శర్మ కాలక్షేపంకబుర్లు-కుక్క తీర్పు.

కుక్క తీర్పు

రావణ సంహారం తరవాత రాముడు రాజ్యం చేస్తున్న కాలంలో ఒక రోజు మునులు, ఋషులు, పౌరులు అందరూ సభలో ఉండగా లక్ష్మణుని రాజ ద్వారం వద్ద న్యాయం కోసం ఎవరేనా వచ్చి వున్నారేమో చూసి రమ్మని పంపేడు, మహరాజు రాముడు.. లక్షణుడు రాజద్వారం వద్దకు వచ్చి వేచి చూచి ఎవరూ న్యాయం కోసం రాకపోవడం గుర్తించి, తిరిగి వెళ్ళి ప్రభువుకు విన్నవించాడు. రాముడు మరల రాజద్వారం వద్దకు వెళ్ళి న్యాయార్ధులున్నారేమో చూడమన్నాడు. లక్ష్మణుడు వెళ్ళి చూడగా ఒక కుక్క తలపై గాయంతో కనపడి న్యాయం అర్ధించింది. విషయం చెప్పమన్నాడు లక్ష్మణుడు, రామునికే నివేదించుకోవాలనుకుంటున్నాను, అని చెప్పింది. లక్ష్మణుడు సభలో కెళ్ళి ప్రభువుతో విషయం చెబితే ప్రవేశపెట్టమని చెబుతాడు. తిరిగి వచ్చిన లక్ష్మణుడు విషయం చెబితే, నేను లోపలికి రావచ్చో రాకూడదో కనుక్కుని వచ్చి చెబితే అప్పుడు లోపలికి వస్తానంది, కుక్క. లక్ష్మణుడు మళ్ళీ సభకు వెళ్ళి ప్రభువుకు విన్న విస్తే కుక్కని ప్రవేశపెట్టమని రాముడు, ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు కుక్క సభలో ప్రవేశించి రామునికి అభివాదం చేసి, రాముని న్యాయ నిర్ణయాలను, పరిపాలననూ పొగిడితే, నీకు అభయం ఇస్తున్నాను,నీ కోరిక నెరవేరుస్తాను, నీకు కావలసిన న్యాయమేమో కోరమన్నాడు. నీ కోరిక తీరుస్తానని మాట ఇచ్చాడు.

అప్పుడు కుక్క ఇలా చెప్పింది. “సర్వార్ధసిద్ధి అనే బిక్షువు ఒక బ్రాహ్మణుని ఇంట ఉంటున్నాడు.నా వల్ల ఏ తప్పూ లేకపోయినా అతడు అకారణముగా నా తలపై కొట్టి గాయ పరచా”డని చెప్పింది. రాముడు వెంటనే సర్వార్ధసిద్ధి కొరకు పంపేడు. అతడు వచ్చి రామునికి అభివాదము చేసి తను చేయవలసిన పని అడిగేడు. మహరాజు “మీరీ కుక్కని, అకారణంగా, కుక్క తప్పు లేకపోయినా, కర్రతో తలపై కొట్టి గాయపరచేరు కదా” అని అడుగుతారు. దానికి సర్వార్ధసిద్ధి మహరాజా “నేను భిక్ష కోసం తిరుగుతున్నాను. భిక్ష దొరకలేదనే తొందరలో ఉన్నాను. నాకు పదేపదే అడ్డొస్తే తొలగిపొమ్మని హెచ్చరించాను, తొలిగిపోలేదని కర్రతో కొట్టిన మాట నిజమే దండనార్హుడినే” అని చెబుతాడు. అప్పుడు రాముడు ఇతనికి ఏమి దండన విధించాలని సభలోని ఋషులు, మునులు, అందరిని అడిగితే, వారు మీకంటే ధర్మం తెలిసినవాళ్ళం కాదు కనక దండన మీరే విధించండని చెబుతారు. అప్పుడు కుక్క కలగ చేసుకుని ప్రభూ! నాకు సహాయం చేస్తానని, కోరిక తీరుస్తానని, మాటిచ్చారు కనక దండన నేను చెబుతాను, అనుజ్ఞ ఇమ్మని కోరుతుంది. దానికి ప్రభువు అనుమతిస్తే, ఇతనిని కౌలంచర మఠానికి అధికారిని చేయమని కోరుతుంది. ప్రభువు వెంటనే సర్వార్ధసిద్ధిని కౌలంచర మఠానికి అధిపతిని చేసి ఏనుగుపై ఎక్కించి పంపించేస్తారు. సభలోని వారంతా సర్వార్ధసిద్ధి కి సన్మానం జరిగింది తప్పించి, దండన జరుగలేదంటే, రాముడు, ఈ కుక్క మాత్రమే దానిలొ ధర్మసూక్ష్మం చెప్పగలదంటే, కుక్క ఇలా చెప్పింది. “క్రితం జన్మలో నేను కౌలంచర మఠానికి అధిపతిగా ఉండి అనేక సత్కార్యాలు, ధర్మబద్ధంగా చేయించి, ఎప్పుడూ తప్పు దారిని పడకుండా బతికాను. కాని ఎక్కడో నేను తెలియక చేసిన తప్పు మూలంగా ఈ కుక్క జన్మ ఎత్తేను. ఈ సర్వార్ధసిద్ధి క్రుద్ధుడు, ధర్మములను పాటింపని వాడు, క్రూరుడు,కఠినాత్ముడు కనక ఇతనే కాదు, ఇతని తాలుకు ఏడు తరములవారు నరక బాధలు అనుభవిస్తారని చెబుతూ,ఎవరినైనా శిక్షించాలంటే అతనిని దేవాలయం మీద అధికారిగా చేస్తే చాల”ని చెబుతుంది.

