శర్మ కాలక్షేపంకబుర్లు-తూ.గో.జి అమాయకులం.

తూ.గో.జి అమాయకులం.

మా తూ.గో.జి అంటే అన్నీ ప్రత్యేకతలే. మొన్న కొన్ని చెప్పుకున్నాం కదా. మరిప్పుడు మరికొన్ని.

జిల్లాలో పెద్ద దేవుళ్ళు, అన్నవరం సత్తెన్న, ద్రాక్షారం భీమన్న, ఇది ద్రాక్షారం కాదు దక్షారామం, నోరు తిరగక ద్రాక్షారం చేసేసేం. అంతర్వేది నరసన్న. సామర్లకోట అనే చామర్లకోట దగ్గర భీమవరంలో కుమారారామ భీమన్న, అమ్మ అష్టాదశ పీఠాలలో ఒకటి, పాద గయగా ప్రసిద్ధి చెందినది, పురుహూతికా శక్తి ఉన్న పిఠాపురం అనే పీఠికాపురం. రాజమంద్రి లో ఎక్కువ మందికి తెలియనిది ముఖ్యమైనది, రాజమంద్రి రయిల్వే స్టేషన్ ఎదురుగా రోడ్ పక్కనున్న కన్నమ్మ దేవాలయం, ఇది రాజరాజనరేంద్రుని కాలం నాటిది. ఆలయం చిన్నది,బాగుంది కూడా. రాజమంద్రిలో పెద్దంజనేయ స్వామి ఆలయం, వేణుగోపాల స్వామి ఆలయం, గోదావరి గట్టున ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయం., గొల్లల మామిడాడ రామాలయం, ర్యాలి జగన్మోహనుడు, ఐనవిల్లి గణపతి, ముఖ్యమైన వాడు మందపల్లి శనీశ్వరుడు. కడలి కపోతేశ్వరుడు, పలివెల కొప్పు లింగేశ్వరుడు,బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వరుడు,వాడపల్లి వెంకన్న, స్వతంత్ర పోరాటం లో ప్రసిద్ధికాంచినవాడు. యానాం వెంకన్న, మురమళ్ళ వీరభద్రుడు, పెళ్ళి కాని వారు, ఆలస్యమవుతున్నవారు, ఇక్కడ కల్యాణం చేయిస్తే, చేయించుకున్నవారికి వివాహం తొందరలో అవుతుంది, నాది గేరంటీ.  చెబితే చాలా ఉన్నాయి. అడుగడుగున గుడి ఉంది. నాకు తెలిసినవి, గుర్తున్నవి.

ధవళేశ్వరం దగ్గర ఆనకట్టు కట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇంజనీరు కాటన్ మహాశయుడు, ఈయనకు కుడి చెయ్యి ఓవర్సీర్ వీరాస్వామి. కాటన్ గారు పని మొదలు పెట్టేముందుగా పొడుగ్గా పెద్ద పెద్ద తాటాకు పాకలేయించాడు, పాపం, మొబలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని తినెయ్యడం తెలియని వాడు, ఆఫీసు, పని వారికోసం. శంకుస్థాపన చెయ్యాలంటాడు,ముహూర్తం పెట్టించాలంటాడు,వీరా స్వామి. జిల్లానుంచి, అప్పటికి ఒకటే గోదావరి జిల్లా, వేద పండితులు వచ్చి చేరేరు, ముహూర్త నిర్ణయం కోసం, నూట ఏభయి మంది. వీరిని పిలిచి సభ ఏర్పాటు చేసి కాటన్ గారిని పిలిచాడు, వీరాస్వామి. వేద పండితులంతా ఏక కంఠంతో, వందల సంవత్సరాలు ఉండవలసిన కట్టడం,లక్షల ఎకరాలకి నీరిచ్చేది, మీరనే “లిక్విడ్ గోల్డ్”, మీరు మంచి మనసుతో చేస్తున్న సత్కార్యం, మొదలు పెట్టడానికి మంచి ముహూర్తం కావాలన్నారు. నీటికి “లిక్విడ్ గోల్డ్” మాట కాటన్ గారన్నది. దానికాయన, నాకు నమ్మకం లేదని అంటూ, కొద్ది క్షణాలలో ఏమి జరగబోతున్నది చెప్పగలరా? అని ప్రశ్నిస్తే, సభ నిశ్శబ్దమయిపోయింది. ఒక చాకులాటి యువకుడు, సభ చివరినుంచి లేచి, కొన్ని క్షణాలలో మీపై విష ప్రయోగం జరుగుతుందని అన్నాడు. ఆయన నవ్వి వెళ్ళిపోబోతూ చేయి పైకెత్తితే, కొత్తగా వేసిన తాటాకులలోని ఒక తేలు ఆయన చేతి వేలుపై పొడిచింది. కాటన్ గారు ఒక్క సారి అరిచాడు బాధతో, వెంటనే ముహూర్తానికి శంకు స్థాపన చేయడానికి ఒప్పుకున్నాడు. ఒక్క సారిగా నూట ఏభై కంఠాలు ఉరిమాయి, వేద స్వస్తి పలికేయి, ఆశీర్వదిస్తూ. ఈయన నొప్పి మాయమైపోయింది. వీరాస్వామి, కాటన్ సంతోషించారు, పండితుల ప్రతిభకి. ముహూర్త నిర్ణయమయింది, ఆ సమయానికి కాటన్ గారు శంకుస్థాపన చేశాడు, గోదావరి తల్లి పై ఆనకట్టకు, ధవళేశ్వరం దగ్గర..

