శర్మ కాలక్షేపంకబుర్లు-ఆశ/నిరాశ.

Courtesy you tube

ఆశ/నిరాశ.

ఆశ నిరాశల మధ్య మరొకరెండున్నాయి, దురాశ, పేరాశ. ఆశ మానవునికి సహజం. ఆశలేని మానవుడులేడు. అమ్మనేది ఆశ లేని వాళ్ళిద్దరే ఒకరు పుట్టని వారు, రెండవ వారు చచ్చిన వారని. దుర్యోధనుడు కర్ణుని పట్ల పెంచుకున్నది పేరాశ. పాపం కర్ణుడు అర్జునుని జయిస్తాడని పేరాశ పడ్డాడు. అల్లాగే రావణుడు, తన భోగభాగ్యాలు చూసి సీత తనను మోహించదా! అని పేరాశ పడ్డాడు. ధర్మార్ధ కామాల్లో మూడవదయిన కామం ఈ ఆశకి మూలం. కామం అంటే కోరికని అర్ధం.

భారతంలో పాండవులది ఆశ, తమ తండ్రి భాగం రాజ్యం తమకు రావాలని, దుర్యోధనుడుది దురాశ, అందుకే ఒక సందర్భంలో తండ్రిని రాయబార సమయంలో, ఒక ప్రశ్న కూడా వేసేడు, యమధర్మరాజు, వాయువు, ఇంద్రుడు, అశ్వినీ దేవతలు, ఇందులో ఎవరు నీ తమ్ముడు, అని.

ప్రతివారు తమ తాహతుకు తగినవాటికి ఆశపడటం తప్పుకాదు. పంట వేసిన రైతు ఫలసాయం కోసం, పెళ్ళయిన పడుచు బిడ్డ కోసం, బాగా పరీక్షలు రాసిన విద్యార్ధి మంచి ఫలితం కోసం, పెళ్ళి చూపులలో చూసొచ్చిన అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోవాలని పెళ్ళికొడుకు, ఆశపడటం తప్పుకాదు. అదేమిటి! అబ్బాయి కదా ఒప్పుకోవలసినది అనద్దు, ఆ రోజులు పోయాయి, ఇప్పటి రోజుల్లో అమ్మాయి ఇష్టపడితేనే పెళ్ళి, లేకపోతే హళ్ళికి హళ్ళి సున్నకి సున్నా, అదీ నేటి పరిస్థితి. మొన్ననొక పెళ్ళి సంబంధం చూశాము, అమ్మాయి ఒక పట్నంలో పని చేస్తూఉంది, అబ్బాయి మరొక పెద్ద పట్నం లో పని చేస్తున్నాడు, అన్నీ నచ్చేయి కాని అమ్మాయి అంత దూరం వెళ్ళి కాపరం చెయ్యను, అని కచ్చితంగా చెప్పేసింది, మరి ఇప్పుడు డిమాండు అమ్మాయిలదా? అబ్బాయిలదా?. పెళ్ళి కొడుకులు అమ్మాయిల ముందు క్యూ కడుతున్నారు. రేపో నేడో, అమ్మాయిలు కన్యాశుల్కం అడిగినా అశ్చర్యపోనక్కర లేదు.ఈ పోకడలు వెర్రి తలలేస్తున్నాయి.వరకట్నమెంత దురాచారమో కన్యాశుల్కం కూడా అంతే దురాచారం.దారి తప్పేం.

ఆశ పడిన ఫలితం దక్కనపుడు నిరాశ పడటం సర్వ సహజం. దురాశ, పేరాశలకి ఫలితం ఎప్పుడూ నిరాశే. ఆ ఫలితంగా వచ్చే నిరాశకి మందు లేదు. నైజ గుణానికి లొట్టకంటికి మందులేదని నానుడి కదా. ఇల్లా పేరాశ,దురాశలకి పోతే మిగిలేదెప్పుడూ నిరాశే. సహజమైన, ధర్మమైన కోరిక నెరవేరనపుడు కూడా నిరాశ జనిస్తుంది, సహజం. నిరాశ నుంచి దుఃఖం పుడుతుంది, నిరాశను, దుఃఖాన్ని కూడా అనుభవించాల్సిందే. జీవితంలో అన్నీ అనుభవించాలి, తప్పదు. సంతోషం, విచారం, కోపం, ఆశ, నిరాశ ఇలా అన్నీ అనుభవించక తప్పదు. ఐతే నిరాశ లో పడి కొట్టుకుపో కూడదు. కష్టము, సుఖమూ, ఏదీ నిలిచి ఉండిపోదు. ఎప్పుడూ సుఖమే ఉండదు, నిరాశలో కూరుకుపోరాదు. చిన్నప్పుడు ఇంగ్లీషు గ్రామర్లో నేర్చుకున్నాం గుర్తుకు తెచ్చుకుందాం,  past perfect,present continuous,future tense, ఎవరు చెప్పినా నిజం నిజమే కదా. జరిగినది నిజం, ఏడ్చి ఉపయోగం లేదు, జరుగుతున్నది నీ చేతులలో ఉన్నంత నీ పని నీవు చెయ్యి, భవిష్యత్తు ఎప్పుడూ ఆందోళన కరమే. నిరాశలో పడ్డా, ఎంత కాలం, ఒక రోజు, మళ్ళీ నిజ జీవితం లో కి రావాలి. అదే జీవితం.

