శర్మ కాలక్షేపంకబుర్లు-ఏమిటో! జీవితాలు.

ఏమిటో! జీవితాలు.

1980  కాలం, ప్రస్తుతం ఉంటున్న ఊళ్ళో జె.యి గా ఉద్యోగం చేస్తున్న రోజులు. చాలా రోజులుగా కేంపులు తిరుగుతున్నందున ఆఫీస్ ఉత్తరాలు రాయడం ఆలస్యమైపోతోందని, ఆఫీస్ లో కూచుని ఉత్తరాలికి జవాబులు రాయడం మొదలుపెట్టేను. ఎక్స్ఛేంజిలో కలకలం వినబడింది, ఏమయిందా అని లోపలికి వెళ్ళేలోగా, ఒకరొచ్చి టెక్నికల్ అసిస్టెంట్ పడిపోయాడని చెప్పేరు, గబగబా పరుగెట్టేను, అతను కింద పడిపోయి ఉన్నాడు,నోటి వెంట నురుగొస్తూ ఉంది. అందరూ చుట్టూ నిలబడి చూస్తున్నారు తప్పించి ఏమి చెయ్యడానికీ ప్రయత్నించడం లేదు. రిక్షా పిలవమని గబగబా రిక్షాలో ఎక్కించి డాక్టర్ దగ్గరికి తీసుకుపోతే డాక్టర్ గారు చేర్చుకుని వైద్యం చేయడం మొదలుపెట్టేరు. ఈలోగా అతని ఇంటికి కబురు పెడితే ఆమె వచ్చింది. విషయం చెప్పేను. ఆమె “చావడు లెండి! చచ్చినా బాగుండు”నంది.నా పక్క నున్న సహచరుని కేసి చూశా, తరవాత చెబుతానన్నట్లు సైగ చేశాడు. నాకయితే ఏమీ అర్ధం కాలేదు. అతనిని ఆమెకు వప్పచెప్పి వస్తూ డాక్టర్ గారిని అడిగితే అతని ఆరోగ్యపరిస్థితి గురించి భయపడక్కరలేదని, అతను తన పేషంటేనని చెప్పేడు. అందరం వచ్చేశాం. ఆ తరవాత రెండు రోజులు నేను కేంపులు పోవలసివచ్చి ఆఫీసులో కూచోలేదు. మూడవ రోజు ఆఫీసులో కూచుని ఉండగా ఆఫీసులో మజ్దూర్ నాలుగు రూపాయలు తెచ్చి నా టేబుల్ మీద పెట్టి, టెక్నికల్ అసిస్టెంటు గారు మీకిమ్మన్నారని చెప్పేడు. ఎందుకిమ్మన్నారంటే, మొన్న ఆయన పడిపోయిన రోజు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళిన రిక్షా ఖర్చులని చెప్పేడు. నా తల తిరిగిపోయింది. ఈ లోగా మరొక టెక్నీషియన్ కనపడి “ఆయనంతేనండి,! మీదగ్గరకొచ్చి తనని హాస్పిటల్ కి తీసుకువెళ్ళినందుకు కృతజ్ఞత చెబితే అందంగా ఉండేది, అదికాక మా దగ్గర, “ఈయన నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళి హీరో అయిపోదామనుకుంటున్నాడేమొ” అని ఇంకా ఏమేమో అన్నాడు, అతని గురించి పట్టించుకోకండి, మేమెప్పుడో వదిలేశామతనిని” అన్నాడు. అతని అకారణ వైరమెందుకో తెలియలేదు. అక్కడితో ఆ ప్రహసనం ముగిసింది.

ఆ రోజు సాయంత్రం ఇంటిలో ఉండగా, ఇద్దరు ఆడవాళ్ళు మిమ్మల్ని కలిసి మాట్లాడాలంటున్నారని వచ్చి చెప్పింది , నా ఇల్లాలు. ఇద్దరం బయటికెళ్ళేము, అప్పటికే చూసి ఉన్నాను కనక ఒకామెను మొన్న ఆఫీసులో పడిపోయిన వారి భార్యగా గుర్తించాను, కూడా వచ్చినావిడ తనను తను పరిచయం చేసుకుంటూ, టెక్నికల్ అసిస్టెంట్, భార్యను హింస పెడుతున్నాడని, ఇంటిలో తిండికి కూడా డబ్బులివ్వడని, తాగి ఉంటాడని, ఒక్కతే అయిన కూతురి బాగోగులు చూడ్డని చెప్పుకొచ్చింది. అతని భార్య అన్నిటికీ నిజమని తల ఊపింది, మధ్య మధ్య కలగ చేసుకుని వివరించింది. ఇప్పుడు నా నుంచి మీరు కోరేదేమని అడిగితే, జీతం ఇంటిలో ఇచ్చేటట్లు, అతను తాగకుండా ఉండేలా, నేను అతనికి చెప్పవలసినదిగా కోరేరు. సరే మీ బాధ, మీకోరిక ఒక కాగితంమీద రాసి సతకం పెట్టి ఇమ్మన్నాను. దానికి అతని భార్య అబ్బే అది కుదరదండి, నేను కంప్లయింటు ఇవ్వను కాని మీరు చర్య తీసుకోవాలని కోరింది. మరొక సంగతిలో జరిగిన చేదు అనుభవం లో, చెయ్యి కాల్చుకున్నది గుర్తు తెచ్చుకుని కుదరదని నిర్మొహమాటంగా చెప్పేశాను. మీరేదో ఉపకారం చేస్తారని అనుకుని వచ్చామని గొణుగుకుంటూ వెళ్ళిపోయారు.

