శర్మ కాలక్షేపంకబుర్లు-బదలాయింపు/రిప్లేస్మెంట్/మార్పిడి

బదలాయింపు/రిప్లేస్మెంట్/మార్పిడి.

అమ్మయ్య! బదలాయింపు అంటే రిప్లస్మెంటేనాండీ! ఏంటో మీతో ఇంగ్లీషులో మాటాడెయ్యాలని కోరిక, అందుకు నాకొచ్చిన ముక్కలు రెండూ చెప్పేస్తూ ఉంటాను, మీరేమో నేను ఇంగ్లీష్ లో షెల్లీనో,కీట్స్ నో, లాంగ్ ఫెలో నో అనుకుంటూ ఉంటారు.ఇంతకీ విషయం వదిలేసి శాఖా చంక్రమణం ఎందుకూ మర్కటం లాగా అంటారా! మరి మనిషి కోతినుంచి వచ్చేడంటున్నారు కదండీ, మరి కొన్ని లక్షణాలుండవా? శాఖా చంక్రమణం అంటే ఏమంటారా? మీకూ తెలుసు కాని నాకోతి పనులు నా చేతే చెప్పించాలని మీ ప్రయత్నం, అంటే ఒక కొమ్మనుంచి మరొక కొమ్మకి తిరగడం, అదేలెండి, ముద్దుగా చెప్పేను, కోతి లా ఒక చోటినుంచి మరొక చోటికి దూకడం, ఒక విషయం లోంచి మరొక విషయంలోకి దూకడమన్నమాట.

పాత రోజుల్లో ఏదయినా వస్తువు పాడయితే బాగు చేయించుకునే వారం. నేను చిన్నపుడు కొనుక్కున్న బైఫోరా వాచీ మొన్నీ మధ్యనే పాడయింది. మరి పని లేదు కదా మూల పడిపోయింది. అలాగే మా రోజులలో సిస్టం ఏదయినా పోతే తలకిందులుగా తపస్సు చేసి అయినా బాగు చేసుకోవాలి తప్పించి, కొత్తది పట్టుకొచ్చి పెట్టడానికి ఉండేది కాదు. ఇంటి వస్తువులయినా అంతే. నిజంగా కూడా, వస్తువు పాడయి బాగుకు సరికాకుండా పోయే పరిస్థితి వస్తే మాత్రం కొత్తది కొనక తప్పేది కాదు. దానికి తోడు నాటి రోజులలో తయారు చేసే వస్తువులు కూడా స్పేర్ పార్ట్ లు అమ్మకానికి ఉండేవి. ఇప్పుడు తయారు చేసే సామానులకు స్పేర్ పార్ట్ ల గొడవలేదు. మల్టి నేషనల్ కంపెనీలు దేశం లో అడుగు పెట్టినప్పటినుంచి ఈ సంస్కృతి బాగా ప్రబలిపోయింది. మొన్న నొక సారి మాఇంటిలో వాషింగ్ మిషన్ కి నీరు బయటికి పోయే పైపు చెడిపోయింది. మిషన్ చక్కగానే పని చేస్తూవుంది. పైపు పోవడం మూలంగా నీరు దగ్గరే పడిపోతూ ఉంది. కంపెనీ వాడు పైపు స్పేర్ లేదన్నాడు అడిగితే. మరో పైపు దానికి పట్టేలా కనపడలేదు. మార్గం ఏమయ్యా అంటే, షాపు వాడు చెప్పినదేమంటే పాతది తెచ్చెయ్యండి, మాకిచ్చెయ్యండి, దాని పరిస్థితి చూసి రేటు కడతాము. కొత్తది పట్టుకెళ్ళిపోండి, మిగిలిన సొమ్మిచ్చి అన్నాడు. పైపు వేసుకుంటే సరిపోయేదానికి ఇంత మార్పా అనుకుంటే హోం మినిస్ట్రీ వారు, పాతది ఇచ్చేసి కొత్తది తెమ్మని హుకుం జారి చేసేరు. సరే, హోమ్ మినిస్ట్రీ ఆర్డర్ కాదనలేము కదా. వాషింగ్ మిషన్ పట్టుకెళ్ళి వాడికి చూపితే వాడు దానికి కట్టిన ఖరీదు పదిహేను వందలు. మిగిలిన సొమ్ము పదిహేనో, పదహారో వేలు పుచ్చుకుని కొత్తదిచ్చాడు. ఇలా ప్రతి గృహ ఉపకరణాలనీ, ఈ బదలాయింపులో కొనేస్తున్నాం. తప్పటం లేదు మరి. అవి మిక్సర్, గ్రయిండర్, టి.వి, ఫ్రిజ్, ఎ.సి, డిసర్ట్ కూలర్, వగైరా, వగైరా. ఇందు మూలంగా వ్యాపారస్తుడు, కంపెనీ బాగు పడుతున్నాయి, వినియోగదారుడు నష్టపోతున్నాడు. అది గుర్తించడం జరగటం లేదు. కొత్తది వస్తోందన్న ఆనందం తప్పించి, పాత దానికేదో డబ్బులొస్తున్నాయన్నది తప్పించి.. నిజానికి ఇటువంటి ప్రతి వస్తువులో విలువైన పార్ట్ ఒక మోటారు మాత్రమే. ఈ మార్పిడికి ఒక సీజను, అవును దసరా ప్రారంభం నుంచి మళ్ళీ కొత్త అమావాశ్య దాకా అదేనండీ ఉగాది దాకా, పల్లెటూరి వాళ్ళం కదా ఉగాదిని కొత్తమావాశ్య పండగంటాం. పెళ్ళయిన తరవాత మొదటి సారి ఉగాది వస్తే అల్లుడు ఈ పండగకి రాడు, ఎందుకంటే అమావాశ్య పండగ కదా అల్లుడు రాడు, అమ్మాయిని తీసుకెళ్ళండి అంటారు.

