శర్మ కాలక్షేపంకబుర్లు-అన్నీ మండిపోతున్నాయి.

అన్నీ మండిపోతున్నాయి.

“ఎండలు మండిపోతున్నాయండీ” అన్నాడు మా సత్తి బాబు. “అవునయ్యా, నలభై ఐదు డిగ్రీలదాకా ఉంది వేడిమి” అంటే “రాత్రులు కూడా చల్ల బడటం లే”దన్నాడు. “అవును ఇది మనం చేసుకున్నదే” అన్నా. “అదే”మన్నాడు. “ఈ వీధిలో మొన్నటి దాకా నాలుగు చెట్లుండేవి కదా” అంటే “అవును అవి మీరు వేసినవేకదా, మొన్న కరంటు వైర్లకి అడ్డొస్తున్నాయని కొట్టేసేరు.” “మళ్ళీ చెట్టు పెంచే సావకాశం లేదు. సిమెంటు రోడ్ కనక. పగలెలాగా వేడి తప్పదు, చెట్లు తీసేసేము కనక పూర్తిగా వేడి మనకే కొడుతుంది” అన్నా. “రాత్రి వేడి ఉండటానికి కారణం సిమెంటు రోడ్లు, బిల్డింగులు. ఇవి నెమ్మదిగా వేడెక్కి నెమ్మదిగా చల్లారతాయి. మరి రాత్రి కూడా అందుకే వేడి ఉంటుంది.మన ఊరిమొత్తం మీద అన్ని చోట్లా బిల్డింగులు కట్టేసి, చెట్లు కొట్టేసేరు కదా, నిన్న మొన్న మెయిన్ రోడ్ వెడల్పని చెప్పి ఉన్న ఇరవై చెట్లు కొట్టిపారేసేరు కదా, మరి వేడి ఎలా తగ్గుతుంది. ఇప్పుడు తెలిసిందా. ఇలాగే మొత్తం దేశం మీద జరిగితే వేడి పెరిగిపోతూ ఉంది. ఇది మన చేతులారా మనం కొనితెచ్చుకున్న బాధ కదా. పశ్చిమ దేశాలలో వేడి అవసరం కనక వారు ఇటువంటి సిమెంటు కాంక్రీటు బిల్డింగులు కట్టుకుంటారు. మనకి అనవసరం ఐనా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు చేసుకుంటున్నాము. అడవులు, కొండలు, గుట్టలు ఏమీ కనపడితే అవి తవ్వేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. మబ్బులని ఆకర్షించే చెట్లు తగ్గి వర్షపాతం తగ్గుతోంది. దీని వల్ల పంట నష్టం.”
మరొక సంగతి, ప్రతి సంవత్సరం వేడిని గుర్తిస్తూపోతే పెరిగినది/తగ్గినది ఒకటి నుంచి రెండు డిగ్రీలుంటుంది, కాని రోజు రోజుకు మన తప్పులు పెరిగినపుడు తిప్పలు తప్పవు కదా.ఈ ఎండ వేడిమి లేకపోతే పంటలు లేవు. రోహిణీ కార్తెలో ఎప్పుడేనా చేలో కెళ్ళి చూశావా? అప్పటికి రెండు నెలలకితం పంట తీసుకోడం జరుగుతుంది. ఇప్పుడు చేను మొత్తం నెఱ కొడుతుంది, అంటే బీటలు తీస్తుంది. ఈబీట నాలుగంగుళాల వెడల్పుని మూడడుగులలోతుగా వుండచ్చు. చూసుకుని నడవకపోతే నెఱ లో కాలు పడితే విరిగిపోవచ్చు కూడా. ఇంత ఎండ కాయడం మూలంగా పైరుకు హాని చేసే పురుగులు, వాటి గుడ్లు నశిస్తాయి. మరొక సంగతి సూర్యరశ్మి నుంచి శక్తి భూమికి చేరుతుంది. ఆ తరువాత వచ్చే వర్షపు ముందు మెరుపుల ద్వారా నైట్రోజన్ భూమికి చేరుతుంది. కాలి ఉన్న భూమి పై మొదటి సారి చినుకులు పడినపుడు వచ్చే సుగంధం ఎప్పుడేనా పీల్చావా? ఎంత కమ్మగా, అమ్మ శ్వాసలా వుంటుందో అనుభవించాలి కాని చెప్పి ఉపయోగం లేదు. ఆ అదృష్టం అందరికీ రాదు. మొదటి సారి నీరు పెట్టినపుడు చేనులో నీరు ఉరుకుతూ ఉంటే ఎక్కడిది అక్కడ భూమి పీల్చుకుంటూ వుంటే ఆత్రంగా తల్లి పాలు తాగుతున్న బిడ్డలా అనిపిస్తుంది, నేల తల్లి. ఈ మంట మనం స్వయంగా తెచ్చుకున్నది ఇక ప్రభుత్వం వారు పెడుతున్న మంట చూద్దాం.