కవులు కళాకారుల గురించి చెప్పాలంటే కడియం శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు, వీరిల్లు నాకు సుపరిచితం. వారిల్లు పూర్తిగా నేల మట్టమైపోయింది. నా అభిమాన రచయిత శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి ఊరు పొలమూరు, అనపర్తి దగ్గరలో. వీరిల్లు కూడా ప్రస్తుతం లేదు. మరొక జంట కవులు రామ కృష్ణ కవులు పిఠాపురం, వీరిల్లు చూడలేకపోయా. ఉన్నది లేనిది కూడా తెలియదు. మరొకరు నవయుగ వైతాళికుడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారిల్లు చూశా.నేనీ ఇల్లు చూసి నలభై ఏళ్ళు పైన అయింది. ప్రస్తుతం ఎలా ఉన్నది తెలియదు. బారిస్టర్ పార్వతీశం గారిల్లు చూశా, ప.గో.జి లో అది మరొక సారి. కళాకారుల గురించి చెప్పలంటే చాలా ఉంది కాని, భరత నాట్యం, సాహిత్యం దండిగా ఉండే స్త్రీలకు కాణాచి మురమండ, మానేపల్లి,పెద్దాపురం. కాల క్రమేణా వీరు భోగ స్త్రీ లయిపోయారు, సానులయిపోయారు. భోగం మేళాలు నిషేధించక ముందు, వీరి నాట్యం చూడతగినదిగా ఉండేది. నాట్యం లో మండూక శబ్దానికి నృత్యం చేయడం కష్టమట. అది వీరు అవలీలగా చేసేవారు, నేనెరిగున్నంతలో. ఇందులో రెండూళ్ళు నేనెరుగుదును. మురమండ మా ఊరికి రెండు కిలోమీటర్ల లోపు. రెండవది మానేపల్లి, మా పితామహి పుట్టిన ఊరు.

జిల్లా లో ప్రసిద్ధి పొందిన దాతలు, పిఠాపురం మహారాజు, వంద సంవత్సరాల కితం వంద ఎకరాల భూమిని వ్యవసాయ యూనివర్సిటీకి దానంగా ఇచ్చిన కృత్తివెంటి పేర్రాజు పంతులు, దానానికి మారు పేరు పాతూరి బులి వెంకమ్మ, అన్నదానానికి ప్రసిద్ధులు, కొవ్వూరి బసివి రెడ్డి, డొక్కా సీతమ్మ, జోగన్న దంపతులు. చివరికి అన్ని ఆస్థులూ ఆమ్మి అన్నదానం చేసిన తల్లి, వర్ణ భేదం చూపక. అమర వీరుడు అల్లూరి సీతారామరాజు చదువుకున్నది రామచంద్రపురం హైస్కూలులో.

