శర్మ కాలక్షేపంకబుర్లు- ఉదాత్త,ధీర నాయిక శకుంతల

 

 

ఉదాత్త,ధీర నాయిక శకుంతల

తండ్రి చేత పంపబడిన శకుంతల రాజ సభకు చేరి దుష్యంతుని చూసింది. ప్రేమగా పలకరింపులేదు, ప్రియమైన చూపులేదు. ఏమైందీ? అని మధనపడి రాజు కదా చాలా పనులుంటాయి మరిచిపోయాడేమోనని సరిపెట్టుకుంది. కనీసపు ప్రేమ దృష్టి కూడా కనపడక తల్లడిల్లింది. సహజంగా భర్తమీద ఉన్న ప్రేమతో సరిపెట్టుకున్నా జరుగుతున్న సంగతి చూసి డీలా పడింది, ఎరగని వానిలా ప్రవర్తిస్తున్నాడా అని, ఇలా ఆశ నిరాశల మధ్య మనసు ఉయ్యాలలూగుతున్నా ప్రయత్నం మానలేదు. వచ్చాము కదా విషయం తాడో పేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. దేవయాని లాగ తండ్రికి చెప్పడానికి వెనుతిరగలేదు, కోపం తెచ్చుకోలేదు.. మానవ ప్రయత్నం చేయాలునుకుని, వస్తున్న కోపాన్ని దుఃఖాన్ని ఆపుకుని, మనసు సంబాళించుకుని రాజుతో మాట్లాడటం ప్రారంభించింది. ఇప్పటి పిల్లలు సమస్య వస్తే దానిని తమరు పరిష్కరించుకో గలరేమో చూడటం లేదు. అంతా ఎవరో అమిర్చిపెట్టాలి. సమస్యకు కారణం, పరిష్కారం, సమస్యలో ఉన్నవారికంటే పైవారికి బాగుగా తెలియదు కదా. పరిస్థితి అనుకూలంగా లేకపోయినా కణ్వాశ్రమానికి దుష్యంతుని రాక, తనతో గాంధర్వ వివాహం గుర్తుచేసి, బాలుని, దుష్యంతుని కొడుకుగా పరిచయం చేసింది. దానికి దుష్యంతుడు సహజంగానే స్పందించి నీవెవరో నాకు తెలియదు పొమ్మన్నాడు. దానికి శకుంతల రాజా! ఎవరూ చూడకుండా ఏమిచేసినా సాక్ష్యం ఉందనుకుంటున్నావేమో, పంచభూతాలు మొదలు, అంతరాత్మ దాకా అందరూ మనం చేసే ప్రతి పని చూస్తూఉంటాయని చెప్పింది. అంటే నీ అంతరాత్మని అడగవోయ్! నేనెవరో, నీకు తెలుసో తెలియదో చెబుతుందని ఒక విసురు విసిరిందన్నమాట. నీకు అంతరాత్మ ఉన్నదా అని ప్రశ్నించింది. తరవాత ధర్మాలు చెప్పింది. భార్యను భర్త ఎలా చూసుకోవాలో చెప్పింది. భార్య భర్తలో సగం అని చెప్పింది. నేడు భార్య భర్తలో సగమేంటి అంటున్నారు. భర్తలో సగం భార్య ఐతే, భార్యలో సగం భర్త కాదా? ఏమో తెలిసినవారు చెప్పాలి. అన్ని వేళలా పురుషుని ఉన్నతి, మంచిని కోరే భార్యను నిరాదరించడం, అవమానించడమేనని, అది తగదని హితవు చెప్పింది. ఇక్కడ భార్య కార్యేషు దాసి నుంచి కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభగా ఉంటుందోయ్! అటువంటి భార్యను పువ్వులలో పెట్టి పూజించుకున్నట్లు చూసుకోవాలి తప్పించి, నువ్వెవరో నాకు తెలియదనడం అవమానించడం సుమా అని హెచ్చరించింది. ఒక  దీపం తో మరొక దీపం వెలిగిస్తే రెండు దీపాలూ ఒకలాగే ఉన్నట్లు, నీ తనువు, నా తనువుతో కలియడం మూలంగా పుట్టిన కుమారుడు నీలా ఉన్నాడు, పోలిక చూసుకో అంది. నేటి కాలానికి సాక్ష్యాలుగా ఫోటోలు, వీడియోలు చూపినా నువ్వెవరో నాకు తెలియదు, ఇవన్ని ఒరిజినల్ కాదు, మార్ఫింగ్ చేయబడ్డవని అంటూ ఉంటే నిజాలకోసం డి.