శర్మ కాలక్షేపంకబుర్లు-దాచాను మగడా వేరుండు.

Courtesy you tube

దాచాను మగడా వేరుండు.

తెలివియొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
తెలిసితినంచు గర్వితమతినై విహరించితి దొల్లి, ఇప్పుడు
జ్జ్వలమతులైన పండితులకడ ఇంచుక బోధశాలినై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంత గర్వమున్.

తెలివిలేని రోజులలో అన్నీ నాకే తెలుసని విర్రవీగాను. ఇప్పుడు గొప్పవారయిన పండితుల ద్వారా కొద్దిగా తెలుసుకుని నేనేమీ తెలియనివాడనని తెలుసుకున్నా,అని పై పద్య భావం.

మా సత్తిబాబొచ్చేటప్పటికి ఈ పద్యం చదువుతున్నా.
“వేమన పద్యం,”అన్నా. “ఏమండోయ్! మీకు తెలిస్తే చెప్పండి లేకపోతే లేదు కాని “బొంకరా, బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయలంత” అన్నట్లు, ఇది వేమన పద్యం కాదు, వేమన పద్యమైతే చివర వినుర వేమ అని వస్తుంది కదా,” అన్నాడు, మా సత్తిబాబు. “ఈ పద్యం భర్తృహరి సుభాషితాలలోది, నీతి శతకం నుంచి. తప్పయిపోయింది మహ ప్రభో!,” అన్నా, అంటే, “మీకిది అలవాటయిపోయిందండీ! అబద్ధాలు, తెలియని వి చెప్పెయ్యడం, బొంకెయ్యడం అలవాటయి, ఏమి చెప్పినా వింటున్నామనా? మీ సంగతి బాగోలేదు,”అన్నాడు. “ఆయ్! ఆగండి, ఆగండి,సత్తి బాబుగారూ, “గుర్రాన్ని కట్టెయ్యండి”, దీన్నే “చచ్చిన పాముని చంపడం” అంటారు. ఇప్పటికే నేను తప్పయిపోయింది బాబోయ్! అని చెప్పి, ఒప్పుకున్నను కదా. మీరింకా అంటే దాన్నే చచ్చిన పాముని చంపడం అంటారు. ఒక సారి చచ్చిపోయిన పాముని ఎన్ని సార్లు కొట్టినా ఉపయోగం లేదుకదా, దీన్నే “చచ్చినవాడి మీద ఎన్ని బళ్ళు వెళ్ళినా ఒకటే” అనీ అంటారు. ఇదీ ఈ నానుడి ఉద్దేశం,” అన్నా. “బాగుంది, బలేవారండీ! ఇది చెప్పడానికి ఇన్ని పుఱ్ఱాకులా”. “అవును బాబయ్యా! తెలియాలంటే ఉపమానం కావాలి కదండీ!

మరొక నానుడి దాచాను మగడా వేరుండు.

ఒక పల్లెటూరు, దంపతులకు ఒకడే కొడుకు, వయసొచ్చింది. పెళ్ళి చేసేరు. అప్పటి దాకా కలిగినదో లేనిదో, సంసారం గుట్టుగానే నడిచింది. “రోగం రొస్టు, సంసారం గుట్టు,”అన్నారు. కొత్త కోడలొచ్చింది మొదలు రోజూ రామ రావణ యుద్ధమే ఇంట్లో, వేలేసి పని ముట్టుకోదు, కోడలు. రామ రావణ యుద్ధానికి పోలిక చెప్పాలంటే కష్టం, సముద్రానికి పోలికేంటి? సముద్రానికి పోలిక ఎలా లేదో అలాగే రామ రావణ యుద్ధానికీ పోలికలేదు. పోలిక లేనిదన మాట. వాల్మీకి ఏమన్నారంటే,

గగనం గగనాకారం సాగరం సాగరోపమః
రామ రావణయో ర్యుద్ధం రామ రావణయోరివః

అంటే, ఆకాశం కి ఉపమానం ఆకాశమే, అలాగే సముద్రానికి ఉపమానం సముద్రమే, రామ రావణ యుద్ధం రామ రావణ యుద్ధమే, దీనికీ ఉపమానం లేదనమాట.

ఇలా యుద్ధం అత్త, కోడళ్ళ మధ్య, తండ్రీ కొడుకుల మధ్య,గొడవే, “నారాయణా అంటే బూతుమాట”యిపోతూ ఉంది, “పచ్చగడ్డేస్తే భగ్గుమని మండిపోతూ” ఉంది. పడుచుకోడలు రోజూ రాత్రి పూట మొగుడుతో “దాచాను మగడా వేరుండు” అని పోరుతూ ఉంది. మగడు “వేరుంటే ఏమితింటాము? బతకడం కష్టం, తిట్టుకుంటూనో, కొట్టుకుంటూనో ఇలా కలిసి బతకాలి కాని వేరొద్ద”ంటాడు కొడుకు. దాచాను మొగడా వేరుండు అనే పోరు పెరిగిపోయింది కుర్రాడికి. మొత్తానికి గోల చేసి, ఇంట్లో గోల పడలేక, పెద్ద మనుషుల పరిష్కారంగా కొడుకు, తండ్రి వేరు పడ్డారు. తండ్రినుంచి కొద్దిగా అస్థి సంక్రమించింది, కొడుక్కి. వేరు పడిన రాత్రి భర్త, భార్యని అడిగేడు “దాచాను మగడా వేరుండమన్నావు, ఏమిదాచావో చెప్పు, చెబుతాను, చెబుతానంటూ దాటవేసేవు ఇప్పటిదాకా” అని నిలదీస్తే, వెనక దాచిన రెండు చేతులూ చూపింది. అది చూసిన మొగుడికి మతిపోయింది. “చేతులు దాచటమేంటి” అంటే “ఇప్పటి దాకా ఈ ఇంట్లో నేను పని చేయలేదు, ఇక ముందు చేస్తా” అందిట.

