శర్మ కాలక్షేపంకబుర్లు-కూచుని లేవలేదు……

కూచుని లేవలేదు…..

నిన్న అబ్బాయి కేంప్ కెళ్ళిపోయాడు, మనవరాలు, కోడలు కలిసి కోడలు పుట్టింటి కెళ్ళేరు. ఇంట్లో ఇల్లాలు నేను మిగిలేము. ఇద్దరం కంప్యూటర్ దగ్గర చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉండగా, “చిరాకేసేస్తోందండీ!, ఎక్కడికేనా నాలుగురోజులు తిరిగిరావాలని ఉంది” అంది. “నిజమేనోయ్! నాకూ చిరాగ్గానే ఉంది, ఏంచేద్దాం” అనుకునే లోగా ఒక మెయిల్ కనపడింది, “ఎక్కడినుంచీ” అంది, “అదా! జిలేబీ గారి దగ్గరనుంచిలే, ఒక సారి విదేశాలలలో, మన మిత్రులందరిని చూసొస్తేనో!” అన్నా, “అలాగే” అంది. “ఎటుబయలు దేరుదా”మన్నా. “తూర్పుగా ప్రయాణానికి మంచిదన్నారుగా,అటే వెళదాం. అన్నీ విదేశాలే అంటున్నారు, మరి దేశంలో వాళ్ళో” అంది. “వాళ్ళని మరో సారి చూద్దాం.” “ముందు తూర్పుగా అంటే సింగపూర్ లో దిగుదాం.” “సరే అక్కడికి వెళ్ళడం, హైదరాబాద్ నుంచా చెన్నై నుంచా” అంది. “చెన్నై నుంచి వెళదాం. ముందు చెన్నై లో మనవరాలిని చూసినట్లవుతుందిగా” అన్నా. “సరే చెన్నై నుంచి సింగపూర్ వెళ్ళి స్నేహితుల్ని చూస్తాం, ఆ తరవాత హాంకాంగ్,ఇండోనీసియా, వియత్నాం,మలేసియా,ధాయ్ లేండు,లో మిత్రులని చూద్దాం. అది సరే, ఇవన్నీ దగ్గరవి కదా అందుకు మిత్రులు దగ్గర సింగపూర్ లో ఆగి అక్కడినుంచి మిగిలినవారిని చూసేద్దాం. ధాయ్ లేండులో అనుకుంటా, కాదుట, మిత్రులు చెప్పేరు, కాంబోడియాలోనట,మన దేవాలయం పెద్దది చాలా పురాతనమైనది ఉందిట, అంగకోర్ వాట్, అది చూద్దాం. ఆ తర్వాత అక్కడినుంచి బయలుదేరి ఆస్ట్రేలియా లో అడిలైడ్ లో శారద గారి దగ్గర దిగుదాం. అక్కడమనకి మంచి స్నేహితులున్నారు. అన్నట్లు మరిచిపోయాను, ఇప్పుడు ఆస్ట్రేలియా లో చలి బాగా ఉన్నట్లుంది, చలికాసుకోడానికి మంచి సరంజామా తీసుకెళ్ళాలి,” అన్నా. “అన్నట్లు ఏమేం పట్టుకెళ్ళాలి” అంది. “ఆ!, మనకి ప్రయాణం లో కావలసినవి, మనకి చాలా కాలం కితమే, మనవాడయిన బారిష్టర్ పార్వతీశం గారు చెప్పేరు, లిస్ట్ ఉందిలే, ఆయన రాసినది, ఆయనేమి పట్టుకెళ్ళినది చూసి మనం పట్టుకెళ్ళిపోతే సరిపోతుందిగా” అనుకున్నాం. 🙂

