శర్మ కాలక్షేపంకబుర్లు-సలహా

సలహా.

సలహా అన్నది తెనుగు పదంకాదనుకుంటా. ఐనా తెనుగుపదంలా ఒదిగిపోయింది భాషలో, దీన్ని తెనుగులో హితవచనం అన్నట్లుంది. చిన్నయ సూరి పంచతంత్రం లో “పోగాలము దాపురించిన వారు దీపనిర్వాణ గంధమును,అరుంధతిని, మిత్ర వాక్యమును, మూర్కొనరు, కనరు, వినరని పెద్దలు చెప్పుదురు” అన్నాడు. చావు దగ్గరపడిన వాడు దీపం ఆరిపోయేటపుడు వచ్చే వాసన గ్రహించలేడు,అరుంధతీ నక్షత్రాన్ని చూడలేడు, మిత్రుని మాట వినడని, చెప్పేరు..( పై పనులు చేయలేని వారు ఆరు నెలలలో మరణిస్తారని నానుడి)

ఎవరు ఇంతమందిని చంపినదని అడిగితే, అకంపనుడు,రావణునితో, రాముడనేవాడు చంపేడు, వాణ్ణి జయించడం కష్టం కనక,రాముని భార్య సీతను ఎత్తుకురమ్మని మొదట సలహా ఇచ్చిన వాడు అకంపనుడు అనే సేనాని. ఆ పని మీద బయలు దేరి మారీచుని వద్దకొచ్చి సాయం కావాలని అడిగాడు, రావణుడు. మారీచుడు భయంతో,సీత జోలికి పోవద్దు, రాముడితో వైరం వద్దు, సుఖంగా బతుకు, నీకీ సలహా ఇచ్చిన వాడు నీ బాగు కోరినవాడు కాదని రావణునికి సలహా ఇచ్చాడు. అప్పటికి ఒప్పుకున్న రావణుడు తిరిగిపోయాడు. అప్పటికే పరాభవంతో లంక చేరుకున్న శూర్పనఖ,(చేటలవంటి గోళ్ళు గలది అన్నారు మా మిత్రులు శ్యామలీయంవారు) అన్న గారిని నిండు కొలువులో, రాముడు చెలరేగిపోతున్నాడు,అతనిని నిలువరించాలని, అతని అందకత్తె అయిన భార్యని నీకోసం తేవాలనుకుంటే యీ పరాభవం జరిగిందని చెప్పి, రెచ్చకొడుతుంది( పరోక్షంగా సీతను ఎత్తుకు రమ్మని సలహా ఇచ్చింది). అప్పుడు రెండవసారి బయలుదేరి మారీచుని దగ్గరకొచ్చి, నువ్వు మాయలేడిగా వెళ్ళు, తరవాత సంగతి నేను చూసుకుంటానంటే, మారీచుడు ఒక మంచి మాట చెప్పేడు,మంచి మాట కనక మారీచుడు చెప్పినా ఇదివరలో చాలా సార్లు చెప్పుకున్నా మళ్ళీ చెప్పుకుందాం.

సులభాః పురుషా రాజన్ సతతమ్ ప్రియవాదినః
అప్రియస్యచ పధ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః

అప్రియమైనా సత్యం చెప్పేవాడు లేడు, ఒకవేళ ఎవరైనా చెప్పినా వినేవాడు లేడు అన్నాడు
ఆ సలహా నెత్తికెక్కిందా, రావణుడికి, లేదే. మరొక ప్రబుద్ధుడు, రావణుని యుద్ధ పరిషత్తులో, మహా పార్శ్వడు అనే సేనాని, ఎందుకీ అవస్థ, సీతను బతిమాలడం,ప్రేమించమని అడగటం, కుక్కుట బంధంతో ( బలవంతంగా ) సీతను అనుభవించెయ్యి అని సలహా చెప్పేడు, రావణునికి. అలానే రంభను అనుభవిస్తే, నలకూబరుడు శాపం ఇచ్చాడోయ్, ఇష్టపడని వారిని బలవంతంగా అనుభవిస్తే తల పగిలి చస్తావని, లేకపోతే ఈపాటికి ఆపని చేసి ఉండకపోదునా, అన్నాడు రావణుడు..

