శర్మ కాలక్షేపంకబుర్లు-చిరాకు/విసుగు.

చిరాకు/విసుగు.

“ఏంటోనోయ్! వెధవ బతుకు, పొద్దుటలేచి స్నానం చేసి, టిఫిన్ చేసి బైక్ మీద పడుతూ లేస్తూ, ట్రాఫిక్ లో భరత నాట్యం, కధాకళి చేసి ఆఫీస్ కు చేరుకుని రోజూ చూసే ఆ దేభ్యం మొహాన్నే చూస్తూ, ఆవే తిట్లు రోజూ తింటూ, బతుకు నరకమైపోతూ ఉంది” నరహరి గోల,విసుగు, చిరాకుతో. “నిజమే! నేనే హాయిగా కాలుమీద కాలేసుకుని కూచున్నట్లు మాట్లాడతారేం. తెల్లరగట్ల లేచి ఇంటి పని, వంట పని చూసుకుని పిల్లల్ని, మిమ్మల్ని లేపి కూచోబెట్టి పళ్ళు తోమినట్లు అన్నీ చేతికందించి, అందరికీ అన్నీ అమర్చి, రెండు మెతుకులు బాక్స్ లో పడేసుకుని, బైక్ ఎక్కేటప్పటికి, ఒక నిమిషం ఆలస్యమైతే అయ్యగారికి కావలసినంత చిరాకొస్తుంది. ఆఫీస్ లో ఆ జిడ్డు ముఖం వాడిని హలో బాస్ అని, చిరునవ్వు తగిలించుకుని, పలకరించి, వాడు చెప్పే సోది కబుర్లు విని, పనిలో పడితే సమయం తెలీదు. మధ్యాహ్నం రెండు మెతుకులు కొరికి, ఒళ్ళు వేడిగా ఉన్న పిల్ల బడిలో ఎలా ఉందో కనుక్కుని, సాయంత్రం ట్రాఫిక్ లో ఈదులాడి, ఏడుపు ముఖం ఈడుపు కాళ్ళతో ఇల్లు చేరి, మళ్ళీ యంత్రంలా పనిలో పడి, రాత్రికి కష్టపడి, నేను ఎంత చిరాకు పడాలి? చూసిన ముఖాలే చూస్తూ, చేసిన పనులే మళ్ళీ, మళ్ళీ చేస్తూ? ఆ!,” రెచ్చిపోయింది సరోజ. అమ్మో!ఎందుకేనా మంచిదని తగ్గేడు నరహరి.ఇది ఇరుపక్కల చిరాకు, విసుగు, కారణం రొటీన్.

“కొత్త ఊరెళుతున్నావు జాగ్రత్త, డబ్బులు దొంగజేబులో పెట్టుకో పిన్నీసు పెట్టు, రైయిలెక్కేటపుడు దిగేటపుడూ, జాగ్రత్త, రాత్రి నిద్ర పోతే సామాన్లు చూసుకుంటూ ఉండాలి,” ఇలా తల్లి చెప్పే జాగ్రత్తలకి కొడుకు “ఏంటమ్మా! నేనేం చిన్న పిల్లాడినా అలా ఊరికే నసపెట్టకపోతే”, కొడుకు చీదరింపు. “పరీక్ష జాగ్రత్తగా రాయి, దిక్కులు చూడకు. వచ్చినవి ముందు రాసెయ్యి”. ఇలా జాగ్రత్త చెబుతున్న తండ్రికి కోపాన్ని ప్రదర్శించలేక, “ఎప్పుడో మీకాలం పరీక్షలు కాదు నాన్నా! జాగ్రత్తగానే రాస్తాలే” కొడుకు తల ఎగరేత. అక్కడికి తండ్రికి ఏదో ఉద్ధరింపు చేస్తున్నట్లు. “ఎందుకలా చెవికోసిన మేకలా అరుస్తారూ! వస్తున్నానని అరుస్తున్నా కదా!” విసుగు ప్రదర్శించిన కోడలు, లేవలేని అత్త, పాలు పొంగిపోతున్నాయి చూడమని చెప్పినందుకు కోడలి సన్మానం.

