరిగిపోయాయి. కేబుల్ టి.వీ వాళ్ళు రేటు పెంచేశారు.మందులు, పిల్లల పాల డబ్బాలు, ఒకటేమిటి, అన్నీ పెరిగిపోయాయి. నిజం, ఆదాయం ఏమీ పెరగటం లేదుకానీండి జుట్టు పెరుతోందండి, అయ్యా! దీనికి కూడా రోజుకి రూపాయి ఖర్చండి, అదేనండి నెలకి ముఫై రూపాయలండి. పెళ్ళిళ్ళ సీజనొచ్చేస్తోందండి, ప్రయాణాలకి, ఖర్చులికీ… అమ్మో, శలవులిచ్చేశారండి ప్రయాణ ఖర్చులు, మళ్ళీ బళ్ళు తీసిన తరవాత, డొనేషన్లు, ఫీజులు,యూనిఫారాలు, పుస్తకాలు, హాస్టలు ఛార్జీలు అమ్మ బాబోయ్! తలుచుకుంటేనే వణుకొచ్చేస్తోందండి.

ప్రతి దాని మీదా సర్వీసు టాక్స్ వేసేస్తున్నారు. పోనీ రైతుకి ధర పెరుగుతుందేమో అనుకుంటే, అది వట్టి మాట, నీటి మూటని తేలిపోయింది.బేరీజు వేస్తే పాతికేళ్ళకి ఇప్పటికి, ప్రతి వస్తువు ధరా ఐదు రెట్లు పెరిగింది. కాని సంపాదన అలా పెరగటం లేదు, సామాన్యునికి. రైతుకి పెరిగిన రేటు అప్పటి ధరకి ఇప్పటికి రెండు రెట్లు అయిందేమో. ఎలా బతకాలో అర్ధం కావటం లేదు అన్నాడు. “తప్పు మనలోనూ ఉందనుకుంటానయ్యా, అలా పరిపాలించే వారిని ఎన్నుకోడంలో” అన్నా. “ఏమోనండి ఓటేసే రోజు ఇయన్నీ గుర్తురావు మరి”అను కుంటూ వెళ్ళిపోయాడు.

ప్రకటనలు

9 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బతుకు భయం.

 1. చక్కటి పోస్ట్ ను అందించారు. ( నిన్నటి వ్యాఖ్యలో ఈ అభిప్రాయం వ్రాయటం మర్చిపోయానండి. )

  ఒక సవరణ…. నేను ఇంతకుముందు వ్రాసిన వ్యాఖ్యలో ” చిద్విలాసంగా ” అన్న పదం వాడటం తప్పుగా అనిపించిందండి. అందుకే తప్పు సరిదిద్దుకుంటున్నాను.

  ” ….ఈ రోజుల్లో ప్రజలు కూడా ఎవరెంత దోచుకుపోతున్నా అంతగా పట్టించుకోకుండా , సినిమాలు, క్రికెట్టులు చూస్తూ కాలం గడిపేస్తున్నారు. “………అని…

 2. బేరీజు వేస్తే పాతికేళ్ళకి ఇప్పటికి, ప్రతి వస్తువు ధరా ఐదు రెట్లు పెరిగింది. కాని సంపాదన అలా పెరగటం లేదు,

  బాగా చెప్పారు,

 3. ఈ రోజుల్లో ప్రజలు కూడా ఎవరెంత దోచుకుపోతున్న పట్టించుకోకుండా చిద్విలాసంగా సినిమాలు, క్రికెట్టులు చూస్తూ కాలం గడిపేస్తున్నారు. ఇంతకుముందు ఇలాంటి ప్రజలుంటే మనకు స్వాతంత్ర్యం కూడా వచ్చేది కాదు. పెద్దాయన ( అన్నా హజారే ) అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం లేవదీస్తే దానికి ప్రజల సపోర్ట్ కూడా అంతంత మాత్రమే. ఇలాంటి ప్రజల గురించి జాలిపడటం కూడా అనవసరమేమోనండి.

  • @anrd gaaru,
   ప్రజలెప్పుడూ వెంటనే స్పందించరు, స్పందించగలవారు నిరాశ పడకూడదు. పన్నూ మనదే, నాలుకా మనదే కదా.
   ధన్యవాదాలు.

 4. తమాషా యేమిటంటే, పెరిగిపోతున్న రేట్లు కాస్తా రైతులకు పంట చేతికి రాగానే కుదేలయిపోతాయి. కిలో నలభై పలికే టమోటా కాస్తా కిలో మూడురూపాయలై పోతుంది. రైతులు గుండెలు బాదుకుంటరు – ఏడుస్తూ అయినకాడికి అమ్ముకుని పోతారు. మర్నాటినుండి ధరలు మామూలే – కిలో నలభై. పెద్దవ్యాపారులు, వాళ్ళముడుపులతో పబ్బంగడుపుకునే దొరతనాలు బాగుపడతాయి. మిగతా అంతా చెడుతూనే ఉంటారు.

 5. నిజమే వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడే రైతులు ఈ పెరుగుతున్న ధరలను తట్టుకుంటూ జీవితం గడపటం దుర్లభమే కదండి. తలచుకుంటేనే ఇంత బాధ గా ఉంటే రైతులు ఎలా జీవిస్తున్నారో?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s