శర్మ కాలక్షేపంకబుర్లు-స్థితప్రజ్ఞత్వం

స్థితప్రజ్ఞత్వం.

నిన్న ఏకాగ్రత గురించి మాటాడుకున్నాం. ఇప్పుడు ఏకాగ్రత తప్పితే జరిగేదేమిటో,ఎలా, ఎందుకు ఏకాగ్రత తప్పుతుందో చూద్దాం. ఈ ఏకాగ్రత తప్పకుండా చూసుకుంటూ, ప్రలోభాలకు లోనుకాకుండా లక్ష్యం మీద దృష్టివుంచి కష్టాలను తప్పించుకుంటూ, లక్ష్యం చేరడమే, స్థితప్రజ్ఞత్వమంటే. నిన్ననంతా స్థితప్రజ్ఞత్వం సాధించిన వారి విజయాలు చూసాంకదా. ఈ వేళ దాన్ని తప్పి, జారిపోయిన వారి పరిస్థితి, ఎందుకలా జారిపోయారో, ఎక్కడ తప్పు చేశారో, ఇటువంటి తప్పులు మనం ఎందుకు చేయకూడదో చూద్దాం.

ఒక మహారాజు పేరు భరతుడు, అజనాభం అనే దేశాన్ని పరిపాలిస్తుండేవాడు, భార్య పంచజని వల్ల ఐదుగురు పుత్రులు కలిగేరు. “అటమున్న నజనాభంబను పేరంగల వర్షంబు భరతుండు పాలించుకతంబున భారత వర్షంబునా బరగె” అజనాభం అని పేరున్న దేశం భరతుడు పరిపాలించడం మూలంగా భారతదేశం అయిందన్నారు, పోతనగారు భాగవతంలో. ఈయన ధర్మ బద్ధంగా, ఏబది లక్షల వేల ఏళ్ళు ( ఈ సమయం భాగవతం లో ఉన్నది )పరిపాలన చేశాడు, చివరికి అంతా పుత్రులకిచ్చి, సాలగ్రామ శిలలకి ప్రసిద్ధి కాంచిన గండకీ నది ఒడ్డున ఉన్న పులహాశ్రమానికి చేరేడు, తపస్సు చేసుకోడం కోసం.. తపస్సు నిరాటంకంగా చేసుకుంటున్నాడు. ఒక రోజు స్నానం చేసి, మొలలోతు నీటిలో, ప్రణవం ఉపాసన చేస్తుండగా, ఒక నిండు చూలాలయిన లేడి నీరు తాగడానికి వచ్చింది. నీరు తాగుతుండగా, దగ్గరలో ఒక సింహం భయంకరంగా గర్జన చేసింది. లేడి తుళ్ళి పడి, ఎగిరి ఒక గంతులో ఆవలి ఒడ్డుకు చేరే ప్రయత్నంలో, కడుపులోని పిల్ల జారి నీటిలో పడింది, ఒడ్డున కిందపడి తల్లి లేడి చనిపోయింది. ఈ సందర్భంగా కళ్ళు తెరచి చూచిన భరతునికి నీటిలోని లేడిపిల్ల కనపడి, అయ్యో! ఇప్పుడే పుట్టిన పిల్ల, ఇది ఏ కౄరమృగానికయినా ఆహారం కావచ్చని, ప్రాణ రక్షణ తప్పుకాదని, దానిని రక్షించి, ఆశ్రమానికి తీసుకు వచ్చి సాకసాగాడు. ఈ లేడి పిల్లని బయటికి వదిలితే దేనికయినా అహారమయిపోతుందని, ఆశ్రమంలోనే ఉంచి, దానితో ఆడుతూ, కాసేపు మెడల మీద ఎక్కించుకుని, కొద్దిసేపు గుండెల మీద పడుకోబెట్టుకుని బుజ్జగిస్తూ, ముద్దు చేస్తూ, పూజ చేసుకునేటపుడు, అన్ని పనులు చేసేటపుడు లేడిపిల్లను దగ్గరుంచుకుంటూ, దానికి పరిచర్యలు చేస్తూంటే, పూజ, ధ్యాన, జపాలు వెనక పట్టాయి. ఒక్కొకపుడు లేడిపిల్ల కొమ్ములతో పొడుస్తూ, మూతితో నాకుతూ, గిట్టలతో దువ్వుతూ భరతునితో ఆడుకునేది. ఇలా భరతుడు లేడి పిల్లతో ఆటపాటలలో, భగవత్ ధ్యానం, జపాలు బాగా వెనకపట్టేయి. ఇలా నడుస్తుండగా ఒక నాడు, ఈ పెద్దదయిన లేడి ఒక రోజు అడవిలోకి పారిపోయింది. అదిమొదలు భరతుడు లేడికి ఏమయిందో ననే ధ్యాసలో సర్వం మరచి, అయ్యో! తల్లి చచ్చిన బిడ్డను పెంచాను, పెద్దదాన్ని చేశాను, ఈ లేడి ఎటుపోయిందో, దానికేమయిందో అని మళ్ళీ లేడితో ఆడుకోగలనా, జపం చేసుకునేటపుడు వెనకనుంచి వచ్చి కుమ్మేది, కోపగిస్తే వెళ్ళిపోయేది. ఇలా మళ్ళీ ఆడుకోగలనా, ఆ ఆనందం పొందగలనా అనే అలోచనలో ఉండిపోయాడు, జపతపాలు పోయాయి. ఒక నాడు లేడి తిరిగివచ్చింది, భరతునికి అంత్యకాలమూ వచ్చింది. లేడిని చూస్తూ ప్రాణాలు వదిలి, మరలా ఆ లేడి కడుపున జన్మించాడు. లేడిగా పుట్టినా పూర్వజన్మ పుణ్య ఫలం వల్ల విషయం గుర్తుకొచ్చి ఇలా వాపోయాడు.

