శర్మ కాలక్షేపంకబుర్లు-పట్టుకో!

పట్టుకో!

శ్రీ (జలతారు వెన్నెల), శ్రీ(మూర్తి) గార్లు ఏకగ్రీవంగా, ఒక మాటపట్టుకుని మీరు టపా రాసెయ్యగలరని, నాకో పతకం మెడలో వేసేసేరు. ఇద్దరు పెద్దలు ఒక మంచి పతకం మెడలో వేసినపుడు ఒక మాట “పట్టుకు”ని టపా రాయకపోతే ఎలా అని అలోచిస్తే పట్టుకోడం మీద మంచి పట్టే చిక్కి భాగవతంలో మంచి సంఘటన గుర్తొచ్చింది. అవధరించండి.

యశోదమ్మ చల్ల చేసుకుంటూ ఉంది. కిట్టయ్య వచ్చి ఆకలేస్తోంది, పాలిమ్మని మారాం చేస్తూ చల్ల చిలికే కవ్వం పట్టేసుకున్నాడు. కవ్వం ఆపు చేసి కన్నయ్యను ఒడిలోకి తీసుకుని పాలివ్వడం మొదలు పెట్టింది. ఈ లోగా దాలి మీద పెట్టిన కుండలో పాలు పొంగుతూ ఉంటే దింపివద్దామని కన్నయ్యను కిందకు దింపి లోపలికి వెళ్ళింది. కన్నయ్యకు కోపం వచ్చేసింది, నా ఆకలి కంటే పాలెక్కువా? అని, మిధ్యా కోపంతో చల్లకుండ బద్దలు కొట్టేసి, వెన్న తీసుకుని, గోడపక్కనే ఉన్న కర్ర రోలు తిరగేసి ఎక్కి, వెన్న కోతులకు పెట్టడం మొదలెట్టేడు. యశోదమ్మ పాలు దింపి వచ్చేటప్పటికి జరుగుతున్నది చూసి, కన్నయ్య మీద కోపం తెచ్చుకుని, పట్టుకోడానికి బయలు దేరింది, శిక్షించడానికి.

స్తన భారంబున డస్సి క్రుస్సి యసదై జవ్వాడు మధ్యంబుతో
జనిత స్వేదముతో జలత్కబరితో స్రస్తోత్తరీయంబుతో
వనజాతేక్షణ కూడబాఱి తిరిగెన్ వారించుచున్ వాకిటన్
ఘన యోగేంద్రమనంబులన్ వెనుకొనంగాలేని లీలారతున్…….భాగవతం దశమస్కం…369

అమ్మ ఇలా కష్టపడుతోంటే, పట్టుకోడానికి, కన్నయ్య, స్థంభాలు అడ్డంపెట్టుకుని, దాగుడు మూతలాడుతున్నట్లుగా, వాటి వెనక దాగి అమ్మా! కొట్టొద్దమ్మా, ఇంకెప్పుడు అల్లరి చెయ్యనమ్మా అని కళ్ళు నులుపుకుంటూ, కాటుక ముఖం నిండా చేసుకుని ఏడుపు నటిస్తున్న కన్నయ్యను పట్టుకోడానికి ప్రయత్నం చేస్తోంది పిచ్చి తల్లి యశోద. మొత్తానికి అమ్మ బాధ చూడలేక దొరికిపోయాడు, పట్టేసుకున్నాననుకుంది. పట్టుకుని ఇలా అనుకుంది అన్నారు పోతనగారు.

పట్టిన పట్టుబడని నిను,బట్టెదమని చలము కొనిన బెట్టే
పట్టుపడవండ్రు పట్టీ పట్టుకొనన్ నాకుగాక పరులకు వశమే……భాగవతం దశమస్కం…373

నువ్వెవరికి దొరకవట, నిన్ను పట్టుకోడానికి మరొకరికి వశమా నాకు గాక అనుకుంది పిచ్చి తల్లి. ఇది నిజంకాదని ప్రేమకి, భక్తికి మాత్రమే పట్టుబడతానని కన్నయ్య చెప్పక చెప్పేడు తరవాత. మనకి పట్టుకోడందాకానే ప్రస్తుతం, కాని కట్టేసే ప్రయత్నం కూడా చూసేద్దాం.లీల గొప్పది కనక. శిక్షించాలి ఎలా? ఒక చేత్తో కన్నయ్యను పట్టుకుని, కవ్వానికి చుట్టేతాడు పట్టుకొచ్చి కన్నయ్యని కట్టేయబోయింది. చాలలేదు, రెండంగుళాలు తక్కువొచ్చింది. మరోతాడు తెచ్చింది. అదీ అంతే తక్కువొచ్చింది. మళ్ళీ మళ్ళీ తాళ్ళు తెచ్చి కట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంది.కాని చిన్ని కన్నయ్య బొజ్జ తిరిగిరావడానికి కట్టడానికి రెండంగుళాలు తక్కువ వస్తూనే ఉంది.యశోద విష్ణు మాయకు లోబడిపోయింది. అమ్మ పడుతున్న శ్రమ చూసి కన్నయ్య కట్టుబడిపోయాడు. మొల చుట్టూ తాడు కట్టేసి ఆ తాడు కర్రరోలుకి కట్టేసేను అనుకుంది,కట్టేసింది, పిచ్చి తల్లి యశోద. పట్టుకోడం నుంచి కట్టుకోడం దాక వెళ్ళిపోయాం. పట్టివిడువరాదూ రామా నా చేయి పట్టి విదువరాదు అన్నారు త్యాగయ్య. వేమన తాత

