శర్మ కాలక్షేపంకబుర్లు-ఏమిటీ అనుబంధం.

ఏమిటీ అనుబంధం.

కాకినాడ ట్రాన్స్ ఫర్ మీద వచ్చిన తరవాత, పుస్తకాల కోసం రెండు లైబ్రరీలలో మెంబర్ షిప్ కట్టేను. అందులో ఒక దానిలో లైబ్రేరియన్, పెద్ద వాడు, ఏబది సంవత్సరాల వయసు ఉన్నవాడు. లైబ్రరీలో పుస్తకాలు పట్టుకెళుతున్నా,చదువుతున్నా, ఇచ్చేస్తున్నా. లైబ్రరీ నాకోసమే ఉన్నట్లు ఉండేది. ఎవరూ ఎక్కువగా వచ్చేవారు కాదు. కొంత కాలం పోయాకా, చరిత్ర చదవటం మొదలుపెట్టా. రోజుకో పుస్తకం చదివినట్లు చదువుతున్నా. ఒక రోజు ఆయన నన్ను పలకరించి “ఏం చేస్తుంటార”న్నారు. టెలిఫోన్ ఎక్స్ఛేంజిలో ఆపరేటర్ ఉద్యోగమని చెప్పేను. అక్కడికి దగ్గరే, మా ఆఫీసు. “పరీక్షకి చదువుతున్నారా, చరిత్ర” అన్నారు. “కాద”న్నా. “మరి” అన్నారు. “నేను సైన్స్ స్టూడెంటుని కాని చరిత్ర అంటే అభిమానం, అభిరుచి” అన్నా. అక్కడితో ఆరోజు సంభాషణ ముగిసింది. మరి కొద్ది రోజులు పోయాకా, ఒక రోజు పుస్తకం ఇచ్చేసి, కొత్తది తెచ్చుకుని రాయించుకుంటూ ఉండగా, “నిన్నటి పుస్తకం చదివేరా?” అన్నారు. “అవునండీ” అన్నా. ఐతే అందులో ఫలానా విషయం చెప్పండి అన్నారు. కితం రాత్రే చదివి ఉండటం చేత వెంటనే చెప్పేశా. ఆయన ముఖం ఆశ్చర్యంగా పెట్టి, “ఎప్పుడు చదివే”రన్నారు. “ఈ పుస్తకం పూర్తి చేసేటప్పటికి రాత్రి రెండయింద”న్నా. ఆయన మరీ ఆశ్చర్య పోయినట్లనిపించింది. అప్పటినుంచి ఆయనే పుస్తకం సెలెక్ట్ చేసి రెడీగా ఉంచేవారు నాకోసం, చదవడానికి. ఇప్పుడు నాకు పుస్తకం వెతుక్కునే సమస్య తీరింది. కాలం నడుస్తూ ఉంది. ఈ అనుబంధం ఎలా పెరిగిందంటే, నేను ఒకటి రెండు రోజులు లైబ్రరీకి వెళ్ళకపోతే ఆయనే నన్ను కలవడానికి ఆఫీసుకు వచ్చేటంతగా. ఎందుకిలా జరుగుతోందో నాకు తెలియదు. ఆయన వచ్చి మాట్లాడేదీ లేదు. ఒక సారి చూసి “బాగున్నావా?” అని ప్రశ్నించేవారు అంతే!. ఆయనొక వృద్ధుడు, నేను యువకుణ్ణి, ఆయన చదువు వివరాలు తెలియకపోయినా, నాకేమీ రాదన్న సంగతి తెలుసు. బంధువా? కాదు. మరి ఏ విషయంగా ఆయన నా వెనక పడుతున్నాడూ? నా మనసు చింతన చేస్తూ ఉంది.

