శర్మ కాలక్షేపంకబుర్లు-తిన్న ఇంటివాసాలు లెక్కపెట్టడం.

Courtesy youtube

తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం.

అచ్చ తెలుగు బ్లాగులో విజయ కుమార్ గారు పూరిల్లు గురించి రాస్తూ…తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అన్నారు…
పాత కాలపు రోజుల్లో చుట్టం వస్తే వారం రోజులు ఉండి వెళితే అది చాలా తొందరగా వెళ్ళి నట్లు లెక్క. దీనికి ఆధారాలు భారత, భాగవతాల్లో బాగా కనపడతాయి. ఒక సందర్భం చూద్దాం. యుద్ధం తరవాత ధర్మరాజు పరిపాలన చేస్తున్న రోజులలో ఒక సారి అర్జునుడు బావను చూసివద్దామని ద్వారకకి వెళతాడు. వెళ్ళినవాడి దగ్గరనుంచి, ద్వారకనుంచీ కబురు తెలియలేదు, అర్జునుడు వెళ్ళి ఏడు నెలలయింది, దుశ్శకునాలు కనపడుతున్నాయి, అని బాధపడతాడు ధర్మ రాజు. అప్పుడు పోతన గారన్న మాట చూద్దాం.

హరి జూడన్ నరుడేగినాడు నెలలేడయ్యెంగదా! రారు కా
లరు లెవ్వారును……భాగవతం ప్రధమ ఆశ్వా….331

వెళ్ళిన వాళ్ళకి ఒక భవనమే విడిదిగా ఇచ్చేవారు. వెళ్ళేవారు కూడా మంది మార్బలంతో వెళ్ళేవారు కాని ఒకరిద్దరు వెళ్ళిన దాఖలాలు లేవు. కృష్ణుడు పాండవులను అరణ్యంలో చూడటానికి వచ్చినపుడు కూడా రుక్మిణిదేవిని తీసుకుని వచ్చిన దాఖలా కనపడుతుంది.

ఒకడు బంధువుల ఇంటికెళ్ళేడు,సకుటుంబ సపరివార సమేతంగా, వారు ఆదరించేరు, అతిధి ఆ ఊరులో ఉన్న తన పనులు చూసుకుంటున్నాడు. భోజనం తరవాత రోజూ పడుకోడానికి మంచం వేసేవారు వసారాలో. వెల్లకిలా పడుకుంటే పై కప్పు కనపడింది. సరదాగా వాసాలు లెక్కపెట్టేడు. మళ్ళీ లెక్కపెట్టేడు. లెక్క బాగా గుర్తు పెట్టుకున్నాడు. ఎలాగా లెక్క పెట్టడం మొదలెట్టేమని నాలుగు పక్కలా, నాలుగు వసారాల్లోనూ మంచం వేసుకుని పడుకుని వాసాలు లెక్కపెట్టేసేడు. తను ఆ ఊరు వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోయే సమయం వచ్చేసింది, ఒక దుర్బుద్ధి పుట్టింది, ఇల్లు బాగా సౌకర్యంగా ఉంది స్వంతం చేసుకుంటేనో అని. ఆ రోజు బంధువుతో “ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నా”వని అడిగేడు. దానికి ఇంటి యజమాని “ఇల్లు ఖాళీ చెయ్యడమేమిటి?” అన్నాడు. “అదేంటి బంధువువు కదా అని చెప్పి నిన్ను ఈ ఇంటిలో ఉండనిచ్చా ఇన్నాళ్ళూ, ఇప్పుడు నేను ఈ ఊరు మకాం మార్చేస్తున్నాను, నా ఇల్లు నాకు ఖాళీ చేసి ఇవ్వవలసినదే” అని గొడవ చేసేడు. దీనికి ఇంటి యజమాని ఏదో హాస్యం చేస్తున్నాడనుకున్నాడు. మరునాడు, ఊరిలో న్యాయాధికారి దగ్గర తగువు పెట్టేడు, బంధువు. “ఇప్పుడు ఫలానా వారుంటున్న ఇల్లు నాదండి, నేను కట్టుకున్న ఇల్లు, ఈయన బంధువు కదా అని ఉంటానంటే ఉండమన్నాను, నేను కుటుంబ సమేతంగా ఈ ఊరు వచ్చేస్తున్నాను. నాకు ఇల్లు ఖాళీ చేయించి, నా ఇల్లు నాకు ఇప్పించండి” అని అడిగాడు. అసలు ఇంటి యజమానిని పిలిపించారు. అతను “బాబోయ్! ఈ ఇల్లు నేను కట్టుకున్నానండి, ఇది నాదే, ఇతను నా దూరపు బంధువు, ఊరిలో పని ఉండి వచ్చి, ఇన్నాళ్ళుగా నా ఇంటిలో అతిధిగా ఉన్నాడు, నా ఇంట సపరివారంగా ఆతిధ్యం పొందేడు,” అని చెప్పేడు. దానికి న్యాయాధికారి “ఏమయ్యా! నేనే అసలు హక్కుదారుడిని అని ఇంట్లో ఉంటున్నతనంటున్నాడు, నువేమో ఇల్లు నాది అంటున్నావు,” అన్నాడు. దానికి బంధువు “అయ్యా! ఆ ఇల్లు నాదేనండి, ఇతనిదయితే, అతనే స్వయంగా కట్టించుకుని ఉంటే, ఇంటికి వాడిన కలప వివరాలు చెప్పమనండి, ఎన్ని దూలాలు వాడేరు, ఎన్ని వాసాలు వాడేరు, ఏపక్కన ఎన్ని ఉన్నాయో చెప్పమనండి” అన్నాడు. దానికి న్యాయాధికారి “అతనడుగుతున్న ప్రశ్న సమంజసంగానే ఉంది, నీవు కట్టుకున్నానంటున్న ఇంటికి, నువ్వు వాడిన దూలాలెన్ని, వాసాలెన్ని, ఏ పక్క ఎన్ని వాడేవో, ఎన్ని ఉన్నాయో లెక్క చెప్ప”మన్నారు. దీనికి ఇంటి యజమాని కళవెళ పడి,” అయ్యా !ఇల్లు కట్టుకున్నాను తప్పించి ఎన్ని వాసాలు, ఎన్ని దూలాలో ఎప్పుడూ లెక్క పెట్టుకోలేదండి, “అన్నాడు. దానికి న్యాయధికారి, ” ఏమయ్యా, ఇల్లు నీదని నువ్వు అంటున్నావు, స్వయంగా కట్టుకున్నానన్నావు, ఎన్ని దూలాలు, వాసాలు వాడినదీ చెప్పమన్నావు, అతను చెప్పలేనంటున్నాడు, నువ్వు చెప్పగలవా” అన్నారు. దానికి బంధువు “తప్పని సరిగానండి, ఇన్ని దూలాలు వాడేనండి, ఇన్ని వాసాలు వాడేను, మీరు లెక్కపెట్టుకోవచ్చు” అన్నాడు. న్యాయాధికారి వచ్చి దూలాలు, వాసాలు లెక్క పెట్టిస్తే, బంధువు చెప్పిన వానితో సరిపోయాయి. దానికి న్యాయాధికారి అసలు యజమానిని ఇల్లు ఖాళీ చేసి, బంధువుకు ఒప్పజెప్పమని తీర్పిచ్చాడు. ఆ రోజుల్లో నోటి మాట తప్పించి రాత కోతలు లేక ఇలా చుట్టమయి వచ్చి దెయ్యమై పీక్కు తిన్నాడు. ఇల్లు స్వంతం చేసుకున్నాడు. దీన్నే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అనగా ఉపకారం పొంది కావలసినవారికే అన్యాయం చెయ్యడంగా రూపొందింది. కావలసిన వారిదగ్గర చేరి పబ్బం గడుపుకుని ఆ తరవాత మోసం చెయ్యడాన్ని తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడమని నానుడి స్థిరమైపోయింది.

