శర్మ కాలక్షేపంకబుర్లు-కవలల పంట దొడ్డిగుంట

 • కవలల పంట దొడ్డిగుంట.

ఒకప్పుడు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు లేవు. ఒకటే గోదావరి జిల్లా ఉండేది. ఆ తర్వాత తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా గా రెండు జిల్లాలు ఏర్పడ్డాయి. ఒకప్పుడు భద్రాచలం తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. ఇప్పటి పోలవరం తాలూకా గోదావరి జిల్లాలో ఉండేది. మిగిలినదంతా కృష్ణా జిల్లాగా ఉండేది. మా తూర్పు గోదావరి జిల్లాకి కొన్ని ప్రత్యేకతలున్నాయి. అసలు గోదావరి జిల్లాలంటేనే ప్రత్యేకం. మేము ముద్దుగా గోదావరి జిల్లాలను గో.జి లు అని తూర్పుగోదావరిని తూ.గో.జి అని, పశ్చిమ గోదావరిని ప.గో.జి అని అంటూ ఉంటాం. ఇప్పుడందరూ అలాగే పిలుస్తున్నారనుకోండి,మమ్మల్ని ఎగతాళీ చెయ్యడానికి :). మా తూ.గో.జి ప్రత్యేకత ఏమంటే!

1850  ముందు మాట. మా దగ్గరగా గోదావరి నది ప్రవహిస్తున్నా, పంట లేదు, పాడి లేదు. అంతా వర్షాధారమే. చెరువులేగతి, పంటకి. చెరువులు మాత్రం పుష్కలంగా ఉండేవి. ఇప్పుడన్నీ పూడ్చి పెద్దలు ఆక్రమించుకున్నారనుకోండి. దేవుడి చెరువులు, భూములూ కూడా మా గో.జిల్లాలలో మింగినట్లు మరెవరూ మింగి ఉండరు, మరి. కాకినాడ దగ్గర సర్పవరం అనే ఊళ్ళో భావనారాయణ స్వామి ఆలయం ఉంది చాలా పురాతనమైనది. ఆ స్వామికి ధూప దీప నైవేద్యాలకిగాను పుణ్యాత్ములు ఎనభై ఎకరాలొక ఊళ్ళో దాన మిచ్చారు. చాలా కాలం అది స్వామి అధీనం లో ఉండి ఉంది. స్వతంత్రం వచ్చిన తరవాత, స్వామి పరతంత్రుడైపోయి ఎనభై ఎకరాలు కనపడకుండా పోయాయి. మొన్న రివెన్యూ వారి మీటింగులో కనపడ్డాయి. మరెక్కడేనా అలా ఎనభై ఎకరాల పొలం కనపడకుండా పోయిన సంఘటనలుంటాయా, మా తూ.గో.జి లో తప్పించి, చెప్పండి. ఎక్కడినుంచి బయలుదేరి ఎక్కడికో పోయానుకదూ. ఇలా ఉన్న గో.జి లలో డొక్కలకరువనే కరువొచ్చింది, దీన్ని ధాత కరువని కూడా అంటారు. సమయం సరిగా చెప్పలేను,1814 కావచ్చనుకుంటా. ఎవరేనా సరి చేస్తే సంతసం.ఈ కరువులో ప్రజలు తినడానికి తిండిలేక, తాగడానికి నీరులేక, పిట్టలలా రాలిపోయారు. రేగడి మట్టి పెరుగులో కలుపుకుని తాగి ఆకలి తీర్చుకునే వారట. ఆకులు తినదగినవి ఏమయినా సరే ఉడకపెట్టుకుని తిని ఆకలి తీర్చుకునేవారట. వేల కొద్ది జనం అసువులు బాశారు. ఇది చూసిన కాటన్ మహాశయుడు గోదావరి పై ఆనకట్ట కడితే ప్రజలు సుఖిస్తారని, దానిగురించిన విషయం ప్రభుత్వానికి చేరేస్తే, వారు పెదవి విరిచారట. ఆపుడీయన మరల విషయాన్ని పంపుతూ, ఈ ఆనకట్టు కడితే దగ్గరగా ఐదు లక్షల ఎకరాల భూమి సాగులో కొస్తే ప్రజలనుంచి పన్ను రూపంలో సొమ్ము బాగా గుంజుకోవచ్చని చెబితే ఒప్పుకున్నారట. సరే ఆనకట్టు కట్టడం తెలుసు, రెండెడ్లబండి కట్టుకుని ఒక మనిషి కూలి కెళితే బండద్ది, మనిషికూలి కలిపి ఆరణాలట.. పంట, పాడి తెలుసు. 1860  సంవత్సరం నుంచి గో.జిలు పాడి పంటలతో వర్ధిల్లాయి. అంతకు ముందు జొన్న,రాగి, కంది, మామిడి, జీడి మామిడి, మిర్చి లాటి పంటలు తప్పించి, వరి సేద్యం లేదు. స్వంతంగా చెరువున్న మహరాజు, తన స్వంతానికి వరి ఊడ్చుకునే వారట. కొన్ని ఊళ్ళలో చెరువు కింద వరి వ్యవసాయం చేసేవారు. అప్పుడు వాడిన వరి వగడం పేర్లు రసంగి, బసంగి. ఈ రసంగి బసంగి అనే రకాల బియ్యం ఎర్రగా ఉండేవి. నేను ఎరుగుదును. రైతు దమ్ము చేసి వెద చల్లడమే తప్పించి నారు మడిపోసి పెంచి నాటిన సందర్భం ఉండేది కాదు. అప్పుడు ఎకరానికి పండే పంట పదిహేను కాటాలు ఐతే గొప్పగా ఉండేది. తెల్ల బియ్యమయితే పేర్లు కృష్ణ కాటులు, వంకసన్నాలు అని సన్నరకం ధాన్యం పండించే వారు. వీటి దిగుబడి చాలా తక్కువగా ఉండేది. వీటిని కూడా నేను ఎరుగుదును. ఇప్పుడీ రకాలే లేనట్లున్నాయి. సామన్యులంతా బంధువులొచ్చినపుడు మాత్రం వరి అన్నం వండుకునేవారట. నేను జొన్న అన్నం, కొరివి కారం తిన్న వాడినే. కొరివి కారం కలుపుకుని( పచ్చి మిరప పళ్ళ పచ్చడిని కొరివి కారం అంటారు. ఇది తెలియని వారి కోసం చెప్పినదే సుమా)జొన్నన్నం మంచి నూని వేసుకుని తింటే ఆ అనందం మరిలేదు. ఆ తరవాత గడ్డ పెరుగు జొన్నన్నం కలుపుకుతింటే ఓహ్! చెప్పేదేముంది. ఆ రోజులలో కుంది, రోలు రెంటినీ కలిపి ఒక్క సారి ఎత్తేవాడిని, అంత బలంగా ఉండే వాళ్ళం. ఇప్పటికీ ఈ మాత్రం ఆరోగ్యంగా ఉన్నామంటే అప్పటి ఆహారపు అలవాట్లేనని నా పిచ్చి నమ్మకం.

