శర్మ కాలక్షేపంకబుర్లు-పంచదారచిలక.

పంచదార చిలక.

మరువంపు మొలకవో, పంచదార చిలకవో, ఎవరివో నీవెవరివో అని పాడుకునేవాళ్ళం, పెళ్ళయిన కొత్తలో, పెళ్ళాం పుట్టింటికెళితే. చిలుకలవలె గోర్వంకలవలెను కులుకగ…..మదనా బాలనురా మదనా! విరితూపులు వేయకురా మదనా! బాలనురా మదనా!! సుశీల    గొంతులోనే వినాలి, పంచదార చిలకంత తియ్యగా, ఆ పాట. మా మిత్రుడొకడు “పేదవాడికి పెళ్ళామే భార్య” అని అనేవాడు. ఇదేంటిరా పెళ్ళాం భార్యకాకపోడం అన్నా. ఓరి పిచ్చాడా! సామాన్యుడికి పెళ్ళామే ప్రియురాలు, మరి మాన్యులకి పెళ్ళాం వేరు, ప్రియురాలు వేరు అన్నాడు. అదేంటిరా అంటే చిన్నిల్లు అన్నాడు. ఏమిటంటే అదో తిక్క, దానికో లెక్క అన్నాడు. ప్రియురాలు పంచదార చిలకలాటిదిరా అన్నాడు. అవునా? నా కర్ధంకాలా 🙂

కలిగినవారొకరు ఆడపెళ్ళివారు ఆషాఢపట్టీ పట్టుకెళుతూ పంచదార చిలకలు పోయించారు. ఇదేమిటీ ఆషాఢ పట్టీ అంటారా. పెళ్ళయిన మొదటి సంవత్సరంలో ఆడపెళ్ళివారు మొగపెళ్ళివారింటికి ఆషాఢమాసం లో పట్టుకెళ్ళేదే ఆషాఢ పట్టీ, శ్రావణమాసంలో మొగపెళ్ళి వారు ఆడపెళ్ళివారింటికి పట్టుకెళ్ళేది శ్రావణ తగువు. దీన్ని శ్రావణ పట్టీ అని కూడా అంటారు. ఇదేమిటీ పంచదార చిలకలు పోయించారూ! చిలకలు సూడిదలకి కదా పోయిస్తారన్నా. ఏదో ఒకటి తీపి పెట్టాలి కదండీ, అందుకు చిలకలు కూడా బాగుంటాయని పోయించా మన్నారు. బాగుంది. ఆషాఢ, శ్రావణ పట్టీలలో సాధారణంగా ఇంటి వారందరికి బట్టలు, తీపి, అరటి పళ్ళు, పట్టుకుని వెళ్ళడం రివాజు. శ్రావణ తగువును మాత్రం, సాధారణంగా వరలక్ష్మీ వ్రతం చేసుకునే రోజుకు కోడలికి, పూజలోకి బంగారం వస్తువు పెట్టి మిగిలినవి కూడా అంద చేస్తారు, మగపెళ్ళి వారు, కోడలికి ఆమె పుట్టినింటిలో. దీన్ని శ్రావణ “తగువు” అని ఎందుకన్నారో తెలియదు. ఇవి ఇంకా పల్లెలలో ఆచరణలో ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయి అడిలెయిడ్ లోనూ అబ్బాయి న్యూయార్క్ లోనూ ఉండగా పెళ్ళి ముంబై హోటల్ లోనో హైదరాబాద్ హైటెక్ లోనో జరుగుతూ ఉంటే, వారం రోజుల శలవులో రెండురోజుల పైగా సమయం ప్రయాణంలో పోతే జెట్ లాగ్ తో పెళ్ళిపీటలమీద కూచుని సోలిపోతూ పెళ్ళి చేసుకుని మళ్ళీ విమానలెక్కేసి ఎవరిచోటికి వారు చేరుకుంటూ ఉంటే ఈ ఆషాడపట్టీలు, శ్రావణ తగువులూ ఎక్కడ? కుదురుతాయా?.ఇదంతా చాదస్తం అనుకోరూ? ఆ తరవాత ఛాట్ లో నువ్విక్కడి కొచ్చెయ్యాలంటే, కుదరదు, నువ్వే ఇక్కడికొచ్చెయ్యాలనే తగువులు తప్పించి, శ్రావణ తగువులు కనపడటంలేదు. ఆ తరవాతెప్పుడో కలిస్తే, అమ్మయ్య ఒక కాయకాస్తుందనుకుంటే అమ్మో! పుట్టేవారు అమెరికా గడ్డమీద పుట్టాలి అందుకు పురుడు అక్కడే పోస్తాం, ముసలాళ్ళని రవాణా చెయ్యండి, లేకపోయినా ఫరవాలేదంటే, ఇక సూడిదలెక్కడ? సూడిదలు లేకపోతే పంచదార చిలకలు లేవుగా,నేటి కాలంలో నిజంగా చేద్దామన్నా కుదురుతుందా?.