భారతంలో దుర్యోధనుడికి మంచి సలహా చెప్పించడం కోసం మైత్రేయుడు అనే మునిని పిలిచి, వీడికి సలహా చెప్పమంటే, ఆయన పాండవులతో కలిసి బతకమని, అర్ధరాజ్యం ఇవ్వమని చెబుతారు. ఇది నచ్చని దుర్యోధనుడు తొడలు బాదుకుంటూ ఉంటే, మైత్రేయుడు, నీ తొడలు రణరంగంలో విరిగి చస్తావని శపించి పోయాడు. సలహా మాట దేవుడెరుగు, శాపం మాత్రం తగులుకుంది.

ఈ మధ్య ఒక రోజు మరునాటి టపా రాదామని కూచుంటే ఒక జంట వచ్చేరు. రమ్మని కుర్చీలు చూపించి చూస్తుండగా అతను “గుర్తు పట్టలేదండీ” అన్నాడు. అప్పుడు గొంతు గుర్తుపట్టి, “ఎలా వున్నా”రన్నా. ఉభయ కుశలో పరి, “నేను మళ్ళీ ఈ ఊరు ఉద్యోగానికొచ్చా. ఎదురుగా ఉన్న అపార్ట్మెంటులో అద్దెకుదిగా నిన్న, మిమ్మల్ని చూడాలని వచ్చా మ”న్నారు. “పిల్లలెలా వున్నా”రంటే, “మీదయవల్ల కులాసా,” అని నా మిత్రుని భార్య ఇలా అంది.

“ఉద్యోగంకి వచ్చిన కొత్తలో ఓవర్ టైం డబ్బులొచ్చినపుడు చెప్పేరట మీరు, ఆ డబ్బులు బోనస్ డబ్బు పెట్టి బంగారం కొనడం మొదలు పెట్టి ఏభయి తులాలు చేసి అమ్మాయికి పెట్టేం.” దానికతను “ఏం పెట్టి ఏం ఉపయోగమైందండి అల్లుడు కాలం చేశాడు, మీరు ఎక్కడో ఉన్నవారు కబురు తెలిసి వచ్చి చూసి ఓదారుస్తూ, అమ్మాయిని రెండేళ్ళు పలకరించకండి, ఈ విషయాలమీద, ఆపు చేసిన చదువు పూర్తి చేయనివ్వండి. ఆ తరవాత మళ్ళీ పెళ్ళి గురించి అలోచిద్దామన్నారు. సరిగా అలాగే జరిగింది. అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది, ఈ లోగా మా బంధువులొకరు ఒక సంబంధం తెచ్చేరు. వాళ్ళకీ విషయం తెలియదేమోనని వెళ్ళి చెబితే, మాకు విషయం తెలుసును, అబ్బాయి అమ్మాయిని ఇష్ట పడుతున్నాడు, విషయం తెలిసి కూడా. అమ్మాయికి చెప్పండి. అమ్మాయి ఇష్టపడితే వివాహం చేద్దామన్నారు. అమ్మాయికి చెప్పేము. ముందు కాదంది, కాబోయే దంపతులను ఒక చోట చేర్చి మాటాడు కోమన్నాము. ఇద్దరూ మాటాడుకుని నిర్ణయానికొచ్చిన తరవాత పెళ్ళి చేసేసేము. మూడేళ్ళయింది. ఎవరికి చెప్పలేదు, పిలవలేదు.ఇప్పుడు అమ్మాయికి ఒక అబ్బాయి, వాళ్ళు ఇప్పుడు బెంగుళూర్ లో ఉంటున్నారన్నాడు. ఇది మీ సలహా చలవే” అన్నాడు. “మంచి కబురు చెప్పేరు, అలా జరగాలి, నేను కాకపోతే మరొకరు చెబుతారా సలహా. ఇది మీ అభిమానం” అన్నా. “మీ, మరొక సలహా చాలా ఆలస్యంగా చేస్తున్నది, మూఢం వెళ్ళిన వెంటనే ఇంటి శంకుస్థాపన చేస్తున్నా” అన్నారు.

