శర్మ కాలక్షేపంకబుర్లు-అసూయ,ద్వేషం.

అసూయ,ద్వేషం.

అసూయ, ద్వేషం కవలపిల్లలు అంటారు. ఇది ఒక మానసిక స్థితి.అసూయ ముదిరి ద్వేషంగా మారుతుందేమో!. దీనికి లోనుకాని వారుండరు. విజ్ఞులయితే సద్దుకుంటారు, వీటి ప్రభావం నుంచి బయట పడతారు, లేక పోతే వికృత చేష్టలు మొదలుపెడతారు. సాధారణంగా కవల పిల్లలలో మొదట పుట్టినవారు పెద్దవారు, తరవాత వారు చిన్నవారంటాం. కాని నిజానికి తరవాత పుట్టిన వారేపెద్దవారట, ఎందుకంటే మొదట గర్భాన్ని పడినది వారు కనక. ఏమో, ఎవరు పెద్దో ఎవరు చిన్నో తెలియదు కాని ఇక్కడ రెండవ వారిదే పెద్ద చేయి.

రామాయణంలో ఒక సంగతి గుర్తొచ్చింది. శూర్పనఖ, ఈ పేరే సరైనదని మిత్రులు శ్యామలరావుగారన్నారు. అది నిజం కూడా అనిపించింది.. శూర్పనఖ అంటే చేటల వంటి గోళ్ళు కలది అని అర్ధం, రావణుని చెల్లెలు. రాముని చూసి కామించింది. దండకారణ్యంలో, తన దుశ్చర్యలు, తన గొప్పతనంగా చెప్పుకుని, వీళ్ళు ఇద్దరినీ నేను తినేస్తాను, మనం ఇద్దరం హాయిగా ఉందాం, నాతో సుఖాలనుభవించు, అందిరామునితో. రాముడు, నేను పెళ్ళి అయిన వాడిని, భార్య దగ్గరుంది, నీలాటిదానికి సవితిపోరు పనికిరాదు కనక లక్ష్మణుడిని వరిస్తే బాధ ఉండదన్నాడు. ఈ మాటలు లక్ష్మణుని దగ్గర చెప్పగానే, ఆయన, నేనే సేవకుడిని నన్ను కట్టుకుని నువ్వు సుఖపడలేవంటాడు, నువ్వు రాముడికే తగినదానివంటాడు. మాటలలో పరిహాసం తెలియని శూర్పణఖ సీతను మింగడానికి వస్తూంటే,లక్ష్మణుడు కత్తి దూసి శూర్పణఖ ముక్కు, చెవులూ కోసి పంపించాడు. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి ఎలా? అన్న దగ్గరికిపోయింది, అన్నను తిట్టింది, నీ పరిపాలన ఇంత గొప్పగా ఉందీ, అని. దండకారణ్యంలో అందమైన స్త్రీని చూశాను, నీకు భార్యగా తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తే, ఈ పరాభవం జరిగిందని చెబుతుంది.
రాముని చూసి కామించింది, రాముడు తిరస్కరించగా, కామం తీరక అది క్రోధంగా మారింది. అసహాయత వల్ల అసూయగా మారింది,అందమైన సీత ఉన్నది కనక రాముడు తన కోరిక తిరస్కరించేడనుకుంది. సీత అందం పై అసూయ, ఆపై అది ద్వేషంగా మారి అన్నతో లేనిది కల్పించి చెబుతుంది. చిత్రంగా లక్ష్మణునిపై కోపం లేదు. రామునిపై కోపం, సీత మీద అసూయా ద్వేషాలు ఇంత పని చేయించాయి. నేను ఇలా చేసేను అని చెబితే తిడతాడేమో! కలగ చేసుకోడేమో!!అన్న, అందుకు పధకం మార్చి, పని జరిగేందుకు తగిన విధంగా రావణునికి అలా చెప్పింది.

నేడు వీటిదే రాజ్యం. ఆడవారికి అసూయ ఎక్కువ అంటారు. కాని నేడు దీనికి ఆడ మగ తేడా కనపడటం లేదు. ఆడవారి మాటలలో ఇది కొంచెం ఎక్కువ పాలు తొంగి చూస్తే అనుకోనక్కరలేదు. అందంగా ఉంటే, తెలివితేటలతో ఉంటే, బాగా చదువుకుంటే, చురుకుగా ఉంటే, డబ్బు కలిగుంటే, ఇల్లా ఇవన్నీ అసూయ పడడానికి కారణాలు. దీనికితోడు కావలసినవారయితే మసాలా బలే రంజుగానే దొరుకుతుంది. “జుట్టున్నమ్మ సిగెట్టుకున్నా కొప్పెట్టుకున్నా అందమేనమ్మా!”,అని సాగతీత,” చక్కనమ్మ చిక్కినా అందమేలే!” ఇది అందమైన వారిగురించిన కామెంటు. ఒక డబ్బుకలవారబ్బాయి కావలసిన వారింటి దగ్గర చదువుకుంటున్నాడు. వీడికి ఏదో అర్ధం కాలా, లేదూ రాలేదు, వారి వ్యాఖ్య “నీకు చదువెందుకురా! మీ నాన్న బోలెడంత సంపాదించాడు,” ఇందులో అసూయ తొంగి చూస్తూ ఉంది. మా వాళ్ళలో ఒక తెలివయిన అమ్మాయి, చూస్తే పట్టేసుకుంటుంది, అందుకూ అసూయే,తెలివయినదని,దానికి వ్యాఖ్య ఇది “రేప్పొద్దున్న మొగుడితో కాపరం ఎలా వెలగబెడుతుందోనర్రా!,ఇది” అని. మొన్నటికి మొన్న ఒకమ్మాయి కాలేజిలో చేరింది. హాస్టల్లోనూ చేరింది. రూం మేట్లు కరంటు పోయినపుడు ముసుగేసి చెవులలో అరిచారు, బాత్ రూం కెళ్ళేటప్పుడు కరంటు పోతే గట్టిగా భయపెట్టేలా అరిచి గోల చేశారు. ఇంక ఇది పని కాదనుకున్నారనుకుంటా, పడుకుని నిద్రపోతుంటే దిండుతో ఊపిరాడకుండా అదిమి చంపెయ్యాలనుకుని, అంతపనీ చేయబోతే అదృష్టం బాగుండి ఆ అమ్మాయి బతికింది.ఇప్పుడు కేసులు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. పాపం ఆ అమ్మాయికి మూడు రోజులు మాట రాలేదు.ఇంతకీ ఆ అమ్మాయి పాపం ఏమంటే అందంగా ఉందిట, ఇదంతా టి.వి లో వచ్చింది..