కొంతకాలం గడిచింది, మరొక పల్లెలో రాత్రి లారీ వాడెవడో స్థంభాన్ని గుద్దేసి పోవడంతో బ్రేక్ డౌన్ వస్తే అక్కడికి పరుగెట్టేను, ఉదయమే. పది గంటల వేళ అక్కడి ఆఫీస్ నుంచి మనిషి ఫీల్డులోకి వచ్చి, మిమ్మల్ని అర్జంటుగా టెక్నికల్ అసిస్టెంట్ మాటాడమన్నారని చెప్పేడు. పల్లెలో ఆఫీస్ కివచ్చి మాట్లాడితే బయటి ప్రపంచంతో అనుబంధమయిన సిస్టమ్ పోయిందన్నాడు. ఏమయిందన్నా, ఏమో నాకు తెలీదు, మీరు వచ్చి చూసుకోండి అన్నాడు. ఉదయమే పోతే చెప్పలేదేమంటే మీరు ఆఫీసుకొచ్చాక చెబుదామనుకున్నా అన్నాడు, ఇంటికి ఫోన్ ఉన్నా చెప్పక. ఒక అరగంటలో చేరుకుని, చూస్తే అందులో గుండెలాటిది చెడిపోయింది. ఎందుకిలా జరిగిందబ్బా అనుకుంటూ దానిని బయటకు తీసి చేయవలసిన టెస్ట్ లు చేస్తూ ఉంటే ఒక చోట ఒక వైర్ తెగిపోయినట్లు కనపడింది. దానిని అతికి చూదామనుకుని అతకడానికి ఉపయోగించే పరికరం సోల్డరింగ్ బోల్ట్ వేడిగా ఉన్నదా అని అడిగితే ఉన్నదని చెప్పేడు. ఈ బోల్ట్ కి కర్ర కాని ఎబోనైట్ పిడికాని ఉంటుంది, టెక్నికల్ పని చేసేవాళ్ళందరికి ఒక అలవాటు పిడి పట్టుకున్నా చూపుడు వేలొకసారి బోల్ట్ బాడీ మీద వేసి వేడి చూస్తారు. అలవాటుగా వేలేసేను. కిద బాసింపట్టు వేసి కూచున్నానేమో ఒక సారి గట్టి షాక్ కొట్టి ఒక కేక వేసి విరుచుకుని గోడమీద పడిపోయా. నా చేతిలో బోల్ట్ ఒక పక్క పడింది, మరో చేతిలో పాడయిన పార్ట్ పక్కన పడిపోయింది. పక్కనే ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ గారు డ్యూటి టైం అయిపోయిందని చల్లగా వెళ్ళిపోయాడు. పక్క సెక్షన్లో అతను నా కేక విని వచ్చి చూసి నన్ను లేపి, చూసి, కూచోపెట్టి పలకరించి ఏమయిందంటే, విషయం చెప్పేను. అతను బోల్ట్ తీసి టెస్ట్ చేసి బాడీకి పవర్ వస్తోందని చెప్పి తీసేసేడు. కాసేపటికి తెప్పరిల్లి మరొక సెక్షన్ నుంచి బోల్ట్ తెప్పించి ఇక్కడి యూనిట్ బాగుచేసి ఇంటికి చేరేటప్పటికి రెండు దాటింది. ఇంటికెళ్ళి బట్టలు తీసి లుంగీ కట్టుకుంటూ ఉంటే ఇల్లాలు చూసి అదేమి పైనుంచి కిందకి చారలా ఉందంది. అద్దంలో చూస్తే నెత్తి నుంచి కిందికి చారలా నల్లగా మాడిపోయిన మచ్చ కనపడింది. సంగతి చెప్పేను. భగవంతుడు రక్షించేడనుకున్నాం. మర్నాడు రాజమంద్రి ఆఫీస్ కి వెళితే ఆఫీసర్ గారు చూసి, అదేమనడిగితే సంగతి చెప్పేను. దానికాయన మీరు కంప్లయింటు రాసివ్వండి అతని మీద చర్య తీసుకుంటానన్నారు. నేను కూడా మా ఆఫీసర్ గారిని చర్య తీసుకోమని కోరలేదుకాని కంప్లయింటు ఇవ్వనన్నా. ఏమన్నారు. శివుని ఆజ్ఞ లేక చీమయినా కుట్టదు. అతను నిజంగా నన్ను హింసించాలని అనుకుని ఉంటే అతని కర్మకి అతను ఏదో ఒక రోజు పెద్ద దెబ్బ తింటాడు అని ఊరుకున్నా.అప్పుడు గుర్తొచ్చిందీ పద్యం, చిన్నప్పుడు చదువుకున్నది.