ఒక రోజు నామనసు అంది “ఒరేయ్! ఆయన నీ నుంచి ఏదో కోరుతున్నట్లుందీ” అని. బుద్ధి చెప్పింది, “నోరు ముయ్యి,ఆయన ఏమైనా కోరిన వాడయితే ఇంతకాలం నీకు తెలియకుండా ఉంటుందా? ఎప్పుడయినా ఏమయినా అడిగాడా? అదేమీ కాద”ని. “మరియితే ఏమిటీ, డబ్బు కావాలని అడగలేకున్నాడేమో” అంది మనసు. బుద్ధి చెప్పింది “వెధవ మనసూ, నీదెప్పుడూ కుళ్ళు ఆలోచనే, నిన్నెప్పుడేనా ఆయన డబ్బు అడిగాడా? లేదూ ఆ సూచనైనా చేసేడా? లేదే! డబ్బు గురించి ఎప్పుడేనా మాట్లాడేడా? మీరిద్దరూ కలిసి టీ, టిఫిన్ చేసినపుడు కూడా ఎప్పుడూ నిన్ను డబ్బులివ్వనివ్వలేదు కదా! మరి నీ అలోచన తప్పు” అంది బుద్ధి. మనసంది “ఎందుకీ గుంజులాట ఆయన్నే అడిగేస్తోనో” అంది. “నీవన్నీ వెధవపనులే” తిట్టింది బుద్ధి. నోరు మూసుకుని ఊరుకుంది మనసు, కాని కోతి లాటిది కదా, ఒక రోజు ఆదివారం అయన్ను సైకిల్ మీద ఎక్కించుకుని బీచ్ కి తీసుకుపోయి అక్కడ అడిగేశాను, “మీరు నన్ను ఎందుకు అభిమానిస్తున్నారూ” అని. ఆయన ఒక నిమిషం ఆగి, “నాకు పిల్లలు లేరు. ఒక వేళ కొడుకుంటే ఇలా ఉండే వాడేమో! అది కూడా కాదు. నీ సమక్షంలో నాకు శాంతిగా, సుఖంగా ఉంటుంది, అంతే” అన్నారు. ఏంటిదీ? ఇది నిజమేనా నమ్మచ్చా. నేను అర్ధం చేసుకోలేకపోయా, నిజం. కొంత కాలానికి, వేరు చదువులో పడి లైబ్రరీకి వెళ్ళటం పడకపోతే, ఆయనే వచ్చి చూసి పది నిమిషాలు కూచుని వెళ్ళేవారు. మరేమీ లేదు. ఏనాడూ నన్ను ఏమీ కావాలని కోరలేదు. నాకేమైనా కావాలంటే ఇవ్వడానికి, నాకు కావలసినది చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తోచేది. ఈ చర్యా నాకు వింతగానే ఉండేది. ఈ విషయంలో న్యూటన్ మూడవ సూత్రం నాకూ వర్తించింది, కొంత కాలానికి ఆయను చూడకుండా నేనూ ఉండలేని స్థితి వచ్చింది. కలుస్తూ ఉండే వాళ్ళం. ఎప్పుడేనా ఇద్దరం కలసి కాఫీ తాగేవాళ్ళం. చూసే వాళ్ళకి, నాకూ ఆపుడపుడిది వింతగానేతోచేది, ఎందుకంటే ఆయన వయసు ఏబది పైబడి, నాదేమో పాతిక, పోనీ కామన్ గా మాట్లాడుకునే విషయాలూ లేవు.పోనీ గంటలకొద్దీ కబుర్లు చెప్పుకుంటున్నారా? లేదే! మౌనమే సంభాషణ కదా!! మరి ఇదేమిటి?!!!