కధని ఒక సారి పునరాలోకనం చేద్దాం. రామునికి పరిచారకులు లేకనా, లక్ష్మణుని వెళ్ళి ద్వారం దగ్గర న్యాయార్ధులను చూడమన్నది. న్యాయం చేయడంలో తన నిష్ఠ చూపేడు. లక్ష్మణుడు రాముని బహిః ప్రాణం కదా. అనగా తనే స్వయంగా అందుకు   పూనుకున్నట్లన్న  మాట. ఇక లక్ష్మణుడు లోపలినుంచి బయటకి,  బయటనుంచి లోపలికి,   కబురు మోస్తూ ఎన్ని సార్లు ఓపికగా తిరిగాడు. మామూలుగా చెప్పిన పని ఒక సారి చేయడానికే మనుషులు బాధ పడతారు అటువంటిది అన్ని సార్లు ఓపికగా లక్ష్మణుడు తిరగడం, అందునా ఒక కుక్క కోసం, కుక్క కబురు మోస్తూ, ఎంత అద్భుతం. న్యాయం చెయ్యాలనే తపన ఎంతగా, గొప్పగా ఉన్నది, కనపడుతుంది. ఇక రాముడు దండన కుక్క చెప్పినట్లు అమలు పరచడం, ఆయనకు కూడా విషయం తెలిసి మాత్రమే. ఐతే ఈ ధర్మ సూక్ష్మం కుక్క చేత చెప్పించాడు. కుక్క తీర్పు ఎంత గొప్పగా ఉన్నది, మనం చూస్తున్నది అనుభవిస్తున్నది అంతా నిజం కాదు, పాపానికి ఒడికడితే ఇటువంటి దండనలే వస్తాయి సుమా. ఐతే ఇది దండన కాదని వాదించే వారికో దండం.

న్యాయం అంగడి సరుకయిందనను కాని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇది నాకు రామాయణంలో ఉత్తరకాండలో 59,60 సర్గల మధ్య అధికపాఠంలో దొరికిన కధ. రామాయణం, మాతృక, తెనుగు అనువాదం తెప్పించుకున్నాను. కరంటు పోతూ ఉండటం మూలంగా రామాయణం చదువగలుగుతున్నా.

16 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కుక్క తీర్పు.

