శర్మ కాలక్షేపంకబుర్లు-గుఱ్ఱపు స్వారి.

Courtesy you tube

 

గుఱ్ఱపు స్వారి

మా ఊళ్ళో హైస్కూల్ ఊరికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది, మధ్యలో తూర్పు పేట అని ఒక పేట ఉంది. ఆ పేటలో నివసించేవారు ఎక్కువగా పాడి చేసేవారు. గేదెలు ఎక్కువగా ఉండేవి. అందులో ఒకటంటే ఒకటే, గౌడు గేది ఉండేది. అది తతిమా గేదెలకంటే పెద్దదిగా ఉండేది. ఎక్కువ పాలు కూడా ఇచ్చేదట. సరిగా మేము స్కూల్ కి బయలుదేరే సమయమూ, గేదెలను తోలుకొచ్చే సమయమూ ఎప్పుడు ఒకటిగానే ఉండేది. మేమూ గేదేలు సమాంతరంగా ఒకటే పుంతలో వెళ్ళాలి, మేము బడికి అవి మేతకి చెరువు గట్టుకి. వర్షాకాలమయితే పుంత దారంతా మోకాలు లోతు దిగబడుతూ ఉండేది. ఈ గౌడు గేది తో మాకు పెద్ద తంటా వచ్చేసింది. ఇది ఎవరిని బడితే వారిని పొడిచేసేది. మేము పాలికాపుతో సరిగా తోలమని చెప్పినా ఉపయోగం ఉండేదికాదు. ఆ గేది వాడి మాట కూడా వినేది కాదు. మగ పిల్లల మయితే ఎలాగో అవస్తపడి బందలో పరుగెట్టేవాళ్ళం, కాని ఆడపిల్లల పని చాలా బాధగా ఉండేది. రోజూ బడికి వెళ్ళే ముందు గౌడు గేది ముందు వెళ్ళిపోవాలని దణ్ణం పెట్టుకు బయలుదేరేవాళ్ళమంటే అనుమానం కాదు, అంత భయమేసేది. మా క్లాస్ మెట్ ఒకమ్మాయి ఎర్ర గౌను వేసుకుని వచ్చేది,ఆ అమ్మాయి తడపలా బక్కపలచగా, గాలి వేస్తే ఎగిరిపోయేలా ఉండేది. ఎర్ర గౌను చూసినపుడల్లా ఈ గేది మరీ రెచ్చిపోయేది. ఇక్కడికిది ఆపి మరొక సంగతి చెప్పుకుందాం, ఎందుకంటే దీనికి దానికి లింక్ ఉందికనక.