“బాబూ! నిన్న మందులు తెస్తానని మరిచిపోయావు. ఈవేళయినా వచ్చేటప్పుడు తీసుకురా, రెండు రోజులయింది మందులయిపోయి”, ఓ పిచ్చి తల్లి అర్ధింపు కొడుకుతో. “ముందు చూసుకోవాలమ్మా! నాకేమో హడావుడి, బయటికెళితే, వచ్చేటప్పుడు తెస్తాలే, మళ్ళీ, మళ్ళీ చెప్పి మూడ్ పాడు చేయకు ఆఫీస్ కెళ్ళేటపుడు”, కొడుకు విసుగుదల. “ఏంటమ్మా! చున్నీ సరిగా వేసుకో! పీకదగ్గరికి కాదు, కిందకి వేసుకోవాలి”,తల్లి సూచన. “చంపేస్తున్నావే! ఏమో ఇప్పుడంతా పీక దగ్గరనుంచి వెనక్కే వేసుకుంటున్నారు, చున్నీ. ఇలా ముందుకేసుకుంటే ముసలమ్మవా అని ఎగతాళీ చేస్తున్నారే,” కూతురి చిరాకు తల్లి పై సభ్యత నేర్పినందుకు. ఇలా కోపాన్ని పూర్తిగా ప్రదర్శించలేని స్థితిలో ఈ చిరాకు విసుగు ప్రత్యక్షమవుతాయి. ఒక రకంగా ఇది అశక్త దుర్జనత్వమే. “ఏమయ్యా వెంకటరావు గారూ! మీకెన్ని సార్లు చెప్పేను సాయంత్రం ఐదయ్యేటప్పటికి స్క్రోల్ పూర్తి చెయ్యమని, ఈ వేళా అవలేదన్న మాట, మన బతుకెప్పుడూ ఇంతేలే!,” మేనేజరు పళ్ళ బిగువున ఆపుకున్న కోపానికి ప్రతీక. రోజూ సమయానికి వచ్చేబస్సు మనకి అవసరమైన రోజు అరగంట ఆలస్యం చిరాకే. చెయ్యగలది లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అంతులేదు దీనికి.
అసలీ విసుగు చికాకు ఎందుకొస్తాయి?. చేసే పనిలో ఏకాగ్రత లేకపోవడం దగ్గరనుంచి ఏదో పని కాలేదనే ఆదుర్దానుంచి, టైమ్ అయిపోతోందనే తొందరనుంచి, పెద్దవారు చెప్పేది చాదస్తం అనుకోడం దగ్గరనుంచి రక రకాలు, నిజంగా ఇది అశక్త దుర్జనత్వమే, ఒక్కొకసారి. కొన్ని మనం చేతులారా తెచ్చి పెట్టుకునేవి, కొన్ని మన చేతిలో లేనివి. దీనిని మాన్చలేమా? నిజం చెప్పుకోవాలంటే, అసాధ్యమే, ఐతే కొంత తగ్గించుకోవచ్చు, కోపాన్ని అదుపులో పెట్టుకుంటే. దీనికి ముఖ్యమైనది మళ్ళీ తిరిగి తిరిగి మనసు దగ్గరకే వచ్చేం.