మా జిల్లాలో మడతకాజాకి ప్రసిద్ధి తాపేశ్వరం, మడతలుగా ఉంటుంది కాజా. మడత మడతకీ, పాకం ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మరొకటి కాకినాడ కోటయ్య కాజా. ఇది చూస్తే ముదురు గోధుమ రంగులో కనపడుతుంది, దొండ కాయలాగా. నోట్లో పెట్టుకు కొరికితే అబ్బో అంతా తియ్యదనమే. ప్రపంచ ప్రసిద్ధి కాంచినది మా ఆత్రేయపురం పూతరేకు. దీని గురించి తెలియని వారుండరు. కాని మళ్ళీ చెబుతా. ఉల్లిపొరలాటి, బియ్యపుపిండితో చేసిన ఒక రేకు, దానినే పూత రేకంటాం. వీటిని నాలుగైదు తీసుకుని పంచదార మెత్తగా చేసినది వేస్తూ అప్పుడే కాచిన నెయ్యి వేస్తూ చుడతారు. ఇందులో యాలకి పొడి కూడా వేస్తారు. ఇవితినాలిగాని రుచి వర్ణించి చెప్పడం కష్టం. అదో గడి పల్లెటూరు, పేరు ఉత్తరకంచి, ఆవూళ్ళో ఉదయమే పాకం గారెలేస్తాడు, ఒక సారే,పాకలో, దానికే క్యూ. కారుల్లో వెళ్ళి తింటారు. మరి వెయ్యడు. కాట్రావులపల్లి, జగ్గంపేటకి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. నవంబరు నెల మొదలు మొక్క జొన్న పొత్తులు కాల్చి అమ్మే కుంపట్లు ఎన్నో, లెక్కలేదు. ప్రత్యేకంగా వచ్చి తింటారు, కార్లలో. పచ్చిపొత్తులు కొని పట్టుకుపోతారు. వీటి రుచి ప్రత్యేకం. తినాలి, రుచి చెప్పడం తేలిక కాదు. నేనిదివరలో చెప్పిన పెసరట్లకి ప్రసిద్ధి బిక్కవోలు, ఇప్పుడు ఎవరేనా వేస్తున్నారో లేదో తెలియదు. వీటిలో చేరినదే కాకినాడ సుబ్బయ్య హొటల్. దీని గురించి చాలా మందికి తెలుసు. పండూరు,సర్పవరం ,పేరుగాంచిన మామిడితాండ్రకి ప్రసిద్ధి.

ఇన్ని చెప్పేరు, మీగురించి చెప్పలేదేమనికదా అంటున్నారు. ఆయ్! తూ.గో.జీ వాళ్ళమండీ ఉత్తి అమాయకులమండి, కుడుము చేతికిస్తే పండగనుకుంటామండి. అందరినీ నమ్మేస్తామండి.అందరూ మావాళ్ళేననుకుంటామండి. మనసులో ఉన్నదేదో, ముఖం మీద అనేస్తామండి, ఏదీ దాచుకోలేమండి. నమ్మితే ప్రాణం ఇచ్చేస్తామండి. కాని మమ్మల్ని అందరూ లిటిగేసన్ మనుషులంటారండి. ఆయ్! మా ఊతపదమండి, అండీ అనకుండా ఉండలేమండి. ఇప్పుడు చెప్పండి మేము అమాయకులం కాదండీ ?

మనసులేదు, రాయలేను, రాయడం మానేస్తానంటే, కాదని, నువు రాయగలవు, రాయి, అని పట్టుపట్టి రాయించిన నా మనవరాలు సుభకి అంకితం.

 

ప్రకటనలు

37 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-తూ.గో.జి అమాయకులం.

 1. కంగ్రాట్స్ అండి తాతయ్య గారు, టాంజానియా వంటి దేశాలలో కూడా మీ బ్లాగ్ చుస్తూన్నారంటే ( నా ఉద్దేశ్యం తెలుగు వాళ్ళు తక్కువ గా ఉన్న చోట కూడా ) నాకు చాలా ఆనందంగా ఉందడి.
  మీ ప్రయాణం ఇలాగె కొనసాగి, మాకు ఇంకా మంచి మంచి టపా లు అందించాలని మనసారా కోరుకుంటున్నాను.

