శర్మ కాలక్షేపంకబుర్లు-మారుపేరు/ముద్దుపేరు/నిక్ నేమ్.

ముద్దు పేరు/మారుపేరు/ నిక్ నేమ్.

మొన్నీ మధ్య భారతం చదువుతోంటే శకుంతలోపాఖ్యానంలో భరతుడికి “సర్వదమనుడు”అని ముద్దు పేరున్నట్లు చూశా, అది అడవిలో ఉండే మునులు పెట్టేరు,  భరతుడికి.ముక్కుమూసుకుని తపస్సు చేసుకునే మునులే ఇలా ముద్దుపేర్లు, పౌరుషనామాలు పెట్టుకుంటే మనకి తప్పులేదనిపించింది. మా మిత్రులొకరన్నట్లు మీరు మాటంటే మాట మీద టపా రాసేస్తారా అన్నదాన్ని, నిజంచేస్తూ.

అమ్మతో మొదలెడదాం, అమ్మకి సహస్రనామాలు, అందులో నాకిష్టమైనవి కొన్ని ఉన్నాయ్,చెప్పను, నన్ను ఉడికిస్తారు, అందుకు చెప్పనన్నమాట. మరి అయ్యకి లేవా? అయ్యో! అయ్యకి కూడా సహస్ర నామాలండీ!! అయ్యకి సహస్రనామాలు లేవంటే ముందు కోపం వచ్చేది అమ్మకే. ఎవరినైనా ఏమైనా అను కాని అయ్యనేమన్నా అంటే అమ్మకి కోపం, ఎందుకంటే. అమ్మ మాత్రం శివుణ్ణి, రుద్రుణ్ణి చేయగలదు,రుద్రుణ్ణీ శివుణ్ణీ చేయగలదు. మరి అదీ తిరకాసు. అమ్మ అన్నది కదా అని అయ్యని మనం తక్కువ చేస్తే, చెవి మొదట మెలిపెట్టేది అమ్మే. ఇక చిన్ని కిష్టయ్యకి లెక్క లేనన్ని పేర్లు, నవనీత చోరుడు, మానినీ మానస చోరుడు, చెప్పుకుంటూపోతే ఈ టపా మొత్తం చాలదు. ఇక రామయ్య బుద్ధిమంతుడు కదా, మరీయనకీ జానకీ వల్లభుడు, దాశరధి, సీతాపతి వగైరా చాలా ఉన్నాయి. ఇక సీతమ్మకి, జానకి,అయోనిజ వగైరా చాలా ఉన్నాయి.మరి లచ్చిందేవిని చెప్పుకోకపోతే ఎలా చిన్నమ్మ కదా! చిన్నమ్మ, శ్రీ మహాలచ్చిమి, వగైరా వగైరా. ప్రతి నాయకుడు రావణుడికి, ఇది స్వయంగా శంకరుడు ప్రసాదించినదనుకుంటా, దశకంఠుడు వగైరా. మరి మా ప్రియమైన దేవుడు హనుమ కి మారుతి, అంజనీ పుత్రుడు, చిరంజీవి వగైరా. ఇలా మారుపేర్లు లేదా ముద్దు పేర్లు మనకు పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారమే, కొత్తది కాదు. మన వాళ్ళు పేర్లు కూడా, మనిషి ఆకారాన్ని బట్టి, చేసే పనిని బట్టి, మరి ఇతరంగా కూడా పేర్లు పెట్టేవారు. ఇది మరో సారి టపాలో చెప్పుకుందాం.