ఇలా గృహోపకరణాల మార్పు అవిఛ్ఛినంగా జరిగిపోతూ ఉంది. మల్టి నేషనల్స్ అలాగే బాగు పడుతున్నారు. ఇప్పుడేదో కంపెనీ వాల్ మార్ట్ ట పల్లెలో కూడా కిరాణా షాపు పెడతారుట, మనవాళ్ళు నెత్తిన గుడ్డేసుకుపోవాలని ప్రభుత్వం వారు చెబుతున్నారు. కూరలు కూడా వాళ్ళే అమ్ముతారట. కూరలంటే గుర్తొచ్చింది. వంకాయలో ఏదో మార్పు చేస్తారట. అది బి.టి ట, బయో టెకనాలజీట, అది ఎందుకు మార్పు చేస్తున్నారంటే వంగ మొక్కలకి పురుగుల బెడద లేకుండాట. కొంతమంది శాస్త్రజ్ఞులు వద్దు మొర్రో అంటున్నారు. మీరు చొప్పించేది విషమయ్యి పురుగు తిని చస్తూ ఉంది. అది మనుషులు తింటే వీళ్ళకి కేన్సర్లొస్తాయంటున్నారు,. ప్రభుత్వం వారు కాదు, కాదని, చేసి తీరతామంటున్నారు. నాలుగు కాళ్ళ వాళ్ళు వద్దంటున్నారు. మూడు కాళ్ళ వాళ్ళు చెయ్యమంటున్నారట. నాలుగుకాళ్ళ వాళ్ళెవరంటారా. ఆడాళ్ళు, ఏమయ్యా బుద్ధిలేని మాటలు మాటాడతావ్! వాళ్ళు పశువులా? నేనలా అనలేదండీ! మనిషికి ఒక జత క్రోమోజోం లు ఉంటాయట. ఆడ వాళ్ళకి రెండూ ఎక్స్ లుట( xx ). ఎక్స్ కి రెండు కాళ్ళు కదా, అందుకు వాళ్ళు నాలుగు కాళ్ళ వాళ్ళు. మరి మగాడికి ఒక కాలు కుంటి ట. అదెలాగంటే వీళ్ళకి ఒక ఎక్స్ ఒక వై క్రోమోజోం లు( XY ) అందుకు వై కి ఒకటే కాలు కదా అందుకు వీళ్ళు మూడు కాళ్ళ వాళ్ళన్న మాట.