ఎన్.ఎ ఫింగర్ ప్రింటింగ్ చుట్టు తిరగాల్సి వస్తూ ఉంది. అది కూడా ఒక లేబ్ ఒకలాగ మరొక లేబ్ మరొకలాగా రిపోర్టులు ఇస్తున్నాయి, నేటికాలంలో. నీవు నన్ను పాణిగ్రహణం చేసిన మూలంగా, నీ మూలంగా, ఈ బాలుడు కలిగేడన్నది సత్య వాక్కు. సత్యవాక్కు ఎంత గొప్పదో నిరూపించి చెప్పింది. అప్పుడు రాజును సూనృతవ్రత అని సంబోధించింది, అంటే ఎప్పుడు సత్యాన్నే వ్రతంగా పలికేవాడా అని. బలేగా అందికదా, అబద్ధం మాట్లడుతున్నవాడితో. అంటే అబద్ధం చెబుతున్నావు మగడా అని ఎగతాళీ చేసింది. అప్పుడు చెప్పింది నేను ఉత్తమ రాజఋషి, మేనకల కుమార్తెను, నీలా అబద్ధం చెప్పడం అలవాటు, నాకు లేదు సుమా అని ఎత్తిపొడిచింది. అందుచేత నువ్వు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కోరుతుంది. సంభాషణలో ఎక్కడా తొట్రుపాటుగాని, భయంగాని, అసహజమైన మాటగాని కనపడదు. ఇప్పుడు ఆడ మగపిల్లలు మాట్లాడే దానిలో తొట్రుపాటు, అధికమైన పట్టుదల, తమ మాటే చెల్లాలనే మంకుతనమే కనిపిస్తున్నాయి. నా ఉద్దేశం అందరూనని కాదు, సమస్యలో చిక్కుకున్నవారు మాత్రమే. దీనికి దుష్యంతుడు సహజంగా నీవెక్కడ, నేనెక్కడ అని ఎక్కువ తక్కువలూ చూపించాడు. ఎక్కడో అడవిలో ఉండేదానివి, నేను మహారాజును నా మాట చెల్లుతుందన్న అహం కనపరిచాడు. ఇది నేటి రోజుల పిల్లలలోనూ చూస్తున్నాము, ఇటువంటి సందర్భంలో. అప్పటి వరకూ ధీరోత్తంగా వాదించిన శకుంతల మానవ సహజంగా బేలపడి, అయ్యో!, పుట్టగానే తల్లి తండ్రులచేత, ఇపుడు భర్త చేత విడువబడ్డానా అని బాధపడి, గుడ్ల నీరు కుక్కుకున్నదే తప్పించి, బేరుమని విలపించలేదు. తన కర్తవ్యం నెరవేర్చి, అది పూర్తి అయిన తరవాత మాత్రమే భగవంతుని పై భారం ఉంచింది. ఇప్పుడు అన్నీ ఇతరులపై భారం మోపేసి, స్వప్రయత్నంగా మానవ ప్రయత్నం, మానేస్తున్నారు. సత్యం మీద నమ్మకముంచింది. ఈ రోజులలో ఆకాశవాణి లాటి సాక్ష్యాలు దొర్కకపోయినా, దైవం మానుషరూపేణా అన్నట్లు, ఎక్కడినుండో ఒక చోటి నుండి, మనకు సహాయం లభించే సావకాశం ఉంటుంది, మన ప్రయత్నం నిజమైనపుడు, మనం ప్రయత్నం చేసే విషయం లో దోషం లేనపుడు, అబద్ధం లేనపుడు.

