శర్మ కాలక్షేపం కబుర్లు-ఎవరి పిచ్చి వారికి ఆనందం.

ఎవరి పిచ్చి వారికి ఆనందం

ఆఫీసుపనిపై, తప్పక రాజమంద్రి బయలుదేరా, రయిలు మీద. అది రాజమంద్రి దగ్గరలో ఆగింది ఎందుకో, బయటకు చూశా. ఆ ప్రదేశం నాకు పరిచయమున్నట్లనిపించి జ్ఞాపకాలలోకి పోతే……

అనపర్తిలో జె.యిగా ఉద్యోగం చేస్తున్న రోజులు, 1986  లో గోదావరికి వరదొచ్చి రావులపాలెం, అమలాపురం వైపు వూళ్ళు ములిగిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లకి కూడా పెద్ద నష్టం సంభవించింది. ప్రాణ,పంట నష్టం జరిగింది. అప్పటిరోజుల్లో అమలాపురానికి బయటి ప్రపంచం తో సంబంధం కేబుల్ ద్వారా కాదు, బయటి లైన్ ద్వారా, స్థంభాలే కొట్టుకుపోయాయి, రావులపాలెం వైపు. ఆ రోజుల్లో వీటిని ట్రంక్ లైన్ అనే వారు. బయట ఊరికి చేసే కాల్ ని ట్రంక్ కాల్ అనేవారు. అమలాపురం వైపు లైన్ లు చూసే జె.యి మా ఊరికి పని చేసే లైన్లు కూడా చూస్తాడు. మాది మెట్ట ప్రాంతం కనక నష్టం లేదు, కాని బయటి ప్రపంచం తో ఎక్కువగా సంబంధం ఉన్న రాజమంద్రితో సంబంధం తెగిపోయింది. మా లైన్ రెయిల్ ట్రాక్ పక్కన ఉన్న స్తంబాల మీద ఉంది, రాజమంద్రి దాకా.ఆ లైన్ మీద పని చేసే సిస్టం పోయింది. రయిళ్ళు కూడా తిరగలేదు మూడురోజులు. ధవళేశ్వరం దగ్గర నీటిలో ఉండిపోయిందిట రైల్ లైన్. నేను రెండవరోజు రాజమంద్రి ఆఫీస్ కి వెళితే ఆఫీసంతా గందరగోళంగా ఉంది. ఆఫిసర్ గారిని కలిసి సంగతి చెప్పేను. జరిగిన నష్టం కొంత నేనూ చూశాను కనక, మా వైపు లైన్ చూడ్డానికి ఆ జె.యి కి సమయం పడుతుంది కనక నేను ఖాళీ గానే ఉన్నమూలంగా నా లైన్ నేను బాగు చేయించుకుంటానంటే ఆఫీసర్ గారు ఒప్పుకున్నారు. మరి మిత్రుడు, సహచరుడికి చెప్పాలికదా అన్నా, అవునని అతనికి ఫోన్ చేసి చెప్పేరు. మిత్రుడు అదే బిల్డింగ్ లో వేరొక గదిలో ఉన్న వాడు వెంటనే వచ్చి, మీరు, మీకు పని చేసే లైన్ చూసుకుంటా నన్నందుకు ధన్యవావాలంటూ, ఆ లైన్ ఎక్కడ వున్నది, దాని వివరాలు చెప్పి, ధవళేశ్వరం వద్ద స్థంబాలు ములిగిపోయి లైన్ లు నీళ్ళలో ఉన్నట్లు నాకు రిపోర్ట్ ఉంది, చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. నేను వెళుతున్నానని చెప్పి వచ్చేశాను.

మరుసటి రోజు రెయిలు బయలుదేరే వేళకి ఇద్దరు యువకులైన మజ్దూర్ లని తీసుకుని కావలసిన సామాన్లు అన్నీ తీసుకుని బయలుదేరాము. కుర్రాళ్ళిద్దరు, నేను లైన్ మీద దృష్టి నిలిపి చూస్తునాము. ధవళేశ్వరం వచ్చేటప్పటికి బండి స్లో అయింది. చూస్తూ వెళుతూంటే మా స్తంభాలు నీళ్ళలో కనపడుతున్నాయి. పూర్తిగా ములిగి, నీరు తీయడం మూలంగా లయిన్లు మాత్రం కనపడుతున్నాయి. నీళ్ళకి లైన్లకి ఎడం బహు తక్కువగా ఉంది. ఒక చోట చాలా పల్లం, అక్కడ లయిన్ మీద ఫాల్టు కనపడింది, కుర్రాళ్ళు దిగేద్దామన్నారు. నాకు భయమేసింది, రెండవది స్టేషన్ దాక లైన్ చూసుకు వెళ్ళి తిరిగొద్దామన్నాను. అప్పుడు గుర్తు చేసుకున్నా ఈ పద్యం.