కొంతమందికి ఎదుటివారు ఆనందంగా ఉంటే చూసి ఓర్చలేరు, అసూయపడిపోతారు. ద్వేషించేటంతగా ప్రేమించానని ఒక చోట చదివేను, అర్ధం కాలేదు. ప్రేమ ఉన్న చోట అసూయ సహజమనుకుంటా. ఎదుటిది ఏదో వస్తువయితే సమస్య లేదు, పొందచ్చు. అదే మనిషి అయితే వారికి వీరి పట్ల ప్రేమ అనురాగం ఉంటే సమస్యలేదు. లేక పోతే ఒక వైపయితే అది తీరక పోతే అసూయ, దానిని నుంచి ద్వేషం, ఆ తరవాత ఆసిడ్లు, పీకలు కొయ్యడాలు దాక పోతూ ఉంది, వ్యవహారం.

ఒక అమ్మ కన్న పిల్లలంతా ఒకేతెలివి, అందంతో ఉండరు. అంతెందుకు ఒక చేతి వేళ్ళు ఐదూ ఒకలా వుండవు. నిజానికి అలా ఉంటే చెయ్యి పనికి రాదు. సమాజంలో తెలివయినవారుంటారు, తెలివి తక్కువ వారుంటారు, అందమయినవారుంటారు, అందవికారులుంటారు. అన్ని రకాలవారు కలిస్తేనే సమాజం. వీరంతా కలసి బతికితేనే అందం తప్పించి ఒకరి పై ఒకరు ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెంచుకుంటే బతుకు నరకమైపోతుంది. చేతకాని వారికి, బలహీనులకు, చేతనయినవారు, బలంకలవారు చేతనయినంత సహాయపడితే ఉండే అందం, అందుతో పొందే ఆనందం వర్ణించలేమేమో! మనం చెయ్యగలదే చేద్దాం, మనుషులలా బతుకుదాం.

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అసూయ,ద్వేషం.

 1. సర్, అలా గబగబా చదివేలా చేయాలంటే ఏమి చేయాలో చెప్తే నా పోస్ట్లు కూడా రోజూ పెట్టేస్తాను. బాగుంది సర్ మీ వివరణ

 2. మా ఊళ్ళలో తాత పడక కుర్చీ మీద కూర్చుని తన చిన్న మనవడునో మనవరాలిలో చేతిలో తీసుకుని మిగిలిన మనవలను చుట్టూ కూర్చో పెట్టి నీతి కధలు చెప్పేవారు అని అంటుండేవారు, కాలం మారింది ఇప్పుడు తాతగారు తన మనవళ్ళకు చెప్పడానికి మంచి ప్రదేశం ఎంచుకున్నారు. మరి వేచి చూద్దాం ఎంత మంది ఈ మంచిపని వల్ల లబ్ధిపొందుతారో.

  • @ గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,
   నాకు తెనుగు తప్పించి మరో భాష రాదు. చదువుకోలేదు. రామాయణ,భారత, భాగవతాలు చదుకున్నా, చదువుతున్నా నిత్యం. నాకు గందర గోళం లేదు. పరమాత్మ చెప్పినది, నీ పని నువ్వు చెయ్యి, ఫలితం ఇవ్వడం నావంతు అన్నారు. నేను పూర్తిగా నమ్ముతాను. అమ్మ నారాయణి నా చేత ఈ పని చేయిస్తోందనుకుంటున్నా, అమ్మ ఎంత కాలం చెయ్యమంటే అంత కాలం చేస్తా.చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ ఖ…. అన్నారు సినీ కవి అదేనా వింటారేమో!
   ధన్యవాదాలు.

 3. అసూయ,ద్వేషాల గురించి బాగా చెప్పారు.
  బావుంది అండీ! అవును..హృదయపూర్వకంగా అందరిని స్వాగతించడం అవసరం. అనవసర ద్వేషాలు ఎందుకండీ! పిల్లలలో పెరుగుతున్న ఇటువంటి దోరణి భయం కల్గిస్తూ ఉంటుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s