శర్మ కాలక్షేపంకబుర్లు-చెంపదెబ్బ.

Courtesy youtube

చెంప దెబ్బ.

నాలుగేళ్ళ కితం ఒకరోజు అన్నయ్యని ఒక సారి చూసొద్దామని బయలుదేరాను. “ఏంటీ! ఈ మధ్య జ్ఞాపల్లోకెళ్ళిపోతున్నారు” అన్నారొకరు, “సాధారణంగా బ్లాగు మొదలు పెట్టినపుడు చెబుతారు అంతా, మరి మీరేంటీ?”, అంటే “మొదటో, చివరో, జ్ఞాపకాలు కూడా తిరగేసుకోవాలి కదండీ! అందుకనమాట”. బస్ ఎక్కేను, అది తిన్నగా ఊరికి తీసుకెళ్ళదు, మధ్య వదిలేస్తుంది. అక్కడ దిగేను, నా జేబులో పంపు రాయి పడేస్తున్నారు చాలా కాలంగా, నేను తప్పిపోకుండా ఉండేందుకు. అన్నయ్య పిలిచాడు, “ఎక్కడున్నావ”ని. పంపు రాయిలో మాటాడేను, “మధ్య ఊళ్ళో బస్ స్టాండులో ఉన్నాన”ని చెప్పా. “అక్కడే ఉండు వస్తున్నా” అన్నాడు, రెండు నిమిషాలలో నా దగ్గరున్నాడు. “మన ఊరి బస్ దొరకక ఇక్కడి దాకా వచ్చేన”న్నా. “నాకు కొద్దిగా పని ఉండి, ఇక్కడికి వచ్చా, ఎక్కడుంటావు, పని చూసుకొస్తా”నంటూ, “మరిచిపోయాను, ఈ హోటల్ లో దూరు, నీకు మంచి కాలక్షేపం” అని చెప్పి వెళ్ళిపోయాడు. “ఏంటబ్బా! అంత మంచి కాలక్షేపం” అనుకుంటూ లోపలికి అడుగుపెట్టా, చీకటిగా ఉంది, కళ్ళు కనపడలేదు. కళ్ళు చికిలించుకుంటూ ఉండగా కరంటు వచ్చినట్లుంది, ట్యూబు లైటు వెలిగింది. ఆ వెలుగులో చూస్తే ఒక పెద్దాయన కనపడ్డాడు, మరెవరూ లేరు. ఎవరబ్బా! అనుకుంటూ ఉండగా హోటల్ కుర్రాడొచ్చాడు. “టీ ఒకటి సుగర్ లేకుండా పట్రా” అని చెప్పి కూచుంటూ ఉండగా, “మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందే” అన్నాడు, పెద్దాయన. “మిమ్మల్నీ చూసినట్లు”ందని, “మీదేవూర”న్నా. “రాగోలపల్లి” అన్నాడు, “మీరు/నువ్వు సుర్రావా?” అన్నా, నా గుఱ్ఱం హీరో సూర్రావుని తలుచుకుంటూ, ఎందుకంటే మా సూర్రావుది ఆ ఊరే.. అతను “ఇంతకీ మీరెవరూ?” అన్నాడు. “చెప్పుకోండి చూద్దాం” అన్నా. అతను ఒక్కసారిగా లేచి, విసురుగా నా దగ్గరకొచ్చి గుచ్చి కౌగలించుకుని, ఎత్తుకున్నంత పని చేసి, “ఒరేయ్! శర్మా!! నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదురా!!! రా, రా, కూచో, ఎలా ఉన్నావు, ఏంటి సంగతులు, బాగున్నావా, పిల్లలంతా బాగున్నారా. నీ సంగతులు అన్నయ్య ద్వారా తెలుస్తూ ఉంటాయి,” అని, “ఒరే! అరవాలూ రెండు టీ పట్రారా! ఏంచేస్తున్నావు లోపలా”అని ఒక అరుపు అరిచాడు. లోపలనుంచి “పాలు వేడి పెడుతున్నా, తెస్తున్నా” అని ప్రతి వచనం వినిపించింది.

“ఏరా! మన కావుడు గుర్తున్నాడా” అన్నాడు. “ఏదీ కళ్ళు చికిలించుకునీ వాడు వాడేనా” అన్నా. “అవును వాడే రహదారులు భవనాల్లో పని చేసి రిట్యిరయ్యాడట, మొన్ని మధ్యనే కనపడ్డాడు, వాన చినుకులా,” అన్నాడు. “వాడి బావ మరిది జానకిరాం ఉండాలి వాడెక్కడో” అన్నా. “ఏమో తెలియలేదురా, అన్నట్లు జమ్మిగాడు ఊళ్ళోనే ఉంటున్నాడు, డబ్బులు బాగా సంపాదించాడు, అన్నట్లు, లాంగ్ ఫెలో కూడా ఊళ్ళోనే ఉంటున్నాడు. బాగున్నాడు. మొన్నీ మధ్యనే మనవడికి పెళ్ళి చేసేడు,” అన్నాడు.