రాజులు ప్రస్తుతింప వసురాజ సమానుడనై తనూజులన్
రాజులు చేసి తాపసుల రాజఋషీంద్రు డటంచు బల్కగా
దేజమునొంది యా హరిణిదేహము నందుల బ్రీతిజేసి నా
యోజ చెడంగ నే జెడితి యోగిజనంబులలోన బేలనై……భాగవతం.స్కందం-5.శ్వాసం-1…117

ఇక్కడికాపేద్దాం, కధ పెద్దది, విషయానికి ఇంతవరకు సంబంధం కనక, మిగిలినది మరొకమారు చెప్పుకుందాం. ఇది జడభరతుని కధే, భరతుడు జడభరతుడెందుకయ్యాడో తరవాత కాని తెలియదు.

మరొక ఉదాహరణ. విశ్వామిత్రుడు రాజర్షి, తపస్సు చేసుకుంటున్నారు. తపోభంగం చేయమని మేనకను పంపేడు దేవేంద్రుడు. మేనక హొయలుకు వివశుడై విశ్వామిత్రుడు, మేనకతో కాపరం చేసేరు. తపోభంగమైపోయింది. శకుంతల కలిగిన తరవాత మేనకను వదలిపోయారు, విశ్వామిత్రుడు.

ఒక సారి సింహావలోకనం చేద్దాం. మహారాజుగా పుట్టి ధర్మబద్ధంగా పరిపాలన చేసి, చివరికి రాజ్యం కొడుకులకప్పగించి ఆశ్రమానికి తపస్సుకు వచ్చాడు భరతుడు. తల్లి చనిపోయిన లేడి పిల్లను రక్షించాడు. తప్పుకాదు. తరవాత ఆ లేడిదే లోకం గా బతికి, దానితో ఆటపాటలే లోకమనుకున్నాడు. అది అడవిలోకి పారిపోతే బాధపడిపోయాడు. రక్షించి తీసుకొచ్చి దాని దారిన దానిని వదిలేయచ్చు, వదలలేదు, పెద్దదయిన తరవాత వదిలేశాడా, లేదు, మమత పెంచుకున్నాడు. అది పారిపోయినపుడేనా వదిలించుకున్నాడా? లేదు. మమత పెంచుకుని దానిగురించి తపించాడు. తపస్సు, తన అసలు లక్ష్యం మరిచిపోయాడు. మనసెంత చిత్రంచేసి అధోగతికి తోసిందో! లేడిగా జన్మించిన తరవాత ఏమని బాధపడ్డాడో చూడండి. సాటి రాజులచే దేవేంద్ర సమానుడవని పొగిడబడినవాడిని, కొడుకులను రాజులుగా చెసిన వాడిని.. ఋషీంద్రుడవని తాపసులచే స్తుతింపబడినవాడను, అయ్యో! లేడి మీద మోహంతో నా తపస్సు చెడకొట్టుకుని భ్రష్టుడనయ్యానే అని బాధ పడ్డాడు. నిజంగా, రాజ్యం, భోగభాగ్యాలు, భార్యా పిల్లల మీద మోహం తెంచుకున్నవాడు, యీ లేడి పిల్లపై మోహం పెంచుకున్నాడు. కాలమాగదుకదా. ఇక విశ్వామిత్రుడు అయ్యో! సంసారంలో పడి,పంచేంద్రియాలకు లొంగి, తపస్సు భగ్నం చేసుకున్నానని చింతించి మళ్ళీ తపస్సుకి వెళ్ళి, కోపాన్ని, ఇంద్రియాలను జయించి బ్రహ్మ ఋషి అయ్యారు, ఇది కూడా మనసు చేసిన చిత్రంకదా. ఏకాగ్రత తప్పి స్థితప్రజ్ఞత్వం లోపించిందికదా.

