శర్మ కాలక్షేపంకబుర్లు-గాంధర్వ వివాహం.(ప్రేమపెళ్ళి)

గాంధర్వ వివాహం.                                              SAKUNTALA-1

దుష్యంతుడనే రాజు పరిపాలన చేస్తూ వేటకై పరివారాన్ని వెంట పెట్టుకుని బయలుదేరి, వేటాడి, దగ్గరలో ఉన్న కణ్వాశ్రమంలో, కణ్వుని దర్శించి, నమస్కరించి వస్తానని, మంత్రులు, సేన అంతనూ దూరంగా వదలి కాలి నడకను కణ్వాశ్రం చేరి, అక్కడ కణ్వుని ఆశ్రమంలో, అపురూప లావణ్యవతి అయిన శకుంతలను చూశాడు. అందంలో జయంతునిలా ఉన్న దుష్యంతుని రాజుగా తెలుసుకుని అర్ఘ్య పాద్యాలిచ్చి కుశలమడిగింది, శకుంతల. అప్పుడు దుష్యంతుడు “వేటకని బయలుదేరివచ్చాను, ఆశ్రమం దగ్గరలో ఉన్నది కనక మునిని దర్శించి పోదామని వచ్చాను, వారెక్కడికెళ్ళేరు, వారి దర్శనభాగ్యం కలగలేదు” అని అడిగాడు. అందుకు శకుంతల “వారు ఇప్పుడే, అడవిలోకి పండ్ల కోసం వెళ్ళేరు, మీరు వచ్చేరని తెలిస్తే వెంటనే వచ్చేస్తారు” అంది. “వారు వచ్చేదాక ఒక ముహూర్త కాలం ఉండమని” కోరింది. అప్పుడు దుష్యంతుడు ఆమెను కన్యగా ఎరిగి, ఆనందపడి, ఆమెను సర్వాంగ సుందరిగా చూసి, సంచలించిన మనసుతో, “నీవెవరి కుమార్తెవు, ఇక్కడికెందు   కొచ్చావు, ఇక్కడ ఉండడానికి కారణం ఏమి” అని అడిగాడు. దానికి శకుంతల “నేను కణ్వ మహాముని కుమార్తెను” అని చెప్పింది. ఈమె ముని కన్య అయితే నా మనసెందుకు లగ్నమయిందని దుష్యంతుడు అలోచించి, ఈమె మాట నమ్మలేను, బ్రహ్మ చర్యవ్రతుడైన కణ్వుని కి కుమార్తె ఏమిటి అని ఆమె జన్మ వృత్తాంతం అడిగాడు. అప్పుడు శకుంతల తన జన్మ వృత్తాంతం చెప్పింది ( ఇది నిన్నటి టపాలో చెప్పుకున్నాం, కనక మళ్ళీ చెప్పటం లేదు.) ఈమె ముని కన్యేమోనని భయపడ్డాను, కాదని తెలిసింది, ఈమె కూడా నాయందనురాగయైయున్నదని, మదనాతురుడై, “ఈ నార చీరలు కట్టనేల, ఈ కుటీరాలలో నివాసమేల, ఈ మునిపల్లెలో ఉండనేల, నాకు భార్యవయి సౌఖ్యాలను పొందు, గొప్పవైన భవనాల్లో నివసించు” అన్నాడు. “వివాహాలు ఎనిమిది రకాలు,బ్రాహ్మ్యము,దైవము,ఆర్షము,ప్రాజాపత్యము,రాక్షసము, ఆసురము,,గాంధర్వము,పైశాచికము. రాచవారికి గాంధర్వము, రాక్షసము యోగ్యమైనవి. మనకిద్దరికి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉన్నది కనక గాంధర్వ వివాహము ఉచితము” అనగా, సిగ్గు పడుతూ శకుంతల ఇలా అన్నది. “మా తండ్రి ధర్మ స్వరూపుడు, మా నాన్నగారొస్తారు, వారు వచ్చి నన్ను నీకు ఇస్తే పెళ్ళి చేసుకో” అంది. అందుకు దుష్యంతుడు, “ఎవరికి వారే చుట్టాలు, గాంధర్వ వివాహం అంటేనే రహస్యం, మంత్రాలు లేనిది” అని ఆమెను ఒప్పించాడు. అప్పుడు శకుంతల, “నీ వల్ల నాకు కలిగే కుమారుడికి యువరాజ్య పట్టాబిషేకం చేస్తానంటే నీకూ నాకూ సంగమం అవుతుంది” అని చెప్పింది. అందుకు దుష్యంతుడు ఇష్టపడి గాంధర్వ వివాహం చేసుకుని ఆమెతో భోగాలనుభవించి, వెళ్ళిపోతూ, నిన్ను తీసుకు వెళ్ళడం కోసం మంత్రులు మొదలయిన వారిని కణ్వ మహాముని వద్దకు పంపుతానని చెప్పి తన పట్టణానికి వెళ్ళేడు.

