శర్మ కాలక్షేపంకబుర్లు-అసంతృప్తి/తృప్తి

అసంతృప్తి / తృప్తి.

“బయాలజీ గ్రూప్ తీసుకుని సుఖపడ్డావే!, లెక్కలు, ఈక్వేషన్లతో చస్తున్నాననుకో!” అంది కమల విమలతో. “సరేలే రోలు వెళ్ళి మద్దెలతో చెప్పుకుందిట” అలావుంది నా పని, కప్పల్నీ బొద్దింకల్నీ కొయ్యలేక చస్తున్నాననుకో” అంది విమల. ఒకరికొకరు వారు పడుతున్న కష్టం చెప్పుకుని నీదే బాగుందిరా అంటే నీ దే బాగుందనుకున్నారు. “ఏమండీ! మిమ్మల్నే!! చంద్రహారం చేయించారు కాని పక్కింటి పిన్ని గారు చేయించుకున్న పలకసర్లు బాగుందండీ!!!”ఇల్లాలి ముచ్చట. “కామేశ్వరరావుగారూ గచ్చకాయి రంగు కారుకి బాగుందండీ! నేను తీసుకునేటప్పటికి ఎరుపు తప్పించి దొరకలేదు” అంటే ఆ కామేశ్వరరావు, “అదేంటండీ! ఇప్పుడు ఎక్కడచూసినా ఎర్రరంగు కార్లే కనపడుతున్నాయి. ఇప్పుడు ఫేషన్ ఎర్రరంగే నండీ, నాకు దొరకలేదు” అన్నాడు. ఇద్దరికీ తృప్తి లేదు, వారి దగ్గరున్న వాటిపై. “తెల్లారగట్ల లేచి, మీకూ పిల్లలికి అన్నీ తయారు చేసిచ్చి మిమ్మలని అందరినీ బయటకి పంపిన తరవాత నేను హాయిగా పడుకుని నిద్ర పోతున్నాననో, సినిమాలు చూస్తూ, టి.వీ. కి అతుక్కు పోయాననో కదా మీ ఉద్దేశం! మీరెళ్ళేకా ఎంతపని ఉంటుంది. బట్టలు వాషింగ్ మిషన్లో వెయ్యాలి. ఏరోజు వెయ్యకపోతే మర్నాడు, స్కూల్ డ్రెసులు బాగోవుకదా. ఆరెయ్యలి. మళ్ళి తియ్యాలి. ఇస్త్రీ చెయ్యాలి. ఇదిగాక రేపు ఉదయం టిఫిన్ కి ఏం చెయ్యాలో చూసుకోవాలి. నిన్ననేమి చేశానో చూడాలి. పొరపాటుగా కనక రెండు రోజులు ఒకటే టిఫిన్ కనక చేస్తే, అందరూ మొహాలు అదోలా పెట్టి నన్నూ హింసించేస్తారుకదా! ఇవి గాక మార్కెట్ కెళ్ళాలి కూరలు తెచ్చుకోవాలి. సాయంత్రం మీరూ పిల్లలూ వచ్చేటప్పటికి స్నాక్స్ తయారు చెయ్యాలి. సాయంత్రం వంట, భోజనాలు, నేను ఇల్లు సద్దుకుని, తలుపులు వేసుకుని పిల్లలు సరిగా పడుకున్నారోలేదో చూసుకుని పక్క దగ్గరకొచ్చేఅప్పటికి దొరగారు రెండో కాలంలో గుర్రు కొడుతూ ఉంటారు. మళ్ళీ తెల్లారుగట్ల లేచి ఆట మామూలే. నాకు శలవెప్పుడూ, మీకు వారంకొకరోజయినా శలవొస్తుంది, మరి నాకో. చెప్పుకుంటూ పోతే ఎన్నో!! కనపడదు పని, మరి,” అంది ఇల్లాలు. మేం వెళ్ళేకా నీకు పనేమిటి ఉంటుందన్న శ్రీవారితో. “పక్కింటి నీరజలాగ నేనూ ఉద్యోగం చేస్తానంటే వద్దంటారు, ఎలా!!!.”ఆవిడ అసంతృప్తి వెల్లడించింది. “నేను మాత్రం ఏం సుఖపడిపోతున్నానోయ్! పొద్దుటపోతా రాత్రికి కొంపకి చేరతా!!మా సుబ్బారావు చూడు పదకొండు దాటాక ఆఫీసుకొస్తాడు, ఐదు అవకుండా వెళ్ళిపోతాడు. ఏంటో, వెధవ ఉద్యోగాలు. వలంటరీ తీసుకుందామనుకుంటున్నా,” ఇది శ్రీ వారి ఉవాచ, అసంతృప్తితో. “ఆపని చెయ్యండి!!! చాలా బాగుంటుంది, అప్పుడు ఇద్దరం చేరో చిప్పా పుచ్చుకు బయలుదేరచ్చు,” ఇల్లాలి ఎత్తిపొడుపు. పోనీ ఆ పక్కింటి నీరజని పలకరిస్తే “ఏం చెప్పుకోను! ఉదయం ఇంటి పని,వంటా, ఆఫీసులో పని వత్తిడి. పిల్లాడిని క్రెచ్ లో వదలిపోవాలి. వాళ్ళెలా చూస్తారో తెలియదు.పిల్లాడిని ఇంటి దగ్గరుండి చూసుకునే వీలు లేదు. ఆయన ఉదయం, పిల్లడిని నన్నూ తీసుకుని బయలుదేరి, పిల్లాడిని క్రెచ్ లో వదిలేకా నన్ను ఆఫీసులో వదలి, తను ఆఫీసుకి వెళ్తారు. సాయంత్రం వచ్చి నన్ను, పిల్లాడిని పిక్ చేసుకుంటే ఇంటికి వెళతాం , అందరం. ఇంటికెళ్ళేకా, మళ్ళీ నాకు వంట పని, ఇంటి పని తప్పదు కదా. ఎక్కడ చావను రోజూ, నరకమైపోయింది, బతుకు. మీరేమేలు ఇంటిపట్టునుండి అన్నీ చూసుకుంటున్నారు ” ఇదీ పక్కింటి నీరజ గోల. ఇలా ఎవరిని కదిలించినా వారు చేస్తున్న పని కష్టంగాను,దాని పట్ల అసంతృప్తిగాను, ఎదుటివారు చేస్తున్నది తేలికగాను, ఎదుటివారు సుఖపడుతున్నట్లూ, తామే కష్టపడుతున్నట్లు, బాధ పడుతున్నారు.