మొన్న ఏప్రిల్ 28 న పెట్రోల్ ధర పెరగచ్చు, తొమ్మిది రూపాయలదాకా అన్నా. అబ్బ! ఆ మాట నిజం చేసేసేరు ప్రభుత్వంవారు. ఈ మధ్య ఒక సర్వే చేస్తే భారత దేశంలో మధ్య తరగతి వారి ఆరోగ్యం పూర్తిగా పాడయిపోతున్నట్లుగా గుర్తించారట. నడవండి బాబూ అని చెబితే ఎవరూ వినటం లేదట, మరేమి చెయ్యాలి? వారి ఆరోగ్యం బాగు చేసేందుకు గాను ప్రభుత్వం వారు నడుంబిగించి పెట్రోల్ రేటు పెంచేసేరట. ఇలా చేస్తే నయినా చచ్చినట్లు నడుస్తారని వారి ఆశట. అసలు రేట్లు పెంచమన్నదెవరు? కంపెనీలు, పెంచకపోతే నష్టాలంటున్నయి. ప్రభుత్వంకి దారిలేక పెంచేసిందిట. తాంబూలాలిచ్చేసేను తన్నుకు చావండి అన్నాడు అగ్నిహోత్రావధానులు. అలాగ రేట్లు పెంచేసేము ఏడవండి అని ప్రభుత్వం అంటోంది. మరెందుకూ ఆలస్యం, కానివ్వండి. కొద్ది దూరాలికి నటరాజా సర్వీస్ గాని సైకిల్ కాని వాడమంటున్నారు, పెద్దలు. ఐదు కిలో మీటర్ల దాకా సైకిల్ మేలేమో చూడండి. ఇక మార్కెట్ లో అన్ని వస్తువుల ధరలు, ముఖ్యంగ నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ఏమీ కొనేలా లేదు, ఏమీ తినేలా లేదు.

