Courtesy youtube
తాళం.
తప్పెట్లోయ్! తాళాలోయ్!! దేముడి గుళ్ళో బాజాలోయ్!!!. తాళం అన్న పదానికి నానార్ధాలున్నాయి. ఇల్లు వగైరా వాటికి తాళంకప్ప వేస్తే,ఈ భవన యజమాని ప్రస్తుతం లేరు కనక ఎవరూ ఇందులోకి వెళ్ళడానికి లేదని చెప్పే గుర్తు తాళం. ఇక రాగం, తాళం అన్నవి సంగీత పరమైనవి. తాళం వేయడం అన్నదానికి కూడ మామూలు తాళం వేయడమన్న అర్ధంతో పాటు సంగీతం కి తాళం వేయడమనీ, మరొకటి, ఒకరిని, గొప్పవారుగా కీర్తించడమనీ నేటి అర్ధం. అక్కడ తాళం అన్నదాని అర్ధం, సంగీతపరమైన శృతి, లయ, రాగం,తాళం, తానం, పల్లవి,లోది. మరిదేమీటీ!. ఇది మన నిత్య వ్యవహారంలో ఉపయోగించే తాళం.మరి తాళం వెయ్యడం అని కూడా అంటారు, అదేమిటీ?. దానినే భజన చేయడం అంటారు, దానినే కాకా పట్టడం అని కూడా అంటారు.తాళం అన్నదానిని మళ్ళీ తాళం కప్ప, చెవిగా చెబుతాం.
తాళాలు గురించి భాగవతం లో మంచి ఘట్టం ఉంది. కన్నయ్య చతుర్భుజుడుగా జన్మించి తల్లి తండ్రులకు కర్తవ్య బోధ చేసి మళ్ళీ మామూలు శిశువులా మారిపోయాడు. ఇప్పుడు కన్నయ్యను తీసుకెళ్ళాలి. తాళాలున్నయి కదా, చెఱసాలకి, అవి ఎలా ఊడేయో పోతన గారిలా చెప్పేరు.
“అప్పుడు చప్పుడుకాకుండ దప్పటడుగులిడుచు,నినుపగొలుసుల మెలుసులు వీడిన దాలంబులు మహోత్తాలుండైన బిడ్డనికి నడ్డంబు గాక కీ లూడి వీడిపడ, యరళంబులు విరళంబులై సరళంబులగు మొగసాలం గడచి, పాపఱేడు వాకిళ్ళు మరల మూయుచు,బడగ లెడగలుగ విప్పి,కప్పి,యేచి, కాచికొని వెంటనంటి రాగ గడంగి నడచునెడ…”
ఒహో! ఏమి చెప్పేరండి పోతనగారు, ఇలాగ ఇనప గొలుసుల కొక్కేలు ఊడిపోయాయట, తాళాలు ఊడిపోయాయట, వాకిళ్ళు తెరుచుకున్న వాటిని వెనకాలే మూస్తూ వెనక పడగలు ఎత్తి పట్టుకుని, ఆహా! ఏమి మాటలు వాడేరండి పోతనగారు, విప్పి, కప్పి, యేచి, కాచుకుని, ఇలా వెనక వెళ్ళేడట ఆది శేషుడు. ఎంత గొప్ప ఘట్టం.