రోగీ పాలేకోరేడు, వైద్యుడు పాలేకోరేడు,

పాత రోజుల్లో వైద్యం అంటే మందు ఇస్తూ ఏమితినచ్చు, ఏమితినకూడదు చెప్పేవాడు వైద్యుడు. మందు కూడా దేనితో వేసుకోవాలో చెప్పేవాడు, దీనినే “అనుపానం” అంటారు. ఒక రోగి వైద్యుడుని పాలు ఆహారంగా తీసుకుంటానని అడిగాడు, వైద్యుడు కూడా నేను కూడా పాలే తీసుకోమని చెబుదామనుకుంటున్నా అంటాడు. అలా ఇది వాడుకలోకి వచ్చింది. ఎలా వీలు కుదురుతుంది?, టపా రాయడం అనే వ్యసనంనుంచి తప్పించుకోవడం,అనుకుంటే, పాపం మా కరంటు వాళ్ళు సాయం చేస్తున్నారు, రోజుకి ఆరుగంటలు అధికారికం అపై లోడ్ రిలీఫ్ వారిష్టం. వారి దయ మన ప్రాప్తి. నిన్న మొత్తం పదునాల్గు గంటలు కరంటు పీకేశారు. రాత్రి నిద్ర కూడా లేదు. అందుచేత రోజూ నియమంగా, నా టైమ్ ప్రకారం ఉదయం ఐదున్నర, ఆరు మధ్య వచ్చే నా టపాలకి ఇంతే సంగతులు. చిత్తగించవలెను. ఎప్పుడు వీలుంటే అప్పుడే టపా.బ్లాగులు చదివేందుకు లేదు. వీలు కుదిరితే రాయడం, లేదూ శివ శివా అంటూ ముక్కు మూసుకు కూచోడం, ఇదండి సంగతి.
స్వస్తి.

 

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-దాచాను మగడా వేరుండు.

 1. తెలివియొకింత కల్గుయెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
  తెలిసితినంచు గర్వితమతినై విహరించితి దొల్లి

  కొంచెం ఏదో తెలిసేసరికి కరిభంగి అంటే ఏనగు లాగ అంతా తెలిసిపోయింది నాన్ను మించిన‌వాడే లేడనుకొని విర్రవీగుతూ తిరిగాను.
  అంతే దాని అర్ధం అందులో ప్రస్థుత ప్రస్థావన ఏమీ లేదు.
  అర్ధం తెలుసుకొని రాస్తే మంచిదని నా అభిప్రాయం.అర్ధం మారుతున్నప్పుడు అవి ఇచ్చిన రూపాంతరాలే మన
  నేటి బతుకులు. ఉదాహరణకు కన్యాశుల్కం లో అవధానులు పాత్రవలే అర్ధం మారితే మనిషే‌మారిపోతాడు.అక్కడ అవధానులు యదాహ్నాత్ కురుతే పాపం తదాహ్నాత్ ప్రతిముత్యతే
  యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్రాత్ ప్రతిముత్యతే (ఏ అహ్నం అంటే మద్యాహ్న సాయహ్నం ఇలా, ఇలా ఏ అహ్నం చేసిన పాపం ఆ అహ్నమే పోతుంది. ఏ రాత్రి చేసిన పాపం ఆ రాత్రే పోతుంది)అందుకే సంద్య చెయ్యాలి అది చాలా గిప్పది అంటాడు. కానీ నిజానికి పొరపాటున చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం గా సంద్య లో ఆ మంత్రాలని పఠిస్తాం.ఇలా అర్ధం అపార్ధం గా మారే ప్రమాదం ఉంది. కాబట్టి నా విన్నపం మన్నించగలరని ప్రార్ధన

 2. సుబ్బులక్ష్మి గారు పాడిన పాట బాగుంది.

  ఇంకా,

  సామెతలు వాటి వెనుక ఉన్న కధాకమామీషు కూడా బాగున్నాయండి.

 3. తన వారికోసం పని చెయ్యని వాళ్ళు తనకోసం పని చేస్తారు అని నమ్మకం ఉందా?

  • గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు gaaru
   తనవారికోసం చేయనిది, తనకోసం చేసుకుంటానని చెప్పిందికదా, మగడితో.
   ధన్యవాదాలు.

  • @మిత్రులు గోపాల కృష్ణగారు,
   పుఱ్ఱాకులు, తడిమిట్లు, కష్టం, ప్రయత్నం అన్న మాటలకి సమానార్ధకంగా వాడతాము పల్లెలలో.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s