ఒక సారి సింహావలోకనం చేదాం. శకుంతల తండ్రి లేనపుడొచ్చిన అతిధికి చేయగల సత్కారం చేసింది. అందరు మాట్లాడినట్లే మాట్లాడింది. దుష్యంతుని వైపు ఆకర్షితురాలయింది. పరస్పరం మోహానికిలోనయ్యారు. “నాన్నగారేరీ” అని అడిగినపుడు “ఇప్పుడే వచ్చేస్తార”ని దుష్యంతుని ఉంచే ప్రయత్నం, సంభాషణ కొన సాగించే ప్రయత్నం చేసింది. వివాహ ప్రసక్తి తెస్తే, ఒక సారి మాత్రం “నా తండ్రికి ఇష్టమయి నీకిస్తేతే వివాహం చేసుకో”మన్నది, రాజు గాంధర్వ వివాహం చేసుకోడం ధర్మమేనన్న మాటకూ, తనకూ అతనియందున్న కామోపభోగ లాలసకు లొంగి వివాహానికి ఒప్పుకుని, ఒక షరతు మాత్రం పెట్టింది, పుట్టబోయే పుత్రునికి యువరాజ పట్టాభిషేకం కావాలని. దీనికి దుష్యంతుడు ఒప్పుకుని సంగమించారు, గాంధర్వ వివాహం చేసుకుని. అప్పటికీ, ఇప్పటికీ అమ్మాయిల, అబ్బాయిల మనస్తత్వం మారలేదన్నదే నా ఉద్దేశం. తండ్రి వచ్చిన తరవాత వివాహం చేసుకుందామన్న మాటమీద నిలబడలేకపోయింది, ఇంద్రియ నిగ్రహం లేక. ఇప్పటి అబ్బాయిల లాగే దుష్యంతుడూ ప్రవర్తించాడు. గాంధర్వ వివాహం అనగా పరస్పర ప్రేమతో అంగికారంతో జరిగే వివాహం, అప్పటికి, ఇప్పటికి, సమ్మతమే, కాదనడానికి లేదు కాని భద్రత దృష్ట్యా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినపుడు చిక్కులు కలుగుతాయి, అదే శకుంతల కూడా పడింది తరవాత, ఇప్పటివారు కూడా అటువంటి చిక్కులు ఎదుర్కుంటున్నారు…. శకుంతల చిక్కులు ఎలా పరిష్కారం చేసుకున్నదీ తర్వాత చూదాం.

శాకుంతలం అంటే శృంగారమే చూస్తున్నారు, ఈ తరవాత జరిగినదాన్ని పెద్దగా పట్టించుకోటం లేదు. మను చరిత్రలో మాయా ప్రవరునితో వరూధిని సంగమం తరవాత చదవక్కరలేదంటున్నారు, అలాగే శాకుంతలంలో కూడా, నిజంగా నేటి కాలానికి ఈ తరవాత జరిగినదే చాలా అవసరం.