పట్టు పట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేని బిగియ బట్టవలయు
పట్టి విడుచుటకన్న బరగ జచ్చుట మేలు
విశ్వదాభిరామ వినుర వేమ. ….అన్నాడు.పట్టుకోడం లోనే ఇన్ని తిరకాసులూ ఉన్నాయి.

నేటి కాలానికొస్తే పట్టుకోడం పెద్ద ప్రహసనమైపోయింది, ప్రతి విషయంలోనూ. భారత దేశం లో దాడులకు మూలమైన వారు మీదేశం లో ఫలానా ఊళ్ళో ఫలానా వీధిలో, ఫలానా ఇంట్లో ఉంటున్నాడు, వాడి పేరిది పట్టుకోండంటే, ఇద్దరం కలిసి పట్టుకుండామంటారేమీ, అర్ధం కాదు. మీ దేశం లో ముడుపుల కేస్ లో కావలసిన వాడిని మా దేశం లో పట్టుకున్నాం, వచ్చి కారణాలు చూపించి తీసుకుపొమ్మంటే, అబ్బెబ్బే! వాడు మావాడే వాడి మీద కేస్ అప్పుడు గోల భరించలేకపెట్టేం తప్పించి శిక్షించడానికి కాదన్నట్లు వాణ్ణి అక్కడనుంచి పట్టు వదిలించే ప్రయత్నం చేసి సఫలీకృతులమయ్యాము కదా. బస్ లో జనం ఉండగా బస్ మీద లోపలి వాళ్ళమీద పెట్రోల్ చల్లి అంటిచిన వాడిని పట్టుకుని కేస్ పెట్టి శిక్ష వేయిస్తే, ఆ తరవాత రాజకీయ కారణాలతో శిక్షలు రద్దు చేయిస్తూ ఉంటే, మేము పట్టుకుని ఈ అవస్థ అంతా పడటమెందుకని పోలీసులనుకుంటే తప్పుకాదుకదా. ఇప్పుడు, వారం రోజుల కితం, కాళ్ళకీ, చేతులకీ బేడీలు గొలుసులు ఉన్న సైకో సాంబశివరావు కష్టడీ నుంచి పారిపోతే పట్టుకోడానికి ౩౦౦ పోలీసులు తిండి, నిద్ర లేక గాలిస్తున్నారు, కాని పట్టుకోలేకపోయారు. ఎ.సి.బి వారు, సి.బి.ఐ వారు కేస్ లు పట్టుకుంటూనే ఉన్నారు. ఉపయోగం మాత్రం కనపడటం లేదు.

అమ్మాయి చదువైపోయింది, ఉద్యోగం కోసం ఎవరిని పట్టుకోవాలో, ఎంత సొమ్ము లంచంగా పట్టుకోవాలో తెలీక తలపట్టుకు కూచున్నాం. మరి ఆ తర్వాత పెళ్ళికెంత పట్టుకోవాలో అదీ తెలియటంలేదు.ఈమధ్య కర్ర పట్టుకుంటే కాని ఎక్కడికీ కదలలేకపోతున్నాను.

వీటన్నిటినీ పట్టుకోక శ్రీహరి పాదాన్ని, నామాన్ని పట్టుకుందామంటే మనసు చెప్పిన మాట వినటం లేదు. పట్టు చిక్కడానికి మరేం పట్టుకోవాలో 🙂

20 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పట్టుకో!

 1. పట్టుకో పట్టుకో..
  అంటూ…
  ఇలాంటి విషయాల మీద మీకున్న పట్టు చూపించారు శర్మ గారూ!
  చాలా బాగుంది…యసోదాక్రిష్ణుల ప్రహసనం…
  @శ్రీ

  • @
   శ్రీ గారు,
   మీరు మాట పట్టుకు టపా రాసేస్తారంటే పట్టుకోడం మీద ఆలోచిస్తే కృష్ణ లీల గుర్తొచ్చి రాశాను.
   ధన్యవాదాలు.

  • @మిత్రులు పంతుల గోపాలకృష్ణారావు గారు,
   పట్టు అనే మాట మీద మంచి శ్లేష చేశారు.
   ధన్యవాదాలు.

 2. సర్ చాలా చక్కగా ఉంది మీ వర్ణన భావం. ఇంకా చదవాలి అనిపించింది. సర్ ఎలాగూ పట్టుకున్నారు కదా ఈ ” శ్రీ ” లు ఎవరెవరో పట్టుకోండి, ఈ మద్యనే తెలిసింది వెన్నెలగారు కూడా ఈ పేరుతో ఉన్నారని.