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహాన్యమానులగుచున్ ధృత్యోన్నతోత్సాహులై
ప్రారబ్దర్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్…..భర్తృహరి సుభాషితం. నీతి శతకం

నీచులయినవారు కష్టాలొస్తాయని ఏ పనీ మొదలుపెట్టరు. మధ్యములు పని మొదలు పెడతారు కాని కష్టం వస్తే మానేస్తారు. ధైర్యవంతులు కష్టాలను ఎదుర్కొని, విధి వ్రాత ఇలా ఉందనుకుని పని పని మానెయ్యరు, దానిని పూర్తి చేసితీరుతారు. ప్రజ్ఞ కలవారు కనుక అని కవి భావం.

అలాగే స్టేషన్ దాకా వెళ్ళి తిరిగి మూడు కిలో మీటర్లు పైన నడుచుకుంటూ వెనక్కి వచ్చాము.ఫాల్టు ఎదురుగా కనపడుతోంది.అదేమంటే తుక్కు, పుల్లలు, గడ్డి అంతా నీటికి కొట్టుకొచ్చి ఒక స్థంభంకి ఆరడుగుల దూరంలో, లైన్ల మీద చిక్కుకుంది. అది తీసేస్తే లైన్ రైట్ అవుతుంది. కాని స్థంభం దగ్గరకెళ్ళదానికి నీరుందే. అదీ ఇరవై అడుగులలోతు పైన ఉందే. మా స్థంభం ఇరవైనాలుగడుగుల పొడుగున్నది ములిగిందంటే. కుర్రాళ్ళిద్దరికి ఈత రాదన్నారు. నాకు ఈత వచ్చు. దగ్గరగా ముఫై అడుగుల దూరం ఉంది లైన్ రైలు గట్టుకి. నేను దిగుతానన్నా, కుర్రాళ్ళు వద్దండి, మీకు అలవాటు లేదు లైన్ మీద పని చెయ్యాలి ,ఈదాలి, వెళ్ళి ఎవరేనా ఈత తెలిసిన వాళ్ళని తీసుకొద్దామన్నారు. నేను ఈత కొట్టుకు వెళ్ళి ఫాల్టు తీస్తానని,బట్టలు విప్పేసి డ్రాయర్ తో ఉండి, కూడా తెచ్చిన తాడు నడుముకు కట్టుకుని నీళ్ళలో దిగిపోయా, తాడు మీరు పట్టుకోండి,ప్రమాదమనిపిస్తే ఒడ్డుకు లాగమని, తాడు కట్టుకున్నది, వాళ్ళ తృప్తి కోసమే. స్థభం దగ్గరకెళ్ళా. పైకి కష్టపడి ఎక్కా, కాని పుల్లలు తుక్కు తీయాలంటే వైర్లమీద నడిచి వెళ్ళమన్నారు. అది సాధ్యంగా కనపడలేదు, నాకు. రెండు లయిన్లు రెండు చేతులతో పట్టుకుని కప్పలా పాకుతూ బయలుదేరా. ఫరవాలేదు, చేరచ్చుననే అభిప్రాయం కలిగింది కాని, కాళ్ళూ, చేతులూ మండిపోతున్నాయి. అలాగే ఓర్చుకుని దగ్గరకు చేరాను కాని ఒక చెయ్యి వదలి పని చేయడం సాధ్యం కాలా. నీళ్ళలో పడిపోయా. ఇదే బాగున్నట్లుందని ఒక చేత్తో లైన్ పట్టుకుని ఈత కొడుతూ ఒక్కొక్క పుల్ల, గడ్డి తీసెయ్యడం ప్రారంబించా.చేతులు మండిపోతున్నాయి, లైన్ పట్టుకోడం మూలంగా.నీరు తీయడం ప్రారంభించిన మూలంగా నీటి వడి తోసేస్తోంది.గట్టున ఉన్న వాళ్ళను తాడు లాగి పట్టుకోమన్నా, కొట్టుకు పోకుండా.