శర్మ కాలక్షేపంకబుర్లు-ఏకాగ్రత

ఏకాగ్రత

ఏకాగ్రత అంటే ఒక పని మీద దృష్టిని కేంద్రీకరించడం. నాకు తెనుగు తప్పించిమరో భాష రాదు. మీకు ఇంగ్లీష్లో చెప్పడం నా వల్ల కాదు కాని, ఎంగిలి ముక్కలు ఎవరో చెబితే విన్నా కాన్సన్ ట్రేషన్, అమ్మయ్యా! మీకు తెలిసేలా చెప్పేశానండీ!!! ఇది లోపిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో, బాగుంటే ఎలా ఉంటాయో చూద్దాం.

ద్రోణాచార్యుని వద్ద విద్యాభ్యాసం చేస్తున్నారు, కౌరవులు, పాండవులు. ఒక రోజు గురువుగారు చెట్టు చిటారు కొమ్మన ఒక చిలుక బొమ్మ పెట్టి, శిష్యులందరూ ఉండగా, ధర్మరాజును పిలిచి చెట్టు చివరనున్న చిలుక కంటిలో బాణం వేసి కొట్టాలి, ధనుర్బాణాలు తీసుకోమన్నారు. ధర్మరాజు బాణం ఎక్కుపెట్టేడు. ఏమి కనపడుతోందన్నారు, గురువుగారు.  చిలక కన్ను, చిలక, చెట్టు, మీరు అందరూ కనపడుతున్నారన్నాడు ధర్మరాజు. సరే నీవు పక్కకి తప్పుకోమని, దుర్యోధనుడిని పిలిచి అడిగితే, పాపం ఈ విషయంలో ధర్మరాజుతో ఏకీభవించి అదే చెప్పేడు.  ఇలా అందరూ అదే సమాధానం చెప్పేరు.  చివరిగా అర్జునుని పిలిచి, ప్రశ్న చెప్పి, ఏమి కనపడుతోందంటే, నాకు చిలక కన్ను తప్పించి మరేమీ కనపడటం లేదన్నాడు. సరే , బాణం వదలిపెట్టమన్నారు, గురువుగారు. అది తిన్నగా చిలుక కన్నులో గుచ్చుకుపోయింది. గురువుగారు అశ్చరమూ, ఆనందమూ పొందేరు.  మరొక సందర్భంగా చీకటిలో అర్జునునికి భోజనం పెట్టవద్దని చెప్పేరు, కుంతికి. పొరపాటున ఒక రోజు అర్జునుడు భోజనం చేస్తుండగా దీపం ఆరిపోయింది.  అలాగే భోజనం పూర్తి చేసిన అర్జునునికి ఒక ఆలోచన వచ్చింది. దీపం లేకపోయినా భోజనం చేసినట్లు, చీకటిలో లక్ష్యం ఛేదించలేమా, అని ఆలోచన వచ్చింది. లక్ష్యం బాణం ఉంటే శబ్దంతో లక్ష్యాన్ని ఛేదించే విద్య తనకు తాను నేర్చుకోవడం ఆరంభించాడు.  దీనిని బట్టి మనకు తెలిసినది ఏకాగ్రత ఉన్నపుడు, ఏపని చేస్తున్నా సరే! లక్ష్యం మీద దృష్టినిలిపేతే ఫలితం ఇలా ఉంటుంది.

ఈ కోవలో మరో ఉదాహరణ, ధృవుడు, చిన్న పిల్లవాడు, సవతి తల్లి, తండ్రి తొడమీద కూచోవద్దన్న మాటకి, తల్లినడిగితే, శ్రీ హరిని ప్రార్ధించమంది. బయలుదేరాడు, అదృష్టం కలిసొచ్చి నారదుడు మంత్రోపదేశం చేశారు. ఆరు నెలలలో ధృవుడు శ్రీ హరి దర్శనం పొంది, చిరస్థాయిగా ఈ సమస్త విశ్వం తన చుట్టూ తిరిగే పదవికి చేరిపోయాడు.బహుశః ఇంత తక్కువ కాలం లో భగవంతుని దర్శనం మరెవరికీ కాలేదు.

