శర్మ కాలక్షేపంకబుర్లు-బాధా? భయమా?

బాధా? భయమా?
( మిత్రుని మరణం సందర్భంగా అంతర్మధనం, బుద్ధి, మనసుల సంభాషణ )

బు: బాధ పడుతున్నావా?

మ: అవును, మిత్రుడు మరణించాడు కదా.

బు: కుంగుబాటెందుకు,జాతస్య మరణం ధృవం, తెలుసుకదా.

మ: అవును, ఇప్పుడూ కాదనటం లేదు. అది మనం ఆపడానికి ప్రయత్నించినా ఆగని, దాగినా తప్పనిది. సత్యం కదా.

బు: ఇంకా చెప్పేవు కదా ఉదాహరణలు,

మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్
జచ్చుచునుండ జూచెదరు చావక మానెడువారి భంగి నీ
చచ్చినవారి కేడ్చెదరు చావుకు నొల్లక డాగవచ్చునే?
యెచ్చట బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్……..భాగవతం, స్కందం-7..అధ్యా-1 లో 46.

అని యముడు బాలకుని వేషం లో చెప్పేడని హిరణ్యకశిపుడు చెప్పేడన్నావు కదా.

మ: మానవుడు పుట్టడం చావడం చూస్తూ ఉంటారు, కాని చచ్చినవానికోసం ఏడుస్తారు, తామెప్పటికీ చనిపోమన్నట్లు, ఇది విచిత్రం కదా అని అన్నాడు.అదీ నిజమే.

బు: మరి కుంగుబాటెందుకు?.ఆత్మకి మరణం లేదు ఒక శరీరం విడచి మరొక శరీరం లో ప్రవేశిస్తుందనీ తెలుసన్నావు.

మ: హిరణ్యకశిపుడు చెప్పిన మాట నిజమే కాని

బు: కానీ ఏంటి అర్ధణా

మ: చావు తప్పదనీ తెలుసు, చచ్చిన వాని కొరకు ఏడవడం కూడదనీ తెలుసు. ఆత్మకి మరణం లేదనీ తెలుసు, నా పని నేను చెయ్యాలనీ తెలుసు, నా పని మానేసి కూచుంటే మిత్రుడు తిరిగిరాడనీ తెలుసు.

బు: పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అని శంకరులు చెప్పేరన్నావు. చావు లేని వాడి గురించి ఏడుపెందుకయ్యా!.నీ కుంగుబాటెందుకు?

మ: లోక సహజం కనుక.

బు: తెలిసి ఏడవటం లోక సహజమా?స్థిత ప్రజ్ఞుడెవరు?

మ: మానావమానాలనూ, సుఖ దుఃఖాలనూ సమానం గా చూసేవాడు. ఏడవటం కూడదనీ తెలుసు, కాని ఏడవక ఉండలేను.

బు: స్థిత ప్రజ్ఞుడెవరో నీకు తెలుసు. ఆచరించు.పొరపాటు, తప్పు చేస్తారు, సరి దిద్దుకో.సరి దిద్దుకోవడం మంచి లక్షణం. తెలిసినదానిని జీవితానికి అన్వయం చేసుకో. త్రికరణ శుద్ధి లోపించిందా?

మ: త్రికరణ శుద్ధిగానే నమ్మేను,అదే చెబుతున్నాను కూడా కాని బాధ పడుతున్నాను.బాధ పడకుండా ఉండలేకపోతున్నాను.

బు: అదే నీకు తెలియనిది. నువ్వు చేసే చిత్రం. కొన్ని రోజులు పోతే ఎందుకు మరిచిపోతున్నావు? నాటకం లో నటుడు పాత్ర అయిపోయిన తరవాత నిష్క్రమిస్తున్నాడు కదా, ఇదీ అంతే. ఈ ప్రపంచ రంగస్థలం మీద అతని పాత్ర అయిపోయింది. వెళ్ళిపోయాడు.నాటకం లో పాత్ర అయిపోయిన వాళ్ళు రంగస్థలం మీద ఉంటే బాగుంటుందా? కాలం తోటిదే అన్నీ

మ: నిజమే కాలంలో నే అన్నీ జ్ఞాపకాలూ కొట్టుకుపోతాయి. కాలం తో అందరూ నశిస్తారు.

బు: చిలకపలుకులు బాగానే చెబుతున్నావు కాని మరెందుకు ఏడుస్తున్నావు? కుంగిపోతున్నావు? అది బాధ కాదన్న మాట. నిజం చెబుతున్నా అది భయం.

మ: ఆ! భయమా? నాకు భయమెందుకు?