రోజుకి ఇరువది నాల్గు గంటలలో నిద్ర ఎనిమిది గంటలు, ఎనిమిది గంటలు జీవన వ్యాసంగానికి కావలసిన పని, నాలుగు గంటలు ఇంటి పనులు జీవన అవసరాలు, నాలుగు గంటలు రిక్రియేషన్. కాని మనం ఏంచేస్తున్నాం? రిక్రియేషన్ లేదా పునరుజ్జీవనంకి కావలసిన ఆట, పాట, చదువు, వగైరాలు మానేసి, ఆ సమయం కూడా డబ్బు సంపాదనా మార్గాలే చూస్తున్నాం. ఇదీ గాక నిద్ర, జీవన వ్యాపారాల సమయం కూడా డబ్బు సంపాదనకే ఉపయోగించేస్తున్నాం. అంటే కొద్ది ఇంచుమించులో పదహారు నుంచి పద్దెనిమిది గంటలు ఈ వ్యాసంగంలో మునిగిపోతున్నామన్న మాట. కొన్ని కొన్ని అత్యవసర పరిస్తితులలో నిరంతరంగా పని చేయాల్సి వస్తుంది, కాదనను, కాని నిత్యంగా చేయ కూడదు కదా. నిరంతరంగా పనిచేసే యంత్రాలకి కూడా కొంత కాలమయిన తరవాత విశ్రాంతి ఇచ్చి ఓవర్ హాల్ చేస్తారు. లేకపోతే వాటికీ ఫెటీగ్ వచ్చి పని చేయడం మానేస్తాయట. మనసు లేని యంత్రానికే అటువంటిది ఉంటే మనసున్న మనిషికి రోజుకి నాలుగు గంటల పునరుజ్జీవనం లేక రిక్రియేషన్ అవసరమా కాదా? మన వాళ్ళంతా చాదస్తులు, పాపం పశ్చిమదేశాలవారు వర్క వైల్ యు వర్క్ ప్లే వైల్ యు ప్లే టు బి మెర్రీ అండ్ గే అంటున్నరు కదా. పోనీ ఆమాటేనా విందాం.

భార్యా భర్తల మధ్య ఈ విసుగు చిరాకు తగ్గించుకోడానికి కొన్ని చిట్కాలు, పెళ్ళినాటి ఆల్బం తిరగెయ్యండి, ఇద్దరూ కలిసి, ఇద్దరూ కలిసి గదుల్లో బెడ్ టేబుళ్ళను ఉన్న స్థానానలనుంచి కొత్త స్థానాలకి మార్చండి. కర్టెన్లు మార్చండి. ఇద్దరూ కలిసి గార్డెనింగ్ చేయండి, కలిసి నడవండి కొంతదూరం కబుర్లు చెప్పుకుంటూ,ఎదుటివారిని సరదాగా ఉడికించండి,తరవాత ఆనందంగా ఓడిపోండి. నోటితో చెప్పలేకపోతున్నారా? ఒక కాగితం మీద మీ భావం రాసి మీ భాగస్వామికివ్వండి. ఏదుటి వారి కోసం చిన్న విషయానికైనా వేచి చూడండి. ఎదైనా ఒక గేమ్ ఆడుకోండి. నిజంగా బార్య/భర్తని పొగడండి, మీరు కనక ఇలా చేయగలిగేరని. సెల్ ఫోన్లు, టి.వి ,నెట్టుకట్టి పారేయండి, ఒక గంట కరంటు పీకేయండి, మాకు ఇప్పటికి మూడు సార్లు పీకేసేడు లెండి 🙂 ఇది రాస్తూ ఉంటే, ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకోండి, కంది పొడి అదిరిందోయ్ అనండి, లేత తామలపాకులు, పచ్చ కర్పూరం, సున్నం ,వక్క తెచ్చుకోండి, రాత్రి ఏడు గంటలికి భోజనం పూర్తి చేయండి, కబుర్లు చెప్పుకుంటూ, తాంబూల చర్వణం చేయండి.. మీ ఇల్లే ఆనందానికి చిరునామా. మేము అమలు చేస్తున్నవి కొన్నే చెప్పేను, మీగిలినవి మీ ఇష్టం…..

ప్రకటనలు

24 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-చిరాకు/విసుగు.