 1. మిత్రులు శర్మగారు,

  లోగడ ఎందుకు ఈ విషయం వ్రాయలేదో ఇప్పుడు చెప్పలేను. మరచినానేమో. ఇలాంటి కథ ఒకటీ మహాభారతంలో కనిపిస్తుంది. భారతంలో జనమేజయుని తమ్ముళ్ళు కుక్కపిల్లలను కొడితే తల్లికుక్క సభలోనికి వచ్చి రాజును ఆక్షేపిస్తుంది. అ కుక్క దేవశుని సరమ. మాట గంభీరంగా ఉందా? ఏమీ విశేషం లేదు దేవలోకపు కుక్క అని అర్థం. (దేవలోకంలో కూడా కుక్కలున్నాయన్నమాట. అంతే కాదు శకుని మాత వినత, దైత్యమాత దితి, గోమాత సురభి, శునక మాత సరమ, వృక్షమాత కరంజ, సర్ప మాత కద్రువ, కుమారుని మాత లోహితాస్య … వగైరా.

  రామాయణకథలో భిక్షువు అన్న పేరు చూడగానే భిక్షువు అంటే బౌధ్ధభిక్షువు అనే అనుకోనవసరం లేదు. భిక్షుకవృత్తిని బుధ్దుడు కనిపెట్టలేదు.

  శ్రీమద్వాల్మీకిరామాయణ మహాకావ్యంలో యుధ్ధకాండ చివరిది. ఉత్తరకాండ వాల్మీకిక్ర్తమా కాదా అన్న మీమాంస ఉంది. ఒకవేళ ఆయనే వ్రాసినా అది ఉత్తరకథాభాగమే కాని రామాయణాంతర్గతమ్ కాదన్న వాదనా ఉంది.

  ఏది ఏమైనా అధికారంలో ఉన్నవారు ఎంత ఉన్నతులైనా సరే ఏదో ఒక తప్పు దొర్లకా పోదు. ఆ పాపఫలం కుడువకా పాపం వారికి తప్పదు. అందుకనే రాజ్యాంతే నరకం ధృవం అన్న సామెత ఒకటి ఉన్నది.

  • మిత్రులు శ్యామలరావు గారు,
   సరమ కథ మొదలుపెట్టినది, మొన్న పోయాయనుకున్నవానిలో ఉన్నదే, పూర్తి చేయాలి.
   కశ్యపుని సంతానం గురించి అనగా తమ పుట్టుక గురించి జటయువు రామాయణం లో చెబుఇతారు. అప్పుడు ఇవన్నీ చెబుతారు.
   ఈ కథ ఉత్తరకాండలో కనపడింది, రెండు సర్గలమధ్య. ఇది ప్రక్షిప్తమనే అనుకుంటాను, ఆ మాటే చెప్పేను కూడా. ఇలా రామాయణ భారతాల్లో చొప్పింపబడినవి చాలానే ఉన్నాయనుకుంటా. బాగున్నదని తీసుకున్నానని కూడా నాడే చెప్పేను. ఇది మూడేళ్ళ కితం టపా.
   రాజ్యాంతే నరకం ధృవం
   ధన్యవాదాలు.

 2. నిర్భయ బాధితులు ఈ కుక్క తీర్పు గురించి తెలుసుకోవాలి. ఉరిశిక్ష కరెక్ట్ కాదు ఒక్కరోజులో చనిపోతాడు. దేశ సేవ చేయమని చెప్పాలి.ఎంత మంచిగా పరిపాలించినా ఎవరో ఒక చాకలోడు ఏదో ఒకటి అనకపోడు, చేసిన ఒక్క తప్పు వల్ల ఏడు జన్మలు ఎత్తవలసి రావచ్చు !

  • వాళ్ళు త్వరగా పాపం అనుభవించడానికే చంపేసాం, ఈ పాటికి ఎక్కడో ఓ చోట కుక్కలా జన్మించి ఉంటారు

   • వెంకి గారు,
    ఏ కాలానికి అమలులో ఉన్న చట్టాలు ఆకాలం లో అమలవుతాయి, అంతే!
    ధన్యవాదాలు.

  • నీహారిక గారు,

   ఇక్కడ కథలో ఉన్నదానికి మీరు చెప్పిన దానికి ఎక్ఖడా లంగరందడం లేదు. ”నేనలా అనుకున్నా”నంటారా! అస్తు.
   ధన్యవాదాలు.

 3. “న్యాయం అంగడి సరుకయిందనను కాని ప్రయత్నాలు జరుగుతున్నాయి” — మీతో విభేదిస్తున్నందుకు క్షమించండి. మొన్న గాలి జనార్దన రెడ్డి బెయిలు ఉదంతంతో వరకూ… ఈ దేశంలో న్యాయం అంగడి సరుకే అని నిరూపించే ఘట్టాలెన్నో.