చరిత్రలో గాంధీ గారి అసలుపేరు మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ. కాని ఆ పేరు చెబితే ఈ యనెవరని అడగచ్చు. అలాగే సుభాష్ బాబుని నేతాజి అంటే వెంఠనే గుర్తు పట్టేస్తాం. దేశ భక్త అంటే కొండా వెంకటప్పయ్యపంతులని అందరికీ తెలుసు. మహర్షి అంటే మా తాతగారు బులుసు సాంబ మూర్తి గారని అందరికీ తెలుసు. ఇల్లా చాలా ఉన్నాయి. నేటి తెర వేల్పులుకి సహస్రనామాలన్నట్లు మారు పేర్లుంటున్నాయి. అసలు కొణిదెల శివ ప్రసాద్ గారెవరంటే? ఎవరో అనామకడు, కోన్ కిస్కా గొట్టంగాడనచ్చు, అదేనండీ చిరంజీవి అనండి, అబ్బో తెలియకపోవడమేంటీ అంటారు. పిల్లి గెడ్డపోడు ఒక రాజకీయనాయకుని ముద్దుపేరు/మారుపేరు. వేలు, వీరభద్ర రావు ఎవరికి తెలుసు? అదే సుత్తి వేలు, సుత్తి వీరభద్ర రావయితే తెలియని వారు లేరు.గెద్ద ముక్కు పంతులు మరొక ప్రఖ్యాతి వహించిన సినీ నటునికి మారుపేరు.

ఇక నేటి కాలానికొస్తే ఆబ్బో! చెబితే శానా ఉంది!! వింటే ఎంతో ఉంది శెబుతా ఇనుకోరా ఎంకట సామి!!! అని, మామిత్రుడొకరికి అసలు పేరు కంటే ముద్దు పేరంటే ఇష్టం, అసలు పేరు రాయకపోయినా ఎక్కడయినా బాధపడడు కాని ముద్దు పేరు రాయకపోతే మా కొండబాబుకి బలే కోపం వస్తుంది, అసలు పేరు ఆదిరెడ్డి లెండి. ఇతనికో అమ్మాయికి వినూష అని పేరు కాని అందరూ “గొమ”అని పిలుస్తారు. సంగతేమంటే గొ అన్నది ఆ అమ్మాయి మాతామహుల ఇంటిపేరు మొదటి అక్షరం, మ అన్నది మనవరాలు, మొత్తం కలిస్తే గొమ, అది వాడుకలో గోమా అయివూరుకుంది.. మాతమహులు ఈ అమ్మాయిని ఎక్కువగా ముద్దు చేసేవారు, అందుకీ అమ్మాయికి గొమ ముద్దు పేరు సార్ధకమైపోయింది.

టీచర్లకి, లెక్చరర్లకి, ప్రొఫెసర్లకి పెట్టే మారు/ ముద్దు పేర్లు బలేగా ఉంటాయి. ఇందులో నాకు అనుభవం తక్కువైనా కొన్ని మేమూ పెట్టేము కనక చెబుతా.మాకో లెక్చరర్ గారుండేవారు వారికి కొంగ పేరు, మెడపొడుగ్గా ఉండేది. మరో మాస్టారు ఎప్పుడు చూసినా టిఫిన్ దిబ్బరొట్టి తినేవారు, పాపం ఈయనకి అదే పేరు సార్ధకమైపోయింది. మరో మాస్టారి పెళ్ళానికి నోరెక్కువ అందుకీయన ప్రతి సారి “నేనేమన్నానే” అనేవాడు. అదేపేరు ఆయనకి పెట్టేశాం. గరుడన్ అని ఒక లెక్చరర్ కి పేరు పెట్టేం, ఆయన ముక్కు పొడుగ్గా ఉండేది.మా తెలుగు మాస్టారికి ముక్కుపొడుంపట్టని పేరు, మరో తెలుగు మాస్టారికి దిష్టిపిడతని పేరు, ఎందుకంటే అందరిని అలా దీవించేవారు. మా హెడ్ మాస్టారికి ఉత్సవ విగ్రహం అని పేరు, కదిలేవాడు కాదీయన, ఎక్కువగా పొట్టతో. మరో మాస్టారు జాక్సన్, ఈయనని జాకాల్ సన్ అనిపిలిచేవాళ్ళం. ఒక లెక్చరర్ గారు మాటాడితే ముందు యు నో అనేవారు, అదే ఆయన ముద్దు పేరు పెట్టేసేం.మరో మాస్టారు క్లాసులో కునికిపాట్లు పడేవారు ఆయనకి తరవాణీ మాస్టారు పేరు. డ్రాయింగు మాస్టారు పొట్టిగా ఉండేవాడు అందుకు బుడంకాయగారు పేరు.

