శర్మ కాలక్షేపంకబుర్లు-బతుకు తీపి.

బతుకు తీపి.

నిన్న సాయంత్రం నడకకి వెళ్ళొచ్చిన తరవాత స్నానం చేసేను కాని నలతగా అనిపించింది, రెండు రోజులనుంచి నడక కొత్తగా మొదలెట్టేను కదా అందుకు, నీరసంగా ఉయ్యాలలో కూచున్నా. కోడలు సెల్ ఫోన్ పట్టుకొచ్చి “మామయ్యగారు! మీకు ఫోన్” అంది. “ఎవరన్నా?” “మీ కోడలినని అంటోంది ఎవరో!” అంది.

ఎవరైఉంటారబ్బా అనుకుంటూ మాట్లాడితే “మామయ్యగారు! బాగున్నారా! ఏంటో నలతగా ఉన్నట్లున్నారు!” అంది. ఎవరో తెలియకచస్తుంటే, ఇదొకటా అనుకుంటూ “గుర్తుపట్టలేకపోయా సుమా” అన్నా. అప్పుడు నేను ఫలానా అని చెప్పింది. “బాగున్నావా? ఆరోగ్యం ఎలా ఉంద”ని ప్రశ్నించా. “మీ దయవల్ల కులాసాగా ఉన్నాను. ఆరోగ్యంగా ఉన్నాను, సుఖంగా కూడా ఉన్నా” అంది. “సంతోషం ఏమిటి విశేషం” అన్నా. “నాకు ప్రమోషన్ వచ్చింది, మొదటగా మీకే చెప్పాలని పిలిచా” అంది. బాగుందని చెప్పి “డబ్బులు జాగ్రత్త పెట్టుకో” అని ఒక ఉచిత సలహా పారేశాను. ఫోన్ పెట్టేసి గతం లోకి జారుకుంటే……

“చచ్చిపోతాను మామయ్య గారు మొగుడెలాగా రోగంతోనే పోయాడు,” అంటూ ఏడుస్తున్న ఇరవైనాలుగేళ్ళ, కంపలా ఎండిపోయి, కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న, చిన్న వయసులో భర్తని పోగొట్టుకున్న, అభాగ్యురాలిని, ఆ పరిస్థితులలో చూసినపుడు నా కడుపు తరుక్కుపోయింది.

ఇక్కడ కొద్దిగా నేపధ్యం చెప్పాలి. ఈ భర్తపోయిన అమ్మాయి నాకు కావలసిన,బతకలేని బడిపంతులుగారి, మూడవ ఆమ్మాయి, తండ్రి ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పటికి కాళ్ళులాగి, ఒక సామాన్యుడి చేతిలో పెట్టేడు, ఈ బంగారు బొమ్మని. వాడిదేమి ఖర్మమో తెలియదు కాని తిరుగులేని రోగం తగుల్చుకుని, ఒక సంవత్సరం హాస్పిటళ్ళ వెంట తిరిగి కాలం చేసేడు, పిల్లా, పాపా కలగలేదు. ఆ సందర్భంగా ఊరడింపుకు వెళ్ళేము.