 2. మీ వ్యాసం హడావిడిగా కాక తీరిగ్గా చదవాలని తీరిక దొరికేవరకూ ఆగి ఇప్పుడే చదివాను. మేము కూడా పోయిన సంవత్సరమే వశిష్టా నది దగ్గరకు ‘దిండి’ వెళ్ళాం బాబాయిగారూ. ఆ ప్రదేశం అంతా చాలా బావుంది అనుకున్నాము. ఫోటో బ్లాగులో ఆ ఫోటోలు కూడా వున్నాయి. ఇంకా అంతర్వేది కూడా వెళ్ళివచ్చాము. మీరు ఆఖర్లో చెప్పిన >> ఉత్తి అమాయకులమండి, కుడుము చేతికిస్తే పండగనుకుంటామండి. అందరినీ నమ్మేస్తామండి.అందరూ మావాళ్ళేననుకుంటామండి. మనసులో ఉన్నదేదో, ముఖం మీద అనేస్తామండి, ఏదీ దాచుకోలేమండి. నమ్మితే ప్రాణం ఇచ్చేస్తామండి. >> ఇది చాలా నిజం.

  • @అమ్మాయ్ జ్యోతిర్మయి,
   ఇలా ఓపికగా తీరిక చూసుకుని మరే చదివే వారిలో నువ్వూ ఉన్నందుకు సంతసం.
   వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, పోయేటపుడు కూడా పట్టుకు పోము, ఏమీ. ఈ మధ్యలో నీది, నాది తప్పదుకాని, దానికోసం పీకలు నులుపుకోనక్కరలేదు కదా!
   మా అమ్మాయి కనక మా మాట నమ్మింది.
   ధన్యవాదాలు.

 3. మాది కూడా తూ.గో.జి అండి!
  విషయమేమిటంటే మాది ప గో జి కూడా అండి!
  అదిరిపోయింది టపా అండి!! మీ మనవరాలు సుభకి ముందు తప్పట్లు.
  మా అందరికోసం ఇలా మీరు రాయడం తన వల్లనే కాబట్టి!
  రాజముండ్రి దగ్గర బొబ్బర్లంక కి లాంచీ ప్రయాణం చెశిన రోజులు ఇంకా గుర్తే!!

  • @శ్రీగారు,
   అనివార్య కారణాలవల్ల జవాబివ్వడం ఆలస్యమైనందుకు క్షమించాలి.
   అమ్మాయ్! సుభ శ్రీ గారి తప్పట్లు అందుకోమ్మా!
   ఆయ్! మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

 4. అయ్య బాబోయి.. నేను చూసిన వాళ్ళ కన్నా చూడని వాటిని, గొప్పదనాన్ని చూసి డంగై పోయాను.
  ఎంత గోప్పండి..మాస్టారు!
  చాలా బాగా సెప్పారు.
  “లిక్విడ్ గోల్డ్” మాట నీటి మూట కాదండి. చాలా గొప్ప మాట.
  మాండూక శబ్దం అంటే ఏమిటో..ఇంకో పోస్ట్ లో వ్రాస్తారా!? తెలుసుకోవాలని ఉంది.
  ఎన్ని దేవళాలు,ఎంత గొప్ప ఘనత అండీ.
  చాలా నచ్చేసిన్దండీ!
  ఈ మధ్యనే ఒకరు.. తూ.గో. అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటారా అని అడిగారండి.
  వద్దు,..అంత దూరం ప్రయాణం నా వల్ల కాదు అని సేప్పెసానండీ! ఇంకెప్పుడైనా సెప్తే మారు మాట్టాడకుండా తల ఊపేస్తానండీ !! తూ.గో.జి అమాయుకులం అని చెప్పారు కదండీ!! అందుకేనండీ!!
  మీ కీ బోర్డ్ వ్యసనం కి విరామం ఇవ్వకండి.
  నాలుగున్నరకి లేచి బ్లాగ్ లు చదవడం కి బ్రేక్ పడి పోతాది అండీ!
  మరేమో .. చాలా ధన్యవాదాలండీ!!