మరి మా తూ.గోజి ప్రత్యేకత ఏమంటే ఒక ఊరిలో పిల్లలు పుట్టడం తక్కువ, ఆ వూరినిండా అందరూ దత్తుళ్ళే. నిజం, ఈ వూరు దుళ్ళ, కడియం మండలంలో ఉన్నది. ఇప్పటికీ ఈ వూరు దత్తుళ్ళకి ప్రసిద్ధి. మరి నేనూ ఆ వూరి దత్తుడినేనండోయ్! మా ఊళ్ళో ఆ రోజుల్లో డబ్బున్న అమ్మాయిని పెళ్ళిచేసుకోమని సంబంధం తెచ్చిన మోతుబరి రైతు దత్తుడు, ఆయనకి పిల్లలు లేకపోతే పెంచుకున్నాడు, ఇతనికీ పిల్లలు కలగలా చాలా కాలం. తరవాత అమ్మాయి పుడితే, ఆ అమ్మాయికి పెళ్ళి చేసిన తరవాత కొడుకుని కంటే ఆ కుర్రవాడిని ఇతను దత్తత తీసుకున్నాడు. తాత, తండ్రి అయ్యాడన్న మాట. ఆ రోజులనాటికి మా సంఖ్య నలభై ఉండేది.మా ఊళ్ళో ఉన్న ఏకైక మంచి నీటి వసతి ఒక పెద్ద నుయ్యి.

