శర్మ కాలక్షేపంకబుర్లు-రెండవ హనీమూన్


Courtesy you tube

రెండవ హనీ మూన్.

“ఏంటోనోయ్! ఏం తోచటం లేదు!! విడుదల కావాలి”, అన్నా. “ఎవరికి కావాలి విడుదల? ఈ మధ్య చాలా మంది తిరుగుతున్నారు కోర్టు చుట్టూ, కనీసం బెయిల్ మీద విడుదల చేయమని, శ్రీ లక్ష్మి, జగన్, మరో విడుదలలిచ్చే జడ్జీగారు వగైరా..ఇందులో ఎవరికి కావాలీ విడుదల” అంది. “వాళ్ళకి కాదోయ్ నాకే విడుదలకావాలి, ఏంతోచటం లేద”న్నా. “ఏం ఎందుకు తోచటం లేదు!!! ఏదో పెద్ద పని ముంచుకుపోతున్నట్లు మూడున్నరకి లేచి కూచుంటున్నారు. అక్కడినుంచి నెట్ దగ్గర కూచుని ఉదయం ఆరుదాకా గడిపేస్తారు. ఆ తరవాత స్నానం పూజ కార్యక్రమాలు, ఆ తరవాత అల్పాహారం దగ్గరనుంచి అన్నీ మీ కంప్యూటర్ దగ్గరేకదా, తదుపరి కరంటు వాడు కరుణిస్తే మళ్ళీ మీ ప్రపంచం లోకి వెళ్ళిపోతారు. లేదా పేపరు, మీకునచ్చిన పుస్తకం పుచ్చుకుని ఉయ్యాలలో కూచుని కాలక్షేపం చేస్తారు. కాక పోతే టి.వి ఉందికదా. దానితో కాలక్షేపమయిపోతుంది. మధ్యాహ్నం భోజనం తరవాత ఒక గంట కూచుని కునుకుతీస్తారు. ఒక్క భోజనానికి మాత్రం ఇంట్లోకి అడుగుపెడుతున్నారు. తరవాత మళ్ళీ ఏదో చేస్తూ కూచుంటారు, దాని దగ్గర. సాయంత్రం మనవరాలిని తీసుకు రావడానికి కాలేజి కెళ్తారు. తరవాత వీలు కుదిరితే నడక వగైరా కార్యక్రమాలు. ఆ తరవాత ఏదో రాస్తారు, రాత్రి తొమ్మిది కి పడక. మాకు కుదురుతుందా మీలా కూచోడానికి. మాకు ఇంటి పని, వంట పని చూసుకుని ఇల్లు సద్దుకునేటప్పటికి సరిపోతుంది, మనవరాలుతో సరిపోతుంది. మాకు మధ్యాహ్నం ఒక గంట, రెండు గంటలు ఖాళీ అవుతుంది తప్పించి, మేము ఇలా గానుగెద్దుల్లా చాకిరీ చేస్తూ ఉండటమే కదా రోజూ. మీరే చెబుతారు కదా

ధర్మ సాధన చేయాలంటే శరీరం మొదటిది అన్నారు. అంటే శరీరం ఆరోగ్యంగా పని చేసినపుడు మాత్రమే ఆనందంగా ఉండగలం,ధర్మ సాధన చేయగలం. శరీరానికి కావలసిన ఆహారం ఇస్తున్నాం కదా, దానికి తగిన పని కూడా చెప్పాలి. పని చెప్పకపోతే అది బద్ధకించేస్తుంది, పని చేయదు. ఒక చేతిని చాపి ఒక వారం అలా ఉంచేస్తే వారం తరవాత అది ముణగదు, అందుకు రోజూ ముడిచి చాచుతూ ఉంటేనే పని చేస్తుంది. మరి అన్ని యంత్రాలకి కందెనలెందుకు పెడుతున్నారు. శరీరంతో వ్యాయామం చెయ్యమన్నారని డెభ్భయి ఏళ్ళకి షటిల్ ఆడకూడదు. వయసుకు తగిన వ్యాయామం చేయాలి, అన్నారు కదా మీరే ” అని గుక్క తిప్పుకోకుండా చెప్పింది..