విద్యచే భూషితుండయి వెలయుచున్న
దొడరి వర్జింపనగు జుమీ దుర్జనుండు
చారు మాణిక్యభూషిత శస్తమస్త
కంబయిన పన్నగము భయంకరముగాదె……..భర్తృహరి నీతి శతకం.

మణి నెత్తిపైనున్నా పాము ఎంత భయంకరమనదో,విద్యావంతుడయినా దుర్జనుడు, పాములా భయంకరమైన వాడని, అతనిని వదలిపెట్టేయాలని, కవి భావం

నేనక్కడినుంచి ట్రాన్ఫర్ మీద వెళ్ళిపోయా. ఇతను మారలేదు. నా తరవాత వచ్చినతను ఇతని మీద రిపోర్ట్ ఇస్తే శిక్షగా ట్రాన్స్ఫర్ ఇచ్చేరు. కొత్త ఊరిలో జాయినయి తాగుడు విపరీతంగా చేయడంతో ముందు పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. ఎవరినైతే జీవితకాలం హింసించేడో, తిండి పెట్టకుండా, ఆ భార్య సేవ చేస్తే, రెండు సంవత్సరాల పైగా, కాలం చేసేడు. ఏమిటో జీవితాలు.

 

ప్రకటనలు

18 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఏమిటో! జీవితాలు.

 1. శర్మ గారూ..నేను కూడా కొంచేం విశ్రమించాక నా అనుభవాలను చెప్పలని ఉంది…
  నేను ప్రతీ రోజూ అరవై నుంచి డబ్బై మంది తో మాట్లాడుతా….10-12 మండలాలి వారితో..వృత్తి రీత్యా….ఈ మద్య విశేకరు గారి బ్లాగ్ లోరెండు మూడు విషయాలు ప్రస్తావించా ..ఆయన కూడా వ్రాయమని చెప్పారు…సమయం దొరకక ప్రస్తుతమ్ వ్రాయలెక పోతున్నా.. ఇప్పుడు సమయం…1.25 am 🙂
  ఒక అనుభవమ్..అక్కడి నుంచి మళ్లీ ఇక్కడ షేర్ చేస్తున్నా…చూడండి…..(క్రింద ఇవ్వబడినది నా కామెంట్…teluguvartalu.com లో)

  .

  చదువుకున్న వాళ్ళుగా చెప్పబడుతున్న జనం ఎంత నీచంగా బిహేవ్ చేస్తారో నేను చూసినంతగా ఎవరూ చూసి ఉండరు.. వృత్తి రీత్యా చాలా ఎక్కువ అనుభవాలు నాకు ఎదురవుతాయి….మిగతా సమాజాలు…దేశాల్లో ఎలా ఉంటుందో గానీ నాకు చూసీ చూసీ అసహ్యం వేస్తుంది మన జనాలంటే…

  చిన్న ఉదాహరణ చెపుతా…

  నాకు తెలిసిన ఒక అమ్మయి.,ఇద్దరు పిల్లలున్నా….అయోమయం రకం…భర్త వదిలేసాడు… ఒక డాక్టరు దగ్గర పని చేస్తుంది…ఉదయం ఎనిమిది నుండి రాత్రి తొమ్మిది వరకూ ఇంటి పనీ హాస్పటల్ పనీ..మొత్తం ..నిమషం కాళీ ఉండదు…చివరికి డాక్టరు గారి భార్యకు కాలి మీద దురద వేసినా బెల్లు కొట్టి పిలిపించుకుని మరీ గోకించుకుంటారు.. ఎంత దారుణం గా ఉంటుందంటే చివరకు టిష్యూ పేపర్ తో ఈ అమ్మయే తుడవాలేమో … ఆ మద్యలో ఓ గంట బోజనానికి ఇంటికి పోనిస్తాడు ఆయన …ఇంతకూ ఇచ్చే జీతమ్ఎంతో తెలుసా మీకు…1000 రూపాయలు…అందులో నే అద్దె….పిల్లలూ..ముసలి తల్లిని చూసుకోవాలి..