నా క్లాస్ మేట్ ఒకతను మా పల్లెటూరికి పక్క పల్లెటూరినుంచి వచ్చేవాడు. మా స్నేహితుడు ఆ పల్లెటూరి మోతుబరిగారబ్బాయి. చదువు అంటలేదు కాని వయసొచ్చేసింది, మా వయసు పన్నెండు, పదమూడయితే అతను పద్దెనిమిది ఆ పై ఉండేవేమో,మనిషి బాగ పెద్దగా బలంగా ఉండేవాడు. అప్పటిరోజుల్లో సైకిళ్ళు లేవు, కాని అతను గుఱ్ఱం మీద బడికి వచ్చేవాడు. నా దగ్గర ఎక్కువగా చేరేవాడు. గుఱ్ఱం దిగి, గుఱ్ఱాన్ని గ్రౌండ్ లో మేతకి వదిలేసి పుస్తకాల సంచి పుచ్చుకుని వచ్చేవాడు. వచ్చేటప్పుడు మధ్యాహ్నం తినడానికి కేరేజి తెచ్చుకునేవాడు. సాయంత్రం బడి వదిలిన తరవాత బయటికొచ్చి చిత్రమైన శబ్దం చేసేవాడు, గుఱ్ఱం వచ్చేసేది, ఎక్కడున్నా. పుస్తకాల సంచి ఒక వైపుకి మరొక వైపుకి కేరేజి వేసి చెంగుమని ఎగిరి గుఱ్ఱం ఎక్కి కళ్ళెం పుచ్చుకునేవాడు. జీను వగైరాలేనీ ఉండేవి కావు. ఈ గుఱ్ఱమంటే కూడా మా కందరికి భయమే, కారణం, అది కరిచేది. ఈ మిత్రుడి పేరు సూర్యారావు. నాకు గుఱ్ఱం ఎక్కాలని సరదాగా ఉండేది, కాని గుఱ్ఱం కరుస్తుందనే భయం మూలంగా చాలా కాలం ఆ కోరిక అణుచుకున్నాను. ఈ మిత్రుడు బడి ఎగ కొట్టడం ఎక్కువగా ఉండేది. పుగాకు రెలిస్తే మానేసేవాడు, పొలం పనులుంటే మానేసేవాడు, అన్నట్లు మరొక సంగతి, దారిలో ఒక కొండవాగు అడ్డొస్తుంది, అదే నిన్న అనుకున్న కొవ్వాడకాలవ. వర్షాకాలమయితే, ఈ వాగు భయంకరమైన వడితో ప్రవహించేది, అందుకు వచ్చేవాడుకాదు. ఒక్కొక రోజు పూర్తిగా తడిసిపోయి వచ్చేవాడు, ఏమిరా అంటే ఏట్లో గుఱ్ఱం నేను తడిసిపోయామనేవాడు. వాడంతే నాకదో ఆరాధన ఉండేది,గుఱ్ఱం స్వారీ చేసేవాడని, నేను వాడు బడికి రానప్పటి పాఠాలు చెప్పేవాడిని, అందుకు నాదగ్గర చేరేవాడు. ఇలా మా స్నేహం అభివృద్ధి చెందింది. కంది కాయలు, చిలగడ దుంపలు, తేగలు ఇలా ఏదో ఒక చిరుతిండి తెస్తూ ఉండేవాడు. ఒక రోజు ఉండబట్టలేక గుఱ్ఱం ఎక్కించవా అని అడిగేశాను. ఓస్! అంతే కదా రా, ఎక్కించేస్తానని తీసుకుపోయాడు. గ్రౌండ్ లోకెళ్ళి విచిత్ర శబం చేస్తే గుఱ్ఱం వచ్చేసింది, తను ఎగిరి కూచున్నాడు. నేను దూరం గా నిలబడ్డా. రారా అంటాడు, నాకు గుఱ్ఱం కరుస్తుందేమో నని భయం, కాని వాడికి చెప్పలేదు, నవ్వుతాడని. వాడు రమ్మన్న కొద్దీ నేను వెనకడుగులేస్తోంటే, గుఱ్ఱంని పక్కకి మరిల్చి వెనక్కు వెళ్ళేడు. వెళ్ళిపోతున్నాడు కాబోలనుకున్నా. గుఱ్ఱం మీద స్వారీ చేస్తూ వచ్చేసి నా జబ్బ పుచ్చుకుని ఊడతపిల్లలా నన్ను గుఱ్ఱం మీద ఎక్కించి, గుఱ్ఱాన్ని ఆపి నన్ను సరిగా కూచోబెట్టి కాసేపు తిప్పేడు. బాబూ! సూర్రావు దింపెయ్యారా అని ఏడుపు గొంతుతో అడిగితే దింపేసేడు. అమ్మయ్య! అలాగ గుఱ్ఱపు స్వారి సరదా తీరింది. అసలు మా వాడి హీరోఇజం ముందుందని నాకు తెలీదుకదా.

ఒక రోజు స్కూలుకి వస్తున్నాం మామూలుగా గేదిల మధ్యలోకి వచ్చేశాం. మా క్లాస్ మేట్ ఎర్ర గౌన్ వేసుకొచ్చింది ఆ రోజు. మా గుండెలు లబ్ డబ్ మని కొట్టుకుంటున్నాయి. ఎక్కడినుంచి వచ్చీందో కాని గౌడు గేది పరుగెట్టుకుంటూ ఆ అమ్మాయి వెనక పడింది. ఆ అమ్మాయి పరిగెడుతోంది శక్తి కొద్దీ, మేము వెనకాల ఆయ్ ఆయ్ అంటూ పరిగెడుతున్నాం, ఈలోగా ఎక్కడనుంచి వచ్చేడో కాని నా హీరో సూర్రావు గుఱ్ఱం మీద వచ్చి చేత్తో గేది వీపు మీద ఒక చరుపు చరిచి, చిత్రమైన శబ్దం చేసి, ఒక్క సారిగా ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని గుఱ్ఱం మీద కూచోపెట్టుకుని దౌడు తీశాడు, స్కూల్ కేసి. ఆ అమ్మాయి చేతిలో పుస్తకాలు కింద పడిపోతే ఏరుకుని పట్టుకెళ్ళేము. స్కూల్ దగ్గర కెళ్ళేటప్పటికి, హెడ్ మాస్టారు, మిగిలిన టీచర్లు బయటికొచ్చేసేరు, వీళ్ళిద్దరూ గుఱ్ఱం మీద రావడం చూసి. మేము చేరిన తరవాత జరిగిన సంగతి చెప్పేము, మా హెడ్ మాస్టారు, మా సూర్రావుని మెచ్చుకుని ఒరే! నువ్వీ వేళ అలా చేయకపోతే ఈ అమ్మాయిని ఆ గేది కుమ్మేసేదిరా అని లోపలి కెళ్ళిపోయారు. మేమంతా మా సూర్రావు హీరోఇజాన్ని కీర్తిస్తూ వెనక నడిచేము. తరవాత…

18 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-గుఱ్ఱపు స్వారి.

 1. సవారీ బానే ఉందండీ !

