శర్మ కాలక్షేపంకబుర్లు-చేదు అనుభవం.

చేదు అనుభవం

ముఫై ఐదు సంవత్సరాలకితం, జె.యి గా కొత్తగా జాయిన అయిన రోజులు, ఇదే ఊరిలో. అప్పటివరకు నా పని నేను చేసుకుంటే సరిపోయేది. ఇప్పుడు మరొకరితో పని చేయించాలి. పని చేయడం తేలిక, చేయించడం కష్టం.అధికారానికి కొత్త, అధికారం వినియోగించడం కూడా ఒక కళ.

నా దగ్గర, దగ్గరగా వంద మంది సిబ్బంది ఉండేవారు, మొత్తం మీద. ఒక రోజు ఒక లైన్ మన్ భార్య ఏడుస్తూ ఇంటికొచ్చేసింది. ఎవరు నువ్వు, ఎందుకేడుస్తున్నావు, వగైరా ప్రశ్నల తరవాత తేలిందేమంటే ఆమె, నా దగ్గర పని చేసే ఒక లైన్ మన్ భార్య అని. సంగతి ఏమంటే! మామూలే, తాగేస్తున్నాడు, ఇంటిలో డబ్బులివ్వడు, ఇల్లు పట్టించుకోడు,పైగా అడిగితే కొడుతున్నాడు, “బాబ్బాబు మీరు కాస్త చర్య తీసుకుని నన్ను రక్షించరా!” మొర!! అబ్బో ఇంకేమి మనం మొరలలాలకించే స్థాయికి ఎదిగిపోయామన్నమాట అనికుని, “సరే పిలిచి కనుక్కుని కూకలేస్తా,” అని అభయమిచ్చేశా, విష్ణుమూర్తి లాగ. మర్నాడు అతనిని పిలిచి “ఏమయ్యా! నువ్వు చేస్తున్న పని బాగోలేదు, తప్పు కదా. భార్యను బిడ్డలను చూసుకోకపోతే ఎలాగ, ఉద్యోగం లేక చాలా మంది ఏడుస్తున్నారు, నీ అదృష్టం కొద్దీ ఉద్యోగం దొరికింది, అందుచేత బుద్ధిగా ఉండు, తాగుతున్నావట మానెయ్యి” అన్నా. “మీకెవరు చెప్పేరు సార్” అన్నాడు. “నీ భార్య నిన్న నా దగ్గరకొచ్చి గోల పెట్టింద”ని చెప్పేశా. మాటాడకుండా వెళ్ళిపోయాడు. నేను కూడా అప్పటి వరకు ట్రేడ్ యూనియన్ లో పని చేసిన వాడిని. రొజూ ఇటువంటి తగువులు తీర్చిన వాడినే, ఆ రోజులలో, నాకు కొత్తనిపించలా. నా స్థానం మారిందన్న సంగతి విస్మరించా.