 1. సర్, చాలా బాగా రాసారు, నేను రమేష్ గారితో ఎకీబవిస్తాను. మానసిక సమస్యలు తలెత్తినప్పుడు వచ్చే చికాకులను నేర్పుగా ఎదుర్కోవాలి. కడుపునిండినప్పుడే ప్రేమ రుచిస్తుంది. కానీ మీరన్నట్లు కొన్ని సార్లు కొన్ని చిట్కాలు పనిచేస్తాయి, అందుకు ఇద్దరి మనసులు అనుకూలంగా ఉండాలి.

  • @ఫాతిమా గారు,
   జుట్టుంటేనే కదండీ కొప్పు పెట్టుకున్నా, సిగ పెట్టుకున్నా. కడుపు నిండక పోతే ఈ సమస్యలు లేవు. అదే సమస్య కదా.మనసులు అనూకూలించకపోతే, ప్రతి స్పందించకపోతే ఫలితం లేదుకదా.
   ధన్యవాదాలు

 2. చాలా బాగుంది శర్మ గారూ!
  మీరన్నట్లు ప్రేమని వ్యక్తం చేయడం రావాలండీ!
  ఊర్లో ఉంటూనే భార్య/భర్త కి ప్రేమలేఖ వ్రాయటం…
  ఇంట్లో ఉండగా భార్య /భర్త మొబైల్ కి మెసేజ్ ఇవ్వటం…..
  అకేషన్ లేకుండా ఓ ఫ్లవర్ ఇవ్వటం…
  ఇంటి డాబా మీద వెన్నెల్లో డిన్నర్ చేయడం…
  ఊహించని సమయంలో ఐ లవ్ యు చెప్పడం….
  ఇంకా చాలా చాలా ఉన్నాయి….
  అభినందనలు మరోసారి..
  @శ్రీ

  • @Sri గారు,
   మొదటగా మీరు నన్ను క్షమించాలి. వేరెవరో అనుకున్నా. పొరబడ్డా.మీరు మమ్చి లిస్టే పెట్టేరు. ఇలా ఎవరికి కుదిరినది వారు చేసుకోవాలి.అప్పుడే ఆనందం. ఇలా చేయమని ఒకరు చెప్పలేరు. ఆ జంటకి ఏది కుదురుతుందో వారికి తెలిసినట్లు పైవారికి తెలియదు కదా. తెలియ కూడదుకదా!
   ధన్యవాదాలు

 3. /నిజంగా బార్య/భర్తని పొగడండి/ :)) నిజం నిప్పులాంటిది మాస్టారూ… అలా పొగడమనే ఎలా చెప్పగలం?!

  • @గారు,
   మొదట ఎదుటివారు మొదలు పెట్టాలనుకోడమెందుకు మనం మొదలు పెడితే వారూ అందుకుంటారు కదా 🙂
   ధన్యవాదాలు

 4. విసుగు చిరాకు గురించి బాగా వివరించారు బాబాయి గారూ… ముఖ్యంగా ఆఖరి పారాగ్రాఫు పెళ్ళయి పదేళ్లు నిండిన వారందరూ తప్పక చదువవలసినది.

  • @అమ్మాయ్ జ్యోతిర్మయి,
   నిజమే, ఏ వయసుకు తగ్గది ఆ వయసులో వుంటే ఆనందంగా ఉంటాం. ప్రేమ వ్యక్తం చేయడం మంచిదికదా.
   ధన్యవాదాలు

 5. ఈ రోజుల్లో డబ్బు సంపాదనకి ఎనిమిది గంటలు మాత్రమే కేటాయిస్తే భార్యా పిల్లలు మన మీద చిరాకు/విసుగుని ప్రదర్శిస్తారు!

  యాంత్రిక జీవనం, ఆర్ధిక ఒత్తిళ్ళు మనిషిని అసహనానికి గురి చేస్తున్నాయనుకుంటున్నాను.

  చాలా స్పూర్తివంతమైన పోస్ట్. అభినందనలు.

