శర్మ కాలక్షేపంకబుర్లు-శకుంతల

శకుంతల.

ఒకప్పుడు విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేస్తుండగా ఇంద్రుడు, ఇంద్ర సింహాసనం పోతుందేమో నని భయపడి, ఆ తపస్సును భంగపరచదలచి, మేనకను పిలిచి, “నీవుపోయి విశ్వామిత్రుని తపస్సు భంగం చేయమ”ని ఆజ్ఞ ఇచ్చాడు. దానికి మేనక “స్వామీ ఆయన మహా కోపిష్టి, వశిష్టుని సంతానాన్ని శాపంతో నాశనం చేసినవాడు. అటువంటి వాడు కోపంగా చూస్తే చాలు మాడిపోడానికి, స్త్రీని, నన్ను వెళ్ళమంటున్నారు, తపోభంగానికి, ఐనా నా చేతనయిన ప్రయత్నం చేస్తానని”, చల్లగాలిని తోడుతీసుకుని, సుగంధాన్ని వెంటబెట్టుకుని, బయలుదేరి వెళ్ళి, విశ్వామిత్రునికి నమస్కారం చేసి, పువ్వులు కోసిపెట్టే నెపంతో, సపర్యలు చేయడం మొదలుపెడుతుంది, చెలులతో కూడి. ఆమె సపర్యలు చేస్తుండగా మలయానిలుడు చేయవలసిన పని చేసి వల్లెవాటు తప్పించాడు, ముని దృష్టి చెదిరింది, ఆమె పాలిండ్లపై దృష్టి నిలిచింది, కామ వశుడయ్యాడు. మేనక పాచిక పారింది, బహు కాలం సంసారగతుడయ్యాడు, విశ్వామిత్రుడు. ఫలితంగా బిడ్డపుట్టింది. మేనక బిడ్డను మాలిని అనే ఏటి ఒడ్డున వదలి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు కూడా బిడ్డను వదలి తన తపో భూమికి వెళ్ళిపోయాడు. ఈ బిడ్డని జంతువుల బారి పడకుండా శకుంతమనే పక్షి సమూహం కాపాడింది. శకుంత పక్షుల చేత కాపాడబడినది కనక శకుంతల అని నామ కరణం చేశాను. ఆమెను తెచ్చి పెంచేను, అని కణ్వుడు మరొక మునికి, శకుంతల జన్మ వృత్తాంతం, తాను వింటూ ఉండగా చెప్పేడని, శకుంతల దుష్యంతునితో తన జన్మ వృత్తాంతం తెలిపింది.