వాళ్ళ తృప్తి కోసం కట్టుకున్న తాడు నాకు అక్కర కొచ్చింది. ఈ లోగా ఒక కుర్రాడు, సార్! పాములుండచ్చు జాగ్రత్త అని భయం పెట్టేడు. చేతులు మార్చుకుంటూ ఈత కొడుతూ లైన్ పట్టుకుని అరగంట సేపు కుస్తీ పట్టి మొత్తానికి తుక్కు, గడ్డి, పుల్లలు అన్నీ తీసేశాను. లైన్ రయిటయింది లేనిది తెలియాలంటే ఫీల్డ్ ఫోన్ లైన్ కి తగిలించాలి. దానికోసం ఈదుకుంటూ వచ్చా. ఫీల్డ్ ఫోన్ వైర్ పట్టుకుని ఈదుకుంటూ వెళ్ళి స్థంభం దగ్గర కనెక్ట్ చేశా. దూరం గా ఉండండి సార్! లైన్ తగిలితే షాక్ కొడుతుందని గుర్తు చేశారు, ఫీల్డ్ ఫోన్ రింగ్ చేశారు, ఒడ్డునుంచి, దొరక లేదు. సరిగ కనెక్ట్ అయివుండదని కటింగ్ ప్లయర్ కోసం మళ్ళీ ఈదుకుంటూ వచ్చి, పట్టుకెళ్ళి, లైన్ గీకి , కనెక్ట్ చేస్తే, రింగ్ చేస్తే దొరికింది. లైన్ రయిటయిందంటే ఆఫీసర్ గారిని తీసుకున్నారు,విషయం చెప్పడానికి . ఆయన లైన్ లోకొస్తే సార్ లైన్ లో ఉండండి జె.యి గారు నీళ్ళలో ఈదుకుని వస్తున్నారు, స్థంభం దగ్గరున్నారు అని చెబితే ఆయన లైన్ లో ఉన్నారు. నేను వడ్డుకు చేరి ఆయనతో మాటాడితే, అదేమి మీరు దిగేరంటే విషయం చెప్పేను. ఇటువంటి సాహసాలు చేయకూడదని సుతిమెత్తగా మందలిస్తూ, వచ్చెయ్యండి, నేను మీకోసం కనిపెట్టుకుని వుంటాను, ఇంటికి వెళ్ళటం లేదన్నారు. అక్కడనుంచి బయలుదేరి వూరిలోకొచ్చి ఆటో పట్టుకుని ఆఫీస్కు జేరేటప్పటికి రెండవుతోంది. ఆయన భోజనం తెప్పించి, మా ముగ్గురికి స్వయంగా వడ్డించి, ఆయన భోజనానికి కూచున్నారు. అందరూ భోజనం మొదలు పెట్టేరు, కలుపులోవడం. నేను చేతులు ఊదుకుంటూ కూచోడం చూసి ఏమయిందని చేతులు చూస్తే రెండు చేతులూ బొబ్బలెక్కి ఉన్నాయి.ఆయన భోజనం మానేసి నాకు కలిపి పెడితే స్పూన్ తో తిన్నాను. పాపం ఆయన ఆ తరువాత భోజనం చేశారు. అంతతో మా లైన్ రయిటవడంతో విషయం మరచిపోయాము. మూడు నెలల తరవాత ఒక రోజు మా ఆఫీసర్ గారు పిలిచి రేపు మీరు ఆఫీస్ కి రావాలి, మీటింగ్ ఉందన్నారు. మీటింగులు అలవాటుకనక వివరం అడగలేదు. మర్నాడు మీటింగ్ లో ఆ వరదల్లో కష్టపడి పని చేసిన వారికి బహుమతులిచ్చారు. చివరలో నా విషయం చెప్పి నాకొక ప్రత్యేక బహుమతి ఇచ్చారు, నేను చేసిన పని ప్రత్యేకంగా చెప్పేరు. మిత్రులంతా అభినందించారు.ఒక మిత్రుడు మాత్రం అడిగేడు ఏరా! ఇటువంటి తిక్కపనులు చేయ్యడం నీ అలవాటా అని… ఏమో ఎవరి పిచ్చి వారికానందంకదా….

 

ప్రకటనలు

28 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-ఎవరి పిచ్చి వారికి ఆనందం.

