శర్మ కాలక్షేపంకబుర్లు-కోపం

కోపం

“సత్తిబాబూ కనపడటం లేదేమోయ్! కోపమొచ్చిందా?” అన్నా, అప్పుడే వచ్చిన సత్తిబాబుతో.”పంతులుగారు బలేవారే! నాకు కోపం ఏంటండీ!, మీమీద” అన్నాడు. ఈ మాటంటూంటే నా ఇల్లాలు కాఫీ తెస్తూ “అన్నయ్యా! మీ బావగారికి అసలు కోపంరాదనుకో వస్తే ఆరునెలలుంటుంది. సంవత్సరానికి రెండుసార్లే వస్తుందనుకో” అంది. నాకు నవ్వాగలేదు. “జగడమెందుకొస్తుంది జంగమయ్యా అంటే బిచ్చం తేవే బొచ్చుముండా” అన్నాడట,అలా నాతో జగడం వేసుకోవాలనుకుంటోందయ్యా మీ చెల్లెలు” అన్నా. “పంతులు గారు కోపం అన్నారు కనక కోపంగురించి చెప్పండి” అన్నాడు. “ఇదివరకోసారి చెప్పేనట్టున్నానయ్యా! మళ్ళీ చెబితే పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరీ” అన్నట్లు ఉంటుందేమో” అన్నా. “కోపం గురించి ఇదివరకు చెప్పనివి ఇప్పుడు చెప్పండి” అన్నాడు. “నీతో బలే చిక్కొచ్చిందే, “తేగంటే తేగంటి బిడ్డకావాలందిట” నీలాటి ఆవిడ, ఇదివరకు చెప్పినవి చూసుకుని ఇప్పుడు కొత్తవి చెప్పాలిట. “మంత్రసాని తనం ఒప్పుకున్న తరవాత బిడ్డొచ్చినా పట్టాలి, గొద్దొచ్చినా పట్టాలని” సామెత, తప్పదు కదా.కోపం గురించి ఏం చెప్పేము ఇదివరలో అని చూస్తే, దీని గురించి ప్రత్యేకంగా చెప్పలేదని, సందర్భాను సారంగా చెప్పేమని తేలింది.భారతం లో ఒక పద్యం ఉంది అస్తమానం చెప్పుకుంటే బాగోదేమో మొదలు చెప్పి వదిలేస్తా కోపమునుబ్బును గర్వము……కాపురుష గుణంబులండ్రు కౌరవనాధా! కాదు,పూర్తిగా చెబుతానయ్యా, నువ్వేమనుకున్నాసరే!

కోపము నుబ్బును గర్వము,నాపోవక యునికియును, దురభిమానము ని
ర్వ్యాపారత్వము ననునివి,కాపురుష గుణంబులండ్రు కౌరవనాధా. భారతం. ఉద్యోగపర్వం. ద్వితీయాశ్వాసం…౩౨.

“ఈ పద్యం ఒకటే వచ్చనుకుంటా మీకు” అన్నాడు మా సత్తి బాబు.”అవునయ్యా! ఈ పద్యం ఒకటీ పూర్తిగా అర్ధమైతే జీవితంలో మరేమి తెలియకపోయినా ఫరవాలేద”న్నా. “ఆగండి అయితే ఒక మాట చెప్పేస్తా మనవాళ్ళకి, మా పంతులుగారికి ఈపద్యం ఒకటే వచ్చును, ఈ పద్యం పట్టుకుని ఇప్పటికి పదిహేను టపాలు రాశారు. చెప్పేశానండీ!” “నాకు కోపం రాదయ్యా! ఈ పద్యం చెప్పే అన్ని టపాలూ రాశా, నేనేమీ అబద్ధం చెప్పలేదు. నాకు కోపం తెప్పించాలని చూస్తున్నావా దూర్వాస మహామునికి వచ్చినట్లు”అన్నా. వీరి కోపం తననూ బాధించింది అలాగే ఇతరులనూ బాధించింది, కాని లోక కళ్యాణమే జరిగింది..