శకుంతల మానవ ప్రయత్నంగా చేయగలది అంతా చేసిన తరవాత ఇక దైవం మీద భారం వేసి వెనుదిరగాలనుకున్న సందర్భంలో ఆకాశవాణి పలికింది సాక్ష్యం, దుష్యంతుడు అప్పుడు ఒప్పుకొని శకుంతలను అక్కున చేర్చుకున్నాడు. ఈ గాంధర్వ వివాహ విషయం ఎవరికి తెలియదు కనక, జన బాహుళ్యానికి వెరచేను, అని చెబుతాడు.

ఈ సందర్భంలో శకుంతల ఉదాత్త,ధీర నాయిక శకుంతల గా చెబుతాను, దుష్యంతుని గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆకాశవాణి చెప్పకపోతే ఏమి చేసేదన్న ప్రశ్న రావచ్చు, బహుశః వీరుడైన కొడుకుతో యుద్ధం ప్రకటింపచేసేదేమో! శాకుంతలం చూసే వారి దృష్టి కోణాన్ని బట్టి కనపడుతుందేమో :). నాకిలా కనపడింది మరి. నేటి యువతులంతా శకుంతలలాటి ధీరోద్దాతులు కావాలని నాకోరిక.

మరొక చిన్న వివరణ.

అందరిలోనూ ఒక అనుమానం, ఏంటీ! శాకుంతలం ఇలా రాశారని. శాకుంతలం భారతం లోని ఉపాఖ్యానం. భారతం లో శాకుంతలం ఇలాగే ఉంటుంది. భారతం నుంచి తీసుకున్న శాకుంతలో పాఖ్యానాన్ని మహా కవి కాళిదాసు మార్పులు చేసి రాశారు. దానికి అభిజ్ఞాన శాకుంతలమని పేరు పెట్టేరు. నాయికను శృంగార నాయికగా చూపించారు. అది తెనుగునాటే కాదు ప్రపంచం మొత్తంమీద బాగా తెలిసిన శాకుంతలం. రెండూ శిరోధార్యాలే.మహాకవి శకుంతలను ధీరోద్దాత్త నాయకిగా చూపడం కంటే లలిత శృంగార నాయకిగా చూపడానికే ఇష్టపడ్డారు. అందుకు గాంధర్వ వివాహం తరవాత, మరలా కలిపేలోపు కధలో మార్పులు చేసి రాశారు. రెండూ శిరోధార్యాలే.అందులోనే ఉంగరం పోగొట్టుకోడం, మరలా చేపకడుపులో దొరకడం, దూర్వాసమహాముని శాపం వగైరా. ఇలాగే నలదమయంతుల కధ కూడా వేరుగా చెప్పబడింది.

స్వస్తి

ప్రకటనలు

16 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- ఉదాత్త,ధీర నాయిక శకుంతల

 1. చక్కటి వ్యాసం.

  ధీరోద్దాత్తనాయిక – ఈ ప్రయోగం తప్పండి.

  ధీరోదాత్త, ధీరలలిత, ధీరప్రశాంత, ధీరోద్ధత అనే విశేషణాలు నాయకులకు మాత్రమే వర్తిస్తాయి. నాయికలు స్వకీయ, పరకీయ, స్వకీయలో ఎనిమిది రకాలు.పరకీయ లో ముగ్ధ, మధ్య, ప్రౌఢ అని తిరిగి మూడు రకాలు.

  పైన చెప్పినది సంస్కృత నాటక పరిభాష.

  ధీరురాలైన నాయిక అని చెప్పుకోవచ్చు.

  • @రవి గారు,
   నా బ్లాగుకు స్వాగతం. తలకట్టు పెట్టేటపుడే అనుమానం వచ్చింది. పెట్టేశాను. చదువుకోలేదు, అందుకు కవి సమయాలు తెలియవు. పొరపాటు సరి దిద్దినందుకు సంతసం. ముందుగా ధీరోదాత్త నాయికగా మార్చా, తప్పుకదా అని ధీర, ఉదాత్త నాయికగా మార్చా. ఇది ఎడమ చెయ్యి తీసి పుర్ర చెయ్యి పెట్టుకున్నట్లుందని, మళ్ళీ ఉదాత్త, ధీర నాయికగా మార్చా. విషయం మీకు నచ్చి నందుకు సంతసం.
   ధన్యవాదాలు.

 2. snkr గారి కామెంట్ బాగుంది. చాలా చక్కగా రాసారండి ఈ టపా.మీ శైలి చాలా బాగుంటుందండి. నాకైతే ఎదో చదువుతున్నాట్టు ఉండదు. మీరు మామూలు కబుర్లు చెపుతూనే పురాణాలలో కథలు చక్కా గా చెపుతూ, నేర్చుకోవాల్సిన వన్ని highlight చేస్తారు. ధన్యవాదాలండి మీకు.