మరొకటి ప్రహ్లాదుడు,

పానీయంబులు ద్రావుచున్, కుడుచుచున్, హాసలీ
లా నిద్రాదులు సేయుచున్ దిరుగుచున్ లక్షింపుచున్ సంతత
శ్రీ నారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సం
ధానుండై మఱచెన్ సురారిసుతు డేతద్విశ్వమున్ భూవరా! ………………  భాగవతం.

ఏ పని చేస్తున్నా లక్ష్యమైన శ్రీ హరిని స్మరించడం మానలేదు, ప్రహ్లాదుడు. విచిత్రం ఏమంటే భక్తుల పేర్లు చెప్పేటపుడు మొదటగా చెప్పేది ప్రహ్లాదుని పేరే, తరవాత చెప్పేది నారదుడు. ప్రహ్లాదుడు రాక్షస వంశం లో పుట్టినా భక్తులలో అగ్రగణ్యుడయాడు. చూశారా ఏకాగ్రత ఎంత గొప్ప పరిస్థితి తెచ్చిపెట్టిందో!!!

ఇంకా చెప్పుకుంటూ పోతే, ఒక మహారాజు ఇంద్రియ సుఖం కోసం వేశ్యా గృహం లో ఉండిపోయాడు. శివరాత్రి అని గుర్తువచ్చి లింగాకారం కోసం వెతికితే ఎదురుగా నిద్రిస్తున్న వేశ్య కుచం కనపడింది. వేశ్య కుచాన్ని శివలింగంగా భావించి పూజించిన రాజు ఏకాగ్రతకి మెచ్చేడు, శివుడు. ఆ కుచం లోనే దర్శనమిచ్చాడు.  అలాగే మేక పెంటికలో శివలింగాన్ని చూసి అర్చించిన వారికి దర్శనమిచ్చాడు శివుడు.  ఇది వారి ఏకాగ్రతకి సూచన మరియు ఫలితం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో! ఎన్నో!! ఎన్నెన్నో!!!

నేటి కాలం చూద్దాం. ప్రతి విజయ గాధ వెనుక, దానికి కారకులైనవారియొక్క ఏకాగ్రత కనపడుతూంది. చూస్తే చాలా కనపడతాయి. సర్వశ్రీ నారాయణమూర్తి, అజిత్ ప్రెంజీ, ధీరూ భాయ్ అంబానీ,కొన్ని మాత్రమే, ఇలా ఈ మధ్య కాలపు విజయాలు బాగా విశేషంగా కనపడతాయి.  మరొక సంగతి, కొంతమంది ఏకాగ్రత ఎలా ఉంటుందంటే, భార్య భోజనం చేద్దురు గాని రండి అంటే భోజనం చేసిన తరవాత చేయి కడుక్కోవడం కూడా గుర్తులేని వారుంటారు. చొక్కా తొడుక్కోడం కూడా మరచి బయటికి వెళ్ళిన వారున్నారు. మనం వీరిని ఆబ్సెంట్ మైన్డెడ్ ప్రొఫెసర్లు అంటాము, కాని నిజంగా వారు ఆ ఏకాగ్రతలో ఇక్కడ జరుగుతున్న విషయాలు వారి మనసుకు చేరవు. ఇటువంటి వారు మనకి సామన్యులలోనూ కనపడతారు, మనం గుర్తించలేం, గుర్తించినా పిచ్చి వాడంటాం. వీరంతా అర్జునుని కోవలోని వారు. మరొకరకం వారు మనతో తిరుగుతారు, కబుర్లు చెబుతారు, సినిమాలు, షికార్లు, ఏమయినా రెడీ అంటారు, కాని వీరి మనసు ఎప్పుడూ లక్ష్యం మీదే ఉంటుంది. వారి సమయం చూసుకుని కనపడకుండా పోతారు, వీళ్ళేరీ అని మనం చూసుకునే లోపు మళ్ళీ వచ్చేస్తారు. వీరు మన ప్రహ్లాదుని వంటి వారు. నేటి కాలం లో రెండవ సారి చెప్పిన లాటివారు ఎక్కువ మంది కనపడుతున్నారు. మరొక విశేషం స్త్రీలలో ఇది బాగా కనపడుతోంది. ఇది శుభ సూచకం కూడా. తిరిగి తిరిగి మనం మనసు దగ్గరికి వచ్చాం. మనసు ఈ విషయం మీద చేసే చిత్రము, ఈ విషయానికున్న రెండవ పార్శ్వము రేపు చూద్దాం,టపా పెద్దదయిపోతూ ఉంది మరి.. .