  • @అనూరాధాదేవి గారు,
   కన్నయ్య బాల్య లీలలు చదువుకుని, ఆనందం అనుభవించగలగడం నిజంగా ఒక భోగమే!
   ధన్యవాదాలు.

 3. ‘ తల్లి యశోద పట్టుటలు ‘ తానుగ పోతన చూచి నట్టు లా
  యల్లిక లద్భుతమ్ములు – మహాత్ముల సొంతము దివ్యదృష్టి – ఆ
  యల్లరి కృష్ణు బట్టి హృదయాంతర మందిర మందు కట్టగా
  జెల్లును శర్మగారు ! తమ చిత్తము భక్తి ప్రపత్తి కల్మిడిన్ .
  —– సుజన-సృజన

  • @@మిత్రులు లక్కాకుల వెంకటరాజారావు గారు,
   కన్నయ్యను మదిలో కట్టిపడెయ్య గలిగితే అంతకుమించిన ఆనందం మరొకటి ఉందంటారా!
   ధన్యవాదాలు.

  • @అమ్మాయ్ జ్యోతిర్మయి,
   ఈ బళ్ళో ప్రేమ తప్పించి, దండనలుండవుకదా! కావలసినది నేర్చుకుంటే సంతోషమే.
   ధన్యవాదాలు.

  • @హేమా మురళి గారు,
   చాలా కాలానికి కనపడ్డారు, కులాసాగా ఉన్నారా. అదో పనిలా రాసుకుంటూ పోతున్నా. మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

   • హహహ…నన్ను గుర్తు పెట్టుకున్నందుకు చాల సంతొషంగా ఉంది.కులాసగా ఉన్నాం.
    నేను ప్రతీ రొజూ మీ టపా కొసం ఎదురుచూస్తూ ఉంటాను. అలాగే మీ టపా ని చాలా సార్లు చదువుతుంటాను కూడా.
    అనేక సంధర్భాలలొ ఆ విషయం గురించి మీరేమన్న వ్రాసేరా అని కూడా వస్తూ ఉంటా. రొజూ రాత్రి పడుక్కునే ముందు మీ టపా పడిందేమో చూడటం ఒక ఆనవాయితీ.
    అన్నట్తు మేము ఒబామ గారి ఇంటికి దగ్గిరలొనే వుంటాం .మా ఇంటికి కూడా తప్పక రావలండొయ్ . మరిచేరు సుమా.

  • @హేమ మురళి గారు,
   సాధారణంగా మరచిపోనండి, కాని వయసొస్తోంది కదండీ, పేర్లు గబుక్కున గుర్తురావు 🙂
   మీ కులాసా చెప్పినందుకు ఆనందమయింది.
   మీరు ఆరు నెలలకి ఒక సారి పలకరించినా చెవుల్లో అమృతపు చినుకులు పోశారు.
   నా బ్లాగును మీరింత ఆదరించినందుకు కృతజ్ఞతలు.
   ఒబామా గారింటి పక్కనే మీ ఇల్లయితే సమస్యే లేదు. తప్పక వచ్చేస్తాం. మీరింత ఆదరంగా పిలిస్తే వచ్చేస్తాం. మరచిపోయే ప్రసక్తి లేదు. వచ్చి పది..హేను రోజులుండిపోతాం.
   ధన్యవాదాలు.

 4. మాస్టారు !!.
  మీరు శ్రీహరి పాదాన్ని, నామాన్ని పట్టుకుందామంటే మనసు చెప్పిన మాట వినటం లేదు. పట్టు చిక్కడానికి మరేం పట్టుకోవాలో !! అను కోవడం బాగుంది.
  బ్లాగ్ లోకం మిమ్మల్ని పట్టుకుని విడవనంటుంది. ఇది ఇంకా బావుంది.
  రెండు చేసేయండి.. “కర్ర పట్టుకుంటే ..కాని ఆనే ఆలోచన రాదు.” నవ్యోత్శాహం తో.. ఇంకా ఇంకా మంచి విషయాలు చెపుతూ..అలరించాలని కోరుకుంటూ..

  • @
   వనజ గారు,
   మీ అభిమానానికి ధన్యవాదాలు. బ్లాగులోకం పట్టుకుని వదలనంటోందండీ!
   ధన్యవాదాలు.

 5. హా హా హా ..పట్టుకోవడం మీద టపా!! అది కూడా ఇంత చక్కగా కృష్ణ లీల గురించి చెపుతూ మళ్ళీ ఈ రోజుల్లో పట్టుకుని శిక్షించలేకపోతున్న నేరస్తుల గురించి రాసారు.ఈ మధ్య నేను ఫోన్ లో ఒక పెద్ద మనిషిని ఎలా పట్టుకోవాలా అని తెగ ప్రయత్నించానండి..భలే ఉంది మీ టపా!! నాకు నచ్చిందోచ్!

  • @
   శ్రీగారు,
   ఫోన్ లో దొరకకుండా పోయేవారు దొరకరండి. దొరకపుచ్చుకోవాలి, తప్పదుకదా.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s