మరో విచిత్రం రంగంపేట మండలంలో దొడ్డిగుంట అని ఒక ఊరుంది. దేశం పల్లెలకి లోటులేదయ్యా! ఊరికే సుత్తి కొట్టకు అనద్దు. ఈ ఊరిలో పిల్లలెక్కువ. ఈ వూరు ప్రత్యేకతేమంటే ఇక్కడ ఎక్కువ మందికి కవలపిల్లలే. ఇది అక్కడున్న వాళ్ళకేననుకోవద్దు. ఆ వూళ్ళో నివాసం ఉన్న ఎవరికేనా అంతే. ఆ వూళ్ళో ఉన్న ఏకైక నీటి వసతి ఒక నుయ్యి. ఆ నూతి నీటి ప్రభావం ఇదంటారు. ఇది శాస్త్రీయంగా ఋజువు చేయగల ఓపిక ప్రభుత్వానికి లేదండి. కావాలనుకున్నవారు అక్కడ సతీసమేతంగా ఆరు నెలలు కాపరం చేస్తే చాలు. ప్రయత్నించండి. ఇది నిజం, మూఢ నమ్మకం మాత్రం కాదు.

మరి, మరో వూరుందండి. పేరు కడియం సావరం. ఇదీ కడియం మండలం లోదే. ఇక్కడ అమ్మాయిలు బయట ఊరికెళ్ళి కాపరం చెయ్యరు. అదేమి? అదంతేనండి. కట్నం గా పొలమిస్తారు,కూతురికి, వారి తాహతు ప్రకారం. అబ్బాయి ఇల్లరికం వచ్చేయ్యాలి, సంవత్సరం తిరిగేటప్పటికి అబ్బాయి పొలం సాగుచేసి, అదేనండి పూలు పండించి అమ్మి, అమ్మాయి కడుపు పండించాలండి. అదండి సంగతి. అబ్బాయిలు ఆనందంగా ఇల్లరికం వచ్చేస్తారండి. రెండేళ్ళు తిరిగేటప్పటికి స్వంత ఇల్లు కట్టుకుని వేరెళ్ళిపోతారండి. పంట పువ్వులండి.అమ్మాయిలు తెలివి తక్కువ వారు, సోమరులు కాదు. రోజూ పొలం వెళతారు, కలుపు తీస్తారు, నీరుపెడతారు, మొక్కలు సాకుతారు, పువ్వులు కోస్తారు, మాలలు కడతారు,బంగారు తల్లులు, అమ్ముకు డబ్బులు తీసుకు రావడం, పొలం నిర్వహణ అబ్బాయి పని. చూడండి ఎంత చక్కటి నిర్వహణో, వారి జీవితం ఎప్పుడూ మూడు పువ్వులు, ఆరు కాయలే.

కవలల ఊరు దొడ్డిగుంట, అల్లుళ్ళ ఊరు కడియం సావరం, దత్తుళ్ళ ఊరు దుళ్ళ.

ఇంకా ఉన్నాయ్ ప్రత్యేకతలు. అవి మరోసారి.

ప్రకటనలు

18 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కవలల పంట దొడ్డిగుంట

 1. కృష్ణకాటుకలు, వంకసన్నాలు పేర్లు విన్నాను తప్పించి చూడను కూడా చూడలేదు… ఇక రసంగి, బసంగి అయితే తెలీనే తెలీదు.
  ధాత కరువు ఒక్క గోదావరి జిల్లా(ల)కే పరిమితమా, రాష్త్రమంతా ఉండిందా?

  • @ఫణీంద్ర గారు,
   బహుశః రాష్ట్రం మీద ఉండి ఉంటుంది. ఐతే దీని ప్రభావం ఎక్కువగా గోదావరి జిల్లాలపైనే ఉంది.వంకసన్నాలు, కృష్ణకాటుకలు పంట నేను ఎరుగుదును. రసంగి, బసంగి ఎర్ర బియ్యం అన్నం నేను తిన్నా.అన్నం తియ్యగా ఉండేది. తరవాత అక్కుళ్ళు వచ్చింది. దిని తరవాత పాత రకాలు కనుమరుగైపోయాయి.

   ధన్యవాదాలు.

 2. శర్మ గారు

  నమస్తే. చక్కని సంగతులు చెప్పారు. మాది రంగంపేట మండలమే. దొడ్డిగుంట ఊరు వెళ్ళానుగాని కాని అక్కడి నీరు ఎప్పుడు త్రాగలేదు. పేపర్లులలో కూడా ఈ ఊరి ప్రత్యేకత వ్రాసారుగాని మీరన్నట్టు ఎవరూ పరిశోధించడం చేయటలేదు. కాని తెలుసున్న వారు కొంతమంది వారి బంధువుల ఇంటికి వచ్చి కొన్నిరోజులు ఉండి వెళ్ళడం లేదా ఆ నూతి నీరు పట్టుకెళ్ళడం చేస్తారు. అవును మీరు ఉండేది గూటాలలోనా లేక కడియంలోనా. మా అత్తగారి ఊరు పోలవరం (వయా పట్టిసీమ).

