శర్మ కాలక్షేపంకబుర్లు-నా హీరో సూర్రావు.

Courtey youtube

మా సూర్రావు.

నా క్లాస్మేట్ గుఱ్ఱం సూర్రావు గుర్తున్నాడు కదా.మరో సారి గుర్తుచేస్తా! నా అరాధకుడు మా సూర్రావు గుఱ్ఱం మీదొచ్చేవాడు చదువుకోడానికి,ఏరుదాటి, ఒక పల్లెనుంచి. ఒక సారి ఒక అమ్మాయిని గేది పొడవబోతూంటే హీరోలా వచ్చి రక్షించి ఎత్తుకుపోతాడు. ఆ సూర్రావు గురించే మరి, మరొక సంగతి.

మా హైస్కూల్ ఊరికి ఒక కిలోమీటర్ దూరంలో ఉండేది,నాలుగెకరాల స్థలములో ఒక మూల అనగా నైఋతి మూల పడమరగా పది గజాల స్థలం వదిలేసి ఇంగ్లీష్ యు ఆకారమ్ లో భవనం కట్టేరు. మిగిలిన స్థలమంతా ఖాళీగా గడ్డితో ఉండేది. మా స్కూల్ కి ఒక క్రాఫ్ట్ మాస్టార్ని వేసేరు. ఆయన వచ్చిన తరవాత పిల్లల చేత తోట పని చేయించాలని ఉబలాట పడ్డారు. స్కూల్ లోపల ఉన్న ఖాళీలో గులాబులు మొదలైన పూల మొక్కలు పెంచేవాళ్ళం. వాటికి నీళ్ళు మాత్రం మా స్కూల్ ప్యూన్ తెచ్చి పోసేవాడు, అతనికీ మొక్కలంటే ఉండే ఆప్యాయత చేత. నీళ్ళు తెచ్చి మొక్కలికి పోయడం కష్టంగా ఉంది కనక, గుఱ్ఱం మీద నీళ్ళు తెస్తేనో అనే అలోచన కలిగి. మా సూర్రాఅవుకి చెప్పేను. వాడు వెంటనే రెండు బిందిలు సంపాదించి బిందిలికి ఉగ్గిలి వేసి, గుఱ్ఱానికి రెండు పక్కలా వేలాడదీసి చెరువునుంచి నీళ్ళు తేవాలని ప్రయత్నం. బిందెలు ముంచితే, చెరువులో గుఱ్ఱం మీద పెట్టడం కష్టం కనక ఖాళీ బిందెలు గుఱ్ఱం మీద ఉంచి నీళ్ళు తెచ్చి రెండు బిందెలలో పోసి గుఱ్ఱాన్ని నడిపించుకు తీసుకొస్తే చివరికి బిందెలో సగం నీళ్ళుకూడా రాలేదు, తొణికిపోవడం మూలంగా. అలా మా గుఱ్ఱం మీద నీళ్ళు తెచ్చే ప్రయత్నం విఫలమయింది.

ఈ క్రాఫ్ట్ మాస్టారు పడమరగా ఉన్న స్థలంలో వ్యవసాయం చేయించాలి పిల్లల చేత అని ఆశ పడి భవనం ఒక వైపు ఉండగా మిగిలిన మూడు వైపులా దడి కట్టించేరు, మా చేత. దానికో ద్వారం పెట్టించేరు. ఈ పనులు చేయడానికి బలే ఉబలాటం గా ఉండేది, సరదాగానూ ఉండేది. కొత్తగా ఏదో చేస్తున్నామన్న భావన ఊపేసేది, ఇది అందరికి ఉండేదో లేదో కాని నాకు మాత్రం ఎక్కువగా ఉండేది.మా సూర్రావు అప్పటికే వ్యవసాయం లో ఆరితేరి ఉన్నవాడు కనక మాకు క్రాఫ్ట్ పీరియడులో మావాడే లీడర్. నువ్వేం చెయ్యగలవురా ఆడపిల్లలాగా ఉన్నావు, కూచో నీ పనికూడా నేను చేస్తాలే అనేవాడు. నాకు చెయ్యాలని ఉబలాటం అందుకు వాడి కూడా తిరిగి, వాడు చెప్పిన పనులు చేసేవాణ్ణి. వాడు కూడా నాకు బరువు పనులు చెప్పేవాడు కాదు, చదువులో గురువును కదా, అదీ ప్రేమ నా మీద. మొదటి సారిగా గునపంతో లోతుగా తవ్వించి టొమాటొ మొక్కలు, కాలిఫ్లవర్ నాటింపచేసేరు. అవి బాగా పండేయి. మొక్కలికి నీళ్ళు పోయడం ఒక కష్టమయిన పనిగా ఉండేది. బడిలో నుయ్యి లేదు. చెరువు అరకిలో మీటర్ దూరం. ఇక దగ్గర నీటి వసతి తూర్పుపేటలోని నుయ్యి. పెద్ద క్లాసుల వాళ్ళు, మా ప్యూన్ పర్యవేక్షణలో నీళ్ళు తోడేవారు. మోసుకు రావడం కొంతమంది పని, మొక్కలికి పోయడం మరికొంత మంది పని. ఇలా శ్రమ విభజన జరిగేది. కాలి ఫ్లవర్, కాబేజి ఇంటికి ఇచ్చేసేవారు, టామాటాలు మాత్రం పళ్ళు పిల్లందరికీ తినమని పంచిపెట్టేవారు, రోజుకో క్లాస్ చొప్పున.