 3. కష్టాలు తొలగిపోవడానికి చేయవలసిన ప్రయత్నాల గురించి, శకుంతల కథ నాధారంగా బాగా చెప్పారు బాబాయిగారూ…మనం పురాణాల నుంచి నేర్చుకోవలసింది చాల వుంది. దురదృష్టవశాత్తూ మన పాఠ్యాంశాల్లో ఇలాంటివి అన్నీ లేకుండాపోయాయి.

  • @అమ్మాయి జ్యోతిర్మయి
   రామాయణ భారతా లు మత గ్రంధాలు అని మన సెకులర్ ప్రభుత్వం వారి అలోచన.దీని మీద స్పందించకపోవడం మన దురదృష్టం. పురాణాలనుంచి నేర్చుకోవలసినది నిజంగా చాలా ఉంది. విర్శ చేసుకుని చదువుకోవాలి. అక్కడే ఉంది అసలు కష్టం. చెప్పేవాడూ లేడు, వినేవాడు లేడు.నీ బాధ పంచుకున్నా.
   ధన్యవాదాలు.

 4. తాడిగడప శ్యామలరావు గారు ……సామాన్యులకు దైవం యెందుకు సాయపడటం లేదు? ఇది చాలా చిక్కు ప్రశ్న, బోలెడు వ్రాయవలసి ఉంది. సూక్ష్మంగా చెప్పాలంటే, అందరూ కర్మఫలం అనుభవిస్తున్నారు. ధర్మబలం, తపోయోగబలాలు కలవారిని ఆ బలాల రక్షిస్తున్నాయి. మనుజులకు కర్మమే దైవం……

  శర్మ గారు….ఈ రోజులలో ఆకాశవాణి లాటి సాక్ష్యాలు దొర్కకపోయినా, దైవం మానుషరూపేణా అన్నట్లు, ఎక్కడినుండో ఒక చోటి నుండి, మనకు సహాయం లభించే సావకాశం ఉంటుంది, మన ప్రయత్నం నిజమైనపుడు, మనం ప్రయత్నం చేసే విషయం లో దోషం లేనపుడు, అబద్ధం లేనపుడు…….

  • @anrdగారు,
   మంచి జరుగుతుందనే నమ్మకం ఒక ఆలంబం. పాసిటివ్ తింకింగ్ అంటున్నారు నేటివారు.
   ధన్యవాదాలు.

 5. కష్టేఫలె ..గారు అన్ని పోస్ట్ లు ఇంకా చదవలేదు. కానీ సూక్ష్మ మైన విషయాలని పట్టిస్తున్న మీ పోస్ట్ లు చాలా బాగున్నాయి ఆకాశ వాణి,అశరీర వాణి .. ఒక మాధ్యమం అనుకోవచ్చును కదా! తండ్రి ఎవరో నిరూపణ చేయాలి అనుకునే డి.ఎన్ ఏ టెస్ట్ లు ఈ కాలంలో నిజ నిర్ధారణ అయినప్పుడు అప్పటి కాలం లో ఆకాశ వాణి మాటలు కూడా
  అలాటి నిరూపణే అని అన్వయించుకుంటే మరిన్ని సందేహాలు తలెత్తవేమో అనిపించింది.
  snkr గారి వ్యాఖ్యతో నేను ఏకీభవించు తున్నాను .

  • @వనజగారు,
   ఇప్పటి కాలానికి డి.ఎన్.ఎ లు అప్పుడు ఆకాశవాణి. ఎటయినా న్యాయం జరగటం ముఖ్యం కదండి.
   ధన్యవాదాలు.

 6. అంతే కాదండోయ్ తార్పుడు గాళ్ళకి సప్పోర్ట్ చేసే వరాహ సంకర గాళ్ళు ఉన్న రాష్ట్రం మనది.దీన్ని కూడా లేక్కేసుకొని ఈ సంకర తొడుగు గాడికి సమాధానం ఇవ్వండి శర్మ గారు.

 7. పురాణపాత్రలపై ప్రజలకు అపారగౌరవం ఉన్నా, వాటి నంటి పెట్టుకొని ఉండే చమత్కారాలు సామాన్యులకు వాటిని మానసికంగా దూరంగానే ఉంచుతున్నాయి.