  శ్రీవాసుకి

  • @మిత్రులు శ్రీ వాసుకిగారు,
   నేను ఉభయచరాన్నండీ! పగోజిలో గూటాలలో( పట్టీసీమ వీరభద్ర స్వామి సన్నిధిలో) పుట్టా. తూగోజీలో దుళ్ళ లో దత్తుడిగా చేరా/ పెరిగా. గోజీలు చెడ తిరిగా. పగోజీ ని కాలి నడకనే తిరిగా. ప్రస్తుతం తూగోజీ లో రంగంపేట మండలం కి ఆనుకుని ఉన్న అనపర్తి మండలంలో అనపర్తిలో ఇల్లు కట్టుకుని ఉంటున్నా. కడియం అత్తవారి ఊరు.ఇదీ నా చరిత్ర క్లుప్తంగా. పోలవరం నేనెరిగినదే.
   ధన్యవాదాలు.

 3. ఇప్పటికి అర్థమయ్యిందండీ శర్మగారు, ఎలా దీక్షితులు గారో కూడాను!

  ఇక డబల్ ధమాకా గురించి చెప్పారు కాబట్టీ , కొంత సొంత డబ్బా ధమాకా కూడా చెబ్తాను. ఈ మా ఊరి స్కూల్లో చూడండీ మొత్తం డబల్ ధమాకాయే!

  చీర్స్
  జిలేబి.

  • @జిలేబి గారు,
   ఎంకన్న బాబు మహిమండీ! బలే డబల్ ధమాకా పెట్టేరు. పోస్ట్ కంటే గొప్పగా ఉంది వ్యాఖ్య.
   ధన్యవాదాలు.

 4. చాలా ఆసక్తి దాయకమైన విషయాలు చెప్పేరు. ఇప్పుటివారు ధాత కరువు లాంటి కరువుని ఊహించుకోనైనా ఊహించుకోలేరు. మీరు చెప్పిన మూడూళ్ల ముచ్చట మరెక్కడైనా వినగలమా? ఊరిస్తున్న మీ మిగతా కబుర్లకోసం ఎదురుచూస్తున్నాను.

  • @మిత్రులు పంతుల గోపాలకృష్ణారావు గారు,
   మరో సారి మరికొన్ని చెబుతానండి. నచ్చినందుకు
   ధన్యవాదాలు.

 5. దొడ్డిగుంట నూతి నీళ్ళగురించే ఆలోచిస్తున్నా,శర్మగారు. ప్లాస్టిక్ బాటిల్సో ఎక్కించి, విదేశాల్లో మార్కెట్ చేస్తే సరొగేట్ మదర్స్ అవసరం వుండదు కదా? ఓ సారి కెమికల్ అనాలిసిస్ చేయిస్తేనో?

  • @వనజ గారు,
   తూగోజి లో ఇటువంటివి చాలా ఉన్నాయండీ! మళ్ళీ కలిసినపుడు మరికొన్ని చెబుతా.
   ధన్యవాదాలు

  • @అమ్మాయ్ రసజ్ఞా,
   కడియంలో అమ్మమ్మ గారిల్లుంది, మన పొలం ఒక ఎకరం చేలో లిల్లీ, కనకాంబరం, చామంతి, గులాబీ, మల్లి తోటుంది, నిజమే చెబుతున్నా. నువు రాగానే ఓ సోగ్గాణ్ణి చూసి ముడెట్టేకా…..ఆర్నెల్లు …చలో దొడ్డిగుంట.. హనీమూన్.. తర్వాత సంవత్సరం…డబల్ ధమాకా.. ఇద్దర్ని పెంచలేనంటావా? ఫరవాలేదు, నేనూ అమ్మమ్మా ఒకళ్ళని పెంచుతాం నీకోసం… అప్పటిదాకా బతికుంటాం..యముడితో దెబ్బలాడిఅయినా సరే… సరేనా.. ఊ అనూ 🙂 🙂 🙂

   Thanx

   • @సుబ్బారావుగారు,
    నా బ్లాగుకు స్వాగతం,ఈ అదృష్టం, ఆనందం అందరికీ కావాలంటే దొరుకుతుందంటారా సుబ్బారావుగారూ?
    ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s