ప్రకటనలు

26 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-గాంధర్వ వివాహం.(ప్రేమపెళ్ళి)

 1. **శకుంతలా దుష్యంతులు పాండవుల, కౌరవుల పూర్వీకులే. శకుంతలా దుష్యంతుల తరువాతి తరాలకు చెందిన వారసులే పాండవులు, కౌరవులునట…

  శకుంతల క్షత్రియ కన్య అని తెలుసుకుని దుష్యంతుడు ఆమె మీద మనసుపడి గంధర్వ రీతిన వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో శకుంతలకు పుట్టిన బిడ్డను చక్రవర్తిని చేస్తానని వాగ్ధానం చేసాడు. రాజలాంఛనాలతో ఆమెను రాజధానికి తీసుకు వెళతానని మాటిచ్చి రాజధానికి వెళ్ళాడు.**అంతర్జాలంలో ఇలా ఉన్నదండి……..
  దీనిప్రకారం చూస్తే తమకు పుట్టబోయే బిడ్డను చక్రవర్తిని చేయమని శకుంతల అడిగినట్లు కాకుండా , దుష్యంతుడే శకుంతలకు అలా వాగ్దానం చేసి గాంధర్వ వివాహం చేసుకున్నట్లు అనిపిస్తోంది.

  • @anrdగారు,
   కవిత్రయభారతం నుంచి మీ అనుమానానికి సమాధానం

   నరనుత నీ ప్రసాదమున న్కుదయించిననందనున్ మహీ
   గురుతర యౌరాజ్యమునకున్ దయతో నభిషిక్తు జేయగా
   వరము ప్రసన్నబుద్ధి ననవద్యమిగా దయసేయు నెమ్మితో
   నిరుపమదాన యట్లయిన నీకును నాకును సంగమంబగున్ భరతం..ఆది పర్వం. చతుర్ధాశ్వాశం ౫౯

   దీని ప్రకారం ఇది శకుంతల కోరిక.
   ధన్యవాదాలు.

   • సర్ ! వ్యాఖ్యలు ఎక్కువగా వ్రాస్తున్నందుకు తప్పుగా అనుకోవద్దండి. నేను ఎక్కువ గ్రంధాలు చదవలేదు. నాకు ఈ పద్యాలు అంతగా అర్ధం కావు.

    ” నీకును నాకును సంగమంబగున్ భరతం..ఆది పర్వం. చతుర్ధాశ్వాశం ౫౯”

    ఇక్కడ నాకు ఒక సందేహం వచ్చింది. శకుంతల తమకు బిడ్డ పుట్టక పూర్వమే తమకు మగబిడ్డే పుడతాడనీ, పేరు భరతం అనీ ఎలా చెప్పగలిగింది ? ” భరతం ” అంటే ఎలా అర్ధం చేసుకోవాలి ? వేరే అర్ధం ఉందా ? ఇలా సందేహాలు కలిగాయండి. నాకు ఈ పద్యం సరిగ్గా అర్ధం కాలేదండి. మిమ్మల్ని విసిగిస్తున్నానేమో … క్షమించండి.

   • ఈ రోజుల్లో కూడా కొందరు యువతీయువకులు కలిసి చెట్లమ్మటపుట్లమ్మటా తిరుగుతూ భవిష్యత్తు గురించి బోలెడు కబుర్లు చెప్పుకోవటం సినిమాల్లో, పార్కుల్లో చూస్తుంటాము.

    శకుంతలాదుష్యంతులు కూడా తమ భవిష్యత్తు గురించి , పుట్టబోయే బిడ్డ యొక్క పేరు, ఆ బిడ్డల భవిష్యత్తు గురించి కబుర్లు చెప్పుకుని ఉంటారు. ఆ ముచ్చట్లలో శకుంతల వరం అడగటం, దుష్యంతుడు వాగ్దానం చేయటం జరిగి ఉండవచ్చు..