పంచదార చిలకలేంటొ చెప్పవయ్యా! నీగోలాపి, అంటే. అయ్యా! పంచదారతో పాకం పట్టి దానితో చిన్నవిగా పెద్దవిగా చిలకలు, నెమళ్ళు, హంసలు, పన్నీరు బుడ్లు మరి ఇతర ఆకారాలలో పోసి తయారు చేసినవే పంచదార చిలకలంటారు. ఇవన్నీ సాధరణంగా తెల్లగా ఉంటాయి. ఒక్కొకప్పుడు కొద్దిగా రంగుకూడా వాడతారు. వీటిని చిన్నవిగాపోయించి ఊరివారికి పంచిపెట్టే అలవాటు ఉండేది. వీటిని అందరూ తయారు చేయలేరు కూడా, దానికీ ప్రత్యేకమైన వారున్నారు. సారె, సూడిద, నిజానికిది సూడిద కాదు, చూడిద, చూలు శబ్దం అపభ్రంశమై చూడు అయింది, చూడు తరవాతికాలంలో, వాడుకలో సూడు అయిందనుకుంటా. ముందుచెప్పిన సారె వగైరాలలో ఇచ్చిన వాటిని, వారే ఉంచుకోక ఆ ఊరిలోని వారికందరికీ పంచిపెట్టేవారు. దీనికోసం కొంతమంది డోలు సన్నాయి కూడా పెట్టేవారు, పంచిపెట్టడానికి, వీటిని ఒకటీ లేదా రెండు కావిళ్ళలో పళ్ళేలలో పెట్టుకుని ఒకరు, ఇద్దరు స్త్రీలు ప్రతి ఇంటికీ వెళ్ళి ఇంటివారిని పళ్ళెం అడిగి తీసుకుని వీటన్నిటిని ఒక్కొక వస్తువూ అందులో ఉంచి పట్టుకెళ్ళి ఇంటిలోని పెద్ద ముత్తయిదువుకు బొట్టు పెట్టి అందచేసేవారు. ఆ సందర్భంగా సంభాషణలు స్త్రీల మధ్య బహు రమ్యంగా ఉండేవి, చతురోక్తులతో. ఈ పంచదార చిలకలని జాగ్రత్తగా భద్రపరచేవారు కొందరు, పెద్దవాటిని, అద్దాల బీరువాలలో పళ్ళాలలో పెట్టి ఆ పళ్ళాలు మరొక నీరు పోసిన పళ్ళెంలో పెట్టి భద్రపరచేవారు, చీమలు పట్టకుండా. వీటిని మొదటి రాత్రికిగాను శోభనం గదిలో ఉంచే ఆచారం కూడా ఉంది, కొత్త దంపతుల ఫలహారం కోసం. ఫలహారాలన్నీ లెక్కపెట్టి పెట్టేవారు. మళ్ళీ ఉదయం లెక్కచూసేవారు, దంపతులు ఏమితిన్నారు? ఎన్ని తిన్నారు, వారి అభిరుచి ఏమిటి అని తెలుసుకోడానికే,అభిరుచులు ఎలా కలిసేయి అన్నది తెలుసుకోడానికి. మానవ మనస్తత్వాలని ఇంత దగ్గరగా పరిశీలించేవారు, మరిప్పుడో!, పరిశీలించే తీరికా లేదు, అంత అవసరమూ కనపడటం లేదు, ఎందుకంటే అందరూ మేధావులు, బాగా చదువుకున్నవారు. అప్పుడు పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తులతో పాటు రెండు కుటుంబాల కలయిక, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సంబంధం. పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెబుతున్నావు, నీ మెదడు ఏభై ఏళ్ళ నుంచి ఎదగడం మానేసిందంటారా, నిజమేనేమో!!!