శకుంతల జన్మ వృత్తాంతం చూదాం. ఈమె విశ్వామిత్రుడు, మేనకలకు జన్మించినది. ఈ సంతానం అక్రమమా? సక్రమమా? ఈ ప్రశ్న వదిలేద్దాం. ఆ కాలానికి అది తప్పుకాదేమో మనకు తెలియదు కనక. జంతువులు కూడా, బిడ్డ పుట్టిన తరవాత బిడ్డను సహజ శత్రువులయిన ఇతర మృగాలనుంచి రక్షించుకోడానికి చాలా ప్రయత్నం చేస్తాయి. ఈ విషయంలో తల్లి చూపే ధైర్యం అనుపమానం. తల్లి తన ప్రాణం ఒడ్డి అయినా బిడ్డను శత్రువునుంచి కాపాడుకోడానికి ప్రయత్నిస్తుంది. దీనికి ప్రత్యేకమైన ఉదాహరణలు అక్కరలేదు. కోడి తన సంతానాన్ని, గద్ద నుంచి రక్షించుకోడానికి, పిల్లలను రెక్కలకింద దాచడం సర్వ సహజంగా చూస్తాము. అలాగే సాధు జంతువైన ఆవు, బిడ్డను శత్రువులనుంచి కాపాడుకోడానికి పులి కంటె ఘోరంగా పోరాడుతుంది. నిన్న ఒక చిన్న సంఘటన చూశా. మా ఎదురుగా నాలుగంతస్థుల బిల్డింగ్ లో నాల్గవ అంతస్థులో ఒక గృహ ప్రవేశం జరుగుతోంది. ఆవుని, దూడని తోలుకొచ్చారు. పైకి, మెట్ల మీంచి ఎక్కించడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఆవు భయపడి పైకి ఎక్కటం లేదు. అంతలో ఒక బుద్ధిమంతుడు, ఆవు చూస్తుండగా, దూడను ఎత్తుకుని పైకి ఎక్కేస్తున్నాడు. ఇది చూచిన ఆవు, ఎవరి ప్రమేయం లేకుండా భయపడక, మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళిపోయింది. దీనిని బట్టి తెలిసేది, తల్లి ఎటువంటి విపత్కర పరిస్థితులలోనైనా బిడ్డను వదలదు సుమా. కాని ఇక్కడ మేనక బిడ్డని నిర్దాక్షిణ్యంగా వదిలేసింది, తండ్రి, కామ పరవశుడై, ఇంద్రియ సుఖాలకోసం స్త్రీని పొంది, తత్ఫలితంగా పుట్టిన బిడ్డను వదిలేసిపోయాడు. పక్షులు కాపాడాయి. అంటే వాటికి ఉన్న పాటి జ్ఞానం కూడా ఈ దంపతులకు లేకపోయింది. అదృష్టం కొద్దీ కణ్వుడు చూసి పెంచాడు.

పురాణ కాలం లో ఇలా, తల్లి కుంతి, తండ్రి సూర్యునిచే వదలి వేయబడిన వాడే కర్ణుడు, ఇతని మూలంగానే పెద్ద యుద్ధం జరిగింది. గంగా శంతనులు కామోపభోగాలలో తేలినా, ఎనిమిది మంది వసువులను, గంగ, గంగపాలు చేసినా, చివరికి ఒకరినైనా తల్లి పెంచి, తండ్రికి ఒప్పచెప్పింది. నేటి కాలానికి ఇటువంటి మేనకలూ, విశామిత్రులూ పెరిగిపోయారు. ఎక్కడ చూసినా ఇటువంటి సంతానమే కనపడుతోంది, ఎక్కువగా. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేకపోవడం, చూసిన ప్రతిదానిని పొందాలనుకోవడం, కామోపభోగాలకోసం వెంపర్లాడటం, తప్పు చేయడం, దానిని ఎదుర్కోలేక, తత్ఫలితంగా కలిగిన సంతానాన్ని, భవిషత్తునో, పేరునో, కుటుంబ గౌరవాన్నో, లేక వీటన్నిటి ముసుగులో, మరొకరితో కామభోగాలు నెరవెర్చుకోడం కోసమో, వదిలేయడం, చేస్తున్నారు. మేనక విశ్వామిత్రులలాగే బాధ్యతలు మరచి, పశువులకంటే హీనంగా ప్రవర్తించి, కలిగిన సంతానాన్ని, గుడిమెట్ల మీద, అనాధ గృహాలవద్ద వదలిపోతున్నారు. ఇంకా కొంత మంది భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. ఏమయినా అంటే పురాణ కాలంనుంచీ ఉన్నదేగా అంటున్నారు.
నాకు తెనుగు తప్పించి మరొక భాష రాదు. దీనిని కవిత్రయ భారతం నుంచి తీసుకున్నాను.

కాళిదాసు శాకుంతలం చదవలేను, సంస్కృతం రాదు కనక. దేవయాని రాసిన వెంటనే రాయలనుకున్నా, కుదరలేదు, నిన్న రాయాలనిపించి మొదలుపెట్టా.

ప్రకటనలు

16 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-శకుంతల

 1. శకుంతల గురించి రాస్తున్నరన్న మాట.
  నాకు ఇలాంటి పురాణ కథలు మీరు రాస్తే ఇష్టం గా చదువుతాను.
  చక్కగా రాస్తారు. చిన్నపుడేప్పుడో చదివాను. మళ్ళీ ఇప్పుడు చదువుతున్నాను.
  అందరికి అర్ధమయ్యే భాషలో రాస్తారు. అందుకేనేమో మీరు రాస్తే చదైవి అర్ధం చేసుకోగలుగుతాను.