నాలుగు రోజులు పోయిన తరవాత ఒక రోజు మా ఆఫీసర్ గారు చెప్పాపెట్టకుండా వచ్చేశారు, వచ్చి ఆఫీస్ లో కూచుని “మీ మీద కంప్లైంట్ వచ్చింది ఎంక్వయిరి కొచ్చా”నని, లైన్ మన్ ని అతని భార్యని పిలిపించారు. నాకు సంగతి అర్ధమయిపోయింది. ఆఫీసర్ గారు లైన్ మన్ ని “నీవు కంప్లైంట్ ఇచ్చావా” అని అడిగారు, “ఇచ్చా”నన్నాడు. “ఏమమ్మా! నువు ఈ జె.యి గారి దగ్గరకొచ్చి, ఆయనతో, నిన్ను మీ ఆయన కొడుతున్నాడని, తిండి పెట్టటం లేదని, సరిగా చూడటం లేదని చెప్పుకున్నావా” అని అడిగారు. అక్కడ సూది పడితే వినిపించే నిశ్శబ్దం ఆవరించింది. ఆమె మాట మీద నా భవితవ్యం అధారపడి ఉంది. నాకేసి చూస్తూ,ఆమె నోరు విప్పింది, “నేను చెప్పుకోలేద”ని చెప్పి మొహం దించేసుకుని ఏడిచింది. “ఎందుకమ్మా ఎడుస్తున్నా”వన్నారు. “ఏంలేదు బాబయ్యా” అంటూ వెళ్ళిపోయింది. నేను ఖిన్నుడనయిపోయా, చెయ్యని తప్పుకు దోషిలా నిలబడ్డా. నాకు ఆమె పై కోపం రాలేదు కాని ఆమె నిస్సహాయతకి బాధ కలిగింది. ఆమె చెప్పినది తప్పని ఆఫీసర్ గారికి కూడా అర్దమయింది, కాని ఆయన నిస్సహాయుడు. నేను శిక్షకి సిద్ధ పడ్డాను. సంగతి చూసిన ఆఫీసర్ గారు “ఏమి చేయమంటావ”ని అన్నారు లైన్ మన్ తో. “ఆయన నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి, క్షమాపణ పత్రం రాసి ఇవ్వా”లని అడిగేడు. దానికి ఆఫీసర్ గారు “జె.యి గారు మీరేమంటా”రన్నారు. నా సిబ్బంది యావత్తు చుట్టూ నిలబడి ఉన్నారు. “నేను క్షమాపణ చెబుతున్నానండి, అతని వ్యక్తిగత విషయం లో కలగ చేసుకోవడం తప్పేనండి”, అని వెళ్ళి లైన్ మన్ కాళ్ళకి నమస్కారం చేసి క్షమాపణ వేడి, పత్రం రాసి ఇచ్చాను. ఎవరి మటుకు వారు వెళ్ళిపోయారు. మా ఆఫీసర్ గారు నేనూ మిగిలేము. నేను చాలా ప్రశాంతంగా ఉండటం చూసి ఆయన “ఎందుకిలా జరిగింద”ని అడిగేరు. అప్పుడు నేను ఆయనకు జరిగిన సంగతి చెప్పేను. నాకు సంగతి తెలుసు, మీరు సాక్ష్యాలు చెబుతారేమో అనుకున్నా అన్నారు. దానికి నేను, “సార్! నేను అతని మంచికోరి చెప్పేను, అందునా ఆమె వచ్చిగోలపెడితే మాత్రమే, కాని ఇది ఇలా జరిగింది. ఆమె అబద్ధం చెప్పవలసి వచ్చినందుకు ఏడిచింది. సగటు భారతీయ మహిళలా ఆమె ప్రవర్తించింది. ఆమెను నేను అర్ధం చేసుకోగలను. నేను అతనిని మందలించిన తరవాత ఆమె బాధలు పెరిగి ఉంటాయి” అన్నా. “ఏమయినా ఇటువంటి సంగతులలో అధికారం లో ఉన్న వారు జాగ్రత్త వహించాలి సుమా” అని హెచ్చరించి వెళ్ళిపోయారు.

నేను నా పనిలో పడిపోయాను.ఆ సంగతి ఆలోచించలేదు.ఆఫీస్ లో మాత్రం గుస గుసలు పోతున్నారు. కొద్దిగా నా చెవికీ సోకాయి. నేను ప్రతీకారం తిర్చుకుంటానని ఒకరు, మా బాగా అయ్యిందని మరొకరు, ఇలా రక రకాల మాటలు వినపడుతూ వచ్చాయి. నేను వేటినీ లెక్క చేయలేదు, నా పద్ధతీ మార్చుకోలేదు. ఇలా ఉండగా ఒక రోజు ఆ లైన్ మన్ భార్య, ఈ సారి ఏడుస్తూ ఆఫీస్ కొచ్చేసి, బయట కూచుని, “చంపేస్తున్నాడు బాబోయ్” అని ఏడుస్తూ ఉంది. నేను పట్టించుకోలేదు, ఎవరూ పట్టించుకోలేదు. ఈ లైన్ మన్ ఫాల్ట్ మీద బయటికి పోయిన వాడు తిరిగొచ్చి సంగతి చూసి పెళ్ళాన్ని బూతులు తిట్టాడు. ఆఫీస్ బయట గొడవ పడుతున్నారు. మా ఆఫీస్ లోని నాయకుడు వెళ్ళి “ఇక్కడ ఆఫీసర్ ముందు చులకనైపోతాం, నడవండి, నడవండి” అంటూ ఆమెను వారిని తీసుకెళ్ళిపోయే ప్రయత్నం చేసేడు, అప్పుడిక ఆమె ఆటంబాంబు లా బద్దలయి పచ్చి బూతులు తిడుతూ “ఓరి వెధవా! నీ మాట పట్టుకుని నా మొగుడు సన్నాసి నన్ను కొడుతున్నాడు, నీ మందు ఖర్చు కోసం ఎంతమంది ఉసురు పోసుకుంటావ”ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది, నాయకుణ్ణి. చివరగా, “పాపం ఆయన దగ్గరకెళ్ళి నేను మొరపెట్టుకుంటే ఈ సన్నాసిని బాగు చేయడం కోసం ఆయన మంచి మాట చెబితే, నన్ను పట్టుకుని కొట్టి నా చేత అబద్ధం చెప్పించి, ఆయన చేత ఈ సన్నాసి కాళ్ళు పట్టించేవు, ఇదంతా నువ్వు చేసినదే! పురుగులు పడిపోతావ్! నీ కళ్ళుపోతాయి, నీకాళ్ళు పడిపోతాయ”ని, నాయకుణ్ణి తిట్టి, అప్పుడు నా దగ్గరకొచ్చి “నేను అబద్ధం చెప్పి, మీచేత ఈ వెధవ కాళ్ళు పట్టించేను, నన్ను క్షమించండ”ని కాళ్ళు పట్టుకుంది. నేను నిర్ఘాంతపోయా జరిగిన సంఘటనకి. “అమ్మా! నువ్వు తప్పు చేసేవని, నేను అనుకోలేదు. ఇతను నిన్ను బాధ పెట్టడం మూలం గా అలా జరిగి ఉంటుందని ఊహించా,” అన్నా. “వీడిని క్షమించం”డని మొగుణ్ణి జుట్టు పట్టుకుని నా కాళ్ళ మీద పారేసింది. నేను మరింత బిత్తరపోయా. దీని కంతకీ కారకుడు, “ఇడుగోనండి” అంటూ నాయకుణ్ణి చూపించింది. నాయకుడు సిగ్గుతో తల దించుకున్నాడు. సినిమా అయిపోయింది మా ఆఫీస్ జనం, బయట జనం ఎక్కడి వాళ్ళక్కడికి సద్దుకున్నారు.నేనొక గుణపాఠం నేర్చుకున్నా, చేదు అనుభవం మిగుల్చుకున్నా.