“ధైర్యంగా ఉండు. బతికియుండిన సుఖములబడయవచ్చు అన్నారు పెద్దలు. ఎంతకాలం చీకటే ఉండదు. వెలుగు కనపడుతుంద”ని చెప్పేను తప్పించి, ఆ వెలుగెలా వస్తుందో తెలియలేదు, ఎలా తేవాలో తెలియదు. ఆ అమ్మాయిని చూస్తే, ఈ అమ్మాయికీ ఆ జబ్బు సోకిందేమో అనే అనుమానం వచ్చింది. మనిషి ఎండిపోయింది, ఆకలి లేదంటుంది, నిద్ర పోదు, కంపలా అయిపోయింది. కళ్ళలో ఉన్నాయి ప్రాణాలు.”ఈ అమ్మాయిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళండి, అశ్రద్ధ చెయ్యద్దు, దానికి తోడు అతనికి సేవలలో ఉండిపోవడం మూలంగా ఈ అమ్మాయి ఆరోగ్యం అశ్రద్ధ చేసేసింది, డాక్టర్ ని కలవండి ముందు అన్నా. కొద్దికాలం లో డాక్టర్ దగ్గరికి తీసుకెళితే అదేదో కౌంట్ తగ్గింది తప్పించి, ఇది అది పూర్తిగా కాదని డాక్టర్ చెప్పేడన్నారు. అమ్మయ్య కొంత ఊరట చిక్కింది. ఆ తరవాత డాక్టర్ ఆ కౌంట్ పెరుగుతుందనీ మందు వాడమనీ, పూర్తి ఆరోగ్యవంతురాలవుతుందనీ, చెప్పేరని చెప్పేరు. మందులు వాడుతున్నారు. నెమ్మదిగా అమ్మాయికి కొంత స్వస్థత చిక్కింది. ఇప్పుడేమి కర్తవ్యం, అంటే. ఇది వరకు ఇంటర్ చదివింది కనక, ఏమి చేయాలనుకుంటున్నావంటే కంప్యూటర్ నేర్చుకుంటా నంది. సరే ఆ ఏర్పాట్లు చేసి.ఆ అమ్మాయికి ఒక వ్యాపకం ఏర్పాటు చేస్తే, తెలివయిన పిల్ల కనక, గబగబా నేర్చేసుకుని నాలుగు నెలల్లో మంచి కంప్యూటర్ ఆపరేటరయిపోయింది. ఇది చూసిన ఒక కంపెనీ ఈ అమ్మాయికి పిలిచి ఉద్యోగం ఇచ్చింది,అదే ఊళ్ళో. ఆనందం, ఒక దారి కనపడింది.

తల్లి తండ్రులదగ్గర ఉంటూ, ఒక వ్యాపకం కలిగి, ఆలోచన ఎల్లవేళలా ఆరోగ్యం మీదా, గతించిన భర్తమీదనుంచి మరలడంతో,మందులు వాడటంతో, ఆరోగ్యం మరింత బాగుపడింది. అప్పుడపుడు తన సంగతులు చెబుతూ వస్తూ ఉంది. కొంత కాలానికి ఆరోగ్యం పూర్తిగా సరిఅయినట్లూ, ఇప్పుడు ఇష్టపడితే వివాహం కూడా చేసుకోవచ్చని కూడా డాక్టర్ చెప్పేరని అమ్మాయి తండ్రి చెప్పేరు. ఈలోగా ఒకరు అమ్మాయిని చూసి పరిస్థితులన్నీ తెలుసుకుని, వివాహానికి సిద్ధపడ్డారు. ఆయనకు ద్వితీయ వివాహం. పెద్ద వయసుకాదు, జోడీ బాగానే ఉంటుంది. ఆయన కబురు చేశారు, వచ్చి అడిగారు,అమ్మాయిని పువ్వులలో పెట్టుకుని చూసినట్లు చూసుకుంటాను, నా మొదటి భార్య అనారోగ్యంతో గతించిందని చెప్పేరు. ఏమమ్మా! మళ్ళీ పెళ్ళి చేసుకుంటావా, తప్పేమీ కాదు, చేసుకోడానికి డాక్టర్ అనుమతి ఉంది, ఆరోగ్యరీత్యా, అని అడిగితే నాకిక పెళ్ళి చేసుకుని సంసార జీవితం గడపాలనే కోరిక పూర్తిగా చచ్చిపోయింది. ఈ జన్మకింతే, అంది. ఎంత చెప్పినా వినలేదు.