  ఎప్పుడైనా ఆ పనిమనిషి కం నర్స్ కు జ్వరం వచ్చినా సాంపిల్స్ అమ్మేసుకుంటాడే గానీ రెండు మాత్రలు కూడా ఇవ్వడు ఆ సోకాల్ద్,రోజుకు 30-40 వేల రూపాయలు వరకూ సంపాదించే ఆ డాక్టరు..
  ఆమె దురవస్థ చూసి మేమె అప్పుడప్పుడూ ఓ యాబయ్యో..వందో..చెతిలో పెట్తేస్తుంటాం.. ఒక వేళ మేము ఇవ్వడం ఆయన చూస్తే మాత్రం ..ఆ మేరకు ఆమె జీతమ్ లో కట్….తన వల్లే ఆమెకు ఆ డబ్బులు వచ్చాయని ఆయన భావన…ఇంతకంటే నీచులున్నారు..కాళీ ఉన్నపుడు ఒక పోస్ట్ పెట్టాలని ఉంది…

  • @ kvsvగారు,
   మీ అనుభవం చూశాను, చదుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అనుకునే కంటే మీరన్న నీచులు అన్న మాట అందరికి వాడేసుకుంటే సరిపోతుందనుకుంటా. చదువుకున్న వారయితే కొంచం బాగోవాలని మన కోరిక. కాని వీరిలో ఇతరులపై స్వారీ చెయ్యాలనే కోరిక పెరిగిపోతున్నందుకు, బాధ పడుతున్నాం.
   ధన్యవాదాలు.

 2. ఇసుకలో తైలమైనా తీయగలమమో కాని మూర్ఖుల మనసుని రంజింపజేయలేమనికదా పెద్దలు చెప్పేరు.మనం మంచి అనుకున్నది చేయడం
  న మాత్రమే మనం చేయగల పని.

  • @మిత్రులు పంతుల గోపాల కృష్ణారావు గారు,
   తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు,
   చేరి మృగతృష్ణలో నీరు తాగవచ్చు,
   తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు,
   చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు.
   సుభాషితం బాగా గుర్తు చేశారు.
   ధన్యవాదాలు

 3. “ఈయన నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళి హీరో అయిపోదామనుకుంటున్నాడేమొ” అని ఇంకా ఏమేమో అన్నాడు, ….ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ? అని ఆశ్చర్యంగా ఉందండి.

 4. మీరన్నట్టు కొంతమందికి విధ్య కేవలం ఉద్యోగం కోసం (విధ్య అంటే కేవలం పాఠాలు కాదు సుమీ) డబ్బులకోసం ఇంకొంతమందికి అది అభ్యున్నతికి.

 5. ప్రభుత్వం ఏర్పడటానికి అవసరమైన కందెన
  ప్రభుత్వం నడవటానికి అవసరమైన ఇంధనం
  ప్రభుత్వం ఉందొ లేదో తెలియ కుండా జో కొట్టే ఔషధం
  మద్యం లేని సమాజాన్ని ఊహించుకో తరమా..?
  చిత్త సుద్ధిలేని,
  చెత్త బుద్ధి ఉన్న,
  నాయకుల జీవధార అది
  అంచేత మద్యాన్ని చెడు వ్యసనం అనకండి.

  • @ఆత్రేయ గారు,
   వారుణీ దేవికి వందనం. ఉదయం పళ్ళు తోమడం కూడా దానితో చేసేవారికి మరో సారి వందనం. ప్రభువులకు శతకోటి వందనాలు.మద్యం లేని సమాజమా? ఊహకే కష్టం. అది ఉంటే ఎంతమందికి నష్టం, ప్రభువులకెంత కష్టం.
   ధన్యవాదాలు

 6. కొందరంతే! మంచి చేసినా విషం వెల్లగ్రక్కుతారు. చేసిన పాపిష్టి పనులకి శిక్ష అనుభవించాడు కదా! పాపం..ఆమె!!
  ఆ క్షమా గుణమే లేకుంటే అలాంటి మగ వారికి నడిరోద్దులే గతి.

  • @వనజ గారు,
   హీనుడవగుణంబు మానలేడు, బొగ్గు పాల కడుగ పోవునా మలినంబు విశ్వ…., వీళ్ళింతే మారరు.
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s