ఈ మధ్య ఒక నలభై ఏళ్ళవాడు, భార్య భర్త ఇద్దరూ గవర్నమెంటు ఉద్యోగాలు చేసుకుంటున్నవారు. ఆర్ధికంగా పెద్దగా నిలదొక్కుకోలేదు. పిల్లలు చదువులకి అందుకున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితులలో “నేను వాలంటరీ పెడతామనుకుంటున్నా, ఏమిటి మీ సలహా” అని అడిగాడు. “అసలెందుకు వాలంటరీ తీసుకోవాలనుకుంటున్నా”వన్నా. “రోజూ ఉద్యోగం, పరుగులు, చాలా చికకుగా ఉంది జీవితం” అన్నాడు. “వాలంటరీ తరవాతేమి చేద్దామనుకుంటున్నా”రన్నా. “ఏదో కంపెనీ అడిగింది, తీసుకుంటానంది,” అన్నాడు. “అలాగయితే, ఆ కంపెనీ మిమ్మల్ని తీసుకుని ఊరికే కూచోపెట్టి జీతం ఇవ్వదుకదా! వాళ్ళూ పని చెబుతారు. ఇప్పటికంటే ఎక్కువ పని కూడా ఉండచ్చు. ఆప్పుడు టెన్షన్ పెరుగుతుందికదా, మరి వాలంటరీ ఉపయోగమేమిటీ, ఉరుకులూ పరుగులూ ఉండవా?” అన్నా. సమాధానం లేదు. “పిల్లలు చదువుకు అందుకున్నారు కదా, మరి సొమ్ము అవసరం పెరుగుతుంది కాని తగ్గదు కదా, దాని గురించి ఏమి చేస్తా”రన్నా. “నెలకి పెన్షన్ వస్తుంది. ఆవిడ ఉద్యోగం చేస్తుంది. అపార్ట్మెంటు అమ్మేస్తే డబ్బులొస్తాయి. వలంటరీలో డబ్బులొస్తాయి. అన్నీ దగ్గర పెట్టుకుంటె సరిపోయుందనుకుంటున్నా,” అన్నారు. “మీకయితే నా సలహా ఒకటె మీరు ఆకాశం లో మబ్బును చూసి ముంతలో నీళ్ళు ఒలకబోసుకుంటున్నట్లు ఉంది సుమా!” అని మొహమాటం లేకుండ చెప్పేశా. తరవతాయన ఏమి చేసుకుంటాడో ఆయనిష్టం.

ఇలా ప్రతివారు తాము చేస్తున్నపనితో, జీవితంతో అసంతృప్తిని పొందుతున్నారు, ఎందుకో తెలియదు. ఇది మానవ నైజమా?. తమకు గల అర్హతను బట్టి, అదృష్ట్టాన్ని బట్టి, జీవితం దొరికింది. దానిని అస్వాదిస్తూ, పైకి ఎదగడాని కి ప్రయత్నం తప్పు కాదు. ఎక్కడి కక్కడ సంతృప్తి పడిపోతే అభివృద్ధి ఆగిపోతుంది. కాని అసంతృప్తికి లోనైతే మిగిలేది, చికాకు, విసుగు, ఆ పై కోపం, చివరికి నిస్పృహ.