నేడు మన కాలానికొస్తే తొమ్మిది నెలలకితం, పూజ, జపం, అనుష్ఠానం చేసుకుని, రామాయణ, భారత, భాగవతాల్లో ఏదో ఒకటి తీసుకుని, ఒక ఘట్టం చదువుకుని ఇంట్లో వాళ్ళకి చెప్పి అందులో అందాలు వివరించి, ఖాళీ సమయంలో నామ పారాయణ చేసుకునే వాడిని. ఇప్పుడేం చేస్తున్నా. కంప్యూటర్ ముందు గంటల తరబడి కూచుని, ఏదో రాసి, అది ప్రచురించి, ఎవరు చదివేరు, ఎవరు చదవలేదు అని చూసుకుంటూ, మెయిళ్ళు చూస్తూ, కావలసిన వారు పలకరించలేదని బాధ పడుతూ, ఎవరిమీదో మమత పెంచుకుంటూ, ఏంటిది? వారేమయినా పలకరించేరా? లేదే? మరెందుకు? సమాధానం లేని ప్రశ్న. జడ భరతునిలా అయిపోవటంలేదూ? సత్వ గుణం నుంచి రజోగుణం లోకి దాని నుంచి తమో గుణం లోకి జారిపోతున్నానా లేదా. స్థిత ప్రజ్ఞత్వం లేక కదా. వీటిని అధిగమించలేకపోతున్నా. ఇది మనసు చేసే చిత్రమనీ తెలుసు, కాని తప్పించుకోలేకపోతున్నా.

కొంతమంది ఇంద్రియ సుఖాలకి లొంగిపోయి తమ తమ లక్ష్యాలు పాడు చేసుకుంటున్నారు. సినిమాలు షికార్లు చేస్తూ చదువు వెనకబెట్టుకుంటున్నారు. అలాగే వస్తువులతోనే ఆనందం ఉన్నదని, వస్తువులు పోగేసుకుంటున్నారు, అయిన వారిని పలకరించటం కూడా లేదు. కొంత మంది డబ్బే సర్వస్వం అనుకుని సంపాదనలో పడి ఇతర విషయాలు, పెళ్ళాం/భర్త పిల్లలు ఇతర విషయాలు మరిచిపోతున్నారు. ఇవి ముఖ్యం కాదన్న సమయం వచ్చేటప్పటికి ఎవరూ మిగలటం లేదు, కష్ట సుఖాలు పంచుకోవడం మాట దేవుడెరుగు, మాట్లాడేందుకు కూడా. మనసు వద్దన్న పని చేయడానికి ఉత్సాహం చూపుతుంది. దానిని బుద్ధి ద్వారా అరికట్టి, మనసుకు మంచి అలవాటు చేస్తే తద్వారా స్థితప్రజ్ఞత్వం సంపాదించచ్చు.మనసుకి అలవాటు చేయాలి.