నేడు వేసిన తాళాలు వేసినట్లుంటున్నాయి కాని లోపలి సరుకులే మాయమవుతున్నాయి. బేంకులేవో గొప్పగా ఉన్నాయనుకోనక్కరలేదు. వాటి స్ట్రాంగ్ రూమ్ లు కూడా వీక్ గానే ఉన్నాయంటున్నారు.నేటి కాలానికి సంగీతం లో తాళం అన్నది తప్పితే, అభాసయిపోతుంది. ఇప్పుడు “ఇ” తాళాల గురించి ఒక సారి చెప్పేసుకున్నాం కదా, అదేనండి పాస్ వర్డ్స్ గురించి. ఒక తాళం లో పాడే పాట మరొక తాళం లో పాడితే అన్యాయంగా ఉంటుంది కదా! దంపుళ్ళ పాటని అలాగే పాడాలి ఆ తాళం లోనే, మరొకలా పాడితే బాగోదు. అలాగే బ్రోచే వారెవరురురా అన్న కీర్తన శంకరాభరణం లో శంకర శాస్త్రిలా పాడాలి, లేదా ఎమ్. యెస్. సుబ్బులక్ష్మిలా పాడాలి, కాని మరొక వంకరశాస్త్రిలా పాడితే అభాసుగా ఉంటుందికదా. అంచేత తాళం తెలిసుండాలి.
మరి నేడు మరోరకం తాళమెయ్యడం నిత్యమూ చూస్తున్న వింత. నినువినా రఘువరా ననుబ్రోచేవారెవరురా! అనే బదులు దేశం ఇప్పుడు నినువినా రాహులూ మము బ్రోచేవారెవరురా! అని పాడుకోమంటున్నారు, భజంత్రీలు. శుభం భూయాత్!
తాళం వెయ్యనివాళ్ళని తప్పించడం కూడా ఒక కళ. కిందవాళ్ళయితే సామ దాన భేద దండోపాయాలున్నాయి. పెద్ద వాళ్ళయితే ప్రమోషన్లున్నాయి. అదీ ఇదీ కాకపోతే కౌటిల్యుడు చెప్పిన విషకన్యా ప్రయోగాల లాటివి ఉన్నాయి. అబ్బాయిగారేదో ఊడపొడుస్తారనుకుంటే, ధైర్యం చేసి, నలభై ఏళ్ళు దాటిన వాడు, పెళ్ళి చేసుకోకపోతే, ఇల్లు చక్కబెట్టుకోడమే తెలియని వాడు, పెళ్ళాం మొట్టికాయలు తిననివాడు, దేశాన్ని ఏమి చక్కబెడతాడంటున్నారు, కొందరు. 🙂 . అబ్బాయిగారు ఎక్కడ కాలు పెడితే అక్కడ నిప్పచ్చరమైపోతూ ఉందికదా అని భయమేసి ఏమీ చేయడానికి జంకుతున్నాడని కొంతమంది గుసగుస లాడుకుంటున్నారు. 🙂 . నిజమేమో పైవాడికి తెలియాలి. అంతా విష్ణు మాయ.
ఏమండీ శర్మ గారు,
ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్టు, తాళం కప్ప కూడా మా రాహులు మీదే పడాలా ? ప్చ్ ఇన్ని మొట్టి కాయలు తింటున్నా మనవడు నిఖార్సు గా ఉన్నాడు. దానికైనా మెచ్చు కోవాలి కదండీ మరి ?
వేరే వారెవరు మము బ్రోచేవారు నిను వినారా హూ, లా లా లా !
ఈ’ తాళానికి సంకేత పదం వాడాలి
ఈ కాలానికి రాహుల్ పదం పాడాలి !
చీర్స్
జిలేబి.
@జిలేబిగారు,
అంతే కదండీ. నిఖార్సా?
ధన్యవాదాలు.
🙂 🙂
@అమ్మాయ్ సుభ
ధన్యవాదాలు.
కీర్తన కూడా చాలా బాగుంది…..
@శ్రీ
@ Rvss Srinivas గారు,
కీర్తన నచ్చి నందుకు
ధన్యవాదాలు.
శర్మగారూ!
పోతన భాగవతంలోని ఘట్టాన్ని గుర్తు చేసారు…
తాళం గురించి మీరు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి..
మీ మాటలకి తాళం వేస్తూ మీ వెంట మేమెప్పుడూ ఉంటాం..:-)
@శ్రీ
@ Rvss Srinivas గారు,
కృష్ణాష్టమి రాబోతోంది కదండి.
ధన్యవాదాలు.