  • @వనజ గారు,
   కాటన్ గారన్న మాట నిజం కదండీ! అసలు బంగారం నీరే కదండీ!!
   మనలో మాట, అమ్మాయిలు దొరకటం లేదండీ! మీ అబ్బాయికేం, వివరాలు చెప్పండి, మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసేద్దాం. తూ.గో.జి అమ్మాయి పెళ్ళికి దొరికితే అబ్బో! ఎంత అదృష్టమండి!!.
   కీ బోర్డ్ వ్యసనం చాలా చిరగ్గా ఉందండి. ఎప్పుడు మానేద్దామనుకున్నా ఎవరో ఒకరు అడ్డుపడుతున్నారండి. మొన్న మనవరాలు అడ్డుపడిపోయింది, టపా వేస్తేనే కాఫీ తాగుతా! లేకపోతే కాఫీ తాగనూ అని, ఏం చెయ్యను చెప్పండి.అయ్యో ఏదో పెద్ద పని ఉన్నట్లు మూడున్నరకే లేస్తున్నానండీ!!!
   తూ.గో.జీ నచ్చినందుకు, మా గో.జి అమ్మాయిని చేసేసుకోండి కోడలుగా.
   ధన్యవాదాలు.

 5. మీరు రాయకపోతే ఎలా సర్, మీలాంటివాళ్ళు రాయకపోతే మాకు ఎలా తెలుస్తుంది చెప్పండి .
  అందుకని మనసు లో ఏమి పెట్టుకోకుండా మీరు ఇలా రాస్తునే ఉండాలి మేము చదువుతూనే ఉండాలి.
  ఉంటానండి.

  • @వెంకట్ గారు,
   తొమ్మిది నెలల్లో 235 టపాలు రాశా, పిచ్చిగా.మొన్న ఎందుకో రాయబుద్ధి కాలా. ఒక మిత్రుడు ఏదో కావాలంటే కంప్యూటర్ ఆన్ చేశా. కుక్క బుద్ధి ఊరుకోదుకదా! మెయిల్ చూశా. మనవరాలు పట్టుకుని టపా రాయడం మానేస్తున్నట్లుందేం తాతా అంది. నీకెలా తెలిసిందిరా అంటే, నాకు తెలుస్తుంది, నీటపా రేపు ఉదయం చూడాలి కాఫీ తాగాలి, లేకపోతే కాఫీ తాగనని కూచుంది. అయ్యయ్యో! మనవరాలు కాఫీ తాగకపోతే ఎలా? ఏం చెయ్యనూ? రాశా, ఇదండీ సంగతి. 🙂
   ధన్యవాదాలు.

 6. అయి బాబోయ్ బలే రాసేరండి . అన్ని సుసినట్టే ఉన్నాయండి చదువుతుంటే.
  ప్రతీ సంవత్సరం పాస్ అవ్వగానే, అన్నవరం వెళ్లి గుండు కొట్టించుకోవడం ఇప్పటకి మర్చిపోలేను. ఎలా మర్చిపోతాను ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు కాదు కదా, ఏకంగా 14 సంవత్సరాలు. మేము మెట్ట వైపు ఉండటం వల్ల నేను మొత్తం అన్ని చూడలేదు. ఈ సారి ఊళ్ళో నాటకాలు వేసారంట చాల సంవత్సరాల తరువాత, మిస్ అయిపోయాను.
  ఈ సారి ఇంటికి వెళితే ఓ పాలి అవన్ని సూడాలి.

  • @వెంకట్ గారు,
   సూసెయ్యండి! మరి ఆలీసెం దేనికీ!! నాటకాలాడుతోంటే చూడకపోతే ఎలాగండీ!!! ఉద్యోగవిజయాలయితే అబ్బో పద్యాలు చెల్లియో, చెల్లకో…….
   ధన్యవాదాలు.

 7. ఎన్నో విశేషాలు చెప్పారు.

  మన దేశంలో మిగతా రాష్ట్రాల కంటే తమిళనాడులో ఎక్కువ దేవాలయాలు ఉన్నాయని అంటారు.
  అలాగే మన రాష్ట్రంలో మిగతా జిల్లాల కంటే తూ గో జిల్లాలో ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి.

  అల్లూరి సీతారామరాజు మా నరసాపురం టేలర్ హైస్కూల్లో కూడా చదువుకున్నాడండి.

  ఇంగ్లీషువాళ్ళు య… య.. అనగా లేనిది మనం ఆయ్.. ఆయ్.. అంటే తప్పేమిటట?