జడ భరతుని గురించి రాయాలని అనుకున్నా, ఈ లోగా anrd అనూరాధ గారు రాశారు. నేను రాద్దామనుకున్నా మీరు రాశారు బాగుందన్నా. దానికామె మీరూ రాయండి అన్నారు. ఇది నా కధకి దగ్గరగా ఉన్నది కనక, నెగెటివ్ విషయాలు చెప్పడం ఇష్టంలేక ముందు విజయాలు చెప్పి ఆ తరవాత అపజయాలు ఎలా ఉంటాయి, వాటికి కారణాలు చెప్పేను. దీనికి ప్రోత్సాహం ఇచ్చిన anrd అనూరాధ గారికి ఈ రెండు టపాలు అంకితం. ఈ వ్యాసంగం నుంచి విముక్తి దొరికే రోజు దగ్గరలోనే ఉంది.

స్వస్తి

 

22 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-స్థితప్రజ్ఞత్వం

  • @అమ్మాయ్ జ్యోతిర్మయి,
   ఈ భవ బంధాలొకపట్టాన తెగవమ్మా! కాలమే నిర్ణయిస్తుంది.
   ధన్యవాదాలు.

 1. ఈ వ్యాసంగం నుంచి విముక్తి దొరికే రోజు దగ్గరలోనే ఉంది.
  ఎలాగు మీకు బ్లాగ్ గాంధి అన్న బిరుదు వున్నది అంటున్నారు కాబట్టి సత్యశోధన లాంటి వచనాలు మాకు ఇస్తూ వుండండి.

  • @మిత్రులు రమేష్ బాబు గారు.
   చిరాకొచ్చినపుడు, ఇబ్బందులు కలిగినపుడు, ఇలా అనిపిస్తుంది,
   ఏదీ మన చేతులో లేదు కదండీ!
   ధన్యవాదాలు.

 2. నవమాసమ్ముల నాడు భాగవత ఙ్ఞానమ్మింటికే హద్దుగా
  వివరింపంబడె శర్మగారు ! యిపుడో వేవేల ‘జాలర్లు’ నే
  డవగాహంబున మీ టపాలు జదివీ , యందుండి పౌరాణిక
  స్థవనీయామృత ఘట్టముల్ దెలిసికో జాలంగ మేలే గదా!
  —–సుజన-సృజన

  • @లక్కాకుల వేంకట రాజారావు గారు,
   ముత్యపు చిప్ప స్వాతి చినుకు కోసం ఎదురు చూస్తుంది. ఆ చినుకు లోపల పడితే ఆనందం, ముత్యమౌతుంది. మీ వ్యాఖ్య స్వాతి చినుకు లాటిది.ఆనందం.
   ధన్యవాదాలు.

 3. పోస్ట్ చాలా బాగుంది. చాలా విషయాలు తెలుసుకున్నాము. ధన్యవాదములు..
  ఈ వ్యాసంగం నుంచి విముక్తి దొరికే రోజు దగ్గరలోనే ఉంది.
  ఇదే నచ్చలేదు.

 4. *కంప్యూటర్ ముందు గంటల తరబడి కూచుని, ఏదో రాసి, అది ప్రచురించి, ఎవరు చదివేరు, ఎవరు చదవలేదు అని చూసుకుంటూ, మెయిళ్ళు చూస్తూ, కావలసిన వారు పలకరించలేదని బాధ పడతూ*
  శర్మగారు,

  ప్రతి మనిషి తనని ఇతరులు ప్రేమించాలి అని, ప్రత్యేకంగా గుర్తించాలని, తనను అర్థం చేసుకొనే వాళ్లు కావాలని (unconditional love) జీవితాంతం తనకు తెలియకుండానే కోరుకొంట్టూ,వెతుకుతూంటాడు. మీరు వాస్తవం గుర్తించారు.