ప్రకటనలు

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-చేదు అనుభవం.

 1. మా నాన్న గారు మంచి చెప్పబోయి, చెడ్డ పేరు తెచ్చుకొన్న సందర్భాలు కోకొల్లలు. ఆయన అనుభవాల నుండి నేను చాలా నేర్చుకున్నాను.

  ధన్యవాదాలు.

  • @శ్రీకరుడు గారు,
   ప్రతిది స్వానుభవం కావాలంటే జీవితం చాలదు. అందుకే పెద్దల అనుభవాలని అధ్యయనం చేయడం.
   ధన్యవాదాలు.

 2. మంచి పనులు ఆనందాలను మిగిలిస్తే…
  చేదు అనుభవాలు కొన్ని పాఠాలను నేర్పిస్తాయి…
  అదేగా జీవితం శర్మ గారూ! Excuse me for the delay in reply.
  @శ్రీ

  • @శ్రీ గారు,
   చేదు అనుభవం కలిగినా తర్వాత ఆ తప్పు మళ్ళీ చెయ్యలేదు. అందుకే ముందురోజు చెప్పిన సంఘటనలో వ్రాత పూర్వకంగా ఇస్తే చూస్తానని చెప్పినది.జీవితమింతే కదా.excuse me for the delay
   ధన్యవాదాలు.

 3. అయ్యా…ఇలా మా దగ్గరకీ పని మనుషులు ఏడ్చుకు వస్తారు…మా శ్రీమతి గారు నిప్పులు తొక్కినట్టు ఎగిరిపోయి..మీ ఆయన్ని దులిపేస్తా ఉండు..అని హెచ్చరించి పంపిస్తుంది…
  అప్పటికీ ఇప్పటికీ తేడా ఇక్కడే…
  మేమిద్దరం లోపలకెళ్ళి మాట్లాడుకుంటాం….పని మనిషి మీద జాలితో వాడ్ని తిట్టామనుకో…వాడికి మనం చెడ్డ అయిపోతాం…రేపు ఏ పని చెప్పినా చెయ్యడు…మొగుడూ పెళ్ళాలన్నాక ఎలాగూ తర్వాత వాళ్ళు కలిసిపోతారు….అనవసరంగా మనమెందుకు వాడికి చెడ్డ అయిపోవడం…సైలెంట్ గా ఉండిపోదాం…

  ఇదీ ఇప్పటి తీరు…
  ఇలా ఉంటే తప్ప ఇప్పటి జనాల్లో తట్టుకు రాలేం…ఏమంటారు..లౌక్యం అంటారా?తప్పుడు పద్దతులంటారా??