ప్రకటనలు

20 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పంచదారచిలక.

 1. ఇక్కడ అమ్మవార్ల జాతరలప్పుడు తప్పనిసరిగా ఉంటాయి పంచదార చిలకలు….చూడగానే కొనుక్కుని కస్సుక్కున కొరికి చప్పరించేయాలనిపిస్తుంది 🙂 .
  ఇప్పటికీ విజయనగరం వంటి ఊళ్ళలో కూడా పైడితల్లి అమ్మవారి జాతరలో వీటిని అమ్ముతారు…
  శంబర జాతరలో మొన్న కొనుక్కున్నాము…చిన్న స్టాల్స్ లా పెడతారు జాతరలో..అన్నిటికంటే ఇవి ఎట్రాక్టివ్ గా ఉంటాయ్ స్టాల్స్ లో….ప్రతీ ఊరి గ్రామదేవత పండగల్లో ఈ చిలుకలు అమ్ముతారు…చాలా ఫాస్ట్ గా సేల్ ఔతాయ్.. ..ఈ సారిజాతరల్లో కొన్నపుడు స్టాల్స్ ఫొటోలు తీసి పెడతాను…

  • @kvsvగారు,
   నా బ్లాగుకు స్వాగతం. ఉత్తి బొమ్మలేనా. పంచదార చిలకలు పంచి పెడతారనుకున్నా.
   మీకు పైడితల్లి అమ్మవారి జాతర గుర్తు చేయగలిగినందుకు ఆనందం.
   ధన్యవాదాలు.

   • మీ బ్లాగ్ రెగ్యులర్ గా చూస్తానండీ….కాకపోతే కామెంట్ పెట్టేటప్పుడు మిగతా కామెంట్ల ముందు ఏమిటో ..నా కామెంట్ తీసి పారేసినట్లు అనిపించి ఉపసంహరించుకుంటాను…వాళ్ళంత బాగా కామెంట్ పెట్టలేననిపిస్తుంది…

  • @ kvsv గారు,
   మీ కామెంట్ చాలా బాగుంది. మీరలా అధైర్య పడకూడదు.మిగిలనవారి కామెంట్లు చదవాలి కాని ఆ అభిప్రాయంలో కొట్టుకుపోకూడదు. నా చేత ఒక కొంటె మాట అనిపించగలిగిన మీ కామెంట్ బలమెంతో చూశారా?కామెంట్ ఎప్పుడు ఇతరులను బాధ పెట్టేలా ఉండకూడదంతే! టపా రాసేస్తున్నానా? క్లాస్ పీకేస్తున్నానా?కామెంట్లు మానకండి.
   ధన్యవాదాలు

 2. అవును, రంగు రంగుల చిలకలు, ఊరంతా పంచిపెట్టేవాళ్ళు. అంత తీపి తినలేక , వంట గది లో ఒక మూల పెట్టేది అమ్మ, వాటికి చీమలు పట్టేసేవి. పాపం పారేయడానికి మనసోప్పేది కాదు, ఆ తరువాత వాటిని టీ , కాఫీ లో వాడటం, ఇంట్లోకి ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళ చిన్న పిల్లలు వస్తే, వాళ్ళ చేతికి ఒక ముక్క విరిచి ఇవ్వడం, అది చప్పరిస్తూ ఉండేవాళ్ళు ఆ పిల్లలు. అవి చూసి చాల సంవత్సరాలైపోతుందండి. బలే గుర్తు చేసారు, ధన్యవాదాలు.