కోపం ఒక మానసిక స్థితి. మనం అనుకున్నది జరగనపుడు,అనుకున్నట్లు జరగనపుడు, మనమనుకున్నదానికి విరుద్ధంగా ఎవరేనా మాట్లాడినపుడు,చేసినపుడు, మనని కించ పరచాలని ఇతరులు ప్రయత్నించినపుడు, వివిధ పరిస్థితులలో కోపం వస్తుంది. కోపానికి మూలం కాంతా కనకాలు. వీరిని పోగొట్టుకుంటామేమో అన్నపుడు, వారి పట్ల అమర్యాదగా ఎవరేనా ప్రవర్తించినపుడు, ఈ కోపానికి అంతు ఉండదు. దీర్ఘ కోపం పనికిరాదన్నారు, శాస్త్రకారులు. ఐతే కోపానికి పర్యవసానం మాత్రం విపరీతంగా ఉండచ్చు. దీనికి రామాయణంలో హనుమంతుడు ఒక మాట చెబుతారు. కోపంలో గురువును కూడా హత్య చేస్తాడు. పాపానికి ఒడి కడతాడు. నేను లంకను కాల్చి అందుతో సీతను కూడా కోపంలో కాల్చిన వాణ్ణి అని బాధ పడతాడు, అందుచేత బుద్ధిమంతుడు పాము కుబుసాన్ని విడిచినట్లు కోపాన్ని విడవాలని చెబుతారు.. తరవాత తెలుస్తుంది తను చేసినపని తప్పుకాదని, అది వేరు సంగతనుకోండి.

కోపమనేది మానసిక స్థితి, అప్పుడు ఆలోచనలు దూసుకుపోవడం,అలోచనలు పేరుకుపోవడం, ఎదుటివారిని హింసించి అయినా కోపం తీర్చుకోవాలనుకోడం జరుగుతుంది. కాని దీని లక్షణాలు శరీరకంగా ఎక్కువ కనపడతాయి. కోపం వచ్చినపుడు, గుండె కొట్టుకోవడం వేగం పెరుగుతుంది. చెమటలు పోయచ్చు, మాటలు తడబడచ్చు, లేడా గోంతు మూగ పోవచ్చు, గొంతు స్వరం స్థాయి పెరుగుతుంది. పరుషపదాల వాడకం పెరుగుతుంది. ఇది వారి వారి సంస్కృతులపై, పెంపకం పై పెరిగిన వాతావరణం పై, ఆధారపడి ఉంటుంది.అందుకే శతక కారుడు “తనకోపమె తన శత్రువు తన శాంతమె తనకు రక్ష తధ్యము సుమతీ” అన్నాడు. కోపమున బుద్ధి కొంచమై ఉండునని అన్నారు శతక కారులు.

మహాత్ములు కోపం తెచ్చుకుంటారు. దాని వల్ల లోకోపకారమవుతుంది. కొంతమంది కోపం వస్తే ఒళ్ళు మరిచిపోతారు. ఏమి మాట్లాడుతున్నదీ కూడా తెలియదు. ఇంగిత జ్ఞానం కూడా చచ్చిపోతుంది.మాటకి మాటకి పొంతన ఉండదు. దీనికి స్త్రీ పురుష భేదం లేదు.ఈ కోపంలో చాలా రకాల హింస జరుగుతుంది. ఇది శారీరికం కావచ్చు, మానసికం కావచ్చు. వ్యగ్యంగా మాట్లాడటం కూడ కోపం తీర్చుకునే వాటిలో ఒక భాగం.