 5. సర్ ! నాకు వ్యాఖ్య ఎలా వ్రాయాలో అర్ధం కావటం లేదు. మీ అభిమానానికి ఎంతో ఆనందంగా ఉంది. కానీ, మీ అంతటి పండితులకు నేను ప్రోత్సాహం ఇవ్వటం ఏమిటండి. మీవంటి పండితుల ద్వారానే నాబోటి వాళ్ళం ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నాము. మీరు నాలాంటి సామాన్యులకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు.

  ఈ టపాలు నాకు అంకితం ఇవ్వటం అంటే ఆశ్చర్యంగా ఉంది. నేను ఒక సామాన్య వ్యక్తిని. ఈ రెండు టపాలను , మనం భగవంతునికి అంకితం ఇవ్వటమే సమంజసంగా ఉంటుందండి . సర్వాంతర్యామియైన దైవానికే ఈ రెండు టపాలు అంకితం.

  ఈ వ్యాసంగం ద్వారా మీరు ముందుముందు మరెన్నో మంచి విషయాలను అందరికీ తెలియజేయాలని మనస్పూర్తిగా భగవంతుని కోరుకుంటున్నామండి..

 6. నాకు తెలియని విషయాలు ఎన్నో మీ బ్లాగు ద్వారా తెలుసుకుంటున్నాను తాతగారు.

  • @అమ్మాయ్!లాస్య రామకృష్ణ,
   నాకిలా అనటం అలవాటు, ఏమనుకోవద్దు, రెండు నెలలుగా బ్లాగులో కనపడటం లేదు, బాగున్నావమ్మా! నచ్చినందుకు
   ధన్యవాదాలు.

 7. సర్, ఏకాగ్రత వల్లా బుద్ధి మారదు కదా, ఏకాగ్రత లేని వారు తాము చేసేపనులలో కొంత నష్టం తెచ్చుకుంటారు, ఇక్కడ భరతుడు ఏకంగా తన జీవన శైలినే కోల్పోయాడు. తనకు లోపించింది ఏకాగ్రత కాదనుకుంటా మనసు మరలటం, ద్యాస మరలటం. ఇది జీవన విదానం తెచ్చే మార్పు కాదంటారా? సర్, మీతో చర్చించే అంతటి దానను కాను, నా కున్న చిన్న సందేహం అంతే.

  • @
   ఫాతిమా గారు,
   ఇక్కడ భరతుడు భోగభాగ్యాలు వదలుకుని వచ్చి చిన్న వలలో పడి లక్ష్యం మరిచిపోయాడు, అంటే ఏకాగ్రత కోల్పోయాడు, తద్వారా స్థితప్రజ్ఞత్వం లోపించింది.అనుమానం తీర్చుకోవాలి.నాకు తెలిసినంతవరకు చెప్పేను.
   ధన్యవాదాలు.

 8. శర్మగారు, స్థితప్రజ్ఞత నాదృష్టిలో ఖచ్చితముగా నేటి కాలానుగుణముగా ఇదే. తెలుసుకున్నాము.తెలిసినది మన పాత్ర ఈలోకం నుంచి ఉపసంహరిచే ముందు తెలిసినది పదుగురితో పంచుకుందామనుకుంటున్నాము.ఆస్తులు వారసులకు విజ్ఞానం సర్వులకు.
  ఒక వేళ తప్పుగా అనిపిస్తే మన్నించగలరు.

  • @మిత్రులు రమేష్ బాబు గారు.
   ఒక చిన్న సవరణ కి నా ప్రతిపాదన. ఎంతిచ్చినా ఇంతే ఇచ్చావేమంటారు.మన పరం కోసం కొంత దానం కూడా….
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s