శర్మ కాలక్షేపంకబుర్లు-శరీర భాష/Body language

శరీర భాష / Body language

భావాన్ని వ్యక్తం చేయడానికి భాష కావాలి, అది నోటి ద్వారా చేసేపని. శరీరం మాట్లాడుతుంది, దానికీ భావం వ్యక్తం చేసే అలవాటుందనీ చెబుతారు. నిజమే దీనికి ఆద్యులం మనమే. ప్రతిదానికి మనమే అద్యులం అంటారు, దీనిని అభివృద్ధి చేసిన వారు పశ్చిమ దేశాలవారు అంటున్నారు. మనం చాలా విషయాలని వదులుకున్నాం,వదులుకుంటున్నాం, అందులో ఇది కూడా ఒకటి. శరీర భాష గురించి ఒకటి రెండు సంగతులు, రెండు చేతులు వేళ్ళతో సహా కలిపి హృదయం దగ్గరుంచితే నమస్కారం, రెండు చేతులూ పైకెత్తి నమస్కారంగా చూపితే తిరస్కారంతో కూడిన నమస్కారం. చెయ్యి చాచి వేళ్ళు వంచి వెనక ముందుకు ఆడిస్తే రమ్మని అర్ధం. అదే చేతిని చాచి చూపుడు వేలు చూపితే, లేదా చెయ్యి చూపితే పొమ్మని అర్ధం. ఒక చెయ్యికాని రెండు చేతులూ వెలపలికి లోపలికి ఊపితే లేదని అర్ధం. తల ఊపడం లో కూడా ఇష్టాయిష్టాలు తెలిపేసావకాశం. తల కుడి ఎడమపక్కలకి వాలుస్తూ ఉంటే ఇష్టం, తల తిన్నగా ఉంచి ఎడమ, కుడిపక్కలకి తిప్పితే అయిష్టం. రెండు చేతులతో ఎదుటివారిని కౌగలించుకుంటే ఆప్యాయతను పంచుకుంటున్నట్లు అర్ధం. చూపులోనే నానార్ధాలు చూపగలగడం స్త్రీల ప్రత్యేక లక్షణం. పురస్కారం నుంచి తిరస్కారం దాకా, ప్రేమ నుంచి ద్వేషం దాకా. మోకాలడ్డుపెట్టడం అంటారు, అంటే ఆ పనిని అడ్డుకుంటున్నట్లట. పెదవులతో చేసే విన్యాసం చెప్పడం ప్రారంభిస్తే అదొక గ్రంధమే అవుతుంది చూపులలాగా. ప్రేమికులకి ఇది ఒక పెద్ద వరం. నొసలు చిట్లిస్తే బాధ, కోపం వ్యక్తం చేయడం. నోటితో పొగుడుతూ నొసటితో ఎక్కిరించడం మరొక ప్రక్రియ. నాలుకతో చేసే విన్యాసాలు మరికొన్ని, వెక్కిరించడం నుంచి………

ఇది ఏ సంస్కృతికి ఆ సంస్కృతికి సంబంధించి ఉంటాయి, కొన్ని మాత్రం సార్వజనీనం. ఒక చేతి వేళ్ళలో మరొక చేతివేళ్ళు దూర్చి గుప్పెట మూసినట్లు ఉంచి చేతులుంచి మాట్లాడుతూ ఉంటే, విషయం దాస్తున్నట్లు అర్ధమట. అలాగే చేతులు కట్టుకుని కూచుంటే అమెరికాలో అయిష్టత వ్యక్తం చేస్తున్నట్లని అర్ధమట. మనకయితే చేతులు కట్టుకు వినటం అంటే శ్రద్ధగా, అణుకువతో వినటమని అర్ధం. ఇవి చెప్పుకుంటూ పోతే అనంతంగా ఉండచ్చు కాని, మనం ఆద్యులం అన్నదానికి సంగతి చెబుతా భారతం నుంచి, మీకందరికి తెలిసినదే.

అనుద్యూతమయింది. షరతుల ప్రకారం పాండవులు అరణ్యాలకి వెళ్ళాలి. వారు వన వాసానికి వెళ్ళేటపుడు కొన్ని విన్యాసాలతో వెళ్ళేరని చెబుతాడు ధృతరాష్ట్రునితో, సంజయుడు, అవేమిటి వాటి అర్ధమేమిటని అడిగినదే ఈ గాధ.