బు: తెలిసి, తెలియనట్లు నటించకు, నా దగ్గర కూడా. నీకు బాధకంటే భయమెక్కువ. నేను నా మిత్రుని వెనక ఉన్నాను కదా, నా రోజెప్పుడో అని…………….. నీ మిత్రుని మరణం నీకు గుర్తు చేసినట్లయింది.
అది ఎలాగా తప్పదు,నీ పని నీవు చేసినా, చేయకపోయినా, ఏడ్చినా, ఏడవకున్నా తప్పదు, అర్ధమయిందా?……….
అందుకే, నీ పని నువ్వు చెయ్యి, కృపయా పారే పాహి మురారే అనుకో, కలిలో నామ స్మరణ చాలు అందుకు భజగోవిందం.
భగవంతుని ప్రార్ధించు,ఏ మతమైనా, మరణం సర్వ జీవులకు సమానం, ఏ పేరుతో పిలిచినా, నీకు తెలియని …………. ఆ శక్తి ఒక్కటే.

ప్రకటనలు

30 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బాధా? భయమా?

 1. ఆ, ఏముందండి?
  ప్రతీ రోజు, ఆఫీసులో పని అయిన తరువాత “Let’s call it a day” అనుకోవడంలేదూ,
  ఇదీ అలాగే.

 2. ఇట్లా పై కెళ్ళిన వాళ్ళతో మాట్లాడే విధానం ఏదైనా కనుక్కుంటే బాగుండు సుమీ అప్పుడప్పుడు గూగుల్ చాట్ ఏదైనా చెయ్య వచ్చు. ఈ గూగుల్ వాళ్ళు ఏదేదో గూగులిస్తారు గాని ఇట్లాంటివి కనుక్కోరేమిటి మరి?

  జిలేబి.

  • @జిలేబిగారు,
   బహుకాల దర్శనం. ఇది మనదేనండి!. మనకు తెలిసినదే!! ఇప్పుడు మళ్ళీ గూగుల్ వాణ్ణి అడుగుతున్నాం.
   ధన్యవాదాలు.

 3. ఇది చదువుతుంటే నాకు కాళహస్తీశ్వర శతకం లోని పద్యం గుర్తుకొచ్చింది. ఆపద్యం ఇది:
  చను వారింగని యేడ్చువారు జముడా సత్యంబుగా వత్తుమే
  మనుమానంబిక లేదు నమ్ముమని తారావేళ నారేవునన్
  మునుగంబోవుచు బాస సేయుటసుమీ ముమ్మాటికిం జూడగా
  చెనటుల్గానరు దీని భావమిదివో శ్రీ కాళహస్తీశ్వరా!
  ఆ స్నానంతో శ్మశాన వైరాగ్యం సరి. మళ్లా మామూలే.

 4. My 2cents. 🙂

  “I’m not afraid of death; I just don’t want to be there when it happens.”
  ― Woody Allen

  “The fear of death follows from the fear of life. A man who lives fully is prepared to die at any time.”
  ― Mark Twain

 5. చాలా బాగుంది మీ బుద్ధి, మనస్సుల సంవాదం. ఈ రెండింటినీ synchronize చేయడం ఎలాగో కూడా కాస్త చెబుదురూ!

  • @ తేజస్వి గారు,
   మంచి ప్రశ్న. మనసు ప్రతి క్షణం అనేక సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. బుద్ధి అనేది ఆ సంకల్ప వికల్పాలము బేరీజు వేసి, సాధ్యాసాధ్యాలను, మంచి చెడ్డలను, అవసరం, తదితరాలను పరిశీలించి తోవ చూపుతుంది. కాని ఒక్కొకపుడు, ఈ బుద్ధి చెప్పిన సూచనను తిరస్కరించి, మనసు పంచేంద్రియాల ద్వారా తన ఇష్టాన్ని అమలు చేస్తుంది.ఫలితం దానికి తగినట్లుగ ఉంటుంది.
   ధన్యవాదాలు.

  • @ ఫణీంద్ర గారు,
   చిన్నవాళ్ళు అలా నిట్టూర్చెయ్యకూడదు. హుషార్! ఇది జీవితం.పొయిన వాళ్ళతో మనమూ పోము, పోకూడదు కూడా.
   ధన్యవాదాలు.

   • మాస్టారూ… నిరాశతో కూడిన నిట్టూర్పు కాదండీ నాది.

    కొద్ది రోజులుగా మరణానికి చెందిన విషయాలే ఏదో ఒక రూపంలో చుట్టుముడుతున్నాయి. చాలా రోజులయిందని ఓ నాలుగు రోజుల నుంచీ గోర్కీ అమ్మ చదువుతున్నాను, నిన్న దానిలోనూ ఓ పాత్ర మరణం.. దాని వెనుకే అతని మిత్రుల అంతర్మథనం ఘట్టం. అదీ సంగతి.