Past perfect ఇక్కడే తప్పు జరుగుతూ ఉంటుంది. జరిగినదానికి నిష్పాక్షిక ఆత్మ పరిశీలన అని మొదలెడతాం. తప్పు ఎక్కడ జరిగింది తెలుస్తుంటూ ఉంది. మన మనస్సు ఆ తప్పు మన వల్ల జరిగిందన్న దానిని ఉపేక్ష చేస్తుంది, మన వల్ల జరిగిన తప్పును కప్పిపుచ్చుతుంది. తప్పు ఎవరిమీదో తోసెయ్యడానికి అవస్థ పడుతుంది. ఇది ఎక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది. నిజమైన ఆత్మ విమర్శ చేసుకోగలిగితే మరొక సారి తప్పు జరగడానికి సావకాశం ఉండదు. ఒక్కొకప్పుడు అన్నీ సవ్యంగా ఉన్నా ఫలితం వ్యతిరేకంగా ఉంటుంది. అదే విధి వైపరీత్యం అంటే. దానినేమీ చెయ్యలేము. అప్పుడనుకోవలసినది, ఈ వ్యతిరేక ఫలితం కూడా మన మంచికోసమే జరిగిఉండచ్చు, మనకి తెలియని ఆపద గడవబెట్టడానికి, భగవంతుడు చేసిన ఏర్పాటిది అనుకుంటే మానవుడు ముందుకు సాగగలడు. లేకపోతే నిరాశ, దుఃఖాలలో కూరుకుపోయి, మరి తేరుకోలేడు. కష్టం కలిగినపుడు నిర్వేదం కలుగుతుంది, ఈ నిర్వేదం నుంచి జీవితానుభవం కలిగిన పెద్దలు ముందు బయట పడి, పిన్నలకు ధైర్యం చెప్పాలి.మార్గదర్శనం చేయాలి.

లంకలో ఉండగా తనను వెతుకుతూ వచ్చిన హనుమతో సీతమ్మ ఇలా అంటుంది,

ఐశ్వర్యే వా సువిస్తీర్ణే వ్యసనే వా సుదారుణే,
రజ్జ్యేవ పురుషం బద్ధా కృతాంతః పరికర్షతి……. రామాయణం. సుందరకాండ. ౩౭వ సర్గ…౩

అనగా సమృద్ధిగా ఐశ్వర్యము కలిగినపుడేగాని, దారుణమగు కష్టము కలిగిన సమయముననేగాని, పురుషుడెంత మాత్రము స్వతంత్రుడు కాడు. దైవము వానిని త్రాటితో కట్టినట్లు పట్టి ఈడ్చుకుపోవును.

చెప్పటం తేలిక, ఆచరణే కష్టం, కష్టంలో ఉన్నపుడే, మనిషి గుణం తెలిసేది, ధైర్యం,నమ్మిక, ఆశ, కావాలి. చెప్పడం కాదు ఆచరించాలి,ఆచరించి చూపాలి, అప్పుడే పెద్దరికానికి విలువ, ఫలితం, కావలసినవారికి ధైర్యం చెప్పాలి, కష్టం గట్టెక్కాలి.

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఆశ/నిరాశ.

  • @past perfect, we cannot change it, lamenting over it is a waste. present continuous, yes it is continuing, what ever that is due to be done by us should be done,future tense, yes it is always tense as it is unknown. we can learn so many thing from so many quarters, if we are interested.
   Thank u

 1. ఆశ, దురాశ, అత్యాశ, పేరాశ …
  వివరణ బాగుంది శర్మ గారూ!
  హనుమాన్ చాలీసా కూడా బాగుంది…
  @శ్రీ

 2. శ్రీ శర్మగారికి, నమస్కారములు.

  చక్కటి విషయాలు చెప్పారు. కష్ట,నష్టాల సమయంలో కొంత స్వీయ విశ్లేషణ, కొంత సంయమనం పాటిస్తే, వీటిని అధిగమించవచ్చును. ధ్యానం చేయటం దీనికి ఉపకరిస్తుంది.

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  • @మిత్రులు మాధవరావుగారు,
   నేను సమస్య దాకానే చెప్పేను, మీరో అడుగు ముందుకేసి పరిష్కారం చెప్పేరు.
   ధన్యవాదాలు.

 3. “సహజమైన, ధర్మమైన కోరిక నెరవేరనపుడు కూడా నిరాశ జనిస్తుంది, సహజం. నిరాశ నుంచి దుఃఖం పుడుతుంది, నిరాశను, దుఃఖాన్ని కూడా అనుభవించాల్సిందే. జీవితంలో అన్నీ అనుభవించాలి, తప్పదు. ” జీవితం గురించి మీరు చెప్పింది చాలా బాగుంది .ప్రతి ఒక్క sentence లో ఎంతో వాస్తవం వుంది. మళ్లీ మళ్లీ చదవాలి అనిపించింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s