“ఊరివాళ్ళ సంగతి తరవాత చూద్దాం కానీ, నీ సంగతి చెప్పు, గుఱ్ఱమేదీ?” అన్నా. “చదువు మానేసేను కదా, పరీక్ష పోయినందుకు, ఆ తర్వాత గుఱ్ఱం వదిలేసేను, ఇదిగో ఇప్పుడు ఆ ఎదురుగా కనపడుతున్న బండి,తరవాత పెళ్ళి చేసుకున్నా, ఇద్దరు మగపిల్లలు, ఒకాడపిల్ల, అందరికీ పెళ్ళిళ్ళు చేసేసేను. అంతా బాగున్నారు, మనవడికి కొడుకు, ముత్తాతనయిపోయా” అన్నాడు. “అది సరే గాని కొడుకుల దగ్గరుంటున్నావా?” అన్నా. “కొడుకుల దగ్గరుండటమేంటి, వాళ్ళే మన దగ్గరుంటూ ఉంటే, ఏమయినా నువ్వేదో తిరకాసు పెడతావురా, ఏంటది చెప్పూ” అన్నాడు. “ఏంలేదు, నేను ఎవరడిగినా కొడుకు దగ్గరున్నా అంటా. అది వాళ్ళకి గౌరవం, వాళ్ళు మా అమ్మా నాన్నల దగ్గరున్నాం అంటారు, రెండూ ఒకటే, కాని ఇలా అనుకుంటే అదో అందం,ఆనందం, తృప్తి”. “నాకీ తిరకాసులు తెలియవుగానొరే!, ఇద్దరు కొడుకులుకీ రెండిళ్ళు కట్టిచ్చా. ఎవరింట్లో వాళ్ళుంటారు, కూతురు సరే కదా!, మీ వదిన వంట చెయ్యలేదు, మేము మా పాత ఇంట్లో ఉంటాము. కోడళ్ళు ఏం కూడబలుక్కుంటారో తెలీదు కాని ఎవరో ఒకరు కేరేజి పట్టుకొచ్చి ఇద్దరికీ భోజనాలెట్టి శుభ్రం చేసి వెళ్ళిపోతారు, ఊళ్ళోనే కదా పిలిస్తే పరిగెట్టుకొచ్చేస్తారు. అవసరానికి అందరూ కలుస్తారు. మీవదినకి నాకూ కొద్దిగా సొమ్ముంచుకుని మిగతా అస్థులన్నీ పంచేశాం, నీలాగా,ఇలా నడిచిపోతూ ఉంది” అన్నాడు. “బాగుంది, సమస్యలు లేవు కదా” అన్నా. “దేవుని దయవల్ల, నీ సహవాసం వల్ల ఇలా బాగానే ఉన్నా” అంటూ, “ఒరేయ్! నీ తడప ఎక్కడుంటోందో” అన్నాడు( తడప నేను ఒకమ్మాయికి పెట్టిన ముద్దుపేరు). “ఏమో తెలియదు, ఆ అమ్మాయి బంధువులు కూడా ఇక్కడెవరూ లేరు,సంగతి తెలియదు”,అన్నా. “ఆ అమ్మాయి , ఇంకా అమ్మాయేమిటిరా, మనలాగ మామ్మో, అమ్మమ్మో, తాతమ్మో అయివుంటుంది కదా! ఎక్కడో ఒకచోట ఈ భూమి మీద క్షేమంగా ఉందనుకుందాం” అన్నాడు. “నిజమే అలా అనుకుంటే ఒక ఊరట కదా” అన్నా. “అన్నట్లు మరిచా నీ మూడు తలకాయిల పాము( ఒకమ్మాయికి ముఖం మీద కణతల మీద కాల్చిన మచ్చలుండేవి, అందుకు మా వాడు మూడు తలకాయల పామని పేరెట్టేడు) ఎలా ఉందిరా” అన్నా. “పాపం కృపమ్మ చచ్చిపోయిందిరా ఈ మధ్య, కనపడేది, కష్టం సుఖం, మాటాడేది, ఏంటో జీవితాలు” అన్నాడు. ఇప్పటికి టీలు తెచ్చాడు, ఈలోగా అన్నయ్య వచ్చాడు, రెండు టీ లు మూడు చేసుకుని తాగేం. “ఏరా! కాలక్షేపం ఎలా అయింది” అన్నాడు, అన్నయ్య. “వీడు లోపలున్నాడని చెప్పచ్చు కదా” అన్నా. “అలా చెప్పేస్తే ఈ మధురానుభూతి ఉంటుందా? అందుకే చెప్పలేదు” అన్నాడు. “ఏ మయినా, మీ అన్నదమ్ములిద్దరూ ప్రత్యేకంరా” అన్నాడు, మా సూర్రావు. పని ఉందని సూర్రావు దగ్గర వీడ్కోలు తీసుకుని ఇంటికెళ్ళిపోయాం. ఆ రాత్రి ఏదో సమస్య మీద చర్చ చేసేం కాని తెగలేదు.