  • @బోనగిరి గారు,
   గోదావరి జిల్లాలలో దేవాలయాలు ఎక్కువేనండి. మనదైన ఆయ్! ని ఎవరండీ కాదనగలిగినది. రేపు టపా ప.గో.జి చూడండి. ఆయ్!. రెండు జిల్లాలు నావేనండీ. ఆయ్!

  • @వెంకట రాజారావు, లక్కాకుల గారు,
   చెప్పడం లో కొద్దిగా పొరబడ్డా, మరుపొచ్చింది కదా, వయసుతో.

   విలస చేప, ఎక్కడో ఆస్ట్రేలియా దగ్గరనుంచి బయలుదేరి, గోదావరి కొత్తనీటికి, నదిలోకి ఎదురు వచ్చి, పులసగా తయారవుతుంది.ఇది ఈ జిల్లాకే ప్రత్యేకం.విచిత్రం ఏమంటే ఈ పులసని అందరూ వండలేరు. దీనిలో అన్ని సరుకులూ వేసి వండినపుడు ఇందులో ఆముదం వేస్తారు. బలే రుచిగా ఉంటుందిట. తయారయిన తరవాత ఒక రోజు మగ్గపెడతారు, మరునాడు, మూడవనాడు తింటే బలేగా ఉంటుందంటారు. మరో విశేషం పెద్దవారికి నజరానా గా ఈ కూర వండించి దూర ప్రాంతాలికి పంపడం మా జిల్లా ఆచారం. ధవళేశ్వరం బేరేజి దగ్గర మాత్రమే మంచి చేప దొరుకుతుంది.

   ధన్యవాదాలు.

 8. చూసారా తాత గారూ రాయను రాయను అని మొత్తం మన జిల్లా అంతా తిప్పించేసారు. ఇప్పుడింకో బెంగ. ఇంటికెళ్ళాలని. ఏం చేయమంటారు చెప్పండి? నాకీ బెంగ పోవాలంటే ఒక కథ చెప్పాల్సిందే.ఒక కిలో మడత కాజా పార్శిల్ చేయాల్సిందే..తప్పదు మరి ఇన్ని చెప్పి ఊరించాకా..ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇరకాటం.. అన్నీ చెప్పేసి నేనేమీ అడక్కుండా మనవరాలికి అంకితం అని ఒక మాటనేసి నా నోరు మూయించేసారు.అన్యాయం అండోయ్…

  • @అమ్మాయ్ సుభ,
   ఒక్క సారి వచ్చెయ్యమ్మా, మళ్ళీ వెళ్ళిపోవచ్చూ, రెండురోజులు. కధ చెప్పలేను కాని తల్లీ,తరవాత చెబుతాలే, రాలేనంటే, నీకు మడత కాజా ఏమి అన్నీ పార్సెల్ పంపేస్తా.
   రాయడానికి మనసు లేదంటే రాయి తాతా అని మారాం చేసేవు కదు తల్లీ, అందుకే రాశా. మరి నీకేగా అంకితం.
   ధన్యవాదాలు.

  • @గోపాల కృష్ణారావు, పంతుల గారు,
   ఆయ్! కలాలు లేవండి.చెక్కులు మీద సంతకానికి తెస్తారండి, బాల్ పెన్ను, ఆయ్! ఆ తరవాత అదీ కనపడదండి. ఆయ్!

   ధన్యవాదాలు.

 9. నేను తూ.గో. జిల్లావాణ్ణి కాకపోయినా అది నా స్వంతజిల్లాయే. మీ వ్యాసం చదివితే చాలా సంగతులు గుర్తొచ్చాయి. నెనర్లు.

 10. ధన్యవాదాలు….మీక్కాదండి ఆయ్…మీమనవరాలికి! ఇంత మంచి అనుభూతిని పంచిన మీక్కూడా 🙂 🙂

  • @పరిమళం గారు,
   నా బ్లాగుకు స్వాగతం.
   అమ్మాయ్ సుభ మరో పూలబుట్ట పంపేరు పరిమళం గారు తీసుకోతల్లీ.
   ధన్యవాదాలు.