“నిజమే ఇదంతా శరీరానికి సంబంధించినది. మనసుకు సంబంధించినది కదా నా తోచకపోవడం, ఏదో అలజడి, ఇది అందరికీ ఉంటుందా?” అన్నా. “మనసుకు సంబంధించినదన్నారు కనక ఏమనిపిస్తుందో చెప్పండి :)” అంది. “నువ్వు కోపగించుకోకూడదు, నవ్వకూడదు మరి, విను, ఏంటీ పిచ్చి ఆలోచనలనద్దు. నిత్యమూ ఇలా ఒక కార్యక్రమంలో ఉండిపోవడం ఏమిటో మనసుకి ఇబ్బందిగా తోస్తుంది. అసలు నేనెవరు? ఎందుకొచ్చానిక్కడికి, ఎక్కడికెళతాను. ఈ తినడం, తాగడం, ఏదో, ఏదో చేయడం, పుస్తకాలు చదవడం, ఎదో రాయడం ఏంటిదంతా? ఎందుకు? ఇవేవీ లేనికాలంలో మనుషులు ఎలా బతికేరు? ఇవన్నీ ఉండికూడా నేడు మనసులో శూన్యం ఎందుకు ఉంది? ఎందుకు ఆందోళన? చెప్పలేని బాధ? వీటినుంచి విడుదల కావాలి.” అంటే “మీరేదో ఆలోచిస్తున్నారనుకుంటా, లేదా మీ మనసులో ఎదో విషయం మీద మధనం జరుగుతోంది. మీరు చెప్పక పోయి ఉండాలి లేదా మీరు గుర్తించి ఉండకపోవచ్చు. వీటన్నిటిని వదిలిపెట్టి ఎక్కడికయినా పారిపోవాలని ఉంటుంది నాకూ, మీరు చెప్పకపోయినా మీసంగతీ అంతేనా? :)” అంది. “నిజం చెప్పేవు, వీటన్నిటిని వదిలేసి ఎవరికీ చెప్పకుండా నడిచి బయటికి వెళ్ళిపోవాలని, తిరిగి రాకూడదనీ, ఎవరూ గుర్తించని చోటికి పారిపోవాలనీ, కోరిక. ఈ కోరిక చాలా కాలంగా ఉంది, కాని అమలు కావటం లేదు. ఎదో ఒక బంధమా? కోరికా? అనుబంధమా? ఏదో పట్టి ఉంచేస్తోంది?” అన్నా. “నిజం వెళ్ళిపోతాం, వీటిని అన్నిటిని వదిలేస్తాం, అంతతో మనసుకి స్వాంతన వస్తుందన్న నమ్మకం ఉందా? శరీరం ఈ వయసులో ఇంత మాత్రం ఆరోగ్యం ఉన్నది కనక నడుస్తోంది. నేటి కాలానికి ఎంతమంది ఈ వయసులో నడవగలుగుతున్నారు? వారికంటే మనం మేలేమో? అలావెళ్ళిపోతే ఈ శరీరం సహకరించగలదా?” అంది. “ఏంటో! పిచ్చి ఆలోచనలే కాని సవ్యంగా నడవటంలేదు,ఆలోచన. కోరికలా? డబ్బు మీది ఆశా? పిల్లల మీది మమకారమా? మనవలమీది ప్రేమా? ముని మనవల మీద ఆశా? ఏది పట్టుకుంటున్నది? చెప్పడం కష్టం, శారీరకమైన కోరికలు లేవు, డబ్బు మీది కోరిక చిన్నప్పటినుంచీ లేదు అది నీకూ తెలుసు, నీకూ లేదన్న సంగతీ తెలుసు. ఏదీ దగ్గరుంచుకోలేదు కదా, పిల్లల మీద మమకారమా, ఇది అసహజమా? ఈ తరం మీద ప్రేమ ఉండటం తప్పా? అది హద్దులు దాటటం లేదనుకుంటా. మరో తరం గురించా? అది కాదు. మరేమి పట్టిఉంచుతున్నది? చెప్పలేను.విడుదల కావాలి, వీటన్నిటినుంచీ. ముక్తి కావాలి” అన్నా. “ముక్తి అంటే ఏమిటి? ముక్తి అంటే విడుదల, దేనినుంచి విడుదల? ఈ జననం మరణం అనే సంసార చక్రంనుంచి, శంకరుడు చెప్పేరుకదా పునరపి మరణం, పునరపి జననం, పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే .. ఇదేకదా ఈ చక్రం నుంచే విడుదల కావాలి. నిజమేకదా! అందుకేం చేయాలో కూడా శంకరులే చెప్పేరు.” అది చూడాలి.

“మీరు చెబుతున్నది సన్యాసం కావచ్చు, కాని సంసారంలో ఉండి మానసిక సన్యాసంతో హరిని భజిస్తే, ఆయన దగ్గరకు చేరితే అదే కదా ముక్తి” అంది. అదేదో తెలిస్తే, ఇవన్నీ వదిలించేసుకుని ఈ విశాల విశ్వం లోకి వెళ్ళిపోవాలని ఎవరూ నన్ను గుర్తించని చోటికి చేరుకోవాలని, అందులో చేరిపోవాలని కోరిక. అందులో లయమైపోవాలని….
“ఈ జీవితానికి మీకూ నాకూ తప్పదు కాని ఒక నిమిషం,” అని లోపలికెళ్ళి వస్తూ ఒక సంచి పట్టుకొచ్చి, “మీ బేగ్ లో పదివేలున్నాయి, ఇవిగో రెండు ఎ.టి.ఎం కార్డులు, మీవి రెండుజతల బట్టలు, నావి రెండు జతల బట్టలు, నడవండి మనల్ని ఎవరూ గుర్తుపట్టలేని చోటుకి లేచిపోదాం, నడవండి మీదే ఆలస్యం” అంది. అదేమంటే “రెండవ హనీ మూన్” అంది. …ఆ( 🙂

ప్రకటనలు

5 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-రెండవ హనీమూన్

 1. @గెల్లి ఫణీంద్రవిశ్వనాధ ప్రసాద్ గారు,
  @అనూరాధ గారు,
  @మూర్తిగారు,
  @లాస్య రామకృష్ణగారు,
  అందరికీ వందనం. ఎక్కడికీ కదలలేకపోయాం, అనారోగ్యంతో.
  ధన్యవాదాలు.

 2. శ్రీమతి & శ్రీ శర్మ గారూ!
  మీ దంపతుల రెండవ తేనెవెన్నెల యాత్ర
  నిరాటంకంగా సాగాలని కోరుకుంటున్నాను…:-))
  అభినందనలతో …
  @శ్రీ

 3. సంసారంలో ఉండి మానసిక సన్యాసంతో హరిని భజిస్తే, ఆయన దగ్గరకు చేరితే అదే కదా ముక్తి” ..బాగా చెప్పారండి.

  ఈ కలికాలంలో ఎందరో ఆచరించగలిగిన చక్కటి విధానమిది.

 4. All the best,మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు?
  అడిగినందుకు క్షమించాలి చెప్పను అన్నారు కదా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s