సాధారణంగా ఎవరికైనా ఒంట్లో బాగోక పోతే హాస్పిటల్ లో చేర్చినపుడు, ఎక్కడ చేర్చేరు, అయ్యో! వాళ్ళు దోచేస్తారండి బాబూ, మరో చోట చేర్పించకపోయారా అనో, లేకపోతే అక్కడ వైద్యం బాగోదనో అనకుండా ఉండలేరు కొందరు సలహాల రావులు. అలాగే చదువుల విషయంలో కూడా, వాళ్ళ దగ్గర అసలు ఫేకల్టీ లేదండి, హంగు తప్పించి, పిల్లాడు పాడయిపోతాడు అంటారు. ఈయనేమో ఫీస్, డొనేషన్లు వగైరా అన్నీ కట్టేసేడు,ఇప్పుడు మార్చ లేడు, ఈ సలహా చెప్పినతను వారికి ఉపకారం చేసినట్లా? వారి మనసు బాధ పెట్టినట్లా? ఎవరైనా ఒక పని చేసేమని చెప్పినపుడు, విని ఊరుకుని బాగుందని చెప్పడం తప్పించి ఇలా మాట్లాడితే వారి మనసు బాధ పెట్టడం తప్పించి ప్రయోజనం ఉండదు. కొంత మందికి కావలసిన ది ఇదే, ఎదుటివారు మధన పడుతోంటే చూసి ఆనందించడం.సలహా కోసం మనంకూడా కనపడిన ప్రతివారినీ అడిగెయ్యడం తప్పే. అడగబోయేవారు ఆ విషయంలో తెలిసినవారా, కనీసం జీవితానుభవమేనా ఉందా, చూసుకోకుండా అడగడం మంచిది కాదు. అలాగే మనల్ని సలహా అడిగినపుడు విషయం గురించిన పరిజ్ఞానం లేకపోతే తెలిసిన వారిని అడగమని సలహా ఇవ్వడం మంచిది కాని తెలిసీ తెలియనిది చెప్పెయ్యడం మంచిది కాదని నా అభిప్రాయం. అడగనిదే జీవితానుభవంతో కూడా సలహా చెప్పకూడదు. ఏ విషయంలోనైనా భార్య/భర్త చెప్పే సలహా మరెవరి సలహా కన్నా విలువైనదే. కొంతమంది సలహాలరావులు అడగకపోయినా సలహాలిచ్చెస్తూ వుంటారు. ఒకరు ఏదో చేస్తూ ఉంటారు, చూసిన వారు అది తప్పని వద్దని సలహా ఇస్తారు, చేసేవారికి తెలియదా, చేసేది తప్పో ఒప్పో! చెప్పిన తరవాత కూడా వారదే చేస్తున్నపుడు మళ్ళీ మళ్ళీ వారికి సలహా చెప్పడం విజ్ఞత అనిపించుకోదుకదా! ఇది మానుకోలేరు కొందరు, ఇది చదువుకున్నవారిలోనే ఎక్కువనుకుంటా.

ప్రభుత్వాలు సలహాదారులను వేసుకుంటున్నాయి, వారిచ్చే విలువైన సలహాలేమో తెలియవు కాని, లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్థులికి మాత్రం కాళ్ళొస్తున్నాయి..

మంచివారికి చెప్పిన సలహా రాణిస్తుందేమో.

 

13 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-సలహా

 1. మిత్రులకు మాత్రం పనికివచ్చే సలహా అప్రియమైనా తప్పక ఇవ్వాలని నా అభిప్రాయం.