  శకుంతలకు ఆకాశవాణి సాక్ష్యం చెప్పింది. ఆకాశవాణి పలుకులు అనేక చోట్ల పురాణల్లో కనబడతాయి. ఈ రోజుల్లోనూ అన్యాయమైపోతున్న శకుంతలలున్నారు. వారికి యే ఆకాశవాణీ సాక్ష్యం చెప్పటం లేదు. ఈ ఆధునిక శకుంతలల్లో కూడా ముప్పాతికమువ్వీసం తొలిశకుంతలకుతీసిపోని పతివ్రతలే. కాని వారికి అన్యాయమే జరుగుతోంది.

  పాండవపత్ని పాంచాలీమహాదేవికి సాక్షాత్తూ పరమపురుషుడైన శ్రీకృష్ణభగవానుడు అనుగ్రహించి అక్షయవస్త్రప్రదానం చేసి రక్షణ కల్పించాడు. ఈ నాడు కూడా తమనుతాము రక్షించుకోలేని అసహాయస్థితిలో అబలలు దేవుడా రక్షించు అని ఆక్రోసిస్తూనే ఉన్నారు కాని వారికి యెటువంటి రక్షణా దొరుకుతున్న దాఖలాలు లేవే. నిత్యం యెంతమంది అబినవదుశ్శాసనులకూ, అభినవసైంధవులకూ, అభినవకీచకులకూ బలైపోతూనే ఉన్నారు.

  ఇలా యెందుకు జరుగుతోందంటే బోలెడంత వేదాంతం చెప్పవచ్చును. కాని, అమాయక దీన జనానికి కావలసినది రక్షణ కాని వేదాంతవాక్యప్రవచనం కాదు.

  పురాణాల్లో అద్భుతాలు ఉంటాయి. జీవితంలో యెందుకు ఉండటం లేదు అలాగున? ఇక్కడ శకుంతలను చూడండి. ఆమె ఒక అభాగ్యరాజపత్ని కావచ్చును. కాని ఆమె ఒక తపస్విని కూడా. దుష్యంతుడిని చూద్దాం. ఆయన నిజంగానే సూనృతవ్రతుడైన రాజు కావచ్చును. అప్పట్లో రాజులు తపశ్శక్తి సంపన్నులు కూడా. అయితే ఒక చిక్కు వచ్చింది. ఆయన సభాముఖంగా ప్రకటించినా సాధారణం జనం దానిని విశ్వసించటం సంశయాస్పదం. రాజభయం చేత నోరెత్తకపోవచ్చును. రాజుపై గౌరవంతో ఊరకొనవచ్చును. అంతే. అందుచత యీ ఘట్టంలో తపశ్శక్తి సంపన్నులైన దంపతులు దైవసహాయాన్ని చిత్తశుధ్ధితో ప్రార్థించారు తమతమ మనస్సులలో. అందుకే దైవం సహాయం అందించి వారిని సంరక్షించింది. ఇదీ సమర్థింపు, నా తోచినంతవరకు.

  ముందే చెప్పినట్లు సామాన్యులకు దైవం యెందుకు సాయపడటం లేదు? ఇది చాలా చిక్కు ప్రశ్న, బోలెడు వ్రాయవలసి ఉంది. సూక్ష్మంగా చెప్పాలంటే, అందరూ కర్మఫలం అనుభవిస్తున్నారు. ధర్మబలం, తపోయోగబలాలు కలవారిని ఆ బలాల రక్షిస్తున్నాయి. మనుజులకు కర్మమే దైవం.

  • @మిత్రులు శ్యామలరావుగారు,
   సత్యం మీద , భగవంతునిపై నమ్మకం తగ్గిపోతున్నాయి కనక మనకు ఇవి పని చెయ్యటం లేదేమోనండి. మీ ఆవేదన పంచుకున్నా.
   ధన్యవాదాలు.

 8. ఆకాలంలో ఆకాశవాణి సాక్ష్యం అంగీకరించిన దుష్యంతుల వంటి చక్రవర్తులున్నారు. మన కాంగ్రెస్ వృద్ధ దుష్యంతుడి మాటేమిటి? నెలరోజులవుతున్నా Hyderabad Forensic Labs ఆకాశవాణి పలకట్లేదేమిటి? ఏదో తారుమారవుతోందేమో అసలే మనది పట్టాభిరాం్‌లను కన్న, అంతులేని అవినీతితో జైల్లో వున్న మహామేతలకు ఓట్లేసి గెలిపించిన ఘనతవహించిన రాష్ట్రం మనది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s