  • @శ్రీ గారు,
   మీరు ఇష్టంగా చదివేలా రాయగలిగిన శక్తి నాకు కలగ చేసిన అమ్మకి నమస్కారం.
   ధన్యవాదాలు.

 2. ఈ రోజుల్లో కొంతమంది ఆచారవ్యవహారాల పేరుతో తమకు తోచినట్లు విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. ఆచారం పేరుతో ఇలా ఆవుదూడలను హింస పెట్టమని పెద్దలు చెప్పలేదు.

  అపార్ట్మెంట్స్ లో ఎక్కడో పై అంతస్థులో ఉన్న ఇంటి వద్దకు ఆవును ఎక్కించటం అన్యాయం. ఇలాంటి విపరీతపోకడల వల్ల పుణ్యం రాకపోగా మూగప్రాణులను హింసించిన పాపం చుట్టుకుంటుంది…

  • @anrd గారు,
   ఆచారం పేరుతో మా దగ్గర ఇలా ఆవుని అపార్ట్మెంట్లు అన్నిటి గృహప్రవేశాలకి తోలుకొస్తున్నారు. బలవంతంగా పైకి ఎక్కిస్తున్నారు. ఏమీ చేయలేక బాధపడటం మిగుల్తోంది.అది మూగజీవిని హింసించడమని అనుకోటంలేదు,వాళ్ళు
   ధన్యవాదాలు.

 3. చక్కటి విషయాలను తెలియజేస్తున్నారండి. వ్యాఖ్యలు కూడా చక్కగా ఉన్నాయి.
  1..వివాహానికి ముందే బిడ్డను కంటే వచ్చే నష్టాలను కుంతి పాత్ర ద్వారా ,
  2..తల్లితండ్రులకు తెలియకుండా మగవారి మాటలు నమ్మి రహస్య వివాహాలు చేసుకుంటే అమ్మాయిలకు వచ్చే కష్టాలను శకుంతల పాత్ర ద్వారా పెద్దలు తెలియజేసారు….
  3..విశ్వామిత్రుల వారు తన బలహీనతలను అధిగమించి రాజర్షి స్థాయి నుంచి బ్రహ్మర్షి స్థాయికి చేరుకోవటం వారి పట్టుదలను తెలియజేస్తుంది….

  • @anrdగారు,
   విశ్వామిత్రుడు చాలా గొప్పవాడు, రామునికి గురువై ఉన్నవారు. పట్టుదల వారిని బ్రహ్మఋషి గా మార్చింది.
   ధన్యవాదాలు.

 4. selective listening అన్నమాట. వారికి అనుకూలంగా ఎంత వరకూ కావాలో అంత వరకే తెలుసుకుంటున్నారు. పూర్తి జ్ఞానం సంపాదిస్తే ఇలాంటి కథల అర్ధం బోధపడుతుంది. బాగా చెప్పారు.

  • @అమ్మాయి జ్యోతిర్మయి,
   కావలసిన మటుకు చూసుకుని మిగిలినది మనకి కాదనుకుంటే మిగిలేది నష్టమే, బాగా చెప్పేవు,
   ధన్యవాదాలు.