రామాయణంలో రావణుడు తనను వలచిన భార్యలుండగా, మరి తనను వలచి వచ్చిన కన్యలుండగా ఇంకా కామతృప్తి తీరక సీతనెత్తుకువచ్చాడు. అందుకే కోరి మృత్యువును కౌగలించుకున్నాడు. ఇంద్రియములెంత బలవంతమైనవో దీనిమూలంగా తెలుస్తోందికదా.

భారతంలో దుర్యోధనుడు, ఈ తృప్తి లేకపోవడం మూలంగానే, “ఐదూళ్ళిచ్చినా చాలు సంధి చేసుకుంటాము, శాంతిగా, తృప్తిగా బతుకుదామన్న పాండవుల మాట పెడచెవిని పెట్టి వాడి సూదిమొన మోపినంత కూడా భూభాగం ఇవ్వనని తెగేసి చెప్పి మొత్తం తనతో పాటు అందరినీ మృత్యువు పాలు చేశాడు దుర్యోధనుడు.

కోపము నుబ్బును గర్వము,నాపోవక యునికియును, దురభిమానము ని
ర్వ్యాపారత్వము ననునివి,కాపురుష గుణంబులండ్రు కౌరవనాధా. భారతం. ఉద్యోగపర్వం. ద్వితీయాశ్వాసం…౩౨.

మనం ఈ పద్యంలో ఆపోవకయునికి అన్నదాని గురించి చూశాం. ఆపోవకయునికి అన్నదానికి అర్ధం, తృప్తి చెందకపోవడం, దీని మూలంగా వచ్చేది, సహించకపోవడం,విసుగు, చిరాకు, కోపం వగైరా వగైరా.

ఇంతకీ దీనికి ముఖ్యకారకులెవరండీ…..మనసు

ప్రకటనలు

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అసంతృప్తి/తృప్తి

 1. కొందరు విచిత్రమయిన జీవులు ఉంటారు వారు నిజంగా vrs తీసుకోరు కానీ తీసుకుంటే ఎలా ఉంటుందని చర్చిస్తారు. నువ్వు తీసుకో అని ప్రోత్సహిస్తారు . ప్రాక్టికల్ గా ఆలోచించాలి లేదంటే ఇలాంటి వారి ఆలోచనలకు ఇతరులు బలవుతారు

  • @మురళిగారు,
   మీరన్నట్లు, ఇక్కడ ఒకతను నన్ను వాలంటరీ తీసుకుంటే మీద చర్చించమంటే అతనికి నేను చెప్పిన సమాధానం కూడా రాశా.
   ధన్యవాదాలు.

 2. చేస్తున్న పనిలో వచ్చే అసహనం వల్ల మాత్రమే ఈ అసంతృప్తి మొదలవుతుందని నా అభిప్రాయం. ఇక పోలిక విషయానికి వస్తే దూరపు కొండలు ఎప్పుడూ నునుపే. అందుకే మనమేంటో మనం అనుకుంటూ ప్రక్కవారితో పోల్చుకోకుండా ఉంటేనే మంచిది.

 3. “Comparison is the death of happiness” ఏదో ఒక దశలో ప్రతివారికీ జీవితానుభవమే చెప్పినా, బహుశా మానసిక సంసిద్దత రానివారు అలాగే అసంతృప్తికి లోబడి లాగుతారు బతుకుని. అయినా చెప్పటం విజ్ఞుల వంతు. అవును ‘మనసు’ కారణమే, కానీ మనసుండాలి, మనిషికి తోడుగా ఉండాలి – దానికి వాత ఎవరికి వారు వేసుకోవాల్సిందే.

  • @ఉషగారు,
   మనసు ఉండాలి, లేకపోతే ఎలా? ఆ మనసు మన చెప్పుచేతలలో ఉండాలి. అసంతృప్తి పోలికలు ప్రమాదం తెచ్చిపెడతాయి.
   ధన్యవాదాలు.

  • @జ్యోతిర్మయి,
   అసంతృప్తి పోలిక అనవసరం. మన కంటే లేని వారితో పోల్చుకుని సంతృప్తి చెందటం మంచిదేమో.
   ధన్యవాదాలు.

  • @ఫణీంద్రగారు,
   పోలిక అనవసరమనుకుంటా. ఒక వేళ అవసరమైనా అసంతృప్తి పోలిక వినాశకరమని నా అభిప్రాయం.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s