    ఇక తరువాత అబ్బాయి అమ్మాయిని , చెప్పుకున్న ముచ్చట్లను మర్చిపోవటం, అమ్మాయి ఎదురుచూపులు, బిడ్డపుట్టటం, తరువాత పెద్దవాళ్ళు ఎంటరయి వారిని కలపటం….. ఈ కధంతా ….తరాలు మారినా మనుషులు. మారలేదు అనిపిస్తోంది…..

    .మీకు కృతజ్ఞతలండి నా వ్యాఖ్యలను మీ బ్లాగులో ప్రచురించినందుకు.

   • anrd గారు, సంగమం అయ్యాక నీ భరతం పడతా అన్నాడు, అంటే ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్ అనే… అంతే… డైరెక్ట్గానే చెప్పాడు, అవిడకే అర్థం కాలేదు, ఒట్టి అడివిమనిషి. :))

   • @anrd గారు,
    ఒక చిన్న పొరపాటు ఈ గజి బిజికి కారణం. అది భారతం, పొరపాటుగా టైపులో భరతం అని పడింది. మీకు రిఫ్రెన్స్ కోసం చెప్పిన నంబరు అది. ఇక్కడ శకుంతల అందరి లాగే మగ పిల్లవాడు పుడతాడనుకోడం తప్పులేదు. పుట్టబోయే బిడ్డకి యువరాజ్య పట్టాభిషేకం చేస్తానంటే మనకలయిక జరుగుతుందని స్పష్టం గ ఆ పద్యం అర్ధం.కలయిక ఆ ఒక సారేకాదుగా తరవాత కూడా కలిగే సంతానమనుకోవచ్చు. విసిగించడం సమస్యలేదు. అనుమానం తీర్చుకోవడం పొరపాటనుకోకూడదు.
    ధన్యవాదాలు.

  • @anrd గారు,
   మీరు వీషయాన్ని నాకంటే బాగానే ఊహించారు. సంతసం.అంతర్జాలం సంగతి నాకు తెలియదండి. కవిత్రయ భారతం లో పద్యం మీకు రిఫరెన్స్ ఇచ్చా.
   ధన్యవాదాలు.

   • సర్ ! నేను భరతం అన్న పదం కూడా కలిపి వాక్యాన్ని చదివేసాను.

    ఎందుకో తెలియదు, ఆ వాక్యాన్ని నేను ఇలా అర్ధం చేసుకున్నాను…….సంభవంబగున్ భరతం…. అని.

    ” నిరుపమదాన యట్లయిన నీకును నాకును సంభవంబగున్ భరతం .” అని.

    ” భరతం ” అనే పదం కలపటం వల్ల అక్షరాలు ఎక్కువయి వ్యాకరణ దోషం కూడా ఏర్పడింది. ఇదంతా నేను అప్పుడు గమనించలేదు.

    మొత్తానికి అర్ధమే మారిపోయిందండి .

  • @anrd గారు,
   చూశారా, చిన్న పొరపాటు పెద్ద అనుమానానికి దారి తీసింది. అనుమానం తీరినందుకు ఆనందంగా ఉంది.

   ధన్యవాదాలు.

 2. పురాణ కథలు వింటుంటే నేటి సమాజం లో మనుషుల మనస్తత్వానికి , ఆనాటి మనుషుల మనస్తత్వానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయనిపిస్తుంది. అన్ని తప్పకుండా జరిగిన కథలే అని నమ్ముతాను.కాకపోతే ఈ గ్రంధాలన్ని రచించిన వారు వాళ్ళని దైవాలుగా , కారణ జన్ములుగా చిత్రీకరించారనిపిస్తుంది.అయినా చాలా నేర్చుకోవచ్చు ఈ పురాణా కథలు చదివి.చక్కగా రాస్తున్న మీకు ధన్యవాదాలు.