ఇది సామాన్యులలో నూ ఎక్కువగా రాజకీయ పార్టీలలోనూ కనపడుతోంది. “మీ నాయకులు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేరంటే,” “మీ నాయకులేం తక్కువ తినలేదు, తిన్నింటి వాసాలు మీ వాళ్ళింతకంటే ఎక్కువే లెక్కేట్టేరని” అంటూ ఉంటారు. ఏమోగాని, అన్ని రాజకీయ పార్టీలు ఒక విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నట్లు కనపడుతుంది, ప్రజలదగ్గర చేరి వారి ద్వారా అధికారంలోకొచ్చి వారికే ద్రోహం చేయడం. “తిన్నింటి వాసాలు లెక్కెడుతున్నాయి రాజకీయ పార్టీలని” ప్రజలనుకుంటున్నారు.

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-తిన్న ఇంటివాసాలు లెక్కపెట్టడం.

  1. నానుడి వెనుక నున్న రంజైన కథని వివరించారు. చాలా బాగుంది.ఇలా మన సామెతల వెనుకనున్నఅసలు కథలని తెలియక పోతే వాటిని పూర్తిగా ఆస్వాదించ లేము.శ్రీ తిరుమల రామచంద్ర గారు తన నుడి-నానుడి గ్రంథంలో కొన్ని విషయాలు వెల్లడించారు.ఇలాగే ఉత్తరాంధ్రకు చెందిన ఓఢ్ర రచయిత ( పేరు పాణిగ్రాహియో పాత్రోనో గుర్తు లేదు) వ్రాసిన పుస్తకం ఒకటి చాలా కాలం క్రిందట చదివేను.ఇటువంటి విషయాలు తెలిసిన వారెవరైనా వాటిని గ్రంథస్తం చేయడం కాని బ్లాగుల లో పెట్టడం కాని చేస్తే భాషా సేవ చేసినవరవుతారు.

  2. ఇంత చెప్పారు మరి శిక్ష గురించి చెప్పండి, మన జీవితం ఆధార పడే సూత్రం సిద్దాంతం “కర్మ సిద్ధాంతం” అది Newton తన మూడవ సిద్ధాంతంగా వ్రాసుకున్నాడు “Every Action has equal and opposite reaction” అని.
    మీ టపాలు చదివేటప్పుడు సంయమనం ఎలా పాటించాలో అర్ధం అవుతుంది.

Leave a reply to kastephale స్పందనను రద్దుచేయి