 5. పురాణకాలపు స్త్రీపురుషవృత్తాంతాలను అధ్యయనం చేయవలసినదే. దానికి ఫలితంగా వారూ మనలాంటివారే, మనకన్నా కొంచెం తక్కువ సంయమనం కల వారే నన్న నిర్ణయానికి వచ్చినట్లయితే ఆ అధ్యయనం సఫలం కాలేదన్న మాట. నిజం చెప్పాలంటే విఫలమై, దుష్ఫలితాన్నిచ్చిందన్న మాట. మహాత్ములజీవితాలలోని చీకటికోణాలతో సహా పురాణాలు మనకు ప్రత్యక్షం చేయటం వెనుక గల అంతరార్థాన్ని మనం పట్టుకోలేక పోవటం విచారించవలసిన విషయం. బలవానింద్రియగ్రామో విద్వాంసమపకర్షతి అనుకోవటం కాదు. ఆ మహాత్ముల తదనంతరవృత్తాంతాలు పరిశీలించి వారు యేవిధంగా ఆత్మోన్నతి సాధించారన్నది మనం గ్రహించాలి. కామక్రోధాదులు సంపూర్ణంగా జయించి మహాభాగులువిశ్వామిత్రులు భగవదవతారమూర్తియైన శ్రీరామునకే గురుత్వం వహించగలిగే స్థాయికి చేరుకోగలిగారని తెలియవస్తున్నదని మనం మరువరాదు.

  శ్రీమద్రామాయణంలో, విశ్వామిత్రులతో రామచంద్రుని పంపటానికి దశరథుడు విముఖుడైనప్పుడు, మనలో ప్రచారంలో ఉన్నట్లు, ఋషి కోపంతో చిందులు తొక్కలేదు. “మిధ్యాప్రతిజ్ఞ కాకుత్థ్స సుఖీభవ సబాందవ” అనేసి లేచి వెళ్ళిపోసాగాడు. విశ్వామిత్రుడు ఒకప్పుడు కోపిష్టికాబట్టి, ఈ సందర్భంలో చిందులు తొక్కినట్లు నాటకాల్లో, సినిమాల్లో చూపుతూ ఉంటారు కాని అది తప్పు.

  పురాణపాత్రలను మనం సరిగా అర్థం చేసుకుంటే చాలా మేలు కలుగుతుంది.

  • @మిత్రులు తాడిగడప శ్యామల రావు గారు,
   మనవారు ఏ విషయాన్ని దాచలేదు. జరిగినది జరిగినట్లుగా చెప్పి, మీరు ఇందులో పడిపోవద్దని హెచ్చరించారు. ఇప్పుడు పురాణ పాత్రలను విమర్శ చేయడం తప్పించి, వాటినుంచి మంచి తెలుసుకోలేకపొతున్నారన్నదే నా బాధ.
   ధన్యవాదాలు

 6. చిత్తం చెప్పినట్లు ప్రవర్తించడం వల్ల ఎలాటి పరిస్థితులు ఉన్న్తాయో అన్యోపదేశంగా పురాణాలు,కావ్యాలు చెప్పాయి అంటే అలా ప్రవర్తించడం వల్ల వచ్చే అనర్ధాలు వివరించడమే కదా! ఏం చేయకూడదో,ఎందుకు చేయ కూడదో..అంతా తెలుస్తుంది కదా! అయినా ఆ అభినవ శాకుంతలలలు, విశ్వా మిత్రులు మన మధ్య కనబడుతున్నారు. మదమత్సరాల రుజువులని వీధికొక అనాధ శిశువు వై విలపిస్తూ ఉంది.ఏం చేయగలం:(

 7. మరో భాషలో పాండిత్యం లేదన్న చింతా?
  గుబులెందుకు గూగులమ్మ వుండ మన చెంత?! :))

 8. ఏమిటి తాతగారూ? మీరు కూడా శాకుంతలానికి సంబంధించిన టపా వేశారు 🙂 చివరి వాక్యాలు బాగున్నాయి. నిజంగానే ఏ పనయినా చేసేయటం పురాణ కాలంలో ఒక కారణం కోసం చేసిన పనులను అడ్డు పెట్టుకుని అదే మేమూ చేసామూ అని సమర్ధించుకోవటం మామూలయిపోయింది.

  • @అమ్మాయ్ రసజ్ఞ
   అప్పుడు అలా జరిగింది పర్వసానాలు చెప్పేరు, ఇప్పుడు అలా చేసుకుని బతుకులు భారం చేసుకోవద్దని కదా
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s