  • @మిత్రులు డాక్టర్ రమణ గారు,
   యాంత్రిక జీవనం పెద్ద దెబ్బ తీస్తోంది, ఆర్ధిక కారణాలు చెప్పక్కరలేదు.
   ధన్యవాదాలు

 6. ఏ పి ప్రెస్ అకాడెమి వెబ్ సైట్ లో పాత పత్రికలు ఉంటాయి వీలుంటే అవి చూడవచ్చు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పోతున్నాయని 60 -70 ఏళ్ళ క్రితం నాటి పత్రికల్లో కూడా అవే సమస్యలు వాటిని చదివి ఇప్పటి సమస్యలను తలుచుకొని హాయిగా నవ్వు కోవచ్చు. పాత సినిమాలు కలిసి చూడండి …. బాగా సంపాదించిన పెద్దలు టివిల్లో విలువల గురించి చెబుతారు వాళ్ల పాత జీవితం గురించి తెలుసుకొని ఇప్పటి విలువల పాటలు వింటే బోలెడు సంతోషం . దేవుడి పై భక్తి , నమ్మకం ఉంటే కుటుం బం అంతా కలిసి గుడికి వెళ్ళండి .. బోలెడు ప్రశాంతత లభిస్తుంది …ఇవన్నీ చేయాల్సినవి ఇక చేయకుడనివి ఉదయం లేవగానే వార్తా పత్రిక చూసి మనసు పాడు చేసుకోకండి

 7. అంటే కొద్ది ఇంచుమించులో పదహారు నుంచి పద్దెనిమిది గంటలు ఈ వ్యాసంగంలో మునిగిపోతున్నామన్న మాట.
  —————————————
  మీరు చెప్పేది నమ్మలేని సత్యం.
  తక్కువ ఉన్న సమయంలో ఎక్కువ పనులు చేస్తుంటే వచ్చేది విసుగు చిరాకు కోపం. ఉన్న సమయంలో ఏవి ముఖ్యమో నిర్ణయించుకొని వాటిని సక్రమంగా చెయ్యటమే సరి అయిన పధ్ధతి అనుకుంటాను. అన్నీ పనులూ ముఖ్యం అనుకుంటే చివరికి మిగిలేది రోష్టే.

  • @రావు,లక్కరాజు గారు,
   కొవ్వొత్తులలా అంతగా అయిపోవక్కరలేదు. సంపాదించి పెడితే, కూచుని తిని సోమరిపోతులయిపోతారు, తరవాతి తరం. మోతాదుగా చేతికందిస్తే చాలు.
   ధన్యవాదాలు

 8. ఒకే తరం వాళ్ళకు మీ సలహాలు కొంత ఎఫెక్టివ్‌గా వుంటాయి. ఓ తరం అటు ఇటు ఐతే కొద్దిగా కష్టమే అని నిన్ననే నాకు అనుభవం అయ్యింది. :))

  • @Snkrగారు,
   ఏ తరానికి ఆ తరం వాళ్ళు కొత్తకొత్తవి కనిపెట్టుకోవాలి. చిన్నప్పటినుంచీ అలవాటు చేసుకుంటే సమస్యలేదు. 🙂
   ధన్యవాదాలు

 9. చిరాకు జీవన అసౌకర్యములో వచ్చేది, విసుగు సంతృప్తి లేనప్పుడు అనుకున్నదానికి భిన్నముగా జరుగుచున్నపుడు జరిగే మానసిక చర్యలు. వీటిని తప్పించు కోవటానికి జీవితములో మార్పు, జీవనములో నేర్పు అవసరమే!

  • @రమేష్ బాబుగారు
   ” చదువది ఎంత కల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు” కదండీ, నేర్పు అవసరం.
   ధన్యవాదాలు

 10. ఎంత చక్కటి పోస్ట్ అండి! చాలా మంచి విషయాలు చెప్పారు!!
  ప్రేమ ఉంటే సరిపోదు, దాన్ని అప్పుడప్పుడు తప్పక వ్యక్తపరచాలి మీరు చెప్పినట్టు. మీ చిట్కాలు simply superb!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s