 1. ఆ రోజుల్లో వృత్తి ని దైవం గా భావించేవారున్నారు అనడానికి మీరే ఉదాహరణ. ఇప్పుదంతా మనకి ఎంత పేయ్ చేస్తున్నరు, దానికి సరిపడా చేస్తే చాలు అనుకునేవారేనండి. చేసే వృత్తి మీద ఇష్టం, గౌరవం ఉంటే మీలాగే ఉంటారండి. మీ టపాలు అన్ని ఎదో ఒక సందేశం ఇస్తాయి నా మటుకు..

 2. శర్మగారు,
  సాహసం చేయరా అన్న డైలాగ్ గుర్తుకు తెప్పించింది. 🙂 మీ విషయంలో ప్రత్యేక బహుమతే, అప్పటికి రాకుమారి అవడం నిరుత్సాహ పరిచింది. I mean, the risk was not worth of it. అంత రిస్క్ తీసుకోకుండా చిన్న (తాడుతో కట్టిన )తెప్ప లాంటిదేదైనా వాడివుంటే బాగుండేది.
  లైవ్ వైర్లు నీళ్ళలో వున్నప్పుడు, సేఫ్ రేంజ్ ఎంతవరకు వుంటుంది? తీగలకు ప్రవాహంలో ఎగువన సేఫ్ రేంజ్ ఎక్కువగా వుంటుందా?

  • @ Snkr గారు,
   పరిస్థితి అలా ఉంటుందని ఊహించలేదు.టెలిఫోన్ వైర్లలో ప్రాణం తీసే ఎ.సి ఉండదు కాని ఫీల్డ్ ఫోన్ రింగు మాత్రం షాక్ గట్టిగా తగులుతుంది. అందులోనూ నీళ్ళలో ఉన్నపుడు ఎక్కువగా ఉంటుందికదా!
   ధన్యవాదాలు.

 3. నా చిన్నపుడు మా బాబయ్య గారు…
  ఏదైనా తిక్క పని చేస్తే…
  ఎ పి వా ఆ …అనేవారు…
  మాకు అర్థం అయ్యేది కాదు…
  తరవాతోసారి చెప్పారు…ఎవరి……ఆనందం అని…
  ఓ తిక్క…దానికో లెక్క అన్నట్లుగా…:-)..(మీరు పెద్దవారైనా…సరదాకి అనేసానండి)
  మొత్తమ్మీద మీరు చేసిన సాహసాన్ని చక్కగా మాతో పంచుకున్నారు..
  ప్రత్యెక బహుమతి పొందిన మీకు అభినందనలు…
  మీరు చెప్పిన పద్యానికి న్యాయం చేసారు…
  @శ్రీ

 4. పని ఎలా తప్పించుకోవాలనే ఆలోచనలకే తమ తెలివి తేటలన్నీ ఉపయోగిస్తారు చాలా మంది .. పని తప్పించుకున్నప్పుడు ఆ క్షణం లో వారికి ఆనందం కలగా వచ్చు .కానీ ఒక పని ఎలా గయినా పూర్తి చేయాలనీ ఇలా సాహసాలకు ( పిచ్చి అనిపించ వచ్చు ) దిగితే అవి జీవిత కాలం సంతృప్తిని ఇస్తాయి

  • @మురళి గారు,
   అప్పుడప్పుడేనా ఇటువంటి చిన్న సాహసాలు చెయ్యకపోతే జీవితంలో ఆనందమే ఉండదేమోనండి.
   ధన్యవాదాలు.

 5. మీరు చెప్పిన విధానం కళ్ళముందే జరుగుతున్నట్టుగా అనిపించింది, మీ నిబద్ధత కు Hats off!!

 6. నిబద్దత,చేసే పని పట్ల అంకిత భావం, కొంత సాహసం..కొంత ఆత్మ సంతృప్తి .. కోసం మీరు చేసిన పని హర్షిస్తూ..
  నిజమే నండీ.. ఎవరి పిచ్చి వారికి ఆనందం.

 7. దీక్షితులు గారు,

  మీ ‘డీప్’ ఇన్వాల్ మెంట్ దీక్షితులు అన్న మీ టైటిల్ కి సరిగ్గా సరి పోయింది !

  చీర్స్
  జిలేబి.

 8. నిజంగా హాట్సాఫ్ సర్.
  ఈత వచ్చిన, మీరు అంట కష్టపడి బాగుచేయడం నిజంగా గ్రేట్. అంత dedication, professionalism, ఈ రోజుల్లో తక్కువగా చూస్తున్నాను, వింటున్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s