  • @ఫణీంద్ర పురాణపండ గారు,
   నాకు అవగాహన లేక అలా అన్నాను. అయ్యో! ఇది కూడా అంగడి సరుకయిపోయిందా!! మరెవరూ రక్ష సామాన్యునికి!!!
   Thanx

 4. బాగుందండి మళ్ళి చక్కగా చెప్పారు.
  కాని ఏదో జరుగుతుంది ఈ కలి కాలం లో.
  అవినీతిని కూడా నీతి / తప్పు కాదు అని అలోచిస్తున్న రోజులివి.
  1.ఒకప్పుడు ఎవరన్నా దొంగతనం చేసారు అంటే అది తప్పు కింద పరిగణించేవారు.
  2. నెమ్మదిగా ప్రజల అలోచనలు ఇలా ఎదిగాయి , పాపం దొంగతనం అవసరం ఉండి చేసాడు కాబట్టి దొంగ అనకూడదు, తప్పే కాని అతని పరిస్తితులు అతని చేత ఆ దొంగతనం చేయించాయి కాబట్టి, క్షమించాలి .
  3. ఇంకొద్ది కాలం తరువాత..దొంగతనం చేసాడా? సాక్ష్యాలేవి? సాక్ష్యం లేదు కాబట్టి శిక్షించే అదికారం లేదు..
  4. ఇప్పుడు..అవును చేసాడు, దొంగతనం, అయితే? ఖలేజా ఉంది, చెయ్యగల సత్తా ఉంది చేసాడు, మధ్య మీకెంటి బాధ? మీరు చెయ్యండి కావాలంటే?
  ప్రజలు అవునవును. నిజమే, మనకి చేతకాక మనం చెయ్య్టం లేదు..అంతే కదా? తప్పేమి లేదు..

  ఏంటోనండి మనమేమో ఇలా కథలు నెమరువేసుకుంటూ, పాపం చేసినవారిని, దేవుడు శిక్షిస్తాడు అని చెప్పుకుంటున్నాము..అలాగే జరిగితే బాగున్ను.

  • @శ్రీగారు,
   ఇది కలికాలం. మార్కండేయుడు, దొంగలు పరిపాలిస్తారన్నాడు.రేపు ఏమి జరుగనున్నదో తెలియదు. చూడటం తప్పించి చేయగలది కనపడటం లేదు, ప్రస్తుత ధనస్వామ్యంలో. .పాపం పండాలి కుంచం నిండాలి.
   ధన్యవాదాలు.

 5. > కరంటు పోతూ ఉండటం మూలంగా రామాయణం చదువగలుగుతున్నా.
  నిన్ననే వేరొకరు తమ బ్లాగులో కరెంటు పోతూ ఉన్నది కాబట్టి సంతోషంగా పుస్తకాలు చదువుకుంటున్నాను అన్నారు.
  ఈ కరెంటు అన్నది ఒక భోగం. భోగాసక్తి, భోగానుభవమూ ఉన్నంతకాలం మనస్సు తదితరములపైకి పోదు. సత్కార్యాచరణం కుదరదు. ఈ కరెంటుకాస్తా పోవటంతో సహృదయులు మంచిపనులతో కాలక్షేపం చేస్తున్నారు. చాలా బాగుంది.

  • @మిత్రులు శ్యామల రావు గారు,
   ఒక రకంగా ఇదే బాగుందేమో. లేకపోతే దీన్ని వదలిపెట్టటం లేదని ఇంట్లో వాళ్ళు కూడా గొడవ చేస్తున్నారు. ఏమయితేనేమి రామాయణం చదువుతున్నా. మధ్యలో ఒక రోజు ఋగ్వేదం చూడాల్సివచ్చింది
   ధన్యవాదాలు.

  • @జిలేబిగారు,
   ఏమో చెప్పలేను. ఇది అధికపాఠంలో ఉన్నది కనక తరవాత చేర్చబడినదే, అనుమానం లేదు. ఎప్పుడన్నది చెప్పడం కష్టమేనేమో. బాగున్నది కనక తీసుకుందాం.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s