  • సుబ్రహ్మణ్యం నిష్ఠలగారు,
   అబ్బో!మూడేళ్ళకితం టపా కదూ! ముందుగా వ్యాఖ్యకి ధన్యవాదాలు.
   ”కన్నుపోయేటంత కాటుక పెట్టుకోకూడద”ని నానుడి మీరెరగనిదా? అలా సలహా ఇవ్వడం మూలంగా ప్రాణమే పోగొట్టుకున్నాడు, మారీచుడు. నేటి కాలానికి ఇలా సలహా ఇస్తే, ఉన్న స్నేహాలు ఊడిపోతున్నాయండి 🙂 అసలు ”స్నేహితులెవరు?” ఒక టపా రాయాలని చాలా కాలం నుంచి ఆలోచన ఉంది, కాని పని జరగలేదు, ఇప్పుడు నడుం బిగించకతప్పదు.
   ధన్యవాదాలు.

 2. దేవ,గంధర్వ,కిన్నెర,కింపురుష వగైరా వగైరా ల వల్ల మరణం సంభవించదని కదా రావణుడికి బ్రహ్మ వరం. అటువంటప్పుడు నలకూబరుడి శాపం రావణుడికి చేటు చేయగలదా? తల వేయి వక్కలయి ఉండేదా? రావణుడికి తెలియదా?

  • @మిత్రులు బులుసు సుబ్రహ్మణ్యం గారు,
   చేసేది వెధవ పని కనక బ్రహ్మగారి వరానికి ఇది మినహాయింపేమో!
   ధన్యవాదాలు.

   • ఎదవ పనులకు మినహాయింపులుండవని నిన్న అరెస్టుతో అర్థమయ్యింది. ఎంత తిరుమలలో రౌడీమూకతో దౌర్జన్యంగా నినాదాలతో దూసుకువెళ్ళి దర్శనం చేసుకున్నా, లడ్డు బుట్టల ప్రసాదం లాక్కు తిన్నా, జై జగన్ అని హోరెత్తించినా,… పరిశుద్ధాత్ముని పుత్రునికి కృష్ణజన్మ స్థానం తప్ప లేదు.

    మరణం రాక, వక్కలైన తలను ఎలా ఎలా మేనేజి చేయగలడు?!

 3. @వనజ గారు,
  అడగనిదే సలహా ఇవ్వకూడదు.స్వానుభవంతో కాని తత్వం వంట బట్టదు మరి.
  ధన్యవాదాలు.

 4. అవుననుకోండి. కాని కొన్ని సార్లు చూస్తూ చూస్తూ పాతాళానికి దారులు వెతుక్కుంటున్న వారికి సలహా ఇవ్వకపోతే… ఆతరువాత తెల్లబట్టలేసుకుని ప్రశ్నించే అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి అదేదో సినిమాలో కృష్ణుడు భీముడికి చెప్పినట్టు… ” చెప్పడమే నాధర్మం, వినకపోతె నీ ఖర్మం” అనే పాలసీ మంచిదంటాను. ఎవరి ఖర్మాను సారం ఎలాగూ వాళ్ళు చేస్తారు, మధ్యలో ఈ అంతరాత్మ రొదనుంచి మనల్ని మనం తప్పించుకున్నవారమవుతాము. ఏమంటారు? 🙂

  • @Snkr గారు,
   పాతాళానికి దారి చూసుకుంటున్నవాడని తెలిసిన తరవాత అసలు ఇవ్వకూడదండి సలహా. మన అంతరాత్మ కూడా మనని ప్రశ్నించదు. 🙂
   ధన్యవాదాలు.

 5. సలహా పనిచేస్తే మనల్ని ఆకాశానికి , అది బెడిసికొడితే మనల్ని పాతాలానికి తొక్కెయడానికి రెడీ గా ఉంటారు చాలా మంది…అందుకే సలహా ఇవ్వలంటే బెరుకు.

  • @శ్రీ గారు,
   సలహా చెప్పడం తప్పు కాదు కాని, అడిగే వారికి, విషయం చెప్పేసి మీరు ఆలోచించుకుని చెయ్యండి అని చెప్పడం మంచిదనుకుంటాను.
   ధన్యవాదాలు.

 6. అడగ కుండా సలహాలు చెప్పకూడదని ఈ మధ్యే నాకు తెలిసి వచ్చి గట్టిగా చెంపలు వేసుకున్నాను.
  బాగుంది అండీ! మంచి విషయాలు బోలెడు కన్నాను.. ధన్యవాదములు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s