మానవ శరీరంలో అన్ని భాగాలు పాడయితే కొత్తవాటితో మార్చేస్తున్నారు, కళ్ళతో సహా. మనం చనిపోయిన తర్వాత కూడా లోకాన్ని మరొకరి ద్వారా లోకాన్ని మరొక జీవితకాలం చూడచ్చు కదా. నేత్ర దానం అంటే నాకిష్టం. ఈ శరీర భాగాలు కూడా సొమ్ములున్నవారికి శనగపప్పు కొనుక్కున్నంత వీజీగా దొరుకుతున్నాయిట. సొమ్ములేని వాళ్ళ బతుకు గోవిందా.

ఇలా ప్రతీదీ కొత్తది కావాలనే మనస్తత్వం పెరిగిపోయి మనుషులలో వస్తువు మీద అభిమానం చచ్చిపోతూ ఉంది. పాత కాలం లో చిన్నప్పుడు కొన్న పెన్ ఉద్యోగం లో చేరేదాకా, ఆ తర్వాత కూడా వాడేను. మరిప్పుడు, చెక్ మీద ఒక సారి సంతకం పెట్టిన బాల్ పెన్ మరుసటి రోజుకు కనపడటం లేదు. మనిషికి వస్తువుకు మధ్య సంబంధం తెగిపోయింది. మనిషికి మనిషికి మధ్య కూడా సంబంధం తెగిపోయింది. ఇప్పుడు మనిషికి ఆతని స్త్రీ కి మధ్య కూడా సంబంధం పలచనైపోతూ ఉంది. ఇదేమి పురోగతో తెలియటం లేదు. మొన్న మిక్సర్ ది స్క్రూ బిగించమంది ఇల్లాలు, బిగించా, వదులైపోయిందని మళ్ళీ వచ్చింది. గోలెందుకుగాని ఇదిచ్చేసి కొత్తది తెచ్చుకుంటేపోలా, ముసలి వాటన్నిటిని ఇచ్చేసి కొత్తవి తెచ్చుకొవచ్చుకదా, ఆ పని చేస్తానన్నా, ఆ కోరిక కూడా ఉందా అని రుసరుసలాడుతూ లోపలికెళ్ళిపోయింది.. నేనేమన్నానంటారు?

ప్రకటనలు

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బదలాయింపు/రిప్లేస్మెంట్/మార్పిడి

  • @శ్రీ గారు,
   మనుషులు కూడా నచ్చటం లేదని మార్చేస్తున్నారు కదా. అదే నాగోల, మీరు కనిపెట్టేశారు.
   ధన్యవాదాలు.

 1. ఏమిటో బదలాయింపు పై మనస్సు బదలాయించారు. ఈ మధ్య మీరు ఇంగ్లీష్ రాలేదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది మీ తృష్ణ గా భావిస్తున్నా.అయనా మనబోటి వాళ్లకు ఇంగ్లీష్ పనికి రాదు కారణం మనం తెలుగు లో ఆలోచించి పరాయి భాషలో రాయాలి అబ్బే మనస్సులో భావన యధాతధంగా రావాలంటే అమ్మ భాషే శరణ్యం.అయినా మీరు కూడా ఆ ఎండమావులు కావాలంటే మాకు ‘శాఖ చ౦క్రమణ౦’ లా౦టి పదం ఒకటి వున్నదని ఫలానా దానికి ఉపయోగించాలని తెలపగలిగేది ఎవరు? మాలాంటి వాళ్ళకు మార్గాలు మూసుకు౦టాయి.పదాలు వాడుకలో వుంటేనే అమరిక.పదనిర్మాణ౦,ఉపయోగించే పధ్ధతి పట్టుబడుతుంది లేక పొతే విలుప్తపదాల జాబితాలో చేరుతుంది.
  పాత తరం వాళ్ళకు వస్తువులు,జీవితం,జీతం పై ప్రేమ,విలువ,నిబద్ధత అందుకే వీటిల్లో ఏది సరిగా లేకున్నా సహించి బాగుచేయించి వాడుకునే వాళ్ళు.కాని ఆధునిక తరం వాళ్ళకు వాళ్ళ జీవితం పై వాళ్ళకే అనురక్తి,ఆసక్తి లేనంత వేగం దానితో వత్తిడి.బహుశా దీన్ని మేము జయించాం అని చెప్పటానికి అనుక్షణం కొత్త వస్తువుల కోసం వెంపర్లాట.ఇది వ్యాపారస్థులకు సావకాశం.
  హన్నా!పిన్ని గారిని బదలాయిస్తారు! ఒక్కసారి కోతి – కోతి తోక కధ గుర్తు తెచ్చుకోండి.
  అయినా మనస్సు తెలిసిన సతి – విధి రాత బదలాయించేవి కావు.