 

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఏకాగ్రత

  • @అమ్మాయ్ జ్యోతిర్మయి,
   నచ్చితేనే మొదలు పెట్టడం జరుగుతుంది,నచ్చినదయితే బాగానే ఉంటుంది, కాని మనసు కోతి లాటిది, ఇది వదిలేసి మరొకదానిని పట్టుకుంటుంది, అదీ చిక్కు.
   ధన్యవాదాలు

 1. మీకు ఇంగ్లీష్ వచ్చు
  ఆ విషయం నాకు తెలుసు
  హా హా హా!!
  concentration/ఏకాగ్రత మీద మీ టపా చాలా నచ్చింది.
  నాకు కూడా ఏ పిచ్చి పడితే ఆ పిచ్చే అంటుంటారు ఇంట్లో!
  నేను దాని కొంచెం polish చేసి, నాకు focus ఎక్కువ అని చెపుతూ ఉంటాను.

 2. ఎంత చక్కగావున్నదో. నిన్నటి పొస్ట్ లో ఎక్కడిదో తెలుపమన్నాని ఈరోజు భాగవతం అని చక్కా తెలిపినారులావున్నది.
  ఒకటి మటుకు నిజం మీశైలి మటుకు ప్రత్యేకం.

  • @
   రమేష్ బాబు గారు,
   సాధారణంగా టపా రాసేటపుడు ఆ జాగ్రత్తలు తీసుకుంటా, మీరన్నట్లు ఆ పద్యం ఎక్కువగా తెలిసినది కదా అని అశ్రద్ధ చేశా.మంచి ఎవరు చెప్పినా తీసుకోవాలి కదండీ!
   నాకో శైలి ఉందంటారా!అది ప్రత్యేకమంటారా?
   మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

 3. * పోస్ట్ చాలా బాగుందండి.
  * మీకు ఇంగ్లీష్ అంతగా తెలియదంటే నేను నమ్మటం లేదండి.
  * ధానుండై మఱచెన్ సురారిసుతు డేతద్విశ్వమున్ భూవరా! ……………… భాగవతం.
  * ” భాగవతం ” అన్న పదాన్ని వాక్యానికి దూరం జరిపేసేరండి…. ముందు జాగ్రత్తతో..
  * చుట్టుప్రక్కల పదాలను కూడా కలుపుకుని వాక్యాన్ని చదివేసే నాలాంటి వాళ్ళుంటారనే ముందు జాగ్రత్తతో…

  • @anrd
   అనురాధ గారు,
   ఇక మిమ్మల్ని అలా పొడి అక్షరాలలో పిలవడం నాకు నచ్చలేదు. మీ పెఋతోనే పిలుస్తున్నా.
   టపా నచ్చినందుకు సంతసం.
   బట్లర్ కి కూడా ఇంగ్లీష్ వస్తుందండీ! 🙂
   సాధారణంగా టపా రాసేటపుడు ఆ జాగ్రత్తలు తీసుకుంటా, ఇది వ్యాఖ్య, ఇందులో నాకు చోటు తగ్గింది, అదీగాక సరి చూసుకోలేదు, అదన్నమాట. కామెడీ ఆఫ్ ఎర్రర్స్.
   ధన్యవాదాలు.

 4. సార్, ఏకాగ్రత ఎంత గొప్పదో ఏకాగ్రతగా బుద్దిమంతురాలైన విద్యార్దినిగా చదివాను, ఇవి కాలక్షేపం కబుర్లు ఎలా అవుతాయి. చాలా మంచి విషయాలు. దిక్కుమాలిన టి.వి. చుసేకన్నా మీ పోస్ట్ చదివితే నా లాంటివారికి ఎంత ఉపయోగమో. అందుకే అన్నారు శర్మగారి మాట చద్దిమూట అని.

  • @ఫాతిమా గారు,
   మీరు తెనుగులో వ్యాఖ్య రాసినందుకు చాలా ఆనందంగా ఉంది.మీకు ఏకాగ్రత ఉంది, ఈ కబుర్లతో అది మరికొంచెం పెరిగితె ఆనందం.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s