  • @శ్రీ గారు,
   పురాణ పాత్రలూ మనలాటి వారే లేదా మనకంటే కూడా తక్కువ నిగ్రహం కలవారనుకోవద్దు. వారు ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా నడచుకున్నారు. వారి ప్రత్యేకత వారిదే.వారు కారణజన్ములన్న దానిలోనూ, దైవాంశ సంభూతులన్నదానిలోనూ అనుమానం లేదు. ఇవన్నీ ఇతిహాసాలు అనగా అలాజరిగినవి అని అర్ధం. ఇది చరిత్ర, నిజంగా జరిగినవే. కధలు కాదు. మానవ మనస్తత్వం ఎన్ని యుగాలు జరిగినా మారదన్నదే సత్యం. భారతం లో ఉన్నది ప్రపంచంలో లేనిది లేదు. అలాగే ప్రపంచంలో ఉన్నది భారతం లో లేనిది లేదు. వెతుక్కోవాలి అంతే. దానికే మనకి ఓపికలేదు.
   ధన్యవాదాలు.

 3. /నీ వల్ల నాకు కలిగే కుమారుడికి యువరాజ్య పట్టాబిషేకం చేస్తానంటే నీకూ నాకూ సంగమం అవుతుంది” అని చెప్పింది. /
  ఇదేమాట కైక అడిగితే రాద్ధాంతం చేశారు. కేవలం తన కొడుకుని రాజుగా చూడాలనే ఆమె దుష్యంతుడిని ఒప్పుకుంది కాని, కేవలం స్వార్థం, వ్యాపారదృష్టేగాని ప్రేమ లాంటిది తప్ప ఆమెకు ఏ కొశాన లేదంటారా?
  బూర్జువా/ఫ్యూడల్ ప్రేంఅ అని మార్కిస్టులు అంటే ఏమో అనుకున్నా… ఇదా! :))

   • ఏమో శర్మగారు,
    కైక కూడా యుద్ధంలో సహాయం చేసినందుకు దశరథుడు కోరుకొమ్మంటేనే తను అలా కోరు కుంటుంది. సత్యవతి విషయంలో, ఆమె తండ్రి ఈ షరతు పెడతాడు.
    ఇక్కడ శకుంతలే అలా అడగడం…పెళ్ళికి ముందు ఈ వాక్యాలు ‘ప్రేమ’ లా అనిపించలేదు, ఓ వ్యాపార ఒప్పందంలా అనిపించింది.

 4. శాకుంతలం అంటే శృంగారమే చూస్తున్నారు, ఈ తరవాత జరిగినదాన్ని పెద్దగా పట్టించుకోటం లేదు. మను చరిత్రలో మాయా ప్రవరునితో వరూధిని సంగమం తరవాత చదవక్కరలేదంటున్నారు, అలాగే శాకుంతలంలో కూడా, నిజంగా నేటి కాలానికి ఈ తరవాత జరిగినదే చాలా అవసరం.****….బాగా చెప్పారు.

 5. చాలా బాగా వివరిస్తున్నారు.Waiting for next post
  అప్పుడంటే ఇచ్చిన బహుమానాలని గుర్తుంచుకునేవారు కాబట్టి శకుంతల చిక్కులనుండి బయటపడిందేమో కదండి:-)

  • @అమ్మాయి జ్యోతిర్మయి,
   పురాణాలలో ఉన్న ఇటువంటి వాటిని విశ్లేషించుకుంటే మనకి ఇప్పటి కాలానికి కూడా కావలసిన సమాధానాలు దొరుకుతాయి. పురాణపాత్రలను, తప్పులు చేశారని విమర్శించుకుని అసలు విషయాన్ని వదిలేసుకుంటున్నాం. అందుకే ఈ ప్రయత్నం.మన వాళ్ళు దేనినీ దాచుకో లేదు, జరిగినది జరిగినట్లు చెప్పేరు, కారణం కూడా చెప్పేరు.
   ధన్యవాదాలు.

  • @మూర్తిగారు,
   నా బ్లాగుకు స్వాగతం. మానవ మనస్తత్వం ఎంత కాలం గడచినా మారదనడానికి ఇవే ఉదాహరణలు.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s