నా మనవరాలు కోపం వస్తే మాటాడదు. అమ్మా! మాటాడలేదేమని అడిగితే తాతా! నీకు మతిమరుపు నేను నిన్ననేగా నీతో మాటాడింది అంటుంది. అమ్మమ్మా, చూడవే తాత ఏమంటున్నాడో అని కంప్లైయింటుకూడా చేస్తుంది. అసలు నాకెందుకూ కోపం తాతా అంటుంది. నేను కోపం తెచ్చుకోను కదా మనవరాలిమీద.మరో మనవరాలు కోపం నటిస్తుంది, బతిమాలించుకోడానికి, అమ్మ కదూ, బుల్లి తల్లి కదూ, చిన్న తల్లి కదూ, మా బంగారు తల్లికి కోపం రాదుటా అని బతిమాలితే కోపం ఎగిరిపోతుంది. మరొకరు,మన కోసం మనం బతుకుతాం, మరెవరికోసమో బతకం, మన ఇష్టప్రకారం మనం చేస్తాం కాని, వేరెవరికోసం మారిపోతూ ఉంటే చివరికి మనం మిగలం అని చెప్పేవారు, మారిపోతున్నారనుకోండి, అప్పుడు కోపం వస్తుందా రాదా? కాని ఇప్పుడు కోపానికి బదులు బాధ తెచ్చుకుంటున్నాం. ఉదయం నుంచి కరంటు సరిగా లేకపోయినా, ఆరోగ్యం ఇబ్బంది పెట్టినా, ఈ టపా రాయాలనే పట్టుదలపై నాకు కోపం రాలేదు. ఇది మనసు చిత్రం. పొగడ్తకి పొంగిపోకూడదు, తెగడ్తకి కుంగిపోకూడదు. ఇది జీవితం. ఎప్పుడూ ఒకలా ఉండదుకదా. కరంటు రోజుకు ఎనిమిది గంటలు తీసేస్తున్నాడు. ఇచ్చిన సమయంలో కూడా పదినిమిషాలకొక సారి తీసేస్తున్నాడు. మరి ఈ ప్రభుత్వం మీద ప్రజలకి కోపం రావటంలేదా? బాధ పడుతున్నారు, ప్రతిక్రియ సరయిన సమయం లో చూపిస్తారు కాని ఇప్పుడు చెప్పరు కదా.!!కరంటు ఉన్న కాసేపతీలో ఏదో ఒకటి రాయడం, ఇది అతుకుల బొంతలా తయారయిందేమో!

ప్రేమికుల విషయంలో దీనిని ప్రణయ కలహం అన్నారు. ఇది కూడా అద్దం మీద ఆవగింజ నిలిచినంత సేపు ఉంటుందన్నారు. మన తెనుగు సినీకవి ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం అన్నారు. ప్రేమికుల విషయంలో ఇది అలుక కాని కోపంకాదు. అలుక తెచ్చిపెట్టుకున్న కోపం. మరో చోట అలుకమానవే చిలుకల కొలికిరో తలుపు తీయవే ప్రాణ సఖీ అన్నారు, మరో సినీకవి. కోపాన్ని అదుపులో ఉంచుకున్న వారే గొప్పవారు, ఎప్పుడూ. కోపం మీద కోపం తెచ్చుకోగలిగినవారు ధన్యులు. పాసిటివ్ తింకింగ్ ఉండాలండీ!!! అక్కడికి అదేంటో నాకు తెలిసినట్లు :):):)

ఈ టపా వెయ్యాలని గంటనుంచి ప్రయత్నం చేస్తూంటే ఇప్పటికి మూడు సార్లు కరంటు పోయింది, టపా వేసేలోపు. అందుకు కరంటు ఎప్పుడొస్తే అప్పుడు ఈ టపా ఈ వేళ వెయ్యాలిసిందేనని పట్టుదలగా కూచున్నా, చిత్రం కోపం రాలా పట్టుదల పెరిగింది.

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కోపం

 1. తన కోపమే తన శత్రువు అన్నట్టు, నాకు కూడా కోపం చాలా ఎక్కువండోయి.. అది ఒక మానసిక స్థితి అని తెలుసుకున్నాను నేను కూడా.. మీ మనవరాలిలాగే వెంటనే తగ్గుతుంది కానీ, అవేశం వలన ఒక్కోసారి తిప్పలు తప్పవు.
  బాగుంది కోపం మీద ఈ పోస్ట్!

  • @
   శ్రీ గారు,
   కోపం రావడం సహజం. దాని ప్రతిక్రియను అదుపులో ఉంచుకోగలగాలి.
   ధన్యవాదాలు.

 2. .
  పట్టుదల సంకల్పస్థిరత్వాన్ని సూచిస్తుంది.
  కోపం సంకల్పస్థిరత్వాన్ని హరిస్తుంది.
  పట్టుదల, కోపం రెండింటిలోనూ సంకల్పతీవ్రత ఉంటుంది
  పట్టుదల, కోపం రెండింటిలోనూ సంకల్పశుధ్ధి ఉంటుంది.
  పట్టుదలలో విజ్ఞత నిండియుంటుంది.
  కోపంలో విజ్ఞత నిండుకుంటుంది.
  ఈ రెండింటికీ చాలా తేడా ఉంది.
  క్షమించండి, సమయం లేదు. మీ టపా ఆనక పూర్తిగా చదువుతాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s