ఆస్ట్రేలియాలో స్నేహితుల దగ్గర నుంచి న్యూజిలేండ్లో మిత్రులను చూసొచ్చి సౌత్ కొరియా వెళ్ళి మిత్రులను చూద్దాం. ఆ తర్వాత జపాన్ చేరి అక్కడ మిత్రుల దగ్గర నాలుగు రోజులుండి అమెరికా వెళదాం.” “అదేమిటీ అమెరికా ఇలా పడమటి వేపునుంచికాదా వెళ్ళడం.” “అలాగా వెళ్ళచ్చనుకో తూర్పు కెళ్ళిపోయాం కదా అటునుంచి అటే వెళ్ళచ్చు. మనం అలా వెళ్ళి అమెరికా లో దిగుదాం.” “అమెరికా అంటున్నారు, అదేం మన పాశర్లపూడి కాదు, పెద్ద ఖండాలు రెండు,చాలా దేశాలు, అక్కడ మనవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒకళ్ళ దగ్గరకెళితే మరొకరికి కోపం రాదూ!” “నిజమేనోయ్! పోనీ మనవరాలు దగ్గరకెళ్ళి, అక్కడినుంచి వెళదాం.” “చదువుకుంటూ ఉంది కదా, దాని చదువు చెడకొడతారా! మీవన్నీ ఇటువంటి అలోచనలే!” “అంత దూరం వెళుతూ దాన్ని చూడకపోతే బాధపడుతుంది కదే!” “అసలు మీకు మనవరాల్ని చూడాలని ఉందని చెప్పచ్చుగా.” “అక్కడికి దాన్ని చూడాలని నీకులేనట్టూ?” “ప్రేమ కారిపోతోంది, మీకే మనవరాలా అది, నాకు కాదేంటి.” “అన్యాయమే, ఆడపిల్ల ఒక్కత్తీ ఉందికదే, బంగారుతల్లి బుద్ధిగా చదువుకుంటూ ఉంది కదే, చూసొచ్చేద్దాం.దాని చదువు చెడకొట్టను సరేనా!. దాని దగ్గర మకాం వేసి మిగిలిన వాళ్ళని చూసొస్తే గొడవలు రావు లేకపోతే నా దగ్గర ఉండకుండా ఎక్కడుంటావ్ బాబాయ్! అని దెబ్బలాటకొచ్చేస్తుందే,అమ్మాయి. మా ఇంటికి రాకుండా ఎక్కడికెళతారని శ్రీగారు గొడవ చేసేస్తారే. అమ్మో ఇంకా ఎన్ని గొడవలొస్తాయో! మనవరాలు దగ్గరికెళ్ళిపోదామే, బతిమాలుతున్నా కదా!” “సరే! దాని చదువు చెడగొట్టనని అంటేనే సుమా! మీరు తిన్నగా ఉండరు, అందుకు నా భయం.” “పిచ్చిపిల్లే! దాని దగ్గర నాలుగురోజులున్నట్లూ ఉంటుంది, అక్కడినుంచి ఒక రోజు పనామా వెళ్ళి స్నేహితుల్ని చూసొచ్చేద్దాం. ఆ తరవాత అమెరికా లో స్నేహితుల దగ్గర ఒక్కొకరిదగ్గర ఒక్కొకరోజు ఉండి, ఆ తరవాత కెనడా లో స్నేహితుల దగ్గరకెళదాం.” “అమ్మో! మనం ఎక్కడికెళ్ళినా ఎండలు బాధపెట్టేలా ఉన్నయోయ్! అమెరికా లో ఎండలు దంచేస్తున్నాయిట.” “సరే లెండి మనం వెళ్ళేటప్పటికి సద్దుకోవూ.” ” నిజమేలే.”