వదనసరోజంబు వస్త్రాంతమున గప్పికొని యేగె ధర్మనందనుండు మఱియు
భీమబాహువులు రెండు బెద్దలుగా జూచి ఘనసత్త్వుడమ్మరుత్తనయు డరిగె
నిసుము చల్లుచు నమరేంద్ర పుత్రుడువోయె భురేణులిప్త శరీరుడగుచు
నకులుండు సనియె మానక లజ్జజేసి యధోవక్త్రుడై సహదేవుడరిగె

వివృతకేశభరము వ్రేలంగ ద్రౌపది సనియె రౌద్రయామ్య సామగాన
ముఖరితాస్యు డగుచుమ్రోల ధౌమ్యుండేగె సకల జనులు శోకనిధిదేల.

ధర్మరాజు ముఖాన్ని ఉత్తరీయపు కొంగు చివర కప్పుకుని, భీముడు చేతులు చాపుకుని, ఇసుక చల్లుకుంటూ అర్జునుడు, ఒంటికి మట్టి పూసుకుని నకులుడు, తలవంచుకుని సహదేవుడు, జుట్టు విడివడి వేలాడుతుండగా ద్రౌపది, రుద్రయామాలు చదువుతూ ధౌమ్యుడు వెళ్ళేరయ్యా అని చెప్పేడు.

వాళ్ళలా వెళ్ళడంలో అంతరార్ధం ఏమని అడిగాడు ధృతరాష్ట్రుడు. అందుకు సంజయుడు నీకొడుకు చేసిన ఘనకార్యానికి రాజ్యంపోగొట్టుకున్న ధర్మరాజు కోపం చూపు ఎవరిమీద పడితే వారు దగ్ధమయిపోతారని ధర్మరాజు కొంగుతో ముఖాన్ని కప్పుకున్నాడు, యుద్ధంలో ఈ చేతులతో శత్రువులను నిర్జిస్తానని, గెలుస్తానని భీముడు, ఇసుక కంటె తరచుగా బాణాలు వేసి శతృవులను చంపుతానని అర్జునుడు, తన సుందర రూపం దుఃఖమయంగా చూసి ప్రజలు బాధ పడకూడదని నకులుడు మట్టి ఒంటికి పూసుకుని, తన దీనతను చూస్తే ప్రజలకు కీడని సహదేవుడు తలవంచుకున్నాడు, జరగబోయే యుద్ధంలో బంధువులు, భర్తలు, సుతులు, మిత్రులు చనిపోతే కౌరవ స్త్రీలు ఇలాగే ఏడుస్తారని, తడసిన ఏక వస్త్రంతో జుట్టు విరబోసుకుని ఏడుస్తూ ద్రౌపది, రాబోయే రణంలో మరణించే కౌరవులకు జరగబోయే కర్మకాండకు సూచనగా రుద్రయామిళం పారాయణ చేస్తూ ధౌమ్యుడు వెళ్ళేరయ్యా అన్నాడు, వారి శరీర భాషను వివరిస్తూ.

ఇప్పుడు చెప్పండి ఈ శరీర భాష మనకి కొత్తా? వారికి కొత్తా?

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-శరీర భాష/Body language

 1. ఏది అందమో తెలియదు ఈ రోజుల్లో ప్రజలకు
  పువ్వులు పెట్టుకోవడానికి జడలేదు
  ముఖం పెద్దదిగా ఉన్నా నుదుటిపై బొట్టు లేదు
  మీరు ఎన్ని చెప్పినా కొంతమంది మారరు, కానీ మీ ప్రయత్నం బాగుంది.మీరు G+ లో కూడా ఈ మంచి విషయాలు పంచే అవకాశం మాకు కల్పించండి.

  • @గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదుగారు
   కొంత తెలియనితనం కొంత మూర్ఖత్వం ఎదుటివారేమనుకుంటారోననే భయం, పాడయిపోవడమే అభివృద్ధి అనుకోడం వల్ల వచ్చిన తిప్పలు. మీ సూచన బాగుంది కాని ఓపికలేదండి.
   ధన్యవాదాలు

 2. శర్మ గారూ!
  ఒక్కసారి మహాభారతం లో దృశ్యం కంటికి కనిపించింది…
  ఈ శరీరభాషను గురించి హనుమంతుడు శ్రీరామ లక్ష్మణులను మొదటి సారి కలిసినపుడు
  హనుమ గురించి రాముడు లక్ష్మణుడితో..హనుమతో అంటాడు చూడండి..
  ఈ రోజుల్లో శరీరభాష గురించి త్రైనింగులు కూడా చేస్తున్నారు
  మనం ఏమిటో మన శరీర భాష ఎదుటి వారికి తప్పక చెపుతుంది…
  చాలా బాగుంది పోస్ట్…అభినందనలు…
  @శ్రీ

  • @శ్రీ గారు,
   మన దగ్గరున్నది మనకు తెలియదు,పరాయిదానికోసం పాకులాడటం అలవాటయిపోయింది.మంచి ఎక్కడున్నా గ్రహించడం తప్పుకాదు. your blog is not opening still for me.
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s