మా స్నేహితుడొకడికి చిన్నప్పుడు లివర్ పాడయితే జమ్మి వారి లివర్ క్యూర్ వాడేరట అందుకు వాడికి జమ్మి నామం స్థిరమైపోయింది.మరో మిత్రుడు పొడుగ్గా ఉండేవాడు వాడికి హెచ్.డబల్యూ. లాంగ్ ఫెలో పేరు. మా క్లాస్ లో ఏకైక అమ్మాయి ఎర్రగా తడపలా ఉండేది, అందుకు తడప పేరు పెట్టేం.అమ్మో బలే తెలివయినదండీ! మరిప్పుడెక్కడుందో!!!జర్మనీలోనో, జపాన్ లోనో

మా వాళ్ళలో ఒకామె నల్లగా ఉండేది, ఆమెపేరు కాంతం, అందరూ నల్లకాంతం అనేవారు. అది కాస్తా మేము నల్లకంత చేసేశాం. మా అన్నయ్య గారబ్బాయిని బుజ్జి అనడం అలవాటు, ఒక సారి వాడి ఆఫీస్ కి వెళ్ళి బుజ్జి కావాలన్నా, ఆ పేరున్న వాళ్ళెవరూ లేరన్నారు. అసలు పేరు గుర్తు రాలా. ఇంటి పేరు చెబితే ఆయనాండీ! మా ఇన్ కం టాక్స్ ఆఫీసరు గారండి అని లోపలకెళ్ళి ఎవరో పెద్దాయన బుజ్జిగారు కావాలంటున్నాడని చెప్పేడట, మా వాడు పరిగెట్టుకొచ్చేసేడు. ఇక చిన్న పిల్లలకి, బుజ్జి పండు, చిన్న పండు, యెర్రపండు, యెర్రాడు, నల్లాడు, సత్తిపండు,చిన్న పండు,బంగారు కొండ, బాచాలకొండ మొగ పిల్లలికి,అమ్మతల్లి, కన్న తల్లి, చిన్నతల్లి, బుల్లితల్లి, బంగారుతల్లి,రసగుల్లా,చెగోడీ, జిలేబీ, పకోడీ,అమ్మలు,అమ్ములు, అమ్ముకుట్టి, నల్లపొణ్ణు,దెయ్యం,దొంగ ముఖంది,ఆడపిల్లలకి, ఇవి కొన్ని మాత్రమే.

ఇంతమందికి చెప్పేరు మీసంగతేంటి అంటారని తెలుసు, చిన్నప్పుడు ముద్దు పేర్లు చెప్పను, ఊ ! మీరేడిపిస్తారు, పెద్దయిన తరవాత తలపాగా జే.యి గారు, రమణారెడ్డి ముద్దు పేర్లు. కొన్నాళ్ళు ట్రేడ్ యూనియన్లో పని చేసేను అప్పుడు కింగ్ మేకర్ అని బిరుదుండేది.ఇప్పుడు మొన్న జిలేబీ గారు బ్లాగ్ గాంధీ అని నిక్ నేమ్ పెట్టేరు. అన్నట్టు మరిచిపోయా ఈ జిలేబీ నిక్ నేమ్ కదూ…..

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మారుపేరు/ముద్దుపేరు/నిక్ నేమ్.

 1. చాలా బాగుందండీ మీ ముద్దు పేర్ల ప్రహసనం…
  ఎపుడో మరో ఆర్టికల్ లో బ్లాగ్ మిత్రుల ముద్దుపేర్లు కనిపిస్తాయేమో!…:-)
  @శ్రీ

  • @ Rvss Srinivasగారు,
   నా బ్లాగుకి స్వాగతం,నిజమేనండీ! నాకయితే జిలేబీ గారో మారుపేరు పెట్టేశారు బ్లాగు గాంధీ అని. మిగతా వారికి ముద్దుపేర్లు పెట్టేంతవాడిని కానని మనవి.
   ధన్యవాదాలు.

  • @@వంశీ కమల్ గారు,
   నా బ్లాగుకు స్వాగతం. బాగుంది. ఇల్లాలే ప్రియురాలు లాగా మీకు ముద్దు పేరు అసలు పేరయ్యిందన్నమాట. సంతసం 🙂
   ధన్యవాదాలు.