  బ్లాకు అండ్ వైటు చిత్ర రాజం చూసినంత గా మీ వర్ణన అమోఘం! ఆ విచిత్ర మైన శబ్దం ఎలా గుంటుందండీ ?

  చీర్స్
  జిలేబి

  • @జిలేబిగారు,
   జరిగింది, జరిగినట్లు చెప్పాలి కదండీ! మా సూర్రావు చేసే శబ్దం రాయలేక, ఆ ప్రయత్నం మానేసి, విచిత్ర శబ్దం అన్నా 🙂
   ధన్యవాదాలు.

 2. బావుంది. గుర్రం మీద హీరో ల వచ్చి కాపాడటం చుస్తుంటే, ఏదో తెలుగు సినిమా చూస్తున్నట్టు ఉందండి.
  ఈ పుంత లో బురదలో నడవడం నాకు కూడా అనుభవమే, కాకపోతే స్కూల్ కి కాదు, ఆటలడుకునేటప్పుడు.
  వానాకాలం చదువులు అంటే ఇవేనేమో అప్పట్లో.

  • @వెంకట్ గారు,
   వానా కాలం చదువుకున్నాం తప్పించి, వానా కాలపు చదువు కాదు కదండీ! 🙂 మా సూర్రావు నాకు అందుకే హీరో అండి.
   ధన్యవాదాలు.

  • @భాస్కర్ గారు,
   మా సూర్రావు చాలాకాలం తరవాత, నాలుగేళ్ళ కితం కలిసేనండి. అది మరోసారి చెప్పుకుందాం.
   ధన్యవాదాలు.

  • @పద్మగారు,
   ధైర్యంగా ఏడిచి గుర్రం దిగిపోలేదా? కరవదనుకుంటే జూలు పట్టుకుని ఎక్కెయ్యనండీ!ధైర్యవంతుడినే కదా! 🙂
   ధన్యవాదాలు.

 3. మొత్తానికి భయపడుతూ గుర్రపు స్వారీ చేసేసారన్నమాట.:)
  మీ సీనియర్ ఫ్రెండ్ సూర్రావు గారి తెలివి,ప్రతాపం బాగున్నాయండీ!

  • @వనజగారు,
   ఊ…. మరి ధైర్యంగా వాడు నా జబ్బ పుచ్చుకుని గుర్రం ఎక్కించేస్తే, ఛస్తానా, ధైర్యం గా ఏడిచేసి దిగిపోయా కదా.
   ధన్యవాదాలు.

 4. >ఎర్ర గౌను చూసినపుడల్లా ఈ గేది మరీ రెచ్చిపోయేది.
  ఈ మాట నిజమే కావచ్చును కానీ, శర్మగారూ,ఆవులూ గేదెలూ వగైరా జంతువులవి compound eyes. వాటి కళ్ళకు వర్ణాంధత్వం ఉంటుంది. అంటే అవి తెలుపు-నలుపు రంగుల్లోనే ప్రపంచాన్ని చూస్తాయన్న మాట. అందు చేత గేదె ఎరుపు రంగును ఆకుపచ్చరంగును విడివిడిగా గుర్తుపట్ట లేదు. దానికి రెండూ నలుపు రంగే. అయితే జనం వాడుకగా చెప్పేది వెంఠనే తప్పన వీలు లేదు. అన్ని రంగుల్లోనూ ఎరుపు రంగుది అతితక్కువ తరంగదైర్ఘ్యం. కాబట్టి ఎరుపును అది అతినలుపుగా చూస్తుంది అనిపిస్తుంది. ఆలోచించవలసిన విషయం.

  • @మిత్రులు శ్యామలరావుగారు,
   మీరు చెప్పింది నిజం. కాని అదెందుకు జరిగేదో తెలియదు. ఈ తార్కిక జ్ఞానం ఆ వయసులో లేదుకదా. ఆ అమ్మాయి ఆ గౌన్ తో చందనపు బొమ్మలా ఉండేది. ఆ దృశ్యం కానిగేదెను భయపెట్టేదేమో.
   ధన్యవాదాలు.

  • @అనూరాధ గారు,
   నిజం సినిమా కంటే ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది కదండి. మిగిలినవి మళ్ళీ కలిసినపుడు చెప్పుకుందాం.
   ధన్యవాదాలు.

 5. మీకాలంలోలాగా నడిచికాదు మాకాలంలో అందరం కలిసి వెళ్ళేది Cycles మరి ఇప్పుడు Bus మరి మీ అనుభవాలు మా అనుభవాలు ఇప్పటివారికి ఉంటాయా?

  • @గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,
   ఎప్పటి అనుభవాలు అప్పటివేననుకోండి. మన అనుభవం మనకి గొప్ప కదా.
   ధన్యవాదాలు.

  • సిరి శ్రీనివాస్ గారు,
   నిజం కదండీ. చదువుకోడానికి ఇంకా చాలా తిప్పలు పడ్డాం. మళ్ళీ కలిసినపుడు చెబుతా.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s