 3. మీ తరం లో , స్వీయానుభవం ద్వారా కానీ, మీ బంధు మిత్రుల ద్వారా కానీ తెలుసుకున్న ఆచార వ్యవహారాలనూ , సంప్రదాయాలనూ ,ఒక్కో సందర్భం గా ( అంటే ఉదాహరణకు పెళ్లి సంబంధాల నుంచీ, నిస్చితార్ధమూ , పెళ్లి వేడుకా, ఇట్లా వేరు వేరు అకేషన్స్ గా ) వివరించే ప్రయత్నం చేయండి శర్మ గారూ ! పాత వన్నీ రోత , కొత్తవన్నీ వింత అనే నానుడి అబద్ధం చేస్తున్నారు మీరు, మీ టపాల ద్వారా !
  పంచదార చిలకల మాట అటుంచి , మీ టపాలు మాత్రం పంచదార గుళికల్లా ఉంటున్నాయి !
  అభినందనలు.

  • @డాక్టర్ సుధాకర్ గారు,
   పాత కాలంలో అన్నీ మంచివే ఉన్నాయనుకోను. నేను చెబుతున్నది,పాసిటివ్ సైడ్ మాత్రమే.ఆశావాదిని కనుక. టపాలు మీకు నచ్చినందుకు
   ధన్యవాదాలు.

 4. ఈ పోస్ట్, నిన్నటి పోస్ట్ కూడా బాగున్నాయండి.
  నిన్నటి టపాలో రాసిన షీకాయాకు చిగురు గురించి నాకు ఇంతకుముందు తెలియదండి.

  • @అనూరాధ గారు,
   షీకాయి ఆకు, మీరున్నది పట్నవాసమయితే, ప్రయత్నం మీద దొరుకుతుంది. ఇప్పుడు వచ్చేసమయం. దీనిని పచ్చడి చేసుకు తింటారు. పుల్లగా చింత చిగురులా ఉంటుంది, చూపుకు కూడా. చిన్న చిన్న ముళ్ళుంటాయి.పురాణ జ్వరాలకి, అరుచికి,సూతికా సమయం లో పెడతారు. కొద్దిగా వేడి చేస్తుంది
   ధన్యవాదాలు.

 5. బాలనురా మదనా పాట (మిస్సమ్మ) పాడింది సుశీల గారండీ!
  (పిడకల వేట)
  శారద

  • @శారద గారు,
   నేను సినిమా చూసి బహుశః దగ్గరగా నలభయి ఏళ్ళయిందేమో! దానితో నాకు వెనక పాడే వారి పేర్లు తక్కువ తెలుసు, గుర్తు కూడా. నాకు బాగా ఇష్టమైన కొన్ని పాటలలో ఇది ఒకటి. పొరపాటు సరి చేశా. తప్పు చెప్ప కూడదు కదా. మీ సవరణకి
   ధన్యవాదాలు.

 6. పంచదార చిలకలు రంగు రంగులతో ఉండేవి..
  ఇపుడు కూడా పల్లెల్లో తీర్థాలు (విశాఖ జిల్లాలో పరస అంటారనుకుంటాను) జరిగినపుడు మాత్రం ఇంకా కనిపిస్తాయి..
  బస్తర్ జిల్లాలో (మేలా అంటారు తీర్థాన్ని.) ఇపుడు కూడా ఈ చిలకలు కనిపిస్తాయి..
  మీరు వ్రాసే ప్రతి పోస్ట్ లోనూ చాలామంది వాళ్ళ బాల్యాన్ని చూసుకుంటు న్నారని అనిపిస్తుంటుంది..
  అభినందనలు మీకు..
  @శ్రీ

  • @శ్రీ గారు,
   మీరన్న మాట నిజం. ప్రతివారికి బాల్యం గుర్తొస్తే ఆనందం కలుగుతుంది.
   ధన్యవాదాలు.

  • @అమ్మాయ్ రసజ్ఞ,
   మనిద్దరికి స్వీట్ అంటే పడదుకదా. మరి అందరూ తినరా?ఎదుటివారు తిని ఆనందిస్తూ ఉంటే,మనం చూసి అనందించేద్దాం, ఏం

   ధన్యవాదాలు.

  • @శ్రీ గారు,
   ఇప్పుడు షాపుల్లో దొరుకుతాయి,కొద్దిగా ముందు చెబితే మనకు కావలసిన సైజు, రంగు,ఆకారంలో పోసి ఇస్తారు. తాపేశ్వరం లో ఎప్పుడూ దొరుకుతాయి.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s