“అన్నట్లు మరిచిపోయా మీ జిలేబీ గారెక్కడా?” అంది. అది చీక్రెట్ రహస్యం కాని ఆమె మనల్ని కలుస్తార”న్నా. “అమెరికా నుంచి జర్మనీ వెళ్ళి మధురవాణి గారిదగ్గరా, లేకపోతే యు.కె లో డాక్టర్ సుధాకర్ గారి దగ్గరనుంచో బయలుదేరి మిగిలిన దేశాలు తిరిగొద్దాం.” “ఎక్కడ బాగుంటుందంటారు.” “ఎవరి దగ్గర వీలు కుదురుతుందో కనుక్కుందాం.” “అక్కడినుంచి ఎవరెవరిని చూడాలి?.” “అక్కడినుంచి హాలెండు, డెన్మార్క్,స్వీడన్,నార్వే,పోలాండ్,స్పైన్, స్విజర్లేండ్, నెదర్లేండ్,ఐర్ లేండ్,బెల్జియం, ఫ్రాన్స్, లిథూనియా,యూక్రెయిన్,చెక్ రిపబ్లిక్, దేశాలలో మిత్రులని చూసి వచ్చేద్దాం.” “ఇదీ బాగానే ఉంది, కాని అందరినీ వరసలో చూసుకుకుంటూ వెళ్ళాలి, ఎవరిని మరిచిపోయినా బాధ పడతారు సుమా.”అంది. “సరే! ఆ తరవాత ఘనా వచ్చేద్దాం, అక్కడి మిత్రులను చూద్దాం.అక్కడినుంచి ఇటలీ వెళ్ళి,మిత్రులను చూసి, ఏది మన సోనియమ్మ గారి ఊరు, అదే ఇటలీ నుంచి, సౌత్ ఆఫ్రికా లో మిత్రులను చూసి సౌదీ అరేబియాలో ఆగుదాం, అక్కడినుంచి, కువైట్,బెహరిన్,ఓమన్,కటార్,యూ.ఎ.యి దేశాలలో మిత్రులను చూసి మళ్ళీ సౌదీ వచ్చేద్దాం. మరి బంగ్లా దేశ్ లో మిత్రుల్ని మరిచిపోయననుకున్నావా? వారిని కోల్కతా అదేనోయ్ మనం కలకత్తా వెళ్ళినపుడు వెళ్ళి కలుద్దాం. అక్కడినుంచి ముంబై అబ్బాయి దగ్గరికొద్దాం. అక్కడ నాలుగురోజులుందాం. కొత్తగా కాపరం పెట్టేడు ఎలా ఉన్నాడో, కోడలేం అవస్థలు పడుతోందో, మనవరాలు డేన్స్ ప్రోగ్రామ్స్ ఏం చేసిందో, చూసి హైదరాబాద్ వచ్చేద్దాం.” అక్కడ మీ అన్నయ్య ఉన్నారుగా”అంది. “మరిచిపోయాలే, మనమూ చూసివద్దాం. హైదరాబాద్ లోఅమ్మాయిల్ని,మనవడిని, మనవరాళ్ళని,ముని మనవరాలిని చూసేసి గోదావరి ఎక్కేద్దాం, ఇంటికొచ్చేద్దాం, సరేనా.” “ఇంతమందిని చూసేస్తున్నాం కాని బెంగళూరులో మనవడిని చూడటం లేదు. వాణ్ణి హైదరాబాద్ వచ్చెయ్యమందాం. అలాగేకాని, ఒంటి గంటవుతోంది దేవతార్చన కానివ్వరా? లేవండి మరి” అంది. “ఉండవోయ్ కాళ్ళు పట్టేశాయి. లేస్తున్నా కదా. అరగంట కూచుంటే కాళ్ళు పట్టేశాయి!”. “అహహ! బలే ఉందండి! కూచుని లేవలేదు కాని ఒంగుని తీర్థమెళతానందట” మీలాటిదే!” “అదీ నిజమే సుమా!!. అందుకే మాటలు కోటలు దాటుతాయి కాని కాళ్ళు గడప దాటవని సామెత కదా.”

“పోనిద్దురూ! మనం మనుషులం వెళ్ళలేకపోయినా మన మనసులు ఒక సారి మన మిత్రులు, బంధువులు అందరినీ చుట్టేశాయి కదా!!!”అంది “నిజమేలే! అదే సంతోషం.”

ప్రకటనలు

32 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కూచుని లేవలేదు……

 1. తమిళంలో ఉలగం సుట్త్రుం వాలివన్ అనే సినిమా ఉంది. అంటే లోకంచుట్టిన వీరుడు. అందులో హీరో MG రామచంద్రన్ లాగా మీరు మీ సినిమా లోకం చుట్టేశారు. బంధు మిత్రులని అంతలా గుర్తున్చుకోవడమే ఒక మధురానుభూతి, ప్రయాణ అనుభూతి కూడాను. Rayala Kumar

  • @రాయలకుమార్ గారు,
   నా బ్లాగుకు స్వాగతం.
   కదలి వెళ్ళలేనపుడు వారిని తలుచుకుని ఆనందించడం కన్న చేయగలది ఉండదుకదా. అదొక మధురానుభూతి.
   ధన్యవాదాలు.