మరునాడు ఉదయమే స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని కూచుని మాట్లాడుకుంటూ ఉండగా ఒక కారు వచ్చి ఆగింది. అందులోచి ఒక జంట దిగేరు. అందులో మగవారిని ఎరగను కాని ఆమెను ఎక్కడో చూసినట్లు అనిపించింది. ఆహ్వానం, ఉభయకుశలోపరి ప్రశ్నలయిన తరవాత అన్నయ్య వారికి పరిచయం చేస్తూ “మా తమ్ముడు” అన్నాడు. అన్నయ్య, వచ్చినాయన ఏదో విషయం గురించి మాట్లాడు కుంటూ ఉంటే ఆమె “మీ పేరు శర్మ కదూ” అంది. “అవును”అన్నా. “నన్ను గుర్తు పట్టారా” అంది. “ఎక్కడో చూసినట్ళుంది కాని గుర్తురాలా” అన్నా. “నేను రత్నమాలని, మీకు కోపం పోలేదేమో” అంది. “అబ్బెబ్బే! అదేమీ కాదు మళ్ళీ ఏభై సంవత్సరాల తరవాత కలిశాము కదా అందుకు గుర్తుపట్టలేకపోయా” అన్నా. ఉభయులం కుశల ప్రశ్నలయేటప్పటికి మా వాళ్ళ పని పూర్తయింది. “ఏమండీ! ఈయన శర్మగారని నా క్లాస్ మేట్” అని తన శ్రీవారికి పరిచయం చేసింది. “మేము రాజమంద్రి లో ఉంటాము, ఈ సారి వచ్చినపుడు రండి” అని ఆహ్వానించి వెళ్ళిపోయారు.

వాళ్ళు వెళ్ళిన తరవాత అన్నయ్యడిగేడు, “కోపంపోలేదని, ఏంటీ అంది” అన్నాడు. “నేను, రత్నమాల, వాళ్ళ అన్నయ్య, లాంగ్ ఫెలో కలిసి ఆడుకునేవాళ్ళం కదా. ఆ చనువు మీద, సెకండ్ ఫారంలో ఉండగా ఎందుకో కోపమొచ్చి ఒక సారి జడపుచ్చుకుని లాగేను క్లాస్ లో, ఒక్కటుచ్చుకుంది చెంప మీద, ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులకే పెళ్ళయి వెళ్ళిపోయింది కదా. మళ్ళీ ఇదే కలవడం, ఆ దెబ్బకి నేను కోపముంచుకున్నాననుకుంది, అదీ సంగతి” అన్నా.

మా రత్నమాల కొడితే కొట్టింది కానండి జీవితంలో మంచి పాఠం నేర్చుకున్నా, మరి జీవితంలో ఎవరి జడా లాగలేదండి, అమ్మాయిల్ని అల్లరీ పెట్టలేదు. 🙂

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-చెంపదెబ్బ.

 1. మా నాన్న, మామయ్య(నాన్న స్నేహితుడు) కూర్చుని మాట్లాడుకున్న సందర్భాలు గుర్తొచ్చాయి. ఒకలాంటి ఉత్సాహం వుండేది వాళ్ళ చిన్నప్పటి కబుర్లు వింటుంటే…ఇప్పుడే కూడా అలాగే..మీతో కలసి టీ తాగాం. రత్నమాల గారికి కాఫీ లిచ్చాం. బావుంది బాబాయిగారూ ఇలాంటి కబుర్లు మరిన్ని చెప్పండి.

 2. భలే ఉన్నాయి మీ చిన్ననాటి ముచ్చట్లు, చాల కాలం తరువాత స్నేహితుడుని కలిసిన అనుభూతులు. తడప అంటే తాటి తడపలె కదాండి ? వాటిని చీల్చి దడి కట్టేటప్పుడు కర్రలకి కడతారు. అవేనా అవి. ఏమి లేదు పేరు విని 20 సంవత్సరాలు పైనే అయింది , అందుకే సందేహం అవేనా కాదా అని . నా చిన్నప్పుడు నేను, మా నాన్న దడి కట్టేటప్పుడు వాడేవాళ్ళం.

  • @వెంకట్ గారు,
   తాటి కమ్మని సన్నగా చీరి తడిపి వాడుతాం. మీరు చెప్పింది సరియైనదే. తడప చాలా సన్నగా వాడతాం.
   ధన్యవాదాలు.

 3. మిస్టర్ పెళ్ళాం లో ఎ. వి .యస్ .
  ప్రహసనం గురోచ్చింది శర్మ గారూ!
  :-))
  మీ జ్ఞాపకాల పుస్తకంలో మరో పేజీ చూసి ఆనందించాము…
  @శ్రీ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s