“ఏమో రేపేమి జరుగుతుందో ఎవరికెరుక? నందో రాజా భవిష్యతి.” ఇంతకీ నేను చేసిన సాయమంటారా! ఏమీ లేదు, చిన్న ఓదార్పు, ఇలా చేసుకోమని ఒక సూచన అంతే. అంతకి ఇంత గొప్ప గౌరవం ఇవ్వడం వారి గొప్పతనం. ఏమయితేనేమి ఎయిడ్స్ భూతం నోటి కోరలదా వెళ్ళి మృత్యువును చూసి వచ్చిన చిరంజీవిని ఆశీర్వదించుదాం.

ప్రకటనలు

24 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బతుకు తీపి.

  1. అభినందనలు.
    మంచి పనులు చేసి నాలుగు (మోక్షపు) రాళ్ళను వెనకేసుకుంటున్నారు.
    మిమ్మల్ని చూసి కొంతమంది అయినా,కొన్ని మంచి పనులు చేస్తారని ఆశిస్తున్నాను.

  2. జీవితేచ్చ ఉంటే మాత్రమే చాలదు. సరైన దిశా నిర్దేశం చేసే హితులు కూడా ఉండాలి కదండీ!
    మీ జీవన విధానం, ఇతరుల పట్ల చూపే దయ,ఆదరణ,సలహాలు-సూచనలు స్పూర్తిదాయకం.
    ధన్యవాదములు

    • @వనజగారు,
      మీ అభిమానానికి ధన్యవాదాలు.సలహా చెప్పేను, వారు ఆచరించారు, ఫలితం పొందారు. అలా జరగవలసి ఉంటే మనం ఉపకరణాలమేనండి.
      ధన్యవాదాలు.

  3. మీరందిచిన సహకారం , ఓ జీవితమంత, మీలోని మానవత్వనికి వందనం.
    మీరు బ్లాగ్ కి ఓ వారం శెలవలు ప్రకటంచాలండి. take rest sir.

    • @భాస్కర్ గారు,
      నేనొక సామన్య పల్లెటూరి మనిషిని అంతే.మీ అభిమానానికి కృతజ్ఞుడిని. శలవు తీసుకుంటున్నా.ఎంతకాలం నెట్ లోకి రాకుండా ఉండగలనో పరీక్షించుకుంటున్నా.
      ధన్యవాదాలు.

    • @శ్రీ (జలతారు వెన్నెల) గారు,
      సామాన్యంగా అందరూ చేసే సూచనలే నేనూ చేశాను, అయితే వాటిని వారు త్రికరణ శుద్ధిగా అమలుచేసి ఫలితం పొందారు.మీ అభిమానానికి
      ధన్యవాదాలు.

  4. మా ఆశీర్వాదం కూడా ఆవిడకి అందించండి శర్మగారూ!
    చేయని నేరానికి ఒకోసారి బలి అయిపోవడమంటే ఇదే…
    @శ్రీ

    • @Rvss Srinivasగారు,
      మీ అందరి ఆశీర్వాదాలు ఆమెకు అంద చేసేను.ఒక్కొకప్పుడు ఇది తప్పదేమో. జీవితమంటే ఇంతే కదా.
      ధన్యవాదాలు.

  5. చిన్నప్పడ నుంచీ నన్ను అందరూ అడిగేవారు “నీ గమ్యం ఏమిటి” అని, అప్పుడూ ఇప్పుడూ నా గమ్యం ఒకటే మంచి వాడిని అనిపించుకోవాలి అని, మంచి చెయ్యాలి అని.
    కానీ నేను అలా కాలేక పోతున్నాను ఎందుకంటే నలుగురు కలిసి ఉన్నప్పుడు అయ్యోపాపం అంటారు కానీ ఒక్కడితో మాట్లాడితే అది వాడు చేసుకున్న ప్రారబ్ధకర్మ అనేసి నా బుర్రలో “వాడు తప్పు చేసాడు అందుకు వాడు శిక్ష అనుభవిస్తున్నాడు” అని అనుకునేలా చేశారు.
    అందుకే నేను ఎప్పుడూ ఎవరికీ సాయం చేసిన పుణ్యానికి పోలేదు.
    కానీ మీ blog లో నాకు మీకు కల వ్యత్యాసం కనిపిస్తుంది “మంచి చెయ్యాలి అంటే వెంటనే చెయ్యాలి – అది మాటసాయం అయినా ఏదైనా”
    ఇంకా కొన్నాళ్ళు పడుతుందేమో నేను మారడానికి, మారడానికి ప్రయత్నిసున్నాను. మీరు మాత్రం మీ ఈ మంచి విషయాలు మాకు నిరంతరం తెలుపుతూ ఉండండి.