 2. ఎన్ని ముద్దు పేర్లు..!!!
  అమ్మయ్య.. ఎవరికైనా పేర్లు పెట్టాలంటే మీ ఈ పోస్ట్ చూస్తే చాలు.
  చాలా పేర్లు పేరు పెట్టడం వెనుక కథలు ..తెగ గుర్తుకు వచ్చేసాయి. :)))
  అన్నట్టు నాకు అసలు ముద్దు పేరే లేదండీ!

  • @వనజ గారు,
   మీకు ముద్దు పేర్లు నచ్చినందుకు సంతసం. మీకు ముద్దు పేరు లేదంటారా? అయ్యో! పెట్టేయ్యమంటారా? 🙂
   ధన్యవాదాలు.

 3. భలే టాపిక్ మీద టపా పెట్టారండి. మీతో ఒక నిక్ నేమ్ గురించి చెపుతాను.
  గొదావరి జిల్లా లో బాగా పాపులర్ అయిన నిక్ నేమ్ మీకు తెలుసా. “బేబీ”
  ఎవరన్నా ఇంటికి వెళ్ళామనుకోండి..”బేబీ” అని పిలుస్తారు. లోపలనుంచి వచ్చే “బేబీ” (పాప) కోసం మనం ఎదురుచూస్తూ ఉంటాము. కాని లోపలనుంచి పెద్దావిడ ఒకావిడ వస్తుంది. అలాగే చాలా మందికి ఆ నిక్ నేమ్ ఉంటుంది.
  క్రిష్ణా జిల్లాలో ఇంకో నిక్ నేమ్/ముద్దు పేరు “బుడ్డి తల్లి” లేక “బుడ్డి”
  మీ నిక్ నేమ్స్ మాత్రం నాకు భలే నచ్చింది..బాగా నచ్చినవి-“KING MAKER” and “బ్లాగ్ గాంధీ”

  • అవునండీ. మాది తూగోజీ. మాతామహులది పగోజీ. నాకన్న యేడాది పెద్ద్దదయిన పిన్నిని అందరూ బేబీ అనేవారు. నేను ఆరు, తను యేడవతరగతీ కలిసి ఒకే బళ్ళో చదివాం. తనని చూడటం కోసం బడికి వేసవి సెలవులు ఇచ్చినప్పుడల్లా మా మాతామహుల యింటికి తప్పక వెళ్ళేవాడిని. నాకు అత్యంత ప్రాణస్నేహితురాలయిన ఆమె లేని లోటు నాకు నిత్యం బాధిస్తున్నది. ఎవరైనా యెక్కడైనా ‘బేబీ’ అనగానే నాకు నా బేబీపిన్ని ఠక్కున గుర్తుకు వస్తుంది!

   అన్నట్లు శర్మగారూ, మీరు మీ యొజ్జల ముద్దుపేర్లన్నీ బహిర్గతం చేసేసి, మీ ముద్దుపేర్లు మాత్రం చెప్పననేస్తున్నారే!

   • @శ్యామల రావు గారు,
    బేబీ పేరు మీద కొంత ఇబ్బంది ఉందండీ నాకూను, అందుకు చెప్పలేదు. ఇక నా ముద్దు పేర్లన్నీ చెప్పేశా. బడి చదువు రోజుల్లో నేనే హీరో. అప్పుడు ముద్దు పేర్లు లేవు. మరీ చిన్నప్పుడు ముద్దు పేర్లు చెబితే, మీరంతా ఆట పట్టిస్తారని….
    ధన్యవాదాలు.

  • @శ్రీ గారు,
   మీరు చెప్పినవి చెప్పడం కొద్దిగా డేంజరని చెప్పలేదు. మరోసారి చెబుతాగా. మానెయ్యను.జిలేబి గారు పెట్టేసేరండీ! ఆ పేరు. వాళ్ళ అవసరం కోసం కింగ్ మేకర్ పెట్టేరు లెండి అప్పుడు. సంతసం.
   ధన్యవాదాలు.

  • @ఫాతిమా గారు,
   మీరూ కొత్త పేర్లు పెట్టేశారా! కానివ్వండి, మీ అభినానాన్ని ఎందుకు కాదనాలి.సంతసం 🙂
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s