శర్మ కాలక్షేపంకబుర్లు-బ్రహ్మశ్రీ ఉషశ్రీ.

Courtesy youtube

బ్రహ్మశ్రీ ఉషశ్రీ

శ్రీ గురుభ్యోనమః

నేను ఈ టపా రాయడానికి ముఖ్య కారకులు భారతిగారు, డాక్టర్ సుధాకర్ గారు.

ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం అన్నారు. ఈ దినోత్సవాలంటే ఎందుకో గాని నాకు సరిగా అనిపించదు,దీనినే గురుపూజోత్సవం అంటే బాగుంటుందేమో. డాక్టర్ గారు నన్ను అంతర్జాలపు ఉషశ్రీ అన్నారు. అది వారికి నా పై ఉన్న అభిమానానికి నిదర్శనం అనుకుంటాను.

బ్రహ్మశ్రీ పురాణపండ శ్రీరామమూర్తి గారని, ఈ తరం వారికి తెలియదు, ఉషశ్రీ గారి తండ్రిగారు, గోదావరి జిల్లాలలో పురాణ ప్రవచనానికి పెట్టిన పేరు. వారి ప్రవచనం ఉందంటే, ఎన్ని పనులున్నా వదులుకుని వచ్చేవారంటే జనం, ఊహించవచ్చు, వారి గొప్పతనం. ఆహార్యానికి వస్తే వల్లెవాటుగా శాలువా కప్పుకుని, జులపాలతో, ఒక చేతిలో పుస్తకంతో, ప్రకాశంపంతులు గారిలా ఉండేవారు. వారి గొంతు కంచు గంటలా మోగేది. గంటల తరబడి అనర్గళంగా ఉపన్యాసం ఇచ్చేవారు. ఎన్ని సందర్భాలు, ధర్మాలు, విశేషాలు దొర్లిపోయేవో. నాగ స్వరానికి తల ఊపే తాచులలాగా ప్రజలు తన్మయత్వం పొందేవారు, ప్రవచనానికి, అదీ, అలా ఆరోజులలో నాకు రామాయణాది గ్రంధాలమీద మక్కువ ఏర్పడింది, ఇది పదొమ్మిదివందల అరవై, డెభ్భయిల్లో మాట. వారు నన్ను ఎరిగి ఉండరు, నేను ఏకలవ్య శిష్యుడను. ఈ శ్రీరామమూర్తిగారు మన ప్రముఖ బ్లాగర్ శ్రీ పురాణపండ ఫణీంద్రగారి తాత గారని తెలిసి ఆనందించా. ఆ తరవాత ఉషశ్రీగారి ప్రవచనాలు రేడియోలో విన్నవే. ఆ రోజులలో ఉషశ్రీగారు రామాయణ ప్రవచనం చేస్తూంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆదివారం రోడ్లు నిర్మానుష్యంగా ఉండేవంటే అతిశయోక్తి కాదు, ఆంధ్రదేశంలో. ఉషశ్రీగారి రామాయణ ప్రవచనం పుస్తకంగా దొరికితే, తిరుమలలోకొన్నా. అప్పటినుంచి దానిని చదువుతూనే ఉన్నా. బైండు చేయించా, మొన్న దాని బైండింగ్ పోతే అంటించి ఎండలో పెట్టి తీసి పుస్తకానికి, గురువుకు, నమస్కరిస్తూ పుస్తకం తీసేటప్పటికి మొదటి పేజీ కనిపించింది. అందులో ఇలా ఉంది చదవండి

ఈ పుస్తకాన్ని నేను 25.06.1979 వ తేదీని తిరుమల కొండపై కొన్నా. ఇది మొదలు రామాయణ భారతాలు చదవడమేకాదు, వాటిని విష్లేషించే అలవాటయింది. ఈ దిశలో పెద్దలు చెప్పినదే కాక నేటి, కాలానికి ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ద్వారా విన్నవి కొన్ని, నాకు తెలిసిన ఊహలతో రాసినవి. వీటిని రాయాలని కుతూహలం చాలా ఉంటుంది, కొన్ని రాసాను కూడా. చదివేవారు తగ్గిపోతున్నందున నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది. అనారోగ్యంతో కూచో లేకపోతున్నా, గురువందనం కొరకు ఓపిక చేసుకున్నా. గురువును తలవని రోజు,గురు వందనం చేయని రోజు ఉండదు. గురువులందరికీ మరల మరల వందనం.

గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బ్రహ్మశ్రీ ఉషశ్రీ.

  1. శర్మగారు,
    చదివేవారు లేనప్పుడు లేదా తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు నిరుత్సాహంగానే ఉంటుంది. అలాగే చదివేవారు ఉదాసీనంగా ఉన్నా నిరుత్సాహం కలుగుతుంది. అది సహజం. నా శ్యామలీయం బ్లాగు కవిత్వం చదివే వారు కూడా రోజుకో పదిమందికి కూడా తక్కువే తరచుగా. అయితే నేను కేవలం నా కోసం వ్రాసుకుంటున్నది కాబట్టి యెవరు చదివినా చదవకపోయినా నాకు బెంగ లేదు. అయినా అప్పుడప్పుడూ నిరుత్సాహం అనిపించటం గమనించాను. అలాంటప్పుడు పదిమంది మంచి కోరి మంచి మంచి విషయాలు మీరు వ్రాస్తున్నా తక్కువమంది ఆసక్తి కనబరచటం తప్పకుండా నిరుత్సాహకరమే. అయినా ఇదివరలోనే అనుకున్నట్లు జనం సద్విషయావలోకనం కన్నా వేరే రకం వాటినే యిష్టపడతారు. అదీ సహజమే. బెంగపడి లాభం లేదు. విలువలెరిగి గౌరవించి చదివేవారూ ఉన్నారు కదా!

  2. ఎంతో చక్కని విషయాలను అలవోకగా అర్ధమయ్యేట్టు చెప్పే మా బ్లాగు గురువు మీరే తాతగారు.. గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు మీకు.

  3. శ్రీ గురుభ్యోన్నమః
    సమస్త సన్మంగళానిభవంతు…
    అనే ఉషశ్రీ గారి గొంతు వింటూ
    తాతగారితో గడిపిన సమయం గుర్తుకొస్తోంది…
    ఆయన మాకు బంధువులౌతారని చెప్పేవారు తాతగారు.
    మీకు కూడా గురు పూజోత్సవ శుభాభినందనలు శర్మ గారూ!
    @శ్రీ

Leave a reply to kastephale స్పందనను రద్దుచేయి