    • @గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు gaaru,
      స్పందన ఉండాలి, మనసులో. మంచి వెంటనే అమలు పరచాలి. ఇది కొద్దిగా అలవాటు చేసుకుంటే,ఆ ఆనందం అనుభవిస్తే, చాలా గొప్పగా ఉంటుంది. నిజంగా ఇది స్వార్ధం. పరోపకారం కాదు. ఆ ఆనందం పొందడానికి చేసే పనులని అనుకుంటా.

      ధన్యవాదాలు.

  6. ఆ అమ్మాయి ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొని తన కళ్ళ మీద తాను నిలబడింది..భవిష్యత్తులో తనకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. మీకు తెలియదు కాని మీతో మాట్లాడితేనే కొండంత ధైర్యం వస్తుంది.

    • @అమ్మాయ్ జ్యోతిర్మయి,
      అమ్మాయికి ఇప్పటికి పెద్ద వయసు రాలేదు. ఏమో రేపు మళ్ళీ పెళ్ళి కూడా చేయించేస్తానేమో! ఆశా జీవులంకదా. బాబయ్య చెప్పేడు కనక నీకలా అనిపిస్తుందేమో నమ్మా!!! 🙂 నీ అభిమానానికి
      ధన్యవాదాలు.

    • @మిత్రులు జీడిపప్పు గారు,
      టపాకి, బలే పేరు పెట్టారు.అదృష్టవంతురాలు, ఆరోగ్యం కుదుట పడింది. అందుకు సంతోషీంచాను. మీ అభిమానానికి కృతజ్ఞతలు.
      ధన్యవాదాలు.

  7. నదిలో కొట్టుకు పోయేవానికి చిన్న కట్టెపుల్ల మరల జీవితం మీద ఆశ కలిగించినట్లు,నిరాశా నిస్పృహల్లో కొట్టుకు పోతున్న వారికి ఆపత్కాలం లో చెప్పిన ధైర్య వచనాలే ఆశావహ దృక్పధాన్ని కలిగిస్తాయి. అవి చాలు ఒక మనిషి నిండు జీవితాన్ని నిలపెట్టడానికి. ముఖ్యంగా రోగగ్రస్తులకు జీవితేఛ్ఛను మించిన మందు లేదు. అది మీరు కలిగించారు.

    • @మిత్రులు గోపాల కృష్ణారావు గారు,
      నేనేదో గొప్ప సలహా ఇవ్వలేదుకాని, కొంచం తొందర చేసేను. సహజంగా అందరూ చేసే పనే నేనూ చేశాననుకుంటా.
      ధన్యవాదాలు.

  8. ప్చ్, పాపం.
    అన్నీ కుదిరి, పెళ్ళిచేసుకునే నెలముందు మెడికల్ చెకప్ కంపల్సరీ చేస్తేనో?! అన్న ఆలోచన వచ్చింది. కాని, అమ్మో! మానవహక్కుల సంఘాలోళ్ళు బ్రతకనిస్తారా?! అనిపించింది.
    మంచి సలహా ఇచ్చారు.

    • @Snkrగారు,
      మనుషుల్లో నీతి, నిజాయితి ఉండాలి కాని ఈ టెస్టులు ఎంతకాలం రక్షించగలవండి.
      ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s