 2. round the world in eighty days…లాగ
  ఓ డెభ్భై వాక్యాల్లో ప్రపంచ యాత్ర చేయించేసారు శర్మ గారూ!
  (కానీ ఖర్చు లేకుండా…:-)))…..)
  @శ్రీ

 3. >>దాని దగ్గర మకాం వేసి మిగిలిన వాళ్ళని చూసొస్తే గొడవలు రావు >>
  ఎందుకురావు వస్తాయి..వస్తాయి..రాకరాక వచ్చారు నాలుగు రోజులన్నా ఉంటారనుకుంటే…అలా వెళ్ళిపోతే మా అత్తగారింట్లో నాకు మాటొచ్చెయ్యదూ…”ఎప్పుడూ మా బాబాయ్ మా బాబాయ్ అంటావ్, వాళ్ళు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారేం?” అనడగరూ నన్నూ…ఈ సారి తప్పకుండా పదిరోజులన్నా మా దగ్గర ఉండేలా రండి. :)))

  మీ ప్రయాణం బావుంది. అరగంటలో ప్రపంచమంతా తిరిగి వచ్చారే…

  • @అమ్మాయి జ్యోతిర్మయి,
   అమ్మో! నీకు అత్తారింటిలో మాటొస్తే ఎలా తల్లీ! పది రోజులేమిటీ… పది ..హేను రోజులుండిపోతాం. సరేనా. 🙂
   కదలలేనపుడు మనసుతోనయినా కావలసినవాళ్ళని చుట్టిరావాలి కదమ్మా.

   ధన్యవాదాలు.

  • @మిత్రులు లక్కాకుల వెంకటరాజారావు గారు,
   నలుగురుతో బాగా ఉండు అన్నారు కదండీ! అందుకు ఇంతమంది బంధు మిత్రులను పోగుచేసుకున్నాం. ఈ జన్మకి ధన్యులం. 🙂
   ధన్యవాదాలు.

 4. శర్మ గారు,

  ఇంతకీ జిలేబీ గారి ఉత్తరం విషయం దాటేసారు మరి. ఏమి మెయిలు రాసారండీ జిలేబీ గారు ?

  చీర్స్
  జిలేబి.

 5. మీ దంపతుల ముచ్చట్లు బాగున్నాయండి….
  నిజమేనండి. అప్పుడప్పుడూ అలా వెళ్ళి నాలుగు ఊళ్ళు చూసి రావాలనిపిస్తుంది.

  • @అనూరాధాదేవి గారు,
   దంపతులు అలా ముచ్చట్లాడుకుంటేనే బాగుంటుంది.
   నాలుగూళ్ళు తిరిగి నలుగురు మిత్రులను చూస్తే ఉల్లాసం కదండీ.
   ధన్యవాదాలు.

 6. శర్మ గారు,
  జూల్స్ వెర్న్ పుస్తకం ఒకటుంది 80రోజుల్లో భూప్రదక్షిణం అని. మీకైతే 8 నిముషాల్లో అయిపోయినట్లుంది! బాగుంది.
  అన్నట్లు శ్రీరాంగారని ఒకాయన అడిగారని శ్యామలీయం బ్లాగులో మహాభాగవతాంతర్గతసృష్టిక్రమం వివరణము వ్రాస్తున్నాను, (నా బ్లాగుకు ప్రచారం కోసం కాదండి) మీకు ఆసక్తి ఉంటుందనిపించి చెప్పాను.
  శ్యామలరావు.

  • @మిత్రులు శ్యామలరావుగారు,
   చిన్నప్పుడు చదివేనండి.జిలేబీ గారు అన్న ఒక మాటకి ఇలా రాస్తే అనిపించి రాశా.
   మీ బ్లాగు తప్పని సరిగా చూస్తూ ఉంటాను. మొన్న చూశాను.నిన్నటి మీపోస్ట్ చూశాను. బాగుంది వివరణ, మీ బ్లాగులో కామెంట్ పెట్టడానికి ఉండదు కారణం, విషయం నిర్దుష్టంగా ఉంటుంది, కామెంట్ చేయగలది ఉండదు, బాగుదనాలి. మాది ఉత్తి కబుర్లు కదా!

   ధన్యవాదాలు.