    నాచికేతోపాఖ్యానం ఓసారి చెప్పకూడదూ…!

 6. హాస్యం రాయగల వారే ఘడమయిన విషయాలను రాయగలరు అనే నా నమ్మకాన్ని మళ్లీ నమ్ముతున్నాను … మరణాన్ని పండుగ చేసుకోవాలి ( దాదాపు ఇదే అర్థం ) తో ఓషో రజనీష్ తెలుగు అనువాదం చిన్న పుస్తకం ఉంది . ఎక్కడయినా లభిస్తే చదవండి .. ఇలాంటి అంశం పై చాలా బాగా రాశారు .చాలా రోజుల క్రితం చదివాను .

  • @ మురళి గారు,
   ఈ విషయాన్ని హాస్య ప్రధానం గా రాయాలని మొదలుపెట్టి, మనసు మార్చుకున్నా. ఎందుకంతే విషయం గాఢమయినది. దానిని హాస్యం లో పులిమేస్తే విషయం పలచబడిపోతుందని మానేశా. మీరు బాగా గుర్తించారు. గీత సారం అమలు చేయడమే మన కర్తవ్యం.
   ధన్యవాదాలు.

  • @ the tree గారు,
   ఈ సంవాదం అంతులేనిది కాదు. బుద్ది చెప్పిన నిర్ణయం అనుసరించడమే కర్తవ్యం.
   ధన్యవాదాలు.

 7. అవునండి అది భయమే. కాని తన తరువాత నా వంతు అని కాదు. ఇన్నాళ్ళు ఒకరికొకరు అని జీవించి ఉన్నట్టుండి ఒంటరి జీవితం ఎలా నడపాల అన్న భయం. కాలం తో పాటు తను కూడా మరపులోకి వేల్లిపోతరేమో? అన్న భయం. అన్ని విషయాలలో తనతో పాటే నేను అనుకున్న నేను ఈ ఒక్క విషయం లో తనతో పాటు నేను ఎందుకు లేను అన్న బాధ. సహగమనం మూడాచారం కాదు కదా. ఆ ఆచారం ఇంక ఉన్నుంటే ఎంత బాగుండేదో.

  • @ స్వాతి గారు,
   నా బ్లాగుకు స్వాగతం.
   ఒక స్నేహితునికే నేనింత కుంగిపోతే, జీవిత సహచరులయితే అది భరింపరాని దుఃఖం మరియు భయమూ కూడా. ఒక బలహీన క్షణం లో సహగమనం చేయాలనిపించడం కూడా అనిపిస్తుంది. గీతా సారం పరిశీలిస్తే తేలేదేమంటే, మనకు అన్నీ తెలుసు, చెబుతాము. ఆచరణ దగ్గర ఇబ్బంది పడుతున్నాము. చనిపోయిన వారొతో అనుబంధం మనను బాధించడం కూడా సహజం. వారితో గడిపిన సమయం, అభిరుచులు, జ్ఞాపకాలను నెమరు వేస్తూ, వారి ఆశయాలను మనం కొన సాగించడమే జీవిత లక్ష్యం కావాలి,వారి జ్ఞాపకాలు మనతో ఉండగా మనం ఒంటరివారమెలా అవుతాము? ఒకరికొకరుగా బతికిన వారు లేరంటే భరించడం కష్టం.కాని ఉన్న వారు తమ పాత్ర, కర్తవ్యం నిర్వర్తించాలని గీత సారం. నాటకం లో పాత్రలాగా వెళ్ళిపోయిన వారి గురించి అతిగా బాధ, తరవాత భయమూ కూడా కూడనివే. నేను నాలుగు రోజుల అంతర్మధనం తరవాత మళ్ళీ ప్రకృతిలో పడ్డాను. ఎవరి జీవితం వారిదే, రెండవ వారితో ముడిపడి ఉన్నా సరే. ఉన్నవారు తమ కర్తవ్యం నెర వేర్చవలసినదే, అప్పుడే వెళ్ళిపోయిన వారికి అసలైన నివాళి ఇచ్చిన వారమవుతాము. బాధను, భయాన్ని జయించడమే కావలసినది.మీ మాటలు నన్ను బాగా ఆలోచింపచేసి, భయాన్ని జయించేందుకు ఉపయోగపడ్డాయి.
   ధన్యవాదాలు.

 8. గీతా సారం అంటే కదండీ!…
  మీరు ఆ వేదన నుంచి తొందరగా బైటికి రావాలని
  ఆకాంక్షిస్తూ
  @శ్రీ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s