డీజిలు, గేస్ ధరలు ప్రస్తుతం పెంచరట, కొద్దికాలం. రేపు రాబోయేకాలంలో గృహిణుల నెత్తినో బండ పడెయ్య దలుచుకున్నారు. తస్మాత్ జాగ్రత. అదేమంటే గేస్ కంపెనీల అభ్యర్ధన మీద గేస్ పై నిమ్న వర్గాలు తప్పించి అందరికి రేటు పెంచుతారట. లేదా కొన్ని బండలే సంవత్సరానికి నిర్ణయించి ఆ పై వాటికి పెంచిన రేటు తీసుకుంటారట. మరో పెంపుదలకు సిద్ధం కండి. కరంటు రోజుకి ఎనిమిది నుంచి పైగా గంటలు వేసవి కాలం లో లేక ప్రజలు మండి పడుతున్నారు. కొన్ని గ్రామాలలో కరంటులేక మంచి నీరు లేదంటే అతిశయోక్తి కాదు. ఇరవై లీటర్ల వాటర్ బాటిల్ ఇంటికి తెచ్చి ఇవ్వడానికి పాతిక రూపాయలు తీసుకొంటున్నాడు. మంచి నీటి వ్యాపారం మహ రంజుగా నడుస్తోంది, పల్లెలలో కూడా. ప్రభుత్వం చోద్యం చూస్తోంది. మంచి నీరు, విద్యుత్,ఆరోగ్యం లాటి ప్రాధమిక అవసరాలు కూడా తీర్చలేని ప్రభుత్వాలు, అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాయి. సంవత్సరానికి ఏడు నుంచి తొమ్మిది వృద్ధి రేటుట, ఎందులోనో సామాన్యునికి కనపడటం లేదు, నిజమే అది బ్రహ్మ పదార్ధం కదా. కాదండీ! పొరపాటు పడ్డాను, మూడు రోజులనుంచి రాత్రులు గుడ్డి దీపాలలో భోజనం చేస్తున్నాం, అభివృద్ధి కాదనగలరా? కరంటు రేట్లు పెంచేసేరు, మొన్న ఏప్రిల్ నుంచి. ఇప్పుడు మరేదో పెంచుతారట ఫుయల్ సర్చార్జి. ఇది రాబోతోంది. తస్మాత్ జాగ్రత.

ముఖ్యమైన విషయం, నందన నామ సంవత్సరం మొదలే బాగోలేదు. ౨౦౧౪ లో మళ్ళీ ఎలక్షన్లు, అనగా రెండేళ్ళు మిగిలాయి. ఈ సంవత్సరమంతా అన్నిటి మీద అడ్డంగా పెంపుదల ఉంటుంది. ఆ పై సంవత్సరం అసలు పెంపు ఉండదు. కారణం ఎన్నికలు దగ్గర పడటం, అప్పటికి అలవాటు పడిఉంతాము కదా, పెంపుదలకి. అంచేత మళ్ళీ సంవత్సరం దాకా బతికుంటే ……… ఇప్పుడే తాజా వార్త రాష్ట్ర ప్రభుత్వం వారు పెట్రోల్ పై ఉన్న టాక్స్ నూటికి ౩౩రూ నుంచి టాక్స్ ౩౦రూ. కి తగ్గిస్తారట? ఎంత తగ్గుతుందీ లీటరుకి 180  పైసలట, ఎలెక్షన్ కమిషన్ కి దరఖస్తు చేసేరట, తగ్గింపు ఒప్పుకోమని, పండగచేసుకోండీ!

ప్రకటనలు

7 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అన్నీ మండిపోతున్నాయి.

 1. బాగుందండి చక్కగా వ్రాసారు.

  ఈ మధ్య నేను ఊళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడపడితే అక్కడ వాడిపారేసిన ప్లాస్టిక్ కుప్పలు, చెరువుల స్థానంలో నల్లటి గబ్బు కొట్టే నీటి ప్రవాహాలు , పెరిగిపోయిన పేదరికం చూసి అభివృద్ధి అంటే ఇదే కాబోలు అనిపించింది..

 2. >పశ్చిమ దేశాలలో వేడి అవసరం కనక వారు ఇటువంటి సిమెంటు కాంక్రీటు బిల్డింగులు కట్టుకుంటారు.
  నిజం కాదేమోనండీ. అమెరికాలో అయితే యిళ్ళన్నీ చెక్క కొంపలు! నేలా చెక్కయే, గోడలూ చెక్కవే.

  • @మిత్రులు శ్యామల రావుగారు,
   నాకా విషయం తెలియదు, తెలుసుకున్నా. మీకు మెయిలిచ్చా, చూసివుంటారనుకున్నా.
   ధన్యవాదాలు.

   • మెయిల్ పంపినందుకు ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s