 7. శర్మ గారూ,
  వొచ్చేయండి మరి!
  నిజమే, చలి చంపేస్తుంది ఇక్కడ. బోలెడన్ని స్వెట్టర్లూ, మీ కబుర్లూ, ఏవీ మరిచి పోకుండా పట్టుకురండి. తెల్లవార్లూ కూర్చుని మీ మాటలు వింటాం.
  అభిమానంతో
  శారద

  • @శారద గారు,
   చలి చంపేస్తోందంటున్నారు కదా! తగ్గనివ్వండి, ఈ లోగా పట్టేసిన కాళ్ళు సరిచేసుకుంటా. వచ్చేస్తాం. మీదగ్గర పదిహేను రోజులుండి పోయి బోర్ కొట్టేసి, కబుర్లు చెప్పేసి, వీళ్ళెప్పుడు పోతారురా బాబూ అనిపించేసి వచ్చేస్తాం. 🙂
   ధన్యవాదాలు.

 8. ఐతే ప్రపంచమంతా తిరిగేసరన్నమాట అరగంటలో . బలే ఉంది. ఓ పావు గంటలో మన దేశం కూడా చుట్టేయండి.
  బాగుంది మీ టపా. మనలో మన మాట, ఆ ఆంగ్కోర్ వాట్ దేవాలయం కంబోడియా లో ఉండనుకుంటండి.

  • @వెంకట్ గారు
   ఏదండీ ఈ సారి కాళీ చేసుకుని ఒక సారి మన దేశంలో మిత్రులను చూసెయ్యాలి. 🙂
   అంగకోర్ వాట్ కాంబోడియాలో ఉన్నట్లు సరి చేస్తా.
   ధన్యవాదాలు.

 9. అన్నింటికన్న వేగంగా ప్రయాణించేది మనసు అని చాలా అనుబంధాలతో కలిపి చెప్పారండీ. బాగుంది…

  • @G.S.Lakshmi గారు,
   మనసుకన్న వేగంగా ప్రయాణించేది లేదు దానికి అనుబంధాలు కలుపుకుంటే ఇంత అందంగా ఆనందంగా ఉంటుంది.

   ధన్యవాదాలు.

 10. హ హ భలే చుట్టేసారండి…ప్రపంచ యాత్ర తరువాత ఎప్పుడన్నా భారత దర్శిని కూడా చేస్తే మైసూరు రావటం మరిచిపోకండి :))

  • @శేఖర్ గుంటూరు గారు,
   మీ ఆహ్వానానికి మా మన్నింపు. తప్పక వస్తాం. మీరింత ఆత్మీయంగా పిలిచినపుడు వచ్చి మీదగ్గరే ఉండిపోతాం, ఒక వారం. 🙂
   ధన్యవాదాలు.

 11. అసలు అమేరికా వచ్చి నా దగ్గర, జ్యోతిర్మయి గారి దగ్గర చెరొక వారం ఉహు…ఒక 10 రోజులు ఉండకపోతే వదిలేదెలేదు. అసలు మీరు రావాలే కాని, అంతకంటే ఆనందం ఉంటుందాండి? అదిరింది మీ టపా అసలు…మీకు ధన్యవాదాలు ఈ టపా లో మీ world tour వివరాలు తెలిపినందుకు.

 12. ప్రపంచ యాత్ర రికార్డ్ టైమ్ లో పూర్తి చేసినందుకు అభినందనలు,హ, హ భలే రాస్తారండి మీరు.

 13. హహహ! బాగుంది తాతగారూ! మనసు అన్నిటికన్నా వేగంగా ప్రయాణిస్తుంది. దానితో మొత్తం ప్రపంచ యాత్ర అయిపోయిందనమాట. నా దగ్గర ఉండటానికి నాలుగు రోజులేనా??? :(:(

  • @అమ్మాయి రసజ్ఞ,
   మనసు ముఖ్యం కదా!
   రావడానికి అమ్మమ్మని ఎంత బతిమాలేనో చూశావుకదా! ఈ సారి నాలుగు..కాదులే వారం.. అదుగో అలా బుంగమూతి పెట్టకు… ప..ది రోజులు…అయ్యయ్యో! నువ్వలా దిగులు మొహం పెడితే నేను తట్టుకోలేనురా! పద్…హేను రోజులుండి పోతాం. అహహ,,నవ్వాలి..బంగారు తల్లి బాగా చదువుకోవాలి…పైకిరావాలి…పేరుతేవాలి మరి….నవ్వమ్మా…అదీ అదీ..సరేనా… 🙂
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s