మొదటి సారి పంట అయిన తరవాత బెల్లు తీయిస్తున్నారు. బెల్లు తీయడం అంటే గునపం తో నేల తవ్వి దానిని పారతో తిరగేయడమనమాట. ఈ పని మొదలు పెట్టించేరు, మా సూర్రావు లీడర్ కదా! మరొక మూడు జట్లకి గునపాలు పారలు ఇచ్చాడు. ఒకరు గునపం తో తవ్వుతూంటే మరొకరు పారతో తీసి తిరగేస్తారనమాట, మట్టిని. ఈ పని జరుగుతూ ఉంది నేను మా సూర్రావు వెనకనే తిరుగుతున్నా. ఒక జట్టులో మా స్నేహితులు జమ్మి, జనార్దనాచారి ఉన్నారు. ఈ జమ్మికి కూడా వ్యవసాయపనులు అలవాటున్నవాడే, అందుకు గునపం తీసుకున్నాడు. జనర్దనాచారి మాత్రం పార తిసుకున్నాడు. ఎలా జరిగిందో తెలియదు కాని జమ్మి నేలలో వేయబోయిన గునపం పోటు జనార్దనా చారి కాలి మీద పడిపోయి కాలిలో గునపం నిలబడిపోయింది. జమ్మి భయపడిపోయాడు. నెత్తురు వరదలా కారుతోంది. సంగతి చూసిన సూర్రావు వెంటనే సంగతి మాస్టారికి చెప్పమని అరిచి గునపం కాలిలోంచి లాగేసి వాడి తువ్వాలు తో గట్టిగా కట్టేసి, అక్కడే ఉన్న గాయపాకు పసరు గాయం మీద పిండి గుఱ్ఱాన్ని కేకేసి గబగబా మా జనార్దనాచారిని గుఱ్ఱం మీద ఎక్కించుకుని వాళ్ళింటికి తీసుకెళ్ళి దిగబెట్టేసేడు. జనార్దనాచారి తండ్రిగారికి మా ఊళ్ళో మందుల షాప్ ఉండేది, ఆయనకు వైద్యం తెలుసు, ఆయన ముందుగా అక్కడ చేయవలసిన వైద్యం చేసి వెంటనే వైద్యం కోసం రాజమంద్రి తీసుకెళ్ళి వైద్యం చేయించి మూడవ రోజుకు తిరిగొచ్చారు. ఊళ్ళో పెద్ద గొడవై పోతుందేమో అనుకున్నాం. జమ్మిగాడు కావాలని పొడిచేసేడేమోనని అనుమాన పడ్డారు కాని అది కాదని జనార్దనాచారే చెప్పడం తో విషయం సద్దుకుంది. జనర్దనాచారిని చూడటానికి రోజూ వెళ్ళేవాళ్ళం. వీడు మూడు నెలలు కాలుకింద పెట్టలేదు. వీళ్ళింటిలో రేడియో ఉండేది. ఆరోజులలో కర్ంటులేదు కనక బేటరీ రేడియో. వాడిని చూడటానికి వెళ్ళే సందర్భంగా బుధవారం రాత్రిపూట, ఆ రోజులలో సిలోన్ నుంచి వచ్చే బినాకా గీత్ మాలా కార్యక్రమం వినేవాళ్ళం. భాష అర్ధం కాకపోయినా అమీన్ సయానీ వ్యాఖ్య తో పాటలు బలే పసందుగా ఉండేవి.

ప్రకటనలు

3 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నా హీరో సూర్రావు.

  1. ప్రతీ ఒక్క హ్యూమన్ రిలేషన్‌కీ ఇది అప్లై అవుతుంది. ఇద్దరి వ్యక్తులు రకరకాల ప్రాతిపదికల మీద ఏర్పరుచుకునే మానసిక అవగాహనా ఒప్పందాలే మన రిలేషన్లు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s