  ఏమన్నా చొరవ తీసుకుంటే పుత్ర సమానుడిని మన్నించండి!

   • అయినా మీకు కూడా ఓ బదలాయింపు పధకం సిద్ధం గా వున్నది.

    కమ్మని పోస్ట్ కు – కట్టుడు పళ్ళు
    ఇంపైన పద్యానికి – సో౦పైన జోడు
    అల్లరి మాటలకు – ఆసరా కర్ర.

  • @రమేష్ బాబు గారు,
   ఇంగ్లీషు అందరికి వచ్చును, నాకు రాదే అని బాధ. ఏంచేస్తాం, ఇలా సద్దుకుపోదాం. ఏమంటారు.
   నేటి వారి విషయం నాకంటే మీరే బాగా చెప్పేరు.
   మీపిన్నిగారే కదండీ నాజీవితం. నిన్న చెప్పేను కదా, ఊరుకే ఉళ్ళ్ ళ్ ఉడికించానన్నమాట.
   తోక కధ చదివేనండీ, బాగుంది.తోక లేకపోతే ఏం లేదు.
   మీరు చెప్పిన బదలాయింపులన్నీ ఎప్పటినుంచో అమలు లో ఉన్నాయి.
   ధన్యవాదాలు.

 2. క్రోమోజోం ల కాళ్ళ విషయం బాగుంది. ఈ మధ్య ఏదో సినిమాలో ఈ బదలాయింపు గురించి నాయిక తో తండ్రి అంటాడు “ఈ జనరేషను వాళ్ళు పాత వస్తువు పాడయితే కొత్తది తెచ్చేసుకుంటారు తప్ప బాగు చేయించుకోవచ్చనే ఆలోచనే చేయరు. కాకపోతే దీన్నే రిలేషన్సు కు కూడా అపాదిస్తున్నారు” అని. మంచి విషయాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు.

  • @మాధవ్ గారు,
   నేటి వాళ్ళు వస్తువుల్ని మార్చినట్లే మనుషులునీ మార్చేస్తున్నారని నా బాధ, మీరుగమనించారు.
   ధన్యవాదాలు.

 3. నేత్రాలు ఏమోకాని మూత్రపిండాలు మొదలయినవి మార్పించుకోవడం సాధారణ జనానికి వీలుకాదు.ఎందుకంటే మార్పించుకున్నాక రోజకు దాదాపు ౧౦౦ రూ. మందులు మింగుతూ ఉండాలి. ఎందుకంటే మనశరీరం మనవి కానివాటిని బయటకు తోసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందువల్ల ఇమ్మ్యూన్ సప్రెసెంట్లని జీవితాంతాం వాడాలి.

  • @వేణు గోపాల్ గారు,
   కలిగినవారికి వీఝీగా దొరుకుతున్నాయి కదా! రోజుకి వందేమిలెండి ఎంతేని ఖర్చుపెట్టగలరు.లేని వారికి ఆ అవసరం రాకుండాలని కోరుకుందాం.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s