 11. మీరమాయకులంటే అండీ అయ్యబాబోయ్ ఎందుకు నమ్మమండీ? కాని దానికి కొద్దిగ ఖరుసౌద్దండి, ఆయ్! పూతరేక్స్, కాజాస్, తాండ్ర, జీడ్స్ … అన్నీ కలిపి ఓ కిలో పంపించండి. తిని చూస్తే కాని చెప్పలేమని చెప్పారు కదండీ. :))

  • Snkrగారు,
   ఒక్కొకటి ఒక్కొక కేజీ పంపుతా. మా ఊరికి టిక్కంటంటే ఎలాగండీ!, మమ్మల్ని అమాయకుల్ని చేసి. 🙂 🙂
   ధన్యవాదాలు.

 12. బాగా చెప్పారు, ఇంకా చాలా ఉన్నాయి మీరు వ్రాసినవి గౌతమీ గోదారి పరివాక ప్రాంతాలు, ఇంకా వైనతేయా వశిష్టా గోదావరీ పరివాహక ప్రాంతాలు గురించి చెప్పలేదు, వాటి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను వ్రాస్తాను.

  • @గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,
   నా బ్లాగుకు స్వాగతం. మీతో మరో పోస్ట్ రాయిచగలుగుతున్నందుకు ఆనందం.
   ధన్యవాదాలు.

 13. మీ వ్యాసం చూస్తుంటే చిన్నప్పటినుంచీ 17 సంవత్సరాలు
  గడిపిన మన జిల్లా లోని ప్రాంతాలు కంటికెదురుగా కనపడుతున్నాయి శర్మ గారూ!
  వినాయక చవితి, దేవీ నవరాత్రులలో అమలాపురం లో తాతగారితో కలిసి చూసిన
  పౌరాణిక నాటకాలు ఇప్పటికీ మరచిపోలేదండి…
  ఆత్రేయపురం పూతరేకులు ఇప్పటికీ నా స్నేహితులద్వారా తెప్పించుకుంటూ ఉంటానండీ!
  తూ గో జీ యాత్ర చేయించేసారు..
  ఉదయాన్నే ఆనందాన్ని నింపేశారు మనసులో…
  అభినందనలు మీకు మీ మనుమరాలికి….
  గమనిక: ఏమిటో మనం అమాయకులం అంటే ఈ గడుసు వాళ్ళంతా సులువుగా నమ్మేస్తారంటారా???:-))..:-))
  @శ్రీ

  • @శ్రీ గారు,
   జననీ జన్మ భూమిశ్చ అన్నాడు శ్రీ రాముడు, అభిమానం తప్పదు కదండీ.మనం అమాయకులం కదండీ!! గడుసువాళ్ళు నమ్మరు లెండి!!!
   ధన్యవాదాలు.

 14. ఆయ్! తాతగోరూ మా బాగా సేప్పారండీ! ఈ సారి మీరు సెప్పిన ఊర్లన్నీ నాకు పరిచయమే! ప్రతీ ఏడూ కార్తీక మాస సోమవారం ఉపవాసంతో పంచారామాలూ చూసి ఇంటికి రావటం నా అలవాటు. సామర్లకోటలో కార్తీక ఏకాదశి నాకు మేము లక్షపత్రిపూజ, ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మ వారికి కుంకుమ పూజ చేసుకుని వస్తాం. మురమళ్ళ శివయ్యకి నిత్య కల్యాణం పచ్చ తోరణం కదా! నేను వెళ్ళి చూశాను. మా బాబయ్య వెళ్ళి కల్యాణం చేయించి వచ్చాడు అనుకోకుండా పెళ్లి కుదిరి రెండు నెలలలో మళ్ళీ వెళ్ళాడు పిన్నితో. పూతరేకులు, కాజాలు, తాండ్ర అంటూ ఇలా ఊరించి నన్ను బాధపెట్టం ఏమీ బాగాలేదు :(:( బిక్కవోలు జీళ్ళు మాత్రం వదిలేసారే. వేడి వేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి.

  • @అమ్మాయ్ రసజ్ఞ,
   నువ్వు చదువైపోయి రాగానే ముందు మురమళ్ళ, తరవాత దొడ్డిగుంట, ఆపైన కడియపులంక ప్రోగ్రాం నిశ్చయం చేశా. తాతా నువ్వన్నీ ఇలాగే చేస్తావ్, నన్ను ఉడికిస్తున్నావ్, రాగానే నీకు పనిష్మెంటు ఇచ్చేస్తా అంటావా. దానికీ రెడీ! 🙂 🙂 🙂
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s