పోటీ పరీక్షలు రాశాం, నెగ్గేము. మొదట విజయ వార్త చెప్పినది గురువు గారికి, రెండవారు, నా శ్రేయోభిలాషి లైబ్రేరియన్ గారు. ఆయన చిన్న పిల్ల వాడిలా ఆనంద పడిపోయాడు. ఆ విజయమేదో, తనే సాధించినట్లుగా, తనదేనన్నట్లుగా తలచినట్లనిపించింది, నాకు. నన్ను చెయ్యి పట్టుకుని లాక్కుపోయి పక్కనున్న హోటల్ లో స్వీట్ తినిపించిన తర్వాత ఇద్దరం కాఫీ తాగివచ్చాం. ఆయనను అంత ఆనందంగా నేనెప్పుడూ చూడలేదు. ఆర్డర్లొచ్చాయి, వెళ్ళిపోతూ వారి దగ్గరకెళ్ళి, పాదాభివందనం చేసి వెళుతున్న విషయం చెప్పేను. వారు బ్రహ్మానంద పడి నన్ను కౌగలించుకుని, ఆశీర్వదించి, జీవితంలో జాగ్రత్త గా మసలుకోమని, చదువు, విజ్ఞానమే శ్రీరామరక్ష అని చెప్పి విడవలేక, విడవలేక, వీడ్కోలు తీసుకున్నారు. ఏమిటీ అనుబంధం? నేను ఆయనకు చేసినదేమి? నన్నెందుకు ఇంతగా అభిమానించారు? సమాధానాలు లేని ప్రశ్నలు.

కలయో వైష్ణవ మాయయో యితర సంకల్పార్ధమో సత్యమో
తలపన్నేరక యున్నదాననో యశోదాదేవిగానో పర
స్థలమో బాలకుడెంత యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్.

మా జిలేబి గారు చెప్పినట్లు ఇది విష్ణు మాయేమో!!!

ప్రకటనలు

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఏమిటీ అనుబంధం.

  • @మిత్రులు బులుసు సుబ్రహ్మణ్యం గారు,
   ఎప్పుడు ఎవరితో ఏ అనుబంధం ఏర్పడుతుందో చెప్పలేము. వాటిని నిలుపుకోగలగడమే గొప్ప విషయం.
   ధన్యవాదాలు.

  • @పద్మగారు,
   నా బ్లాగుకు స్వాగతం,నిజమే,కానీ పిచ్చి మనసు అపార్ధం చేసుకుంటుంది కదండీ,
   ధన్యవాదాలు.

  • @ Gopala Krishna Rao Pantula గారు,
   కొన్ని అనుబంధాలకి అర్ధాలు వెతుక్కోడం తెలివితక్కువ. కాని మనసు కోతి లాటిది కదండీ!!!
   ధన్యవాదాలు.

  • @శ్రీ గారు,
   చోటు కొత్త, పని కొత్త, ఆ రోజులలో ఇంత సౌకర్యంలేదు, కాక స్వార్ధపరుణ్ణి కదా!!!
   ధన్యవాదాలు.

 1. మనస్సులూ మనస్సులూ (అంతరాత్మలు !) మాట్లాడుకుంటూ ఉంటాయని ఎక్కడో చదివాను. ఆ మాటలు కలిస్తే ఆత్మీయత వస్తుంది. లేకపోతే వికారం పుడుతుంది.

  • @Rao Lakkaraju గారు,
   ఒక వేవ్ లెంగ్త్ లో ఆలోచించేవారు ఒకలా స్పందిస్తారనుకుంటా. అలాగే హృదయాలు కూడా స్పందిస్తాయి దూరాన ఉన్నా.
   ధన్యవాదాలు.

 2. “పుస్తకం హస్త భూషణం ” మనం సంపాదించిన జ్ఞానమేడైతే ఉందొ.. అది కనీసం 1 % అయినా ఆచరణలో చూపితే.. జీవితానికి అర్ధం ఉంటుంది అని నేను భావిస్తాను.
  మంచి విషయం పంచుకున్నారు. ఒకోసారి మనం ఏమి కాకపోయినా వారు మన పట్ల చూపే ఆదరాభిమానాలు మనకి కొండంత అండగా ఉంటాయి. ఆ అండ మన పురోగాభి వృద్దిలో తప్పకుండా ప్రాధాన్యత కలిగి ఉంటుంది.
  సంతోషం ..అండీ!ధన్యవాదములు.

  • @వనజ గారు,
   మీరు చెప్పింది అక్షరాలా నిజం. చదువుకున్నది ఆచరణలోకి తెచ్చుకున్నపుడే జీవిత సాఫల్యం.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s