 4. ఇక్కడో విషయం గమనించాల్సింది ఉంది. ట్రేడ్ యూనియన్ల వారుతమ బలాన్ని పెంచుకోవడం కోసం వారి మెంబర్లది తప్పయినా ఆవిషయం తమకి తెలిసినా కూడా వారి తరఫున వకాల్తా తీసుకుంటారు.ఈ సంఘటనలో జరిగిన తప్పుకి ట్రేడ్ యూనియన్ నాయకూడే భాద్యుడు.ట్రేడ్ యూనియన్ను ఉండవలసినదే. కాని అవి నిర్వహించాల్సిన బాధ్యతలు అవి సక్రమంగా నిర్వహించడం లేదు.ఉదాహరణకి ఇప్పుడు మారుతీ ఉద్యోగ్ లో జరిగిన ఉదంతం తీసుకోండి.అక్కడి ట్రేడ్ యూనియన్ నక్సల్స్ చేతుల్లోకి వెళ్లినట్లుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ట్రేడ్ యూనియన్లు తాము కూర్చున్న చెట్టునే నరుక్కున్నట్లు ప్రవర్తిస్తున్నాయి. పొలిటికల్ పార్టీలు తమ ఆవసరాలకి వీటిని వాడుకుంటున్నాయి. తెలంగాణ కోసం ఉద్యోగ సంఘాలు సమ్మె చేయడం కూడా ఇలాంటిదే. ఈ విషయం మన మేధావులు పట్టించుకోవలసిన అవసరం ఉంది.

  • @మిత్రులు పంతుల గోపాలకృష్ణారావు గారు,
   ఇదొక చెడ్డ అలవాటు అయిపోయిందండి. ట్రేడ్ యూనియన్లో రాజకీయ పార్టీల జోక్యాన్ని నేను ఏబది సంవత్సరాల కితమే నిరసించినందుకు కూడా చేదు అనుభవం మిగిలిందండి, మరొకటి. ఎప్పుడయితే రాజకీయం చోటు చేసుకుందో, అక్కడ కట్టుబాట్లు, డిసిప్లిన్ దెబ్బతింటున్నాయి.ఒక్కొక చోట పరిస్థితులు చెయ్యి దాటిపోతున్నాయి. ఇది నిజం.
   ధన్యవాదాలు.

 5. మహాభారతంలో ధర్మరాజుగారు చెప్పిన రెండు చమత్కారమైన మాటలున్నాయి. అన్నిటికంటే తేలికయినది యితరులకు సలహా ఇవ్వటం. అన్నిటికంటే కష్టమైనది తానన్న మాటను ఆచరించి చూపటం అని. నమ్మకస్తులయిన పదిమంది సాక్షులుగా ఉన్నప్పుడు తప్ప ఇతరులకు సలహాలు ఇవ్వకూడదు. విడిగా వచ్చి అడిగారని సలహాలిస్తే, అవి పనిచేస్తే వారు మనకి యేమీ కిరీటం పెట్టరు కాని మన సలహాలు నచ్చకపోయినా ఆచరించటంలో విఫలమై ఇబ్బంది పడినా మనకి వ్యతిరేకంగా ప్రచారం చేసి తలనొప్పులు మిగులుస్తారు. అదే నలుగురిలో సలహా యిస్తే మన గౌరవానికి ముప్పు రానీయ లేరు. బలహీనులకు సహాయంగా మాట్లాడుతున్నామనుకుంటాం కాని ఆ బలహీనులు మనమే కాదు మరెవ్వరు యే ఆశ చూపినా బెదిరించినా మనకే హానిచేయగలరని తరచు మనకు తోచదు. ఈ ప్రపంచం క్రూరమైనది అది మన బలహీనతలను సొమ్ము చేసుకోవటానికి వెయ్యి కళ్ళతో వెదుకుతూ మన విలువలను గౌరవించటానికి తీరికి చేసుకోలేదు,

  • @మిత్రులు శ్యామల రావు గారు,
   అప్పటికి అనుభవం లేక పొరబడ్డా, తరవాత అటువంటి సందర్భంలో ఉత్తరమియ్యకపోతే చర్య తీసుకోనని నిక్కచ్చిగా చెప్పేశా. అనుభవం పాఠం నేర్పిందండి.
   ధన్యవాదాలు.

 6. మీకు చేదు అనుభవం మిగిల్చినా ఆ భార్య దానికి తగిన ప్రాయశ్చితం అందరిలోనూ చేసి చూపించి నిజం నిరూపించించింది అనిపించింది.

  • @చిన్ని ఆశ గారు,
   మీరు చెప్పినది నిజం. అందరికి అన్ని వేళలా ఇటువంటి సావకాశాలు రావేమో కదండి, నేను ఆ విషయంలో అదృష్టవంతుడినే.
   ధన్యవాదాలు.

 7. ఆరోజు నాకు పాడైపోయేవాళ్ళకి అస్సలు సలహాలివ్వద్దని ఎందుకు సమాధానం ఇచ్చారో ఇప్పుడర్థమయ్యింది. 🙂 అనుభవాన్ని మించిన గురువు కలడే?